Friday, December 8, 2023
Friday, December 8, 2023

భూత దయ

చింతపట్ల సుదర్శన్‌

చలికాలం కనుక ఎండలో చురుకులేదు కానీ చురుగ్గా మటన్‌షాపు ముందు తిరుగుత్నుట్లు గ్రామసింహాలు కొన్ని కనిపించకుండా దాక్కుని ఉంటే, కొన్ని కండబలం మీద నమ్మకంతో షాపుకెదురుగ్గా నించుని ఉన్నవి. పన్నెండవ వస్తున్నది. ఇంకా ఒక్క ముక్కా విసిరేయడేం అని కొన్ని చిరాకు పడుతుంటే, కొన్ని తిండి దొరకాలంటే ఎంత ఓర్పు, నేర్పు, శ్రమ కావాలి మనుషులకైనా, మనకైనా అనుకుంటున్నవి. షాపులోనుంచి ఎగిరిపడ్డదో ఎముక చురుగ్గా పరుగెత్తినవన్నీ గ్రామసింహాలు. నడిరోడ్డు మీద గుంపుగా నిలబడ్డవి. ఆత్రంగా షాపులోంచి బైటపడ్డ దానికోసం తొక్కిసలాడాయి. రోడ్డు మీద దూసుకొచ్చింది ఓ కారు. ఆ కారు వెనక మరో కారు, దాని వెనుక ఇంకో కారు దూసుకొచ్చిన కారు దూకుడికి డ్రైవర్‌ బ్రేకు వెయ్యడంతో వెనుక వస్తున్న కార్లు కూడా ఆగిపోయాయి.
రోడ్డుమీద ఊరకుక్కల గుంపు ఒ బడానాయకుడి కారుకు అడ్డం పడ్డది. గుంపులో ఉన్న డాగీ, కారులో ఉన్నది ఎవరా అనిచూసి వామ్మో ‘వీడా’ అనుకుంది. చదువురానిది కనక మర్యాద తెలీదు కనక. ఒక్క నిమిషంలో ‘ఫ్లాష్‌ బ్యాక్‌’ లోకి వెళ్లి వచ్చింది. ఈ బడానాయకుడే ఓ ఆర్నెల్ల క్రింద ఇదే రోడ్డుమీద కారులో వచ్చాడు. అప్పుడు ఇలాగే షాప్‌లోంచి రోడ్డు మీదకి విసిరిపడ్డ దానికోసం కుక్కలు గుంపుగా నిలబడ్డాయి. అప్పుడీ మనిషే అగ్గిరాముడు, పిడుగురాముడు అయి తన కారును ఆపినందుకు అలగాకుక్కలు దారి వెంట మనుషుల్ని నడవనీయడం లేదని, వాళ్ల పిక్కలు పీక్కుతింటున్నాయని అరిచి మున్సిపాలిటీ వాళ్ల బండిని రప్పించి కుక్కలన్నింటినీ పట్టుకుపోయే దాకా వదల్లేదు. ఆనాడు చావుతప్పి కన్నులొట్టబోయిందన్నట్లు పడుతూ లేస్తూ ఎలాగో పారిపోయా. వీడు మళ్లీ అగ్నిహోత్రావధానుడిలా, దుర్వాసుడిలా అంతెత్తు ఎగిరి కుక్కల అంతుతేలుస్తాడు అనుకున్న డాగీ మిగతా కుక్కలు వినిపించుకోవని, ఎమర్జెన్సీని ఏ మాత్రం అర్థచేసుకోవని, బ్రతికుంటే పాచి అన్నమైనా తినవచ్చని గుంపులోంచి బైటకువచ్చి రోడ్డుకి ఎదురుగ్గా గల్లీలో నిలబడి చూడసాగింది. పాపం తోటి వాళ్లంతా ఏమైపోతారో అని దిగులుపడుతూ. కారులోంచి దిగాడు బడా లీడర్‌. ఇక జేబులోనుంచి సెల్‌ఫోన్‌ తీస్తాడు అనుకుంది డాగీ. కానీ ఆ మనిషి షాపులోకి వెళ్లాడు. ఏం జరుగుతుందా అని చూడసాగింది డాగీ. ఆ బడా నాయకుడు పెద్ద కవరునిండా మాంసం ముక్కలు తెచ్చాడు. ఎగురుతూ నోళ్లు తెరుస్తున్న కుక్కల నోళ్లవైపు విసిరేయసాగాడు. ఇది లోకంలో ఎనిమిదోవో తొమ్మిదోదో వింత అనుకుంటూ తనూ రోడ్డుమీదకి వచ్చి నోరు తెరిచింది డాగీ. చుట్టూపోగైన జనంతో ఆ లీడరు అన్నాడు. ‘నాకు మనుషులన్నా, జంతువులన్నా చిన్నప్పట్నించీ ఎంతో ప్రేమ. ఆకలితో ఎవరు బాధపడుతున్నా చూడలేను. కుక్కలైనా, పిల్లులైనా వాటికీ ప్రాణం ఉంది. ఆకలి ఉంది. మనిషిగా పుట్టినందుకు పరోపకారం చెయ్యాలి. తనకు దొరికిన మాంసపు ముక్కను నవులుతూ ఆ బడా లీడర్‌ చెప్పింది పూర్తిగా వినలేదు డాగీ. కాని చివర్లో ‘మీ ఓటు నాకే’ ‘ఇదిగో ఈ గుర్తుకే’ అంటూ తన ఫోటీ, ఎన్నికల సింబల్‌ ఉన్న కరపత్రాలను గాలిలోకి విసిరేశాడు. జనం చప్పట్లు కొట్టారు. దొరికిన ముఖ్కలు నోట కరుచుకుని పరుగులు తీశాయి మిగతా కుక్కలు. డాగీ మాత్రం ఓ కరపత్రాన్ని నోటకరుచుఉని కూలిన ఇంటివైపు రన్నింగ్‌ చేసింది.అప్పటికే అరుగుమీద ఉన్నది డాంకీ. ఏమిటిది సాయంత్రం దాకా తిరిగీ నమిలీ వచ్చేదానివి అప్పుడే వచ్చేశావేం డాంకీ ‘బ్రో’ అనడిగింది డాగీ అరుగు ఎక్కుతూ. ఎలక్షన్లు కదా ఎందుకైనా మంచిదని వచ్చేశా. ఈ మధ్య ఓ అభ్యర్థి నామినేషన్‌ వెయ్యడానికి వెళ్తూ గాడిదను తీసుకు వెళ్లాట్టగా. నన్ను ఎవడైనా తోలుకుపోతాడని భయంతో వచ్చేశా మరి. నువ్వెందుకు ‘అర్లీ డాగ్‌’ లా వచ్చావు అంది డాంకీ. ఉచితంగా అన్నీ దొరికితె రోడ్లమీద బలాదూర్‌ తిరిగే మనుషులమా మనం. తిండికోసం తిప్పలు పడతాం. అది దొరికితె ఎక్కడా పెత్తనాలు చెయ్యకుండా, ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో, ఏ నాయకుడికి ఎంత మెజారిటీ వస్తుందోనని ఛాలెంజిలు చెయ్యకుండా ఇంటికి వచ్చేస్తాం ఇదిగో ఈ కరపత్రం చూడు అని కరపత్రాన్ని డాంకీ ముందు పెట్టింది డాగీ. ఈ పెద్దమనిషా ఇప్పటికి దేశంలో ఉన్న పార్టీలన్నీ మార్చి ఇక కండువా కప్పే పార్టీ ఏదీ మిగలక ‘ఇండిపెండెంట్‌’ గా నామినేషన్‌ వేశాడు అన్నది డాంకీ. కరపత్రంలో ఫొటోలో ఉన్న మనిషిని చూస్తూ. పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు. ఏదో ఒక పార్టీలో గెలవాలి లేదా స్వతంత్రంగానైనా ‘రెబెల్‌’ గానైనా గెలిచి తీరాలి. గెలుపే కదా అందరి లక్ష్యం. ఏదయితేనేం కాని కడుపు నిండా మటన్‌ పెట్టించాడు. ఆయనకు బల్లులూ, పిల్లులూ, కుక్కలూ అసలు ప్రాణులన్నింటి మీదా ప్రేమేనంట అంది డాగీ. అవునవును, ఎన్నికలకు ముందు చీమలూ, దోమలూ, గొంగళి పురుగుల్లా కనిపించే మనుషులంతా వరాలిచ్చే దేవుళ్లులా కనపడతారు. బోధి వృక్షం కింద తపస్సు చేయకపోయినా లీడర్లందరికీ బుద్ధుడికిలా భూతదయ తెల్సి వస్తుంది అన్నాడు అరుగు ఎక్కిన అబ్బాయి. అవునవును మనుషులందరికీ ఆకలి, దప్పికా ఉంటాయని, నీలాంటి వాళ్లకు ఉద్యోగం ఇచ్చి తీరాలని, మానవ సేవే మాధవ సేవని ఎన్నెన్ని గుర్తుకొస్తాయో వీళ్లకు తమ ఎన్నికల గుర్తుని ఓటర్లకి గుర్తు చెయ్యాలని అన్నది డాంకీ. పోలింగ్‌ రోజున ఓటర్లంతా ‘ఏక్‌ దిన్‌కా సుల్తాన్‌’ లు ఆ మర్నాటి నుంచి మళ్లీ చీమలు, దోమలు, గొంగళి పురుగులు, నాలాగా కుక్కలు, నీలాగా గాడిదలు అంతేగా అంది డాగీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img