Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

మణిపూర్‌ మారణహోమం సూత్రధారి తెలుగోడే ?

అడవి బిడ్డలపై ఆటవిక న్యాయం! నేడు దేశాన్ని నగ్నంగా నడిపించిన వారి అసలు చరిత్ర ప్రతి భారతీయుడు తెలుసుకు తీరాలి. క్రీస్తుపూర్వం 185 సంవత్సరం మౌర్య సామ్రాజ్యంలో పుష్యమిత్రశుంగ అనే బ్రాహ్మణుడు సైన్యాధ్యక్షుడుగా ఉండేవాడు. సింహాసనం కోసం మౌర్యచక్రవర్తి బృహద్రతను చంపి శుంగ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అప్పటివరకు మౌర్యుల ఏలుబడిలో బౌద్ధం విరాజిల్లిన భారత ఉపఖండంలో రక్తం ఏరులైపారింది. భారతదేశ చరిత్రలో.. పాలనతో పెనవేసుకుపోయిన మతహింస కారణంగా మొట్టమొదటి జాతి నిర్మూలనకు గురి అయ్యింది బౌద్ధం. బౌద్ధ సన్యాసుల రక్తంతో ఈ నేల ఇంకిపోయింది. లెక్కలేనన్ని బౌద్ధ ఆరామాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బౌద్ధం ప్రాణభయంతో దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోయింది. ప్రాచీన బౌద్ధ ఆరామాలు శైవ, వైష్ణవాలయాలుగా మార్చివేశారు. మత విద్వేషాలు రగిలించిన కార్చిచ్చులో ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం, బౌద్ధారామం నలంద అగ్నికి ఆహుతి అయ్యింది. పదివేలమంది రెసిడెన్షియల్‌ విద్యార్థులు, రెండువేల మంది అధ్యాపకులుతో దేశ, విదేశీ విద్యార్థులతో ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన విశ్వ విద్యాలయం మంటలో ్లకాలి బూడిద దిబ్బగా మారిపోయింది.
వరుస విధ్వంసాల్లో తక్షశిల, విక్రమశిల ధ్వంసం అయ్యాయి. ఈ మూడు విశ్వవిద్యాలయాల కారణంగా భారతదేశానికి విశ్వగురు అనే పేరువచ్చింది. ఇదిదేశ గత చరిత్ర. భారత స్వతంత్ర పోరాటంలో అన్ని మతాలు, కులాలు ఒక్కటై మహాత్ముడి అడుగుజాడల్లో దేశం నడిచింది. ఒక్క సంఫ్‌ు పరివార్‌ తప్ప! నేడు వారే దేశభక్తి, జాతీయత గురించి మాట్లాడటం రోత పుట్టిస్తుంది. ఆర్‌యస్‌యస్‌ యాబై రెండు సంవత్సరాలపాటు జాతీయ జెండాగా త్రివర్ణ పతాకాన్ని ఒప్పుకోలేదు! కనీసం గౌరవించలేదు! 1910లో అతివాద సావర్కర్‌ లండన్‌లో చదువుకుంటూ, ఇండియా హౌస్‌ కేంద్రంగా హిందూ-జర్మన్‌ కుట్రలో అక్కడి అతివాదులు, మారణాయుధాల సరఫరాదారుతో సంబంధాలు కలిగి ఉన్నాడని లండన్‌లో సావర్కర్‌్‌ను అరెస్ట్‌చేసి, నౌకలో భారత్‌కు తరలించే సమయంలో పోర్టులో నిలిపిఉంచిన నౌక మరుగుదొడ్డి కిటికినుండి పారిపోవడానికి ప్రయత్నిస్తే పట్టుకుని భారత్‌కు తరలించారు. 50సంవత్సరాల జైలుశిక్ష విధించి, అండమాన్‌ జైలుకు పంపించారు. సావర్కర్‌ బ్రిటీష్‌ ప్రభుత్వానికి పదులసంఖ్యలో క్షమాభిక్ష పెట్టమని ఉత్తరాలురాస్తే అండమాన్‌ జైలునుండి 1924లో బ్రిటీష్‌ ప్రభుత్వం విడిచిపెట్టింది. అందుకు ప్రతిఫలంగా నాటి నుండి భారతీయుల సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటానికి వ్యతిరేకంగా బ్రిటీష్‌ అధికారులతో చేతులుకలిపి, ఆనాడే ఈ దేశం రక్తం చిందించటానికి కారకులయ్యారు! అంతేకాదు మహాత్మగాంధీ హత్యకు హంతకులను తయారుచేసింది ఈ మనువాదులే!
మహాత్మ గాంధీ హత్యకేసులో కోర్టుబోనులో నిందితుడుగా నిలబడి విచారణ ఎదుర్కొన్న సావర్కర్‌్‌, సంఫ్‌ు పరివార్‌కు ఆరాధ్యుడయ్యాడు. ఇతని పేరు ముందు వీర్‌ అనే పదంచేర్చి వీర్‌ సావర్కర్‌గా ప్రచారం కల్పిస్తున్నారు. సవార్కర్‌ పిరికివాడు, నాడు బ్రిటీషర్ల క్షమాభిక్ష పొందాడు. మహాత్మగాంధీ హత్యకేసు విచారణకోర్టు హాలులో నిందితుల్లో ఒకరైన సావర్కర్‌్‌, కోర్టువారితో నాథూరామ్‌ గాడ్సే, గోపాల్‌ గాడ్సే, నారాయణ్‌ ఆప్టే, విష్ణు కర్కరే, మదన్లాల్‌ పప్‌ా, దిగంబర్‌ బాడ్గే, శంకర్‌ కిష్టయ్య ఎవరో నాకుతెలియదు అని మరోసారి తన పిరికితనాన్ని కోర్టుహాల్లో ప్రదర్శించాడు సవార్కర్‌. నిందితుల్లో దిగంబర్‌ బాడ్గే అప్రూవర్‌గా మారి మహాత్మగాంధీ దారుణ హత్యకేసు విచారణలో సహాయపడ్డాడు. గాంధీహత్యకు ముందు నాథూరామ్‌ గాడ్సే, నారాయణ్‌ ఆప్టే, దిగంబర్‌ బాడ్గే సావర్కర్‌ ఇంటికి వెళతారు. గుమ్మం బయట దిగంబర్‌ బాడ్గేను ఉండమని, గాడ్సే, నారాయణ్‌ ఆప్టే ఇంటి లోపలికి వెళ్లి సావర్కర్‌తో సమావేశం ముగించుకుని బయటికి వస్తారు. గాంధీ హత్యకు సావర్కర్‌ ఆశీస్సులు మనకు లభించాయి. విజయంతో తిరిగి రండి అన్నారని దిగంబర్‌ బాడ్గేకు తెలియజేస్తారు. ఇదే విషయాన్ని బాడ్గే కోర్టు విచారణలో జడ్జికి తెలియజేస్తాడు. సావర్కర్‌్‌ న్యాయవాది దిగంబర్‌ బాడ్గే సాక్ష్యం చెల్లదని వాదిస్తాడు. సవార్కర్‌, దిగంబర్‌ బాడ్గేతో నేరుగా సంభాషించలేదు. (ప్రత్యక్ష, వ్యక్తిగత ఆధారంగా కాకుండా మరొక వ్యక్తినుండి విన్నదాని ఆధారంగా సాక్ష్యం) చెల్లదు అనివాదించి సాంకేతికంగా సావర్కర్‌్‌ ఉరిశిక్ష నుండి తప్పించుకున్నాడు. నాథూరామ్‌ గాడ్సే, నారాయణ్‌ ఆప్టే నోరు విప్పకుండా తమ గురువును కాపాడారు. మతం వేరు.. మతోన్మాదం వేరు. అది ఇస్లాం అయినా.. హిందూత్వం, క్రిస్టియన్‌ అయినా..ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మతోన్మాదమే అప్పుడు, ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తోంది.. గాంధీజీ జీవితం భారతావనికి ఒక అపురూప చరిత్ర. ప్రపంచంపై చెరగని ముద్రవేసిన మహనీయుడు గాంధీజీ. మతోన్మాదంతో మహాత్ముడినే పొట్టన పెట్టుకున్న నీచులకు భారతీయత గురించి ఏం తెలుస్తుంది. మతోన్మాదం దేశంలో ఇప్పుడు జడలు విప్పి నాట్యంచేస్తుంది. ఒకవైపు గాంధీని స్మరిస్తూ.. మరోవైపు గాడ్సేని కీర్తిస్తూ.. సావర్కర్ను హీరోగా ఆరాధిస్తూ.. దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. స్వాతంత్ర పోరాటంలో తొలి తరం మహనీయులు తమ సర్వస్వం ఈ దేశం కోసం ధారపోసారు. ప్రజలందరూ ఐక్యం కాకుండా ఉండేందుకు మతతత్వ, మనువాద రాజకీయాల మంటలు రాజేస్తున్నాయి. సావర్కర్ను జాతీయోద్యమ నేతగా చిత్రించడం దారుణం. చరిత్రను చెరిపేయాలనీ.. అదీ సాధ్యం కాకపోతే వక్రీకరించాలనీ మోదీ ప్రభుత్వం యత్నిస్తోంది. భారతదేశంలో మతోన్మాదంతో హిందూ-ముస్లిం మతహింసలో ముస్లింలు, హిందువులు వేలల్లో హతులయ్యారు. ఉత్తరభారతదేశంలో ముస్లింలపై కుట్రపూరిత దాడులు పెరిగాయి. ఫలితంగా బీజేపీ ఎన్నికలలో మరింత విజయాన్ని సాధించింది. ఇప్పుడు వర్తమాన మోదీ న్యూ ఇండియాలో ఆంధ్రప్రదేశ్‌, అమలాపురం ప్రాంతానికి చెందిన రామ్‌మాధవ్‌ 2014-2020 వరకు భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో మణిపూర్‌లో మైతీ లిపూన్‌, అరంబై టెంగోల్‌ సాంస్కృతిక ముసుగు సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు మైతీల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. వీటి నిర్మాణంలో రామ్‌మాధవ్‌ కీలకపాత్ర పోషించారనే ఆరోపణ ఎక్కువగా వుంది. వీరికి వెన్నుదన్నుగా వెనకనుంచి నడిపించేది ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌ దళ్‌, బీజేపీ అనేది అక్కడి ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఆ రెండు సంస్థలే మణిపూర్‌లో ఉద్భవించిన సరికొత్త తీవ్రవాద సమూహం. ఈ గుంపు ఆధ్వర్యంలో ఇప్పుడు అక్కడ జరుగుతున్న అమానవీయ ఆటవిక సంఘటనలు దేశాన్ని తీవ్రదిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అంతేకాకుండా రామ్‌మాధవ్‌, అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ 2017 అసెంబ్లీ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం కుకి మిలిటెంట్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు రాసిన లేఖలో కుకీ తీవ్రవాద సంస్థ చైర్మన్‌ ఆరోపించారు. హిమంత బిస్వశర్మ, రామ్‌మాధవ్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలనే ప్రతిపక్షాల డిమాండ్‌ అరణ్యరోదన అయ్యింది.
హిందుస్థాన్‌ చరిత్ర ఇలా రక్తసిక్తంగా సాగుతూనే ఉంటుందా అంటే! ద్వేషం ద్వేషంతో సమసిపోదు. దానికి సరైనమందు ప్రేమ మాత్రమే అని బుద్ధుడు ప్రపంచానికి చెప్పాడు. అడ్డుకట్టవేయాల్సింది ఈ దేశప్రజలే. శక్తివంతమైన మోదీలను తయారుచేసేది ప్రజలే! శక్తి హీనులను చేసే శక్తికూడా ఈ ప్రజలదే.
శుభాకర్‌ మేడసాని, జర్నలిస్ట్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img