Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

మగువకెంత కష్టం!

కూన అజయ్‌బాబు

ఇటీవల తెలుగులో ‘లవ్‌ స్టోరీ’ అనే ఒక సినిమా వచ్చింది. శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటించారు. మహిళల పట్ల అఘాయిత్యాలు జరిగేది ఎక్కడో కాదని, ఇంట్లోనే ఎక్కువగా జరుగు తున్నాయన్న విషయాన్ని దర్శకులు చాలా సున్నితంగా వివరించారు. ఇంట్లోవాళ్లు, తెలిసినవాళ్లు, చాలా చనువుగా వ్యవహరిస్తున్నట్లుగా నటిస్తూ ఒంటిమీద చేతులు వేయడం, ప్రైవేటు విభాగాలను తాకడం వంటి నీచ కార్యాలకు పాల్పడుతున్నారు. మహిళలను ఎక్కువమంది తెలిసినవారే అత్యా చారం చేస్తున్నట్లు 2020కి సంబంధించిన ఎన్‌సిఆర్‌బి నివేదిక బట్టబయలు చేసింది. ఏ మాత్రం పరిచయం లేనివారు అంటే ముక్కూమొఖం తెలియని వాళ్లు పాల్పడే అత్యాచారాలు కేవలం 7 శాతం మాత్రమేనంటే ఆశ్చర్యం కలగక మానదు. భర్త లేదా ఇతర బంధువులు, స్నేహితులు అత్యధిక స్థాయిలో మహిళల పట్ల క్రూరత్వం కలిగివున్నారని తేటతెల్లమైంది. ఇలా అయితే, మగువ బయటా బతకలేక, ఇంట్లోనూ బతకలేక, ఇంకెక్కడ బతకాలి? ఎలా బతకాలి? వనితల బతికే హక్కును ఎలా కాపాడాలి?
నిజానికి నిర్భయ వంటి చట్టాలు వున్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా అత్యాచారం (రేప్‌) కేసులు పెరుగుతూనే వున్నాయి. 2005లో 19 వేలకు పైగా అత్యాచారం కేసులు నమోదుకాగా, 2016 నాటికి ఆ సంఖ్య ఏకంగా 38,947కి పెరిగింది. 2017లో 32,559, 2018లో 33,356, 2019లో 32,032 రేప్‌ కేసులు నమోదయ్యాయి. 2020లో రోజుకు సగటున 77 రేప్‌ కేసులు, 80 హత్యలు నమోదయ్యాయి. 29,193 మంది ప్రాణాలు కోల్పో యారు. హత్యలు, అత్యాచారాల్లో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. బంధు వులే కిరాతకంగా హత్యాచారం చేసిన ఘటనలు యూపీలో అధికం. నేరాల విషయంలో ఎన్నో ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌ ముందంజలో వుంది. బీహార్‌, మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. అయితే కేవలం అత్యాచారాలకే పరిమితమైతే రాజస్థాన్‌లో 2020లో అత్యధి కంగా 5,310 రేప్‌ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ కాలంలో గృహ హింసతో పాటు ఇతర సన్నిహిత సంబంధీకులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులు ఎక్కువ. 2019లో లక్ష మంది మహిళల్లో 62.3 మందిపై అఘాయిత్యాలు జరిగినట్లుగా కేసులు నమోదు కాగా, 2020లో ఆ రేటు 56.5గా వుంది. అంటే ప్రతి లక్ష మందికి కనీసం 70 మంది మహిళలు ఏదో ఒక రూపంలో పురుష క్రూర రక్కసి కోరలకు బలవుతూనే వున్నారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో తేల్చిచెప్పింది. విచిత్రమేమిటంటే, 2020లో గరిష్ఠ స్థాయిలో 1,11,549 కేసులు భర్త లేదా సంబంధీకుల క్రూరత్వంతో నమో దయినవే. 62,300 కేసులు అపహరణ, నిర్బంధాలకు సంబంధించినవి. అందులో 3,741 కేసులు అత్యాచార యత్నానివే. 105 కేసులు యాసిడ్‌ దాడులు ఉండగా, 6,966 మంది వరకట్న వేధింపుల కారణంగా మరణిం చారు. 2019లో 7,045 వరకట్న చావులు నమోదయ్యాయి. 2019తో పోల్చితే ఐపిసి సెక్షన్ల కింద 2020లో మహిళలపై దాడులకు సంబంధించి 31.9 శాతం కేసులు పెరగ్గా, ప్రత్యేక, స్థానిక చట్టాల (ఎస్‌ఎల్‌ఎల్‌) కింద 21.6 శాతం కేసులు పెరిగాయి. దిల్లీలో నమోదైన రేప్‌ కేసుల్లో 98 శాతం కేసుల్లో నిందితులు బంధువులు, లేదా స్నేహితులేనని దిల్లీ పోలీసులు 2020 నవంబరులో పార్లమెంటరీ స్థాయీసంఘానికి ఇచ్చిన నివేదికలో వెల్లడిరచారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే, అత్యాచారానికి పాల్పడినవారి కేసుల సంఖ్యలో 500 మంది (45.66%) స్నేహితులు, ఆన్‌లైన్‌ స్నేహితులు ఉండగా, 497 మంది (45.38%) కుటుంబ స్నేహితులు, ఇరుగుపొరుగు వారు, ఉద్యోగమిచ్చిన వారు ఉన్నారు. 91 మంది (8.31%) అచ్చంగా కుటుంబ సభ్యులే కావడం విచారకరం. అసలు పరిచయం లేని అగంతకులు ఏడుగురు (0.63%) మాత్రమే వున్నారు.
మహిళలకు భద్రత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రమాదం అత్యధికంగా సొంతవారి నుంచే ఉందన్నది ఈ గణాంకాలు చెప్పిన నగ్నసత్యాలు. పదేళ్ల బాలికపై సొంత బాబాయి, తొమ్మిదేళ్ల బాలికపై సొంత బావ, కుమార్తెపై కీచక తండ్రి, బాగా తెలిసిన ఓ ఆటోవాలా ఒకమ్మాయిని రేప్‌ చేసిన ఘటనలు మన రాష్ట్రంలోనే విన్నాం. దిల్లీలో ఒక ఏడాదిలో నమోదైన అత్యాచారం కేసుల్లో 12 శాతం నిందితులు తండ్రి లేదా చిన్నాన్న లేదా అన్నదమ్ములే కావడం దారుణం. అత్యంత ఆందోళనకరమైన ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి యావత్‌ సమాజం దృష్టి పెట్టాల్సిన తరుణమిది. ‘అర్థరాత్రి మహిళ రోడ్డుపై ఒంటరిగా తిరిగిన నాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు’ అని మహాత్ముడు అన్నట్లుగా చెపుతుంటాం. కానీ, మహిళల పట్ల ఇలాగే నేరాలు పెరిగితే, ఆమె పట్టపగలు స్వంత ఇంట్లోనే నడవలేదన్నది సుస్పష్టం. అది మహిళకు నరకప్రాయమే!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img