Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మందగించిన వాణిజ్యం

బి.లలితానంద ప్రసాద్‌ (రిటైర్డ్‌ ప్రొఫెసర్‌)

ప్రపంచీకరణతో వాణిజ్యపరంగా ప్రపంచ దేశాలన్నీ పరస్పరం అనుసంధానం అయినాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన ఒడిదుడుకులు అన్ని దేశాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న దేశాలలోని పెనుమార్పులు వాటితో అనుసంధానంగా ఉన్న దేశాలలో అధికంగాను, ఇతర దేశాలపైన ఏదో స్థాయిలో ప్రభావం తప్పక చూపుతాయి. అందుకు తాజాగా లభిస్తున్న తాజా గణాంకాలు తార్కాణాలు. పశ్చిమ దేశాల్లో పెరుగుతున్న వడ్డీరేట్ల ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై, తద్వారా ఆర్థికంగానూ ప్రతికూలంగా పడిరది. ఈ కారణంగా చైనా ఎగుమతులు చైనా సహా ఇతర ఆసియా దేశాల్లో అన్ని ముఖ్య ఆర్థికవ్యవస్థలపైన ప్రభావం చూపింది. విశ్వ వాణిజ్యంలో మందగమనం కొన్ని నెలలుగా నెలకొనగా ఇకముందు కూడా కొనసాగుతుందని పరిశీలకులు అభిప్రాయం. అభివృద్ధి చెందిన దేశాల్లోని సెంట్రల్‌ బ్యాంకులు ద్రవ్యోల్బణం కట్టడి ప్రయత్నంలో భాగంగా వడ్డీ రేట్లు పెంచడం అక్కడి ఆర్థిక మాంద్యం పెరగడానికి దోహదపడిరది.
చైనాలో కోవిడ్‌-19 కి ముందుతో(2020 ఫిబ్రవరి) పోల్చితే వారి వార్షిక ఎగుమతులు ఈ ఏడాది జూన్‌లో లాగా ఇంతగా పడిపోలేదు. ఈ ఎగుమతుల తరుగుదల చైనాకే పరిమితం కాదు. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఈ తరుగుదల తైవాన్‌లో 23శాతం, వియత్నాంలో 11శాతం, దక్షిణ కొరియాలో 6శాతం మేర తగ్గాయి. ప్రపంచ వాణిజ్యంలో ఈ మార్పుకు ఆయా సంపన్న దేశాల్లో వినియోగదారుల కొనుగోలు ప్రాధాన్యతలలో మార్పు ప్రధాన కారణంగా ఉంది. గతంలో అధికంగా వ్యయంచేసే ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గృహాల నవీకరణ, వినియోగ వస్తువులు వగైరాలు లాంటివి కరోనా కాలంలో అధిక ప్రాధాన్యం వహించేవి. అప్పటి సామాజిక, ఆర్థిక, దైనందిన జీవన మార్పులకు ప్రేరకాలైనాయి. వీటి స్థానంలో ఇప్పుడు ఆహారం, పర్యటన, ఇతర సేవలకు సంబంధించిన వాటిపై ఖర్చు చేస్తున్నారు.
ఈ మార్పులే కాక అమెరికాలో, యూరోప్‌లో పెరిగిన వడ్డీరేట్లతో రుణభారం పెరిగింది. కొందరు ఆర్థికవేత్తలు ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక మాంద్యానికి గురవుతుందని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలపు ప్రపంచ వాణిజ్య అంచనాలన్నీ ఆర్థికంగా సంపన్న దేశాలు అన్నింటిపైన గణనీయంగా ప్రభావితం చూపుతాయి అంటున్నాయి. కొందరు ఆర్థికవేత్తలు రానున్న సంవత్సరాల్లో ప్రపంచ వాణిజ్యం మరింత మందగమనంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అది ప్రపంచ ఆర్థిక అభివృద్ధి కన్నా తక్కువ స్థాయిలో ఉండొచ్చు అని వారి అభిప్రాయం. ఇది సంవత్సరాల తరబడి ఏర్పడిన ప్రపంచ ఆర్థిక అనుసంధానానికి భిన్నంగా కూడా పరిణమించవచ్చునని సింగపూర్‌ లోని చైనా రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ హెడ్‌గా ఉన్న ‘జీన్‌ మా’ అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి దీని బీజాలు ‘బ్రెగ్జిట్‌’ తోనే పడినట్లు భావిస్తున్నారు.
ఈ ఏడాది జూన్‌లో చైనా ఎగుమతులు విలువలో 12.4 శాతం క్షీణించాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడివి 285 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. చైనా జనరల్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ ప్రకారం, మే నెలలో 7.5శాతం తగ్గాయి. ఇది వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ ఆర్థికవేత్తల అంచనా 9.2 శాతం కన్నా ఎక్కువ తరుగుదల. ప్రపంచ వాణిజ్యంలో మందగమనాన్ని చైనాలోని ఆర్థిక స్థితిగతులు విదేశీ వాణిజ్యాన్ని మరింతగా దిగజారుస్థాయి. అది ప్రపంచంలో అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థ కావటంతో అక్కడ బలహీన లేబర్‌ మార్కెట్‌ కారణంగా వినియోగం ద్వారా రావాల్సిన వృద్ధి మసకబారింది. అదే అక్కడి రియల్‌ఎస్టేట్‌ రంగాన్ని కృంగదీసింది. మూడు సంవత్సరాల కోవిడ్‌ 19 దుష్ప్రభావాల అనంతరం కోలుకోవలసిన రీతిలో కోలుకోలేక ఆశావహులను నిరాశపరిచింది.
గత సంవత్సరంతో పోలిస్తే అమెరికాకి చైనా ఎగుమతులు ఈ ఏడాది జూన్‌లో 24 శాతం తగ్గాయి. యూరోపియన్‌ యూనియన్‌ ఎగుమతులు 13 శాతం, ఇండోనేషియా, మలేషియాతో కలిపిన ఏషియన్‌ (అగ్నేసియా) 10 దేశాలకు అమ్మకాలు 17శాతం దిగజారాయి. గత సంవత్సరంతో పోలిస్తే, అమెరికా సెన్సెస్‌ బ్యూరో ప్రకారం, ఈ ఏడాది తొలి ఐదు మాసాల్లో దిగుమతులు 5.5 శాతం తక్కువ నమోదైంది. వస్తువుల దిగుమతులు మే నెలతో పోల్చితే, మార్చిలో స్వల్పంగా పెరిగినప్పటికీ, 2.7 శాతం క్షీణించాయి. అమెరికాలోని ప్రస్తుత మార్కెట్‌ మాంద్యం, ఇతర ఆర్థికవ్యవస్థలలో మందగమనం దృష్ట్యా ఈ సంవత్సరం మిగతాకాలంపై కూడా పరిశీలకులుఎలాంటి ఆశావహఅంచనాలతో లేరు.
ఇక మన దేశంతో చైనా వాణిజ్యం కూడా వీటికి అతీతంగా ఏమీ లేదు. తొలి అర్ధభాగంలో చైనా నుండి మన దిగుమతులు గతంతో పోల్చినప్పుడు 0.9 శాతం తగ్గి 56.5 3 బిలియన్‌ డాలర్లు మేరకు జరిగాయి. ఇదే సమయంలో వారికి మన ఎగుమతులు 0.6శాతం తగ్గి 9.49 బిలియన్‌ డాలర్లుగా ఉంది. చైనాతో మన ఈ విదేశీ వాణిజ్యలోటు మరి ఏ ఇతర దేశం కన్నా కూడా ఎక్కువ. మన ఎగుమతులకు అక్కడ గిరాకీ కొరత వలన ఈ తేడా నమోదైంది. ఇది గత రెండు సంవత్సరాలలో పెరిగిన తర్వాత తిరోగమనంగా కనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ ప్రకారం మన ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ సంవత్సరం తొలి అర్ధభాగంలో 66.02 బిలియన్‌ డాలర్లు కాగా వాణిజ్య లోటు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే, ఈ సంవత్సరం తొలి అర్ధభాగంలో 47.5 బిలియన్‌ డాలర్ల నుండి స్వల్పంగా తగ్గి 47.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2022లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డుస్థాయిలో 135.98 బిలియన్‌ డాలర్లు కాగా, గత సంవత్సరం దిగుమతులు 21శాతం పెరిగి చైనాతో మన వాణిజ్యలోటు తొలిసారిగా 100 బిలియన్‌ డాలర్లను దాటింది. 2021, 2022 సంవత్సరాలలో చైనాతో మన వాణిజ్యం చారిత్రక శిఖరాలను చేరింది. చైనా నుండి మన దిగుబడులు మందుల తయారీకి కావల్సిన ఆక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియంట్స్‌, రసాయనాలు, యంత్రాలు ఆటో విడిభాగాలు, మందులు. అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో గిరాకీ తగ్గడంతో జూన్‌లో భారత్‌ ఎగుమతులు 22 శాతం క్షీణించి 32.97 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. జూన్‌లో దిగుమతులు 17.48 శాతం తగ్గి 53.10 బిలియన్‌ డాలర్లకు పరిమితం కాగా దిగుమతుల ఎగుమతుల అంతరంగా చెప్పే వాణిజ్యలోటు 20.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2022 జూన్‌లో వాణిజ్య లోటు 22.07 బిలియన్‌ డాలర్ల కంటే ఈసారి తగ్గింది.
వర్ధమాన దేశాలకు చౌకగా విద్యుత్‌ వాహనాలు, స్మార్ట్‌ ఫోన్లు ఎగుమతి దారునిగా పశ్చిమ దేశాలపై చైనా పైచేయి సాధించింది. ఈ మార్పులు సహజంగానే చైనా, అమెరికా నాయకత్వంలో పశ్చిమ దేశాల నడుమ సంబంధాలలో మార్పులు అధమస్థాయికి చేరాయి. 2018లో ట్రంప్‌ హయాంలో చైనా నుండి అమెరికా చేసుకునే దిగుమతులపై సగటు టారిఫ్‌లు 20శాతం కాగా, గత మే నెలలో 15శాతంగా ఉన్నాయి. చైనా నుండి అమెరికా దిగుమతులు తగ్గినప్పటికీ, ఇప్పటికీ ప్రపంచ వాణిజ్యంలో తన ఆధిక్యతను కొనసాగిస్తూనే ఉంది. అనేక నూతన మార్కెట్లోకి చొచ్చుకుపోతుంది. అమెరికా మినహా చైనా విశ్వ వాణిజ్యంలో వస్తువుల ఎగుమతులలో 2022లో 14.4 శాతం కాగా, అంతకుముందు కరోనా కాలంలోని 13శాతం కన్నా ఇది ఎక్కువ. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం ఎగుమతులు 2012లో 11 శాతం మాత్రమే.
సెల్‌: 9247499715

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img