చింతపట్ల సుదర్శన్
ఆకాశంలోకి ఏనుగుల గుంపు ఒకటి వచ్చి తొండాలతో నీళ్లు గుమ్మరిస్తున్నట్లు విసుగూ, విరామం లేకుండా కురుస్తున్నది వర్షం. కురిసే వర్షంలో తడిసి ఆకాశం ముఖం తెల్లబోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మనుషులే కాదు అనేక ప్రాణులు తల్లడిల్లిపోతున్నాయి. ఆ అనేక ప్రాణుల్లో ఉన్నవీ డాంకీ డాగీలు. తడిసిన గోడకు ఆనుకుంటే ఎక్కడ కుప్పకూలుతుందోనని కాస్త దూరంగా కూచుంది డాంకీ. సగం విరిగిన తలుపుకి మరోపక్క ఉంది డాగీ. ద్వారపాలకుల్లా ఉన్న డాగీ, డాంకీలకు చేసేందుకు పనేమీ లేదు, దారాలు దారాలుగా, ధారలు ధారలుగా కురుస్తున్న వర్షం వైపు దిగులుగా చూడ్డం తప్ప. ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న డాంకీ వైపు చూసింది డాగీ. డాంకీ కళ్లు మూసుకుని ఉంది. నిద్ర పోతున్నదో, నిద్ర నటిస్తున్నదో తెలీడం లేదు. ఊరికే తోక ఊపుకుంటూ కూచోడం నచ్చలేదు డాగీకి. అన్నా! నిద్రపోతున్నావా? అని అడగలేదు అరిచింది, వర్షం చప్పుడుకు డాంకీకి సరిగ్గా వినపడదేమోనని, కాస్సేపటి దాకా మూసుకుని ఉన్న కనురెప్పల తలుపులు తెరవని డాంకీ, డాగీ మళ్లీ అదే ప్రశ్నను రిపీట్ చేయ్యడంతో తప్పనిసరై కళ్లు తెరిచింది. ఏమిటి తంబీ ఆ అరుపులు. ఎందుకు డిస్ట్రబ్ చేస్తున్నావు అంది. అక్కడికి నువ్వేదో బల్లకట్టులో నడిరేయి వరదల్లో కొట్టుకుపోయే జనాన్ని పరామర్శించే పనిలో ‘బిజీ’ గా ఉన్నట్టు, డిస్ట్రబ్ చేస్తున్నానంటున్నావు అంది డాగీ ముక్కు ఉబ్బిస్తూ. ఊరు మునిగేక వచ్చే లీడర్‌ని కాదోయ్, ఉన్నచోటు నుంచి కదలకుండా నష్టపరిహారం ఇంత ఇవ్వాలని డిమాండ్ చేసే ప్రతిపక్ష నాయకుడ్నీ కాదు. మనకు చేయడానికి పని ఏదీ లేనప్పుడు, పంటి కిందకి నమలడానికి ఏదీ దొరకనప్పుడు ‘మెడిటేషన్’ చెయ్యాలన్నాడు ఓ స్వామీజీ ఆ మధ్య. ధ్యానం చేయడం ఆకలి దప్పుల్ని మరచిపోవడానికేనని అప్పుడర్థమైంది. ఇప్పుడు సమయం, సందర్భం రెండూ కుదిరాయి కనుక ధ్యానం చేసుకుంటున్నాను. నువ్వూ కళ్లు మూసుకుని ధ్యానం చేసుకుంటే ఏ సమస్యా ఉండదు అంది డాంకీ. అవునా! నిజమా! ధ్యానమా! ఓకే. నేనూ ట్రై చేస్తాను’ అంటూ కళ్లు మూసుకుంది డాగీ.
అలా కళ్లు మూసుకున్న డాగీ, కళ్లముందు కనపడ్డ వస్తువును చూసి ఉలిక్కిపడ్డది. ఒక్క ఉదుట్న కళ్లు తెరిచింది. డాంకీ బ్రో! ధ్యానం అంటే ఆషామాషీ వ్యవహారం కాదనిపిస్తున్నది. కళ్లు మూసుకుంటే, మాంసం కొట్టూ, నా మీదకి వచ్చిపడిన ఎముకా మాత్రమే కనిపిస్తున్నాయి అంది. నిజమేనోయ్ ధ్యానం అనేది లాకాయి లూకాయి, వ్యవహారం కానేకాదు. కళ్లు మూసుకుంటే నాకు నిన్నటిదీ మొన్నటిదీ కాక, ఇవ్వాళటి తాజా న్యూస్ పేపర్ కనిపిస్తున్నది. దాని వాసన ముక్కు పుటాలను ఎగరేస్తున్నది. దేనికయినా ‘స్ట్రాంగ్ డిటర్మినేషన్’ ఉండాలని అన్నాడు గిరీశం విడో మ్యారేజి విషయంలో. అభ్యాసం కూసు విద్య అన్నారు. ట్రై చేస్తూ ఉన్నా. నువ్వూ ట్రై చేస్తూనే ఉండు ‘రోమ్ వజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే’ అన్నారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్‌ఫెక్ట్ అనీ అన్నారు’. మ్యాన్‌కు బదులు, మనం డాగీ, డాంకీ అనీ అప్లయి చేసుకోవచ్చు. కళ్లు గట్టిగా మూసుకుందాం. కాస్సేపటికి భ్రమలన్నీ తొలగిపోయి జ్ఞాన నేత్రం ఓపెన్ అవుతుందని నమ్ము అంటూ డాంకీ కళ్లు మూసుకుంది. డాగీ ఫాలో అయింది. ఏమయింది మీకు చెరో పక్కా కళ్లు మూసుకు కూచున్నారు అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. ధ్యానం మాట మరచిపోయి కళ్లు తెరిచాయి నాలుగు కాళ్ల ప్రాణులు రెండూ. నువ్వా బ్రో ఈ వర్షంలో వస్తావనుకోలేదు అంది డాగీ. వర్షం కాస్త ‘ఇంటర్వెల్’ ఇచ్చింది. ఇంటి దగ్గర ‘బోర్’ కొట్టి ఇలా వచ్చా. మీరిద్దరూ జాయింటుగా నిద్రపోతున్నట్టున్నారు అన్నాడు అబ్బాయి. నిద్ర కాదు బ్రో ఇది. మెడిటేషన్ అనగా ధ్యానం అనగా తపస్సు అంది డాంకీ. ధ్యానం, తపస్సూ మనుషులకు సంబంధించిన సబ్జక్టు ముఖ్యంగా మంచి వ్యక్తిత్వం ఉన్న సత్పురుషులకూ, పురుషోత్తములకూ సంబంధించిన విషయం అన్నాడు అబ్బాయి. వ్యక్తిత్వం సరే వ్యక్తులకు ఉండేది వ్యక్తిత్వం అనుకుందాం. కొందరు వ్యక్తులకు పశుత్వం ఉంటుంది అది వేరే విషయం. కానీ మంచి వ్యక్తిత్వం, చెడ్డ వ్యక్తిత్వం అనేవి కూడా ఉంటాయా? అంది డాగీ. ‘లింగ్విస్టిక్స్’ సంగతైతే ‘చేకూరి’ గారినడగాలి. మనకంత సీన్ లేదు. కాకపోతే ఈ మధ్య ఓ పార్టీ ప్రభుత్వనేతా, అధినేతా నోట ‘మంచి వ్యక్తిత్వం’ అనే పదం వినపడిరది, కనుక వాడాను మరి అన్నాడు అబ్బాయి. మంచి వ్యక్తిత్వం అంటే ఏమిటని అడగొద్దన్నావు సరే దాని వాడకం సంగతేమిటి? అంది డాంకీ. చెప్తా! ఇటీవల ఓ పార్టీ నాయకుడు, అవతల పార్టీల్లో మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్లను మాత్రమే తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించేడు అన్నాడు అబ్బాయి. మంచి వ్యక్తిత్వమా అదెక్కడ లభిస్తుంది. అసలు ఏ పార్టీ వారైతేనేం రాజకీయ నాయకుల్లో అది మచ్చుకైనా కనిపిస్తుందా అని నా డవుటు అనగా సందేహానుమానం అంది డాగీ. మంచి వ్యక్తిత్వం అనేది వ్యక్తులు ఉన్న రంగాన్ని బట్టి బేరీజు వెయ్యాలనుకుంటా. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులమీద ఎన్ని నేరాలు ఎక్కువగా ఉంటే అంత మంచి వ్యక్తిత్వం అనుకుంటా. కేసులు పైన ఉన్నవారే కదా మంత్రులూ, ముఖ్యమంత్రులూ అవుతున్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్నవాళ్లు జైళ్ల నుంచి బెయిళ్ల మీద బయటికి వస్తూ, జేజేలు కొడుతున్నారు, కొట్టించుకుంటున్నారు, కాళ్లు మొక్కించుకుంటున్నారు. ఇలాంటి వాళ్లే మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ల కింద లెక్క కాబోలు అన్నాడు అబ్బాయి.
జేజేలు కొట్టే అనుచరులు, కుస్తీలు పట్టే కార్యకర్తలు ఎన్నికల్లో ఓట్లు కొనే సామర్థ్యమూ ఉన్నవాళ్లు ఏ పార్టీ వారికైనా అవసరమే. అలాంటి వాళ్లు అధికార పార్టీ స్వంత బలం పెంచుకోవడానికి అవసరం కనుక వాళ్లే వ్యక్తిత్వం, అదే మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు అంది డాగీ. నేరాలు, ఘోరాలు చేసేవాళ్లు, అర్ధబలం, అంగబలం ఉన్నవారు మంచి వ్యక్తులన్న మాట. పదాలకు అర్థాలు మార్చే మనుషుల గురించి ఆలోచించడం కంటే మెడిటేషన్ అనబడే ధ్యానం చేసుకోవడం మంచిది. కాస్సేపు కాల్చేసే ఆకలినీ, ముంచేసే వరదల్నీ మరచిపోవచ్చు అంటూ కళ్లు మూసుకుంది డాంకీ.