Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

మంత్రులూ ఇవేం వ్యాఖ్యలూ?

పోతుల బాలకోటయ్య

ప్రజా రాజధాని అమరావతిపై కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, దూషణలు, పరుష పదజాలం రాజధాని రైతుల, ఉద్యమకారుల ఆగ్రహానికి కట్టలు తెంచుతోంది. మూడు ప్రాంతాల్లోని ప్రజలకు, పౌర సమాజానికి, మేధావులకు ఆగ్రహం తెప్పిస్తోంది. రాజ్యాంగం మీద, చట్టాల మీద, న్యాయస్థానాల మీద వ్యాఖ్యలు చేస్తున్న అమాత్యులకు వాటిమీద ఎంతమాత్రం గౌరవం లేదని అర్థమవుతోంది. అధికారంలో ఉన్నందున ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న రీతిలో మంత్రులు వ్యవహరించటం ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఒకవైపు భూములు ఇచ్చిన రైతులు 620 రోజులుగా ఉద్యమం చేస్తుంటే, మరోవైపు 100కు పైగా రాజధాని కేసులు హైకోర్టులో విచారణ జరుగుతుంటే మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్‌ నాయకులు రకరకాలుగా మాట్లాడు తున్నారు. రైతులతో చర్చించేది ఏమీ లేదు? ఏపీ రాజధాని విశాఖనే, న్యాయ స్థానాలను ఒప్పిస్తాం, మెప్పిస్తాం అని ఒకసారి, 29 గ్రామాల లోని కమ్మ సామాజిక వర్గానికే రాజధాని కావాలా? మిగిలిన రెండు ప్రాంతాల వారికి అక్కర లేదా? అని మరోసారి రాజధానిపై విషం చిమ్ముతున్నారు. ఇతర ప్రాంత ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. గతంలోరాజధాని ప్రాంతానికి ఎడారి అని పేరు పెట్టారు. మరొకరు స్మశానం అనీ, ఇంకొకరు పటుత్వం లేని నేలలనీ, ఇన్సైడ్‌ ట్రేడిరగ్‌ జరిగిందనీ నరాలు లేని నాలుకలతో దాడి చేశారు. ఇలా పదే పదే గుండెల్లో గుచ్చుతున్న మంత్రుల శూల్లాలాంటి మాటలకు అమరావతి మహిళా ఉద్యమకారులు విసిగిపోయారు. మంత్రి బొత్సకు పిండాలు పెట్టే పోరాట రూపం తీసుకోక తప్పలేదు. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? రెండున్నరేళ్లుగా ఎందుకు వెళ్ళలేదు? న్యాయ పరిధిలో ఉన్న రాజధాని అంశం పై వ్యాఖ్య చేయవచ్చా? రెండున్నరేళ్లుగా వైకాపా పరిపాలన ఏ భూముల్లో నుండి జరుగుతోంది? ప్రతిపక్ష హోదాలో రాజధానికి అసెంబ్లీలో ఎందుకు మద్దతు పలికారు? 30 వేల ఎకరాలు కావాల్సిందే అని ఎందుకుచెప్పారు? విజయవాడ ప్రాంతంలో మధ్యస్థంగా ఉండాలని ఎందుకు నమ్మబలికారు? 2019 ఎన్నికలముందు కూడా అమరావతిలో ఇల్లు కట్టామని, కార్యాలయం పెట్టామని ఎందుకు చెప్పారు. రాజధానిని చంద్రబాబు కంటే మిన్నగా నిర్మాణం చేస్తామని హామీ ఎలా ఇచ్చారు? రాజధాని పింఛన్లు రూ.2,500 నుంచి రూ. 5,000 చేస్తామనీ, ఎసైన్డ్‌ రైతులకు పట్టా రైతులతో పాటు సమాన ప్యాకేజీ ఇస్తామని ఎందుకు ప్రకటించారు? వంటి రైతులప్రశ్నలకు సమాధానంచెప్పరు. రాజధానిలో లక్ష కోట్ల కుంభకోణం ఏమైంది? ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో చెప్పిన 4,700 ఎకరాల ఇన్సైడ్‌ ట్రేడిరగ్‌ ఏమైంది? 10 ఎకరాలు శోధించారా? వీటిపై నోరు విప్పరు. గతంలో రాజధానిలో నిర్మితమైన భవన సముదాయాలను గ్రాఫిక్స్‌ అని ప్రచారం చేశారు. రైతు మహిళలు మీరు, మేమూ కలిసి భవంతుల మీద నుంచి కిందికి దూకుదాం రండి? అని పిలుపునిచ్చారు. ఒక్కమంత్రి కూడా అందుకు సాహసం చేయలేదు. తాజాగా ఖద్దరు బట్టలు తీసి తాలిబన్ల ముసుగులో మా ప్రాణాలు తీయండి అని రైతు మహిళలు అంటున్నారు. పోనీ, ఈ పనైనా చేస్తారేమో చూడాలి. గదిలో బంధించి కొడితే పిల్లి పులి అయినట్లు, బంతిని గోడకు విసిరితే, రెట్టింపు వేగంతో తిరిగి తగిలినట్లు రాజధానిపై చేస్తున్న వ్యాఖ్యలు పౌర సమాజానికి ప్రజాస్వామ్యంపై భ్రమలు పోయేలా చేస్తున్నాయంటే ఆశ్చర్యం అక్కర్లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చట్టసభల మీద, పరిపాలన వర్గం మీద, కార్యనిర్వాహకవర్గం మీద విశ్వాసం పోయింది. కేవలం న్యాయస్థానాల మీద మాత్రమే విశ్వాసం మిగిలి ఉంది. అది కూడా ఆరిపోయే దీపంలా ఉంది. అదీ ఆరిపోతే జనం రహదారుల్లోకి వచ్చేస్తారు. ‘రక్షణ’ కంచెలు తొలగిస్తారు. కేంద్ర ప్రభుత్వం పైకి ఏది చెప్పినా ఏపీ రాజధాని పరిష్కారంలో రాజకీయాలకే పట్టం కట్టింది. అందుకే రాష్ట్రంలో బీజేపీ ఒక మాట, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో మాట. ఒకరు అమరావతికి మద్దతు అంటారు, మరొకరు రాజధాని రాష్ట్రాల పరిధిలోది అంటారు. కానీ, అప్పుడప్పుడూ ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్‌సభలో లీకులో, జోకులో వేస్తుంటారు. ఈ జంట ప్రభుత్వాల సయ్యాటలో ఏపీ నలగాల్సిందే అనే కోరిక కాబోలు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు రాజ్యాంగ స్ఫూర్తినే నమ్ముకున్నారు కానీ ఐదేళ్ళకోసారి మారే ప్రభుత్వాలను కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. అవివేక మంత్రులందరూ… జర జాగ్రత్తగా ఉండాల్సిందే.
వ్యాస రచయిత అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img