Monday, January 30, 2023
Monday, January 30, 2023

మతోన్మాదం రగిల్చే మోదీ అమృతోత్సవ ప్రసంగం

జి. ఓబులేసు

దేశ స్వాతంత్రానికి 74 ఏండ్లు నిండి 75వ వసంతంలో అడుగుపెట్టిన ఈ ఆగస్టు 15 నాడు ప్రధాని మోదీ దిల్లీ ఎర్రకోట నుండి జాతినుద్దేశించి గంటన్నరపాటు సుదీర్ఘోపన్యాసం చేసారు. ఈ ఉత్సవాన్ని ‘‘అజాదీ కా అమృతోత్సవ్‌’’ అని, అందులో ఉద్ఘోషించిన వాటికి ప్రధాని గతిశక్తి అని నామకరణ చేసారు. ఎద్దు చూస్తే ముద్దు వస్తుంది. ఈడుపు చూస్తే ఏడుపు వస్తుందన్నట్టుగా మోదీ పాలన ఉంది. ఆకర్షణీయమైన పేర్లతో జనానికి పెద్దగా ఒరిగింది ఏమి లేదు, బురిడీ కొట్టించడం తప్ప.
ఏ పనికి మాలిన అంశమైనా, ఎంత చెత్త విషయమైనా, ఎంత ప్రతికూల స్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకొనగలడు. కరోనా రెండో దశలో బెడ్ల కొరత, ఆక్సిజన్‌ కొరత, వెంటిలేటర్స్‌ లేకపోవటం, వాక్సిన్‌ అందుబాటులో లేకపోవటం లాంటి సమస్యలపై పార్లమెంట్‌కు జవాబు చెప్పలేని దుస్థితి. 9 నెలలుగా రైతులు 3 వ్యవసాయ దుష్ట చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే దానిపై విపక్షాల నిరసనలకు, రైతుల ఆవేదనలకు పరిష్కారం చూపాల్సిన పెద్ద మనిషి అక్కడ పలాయనం చిత్తగించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి నిరసనగా ఉద్యోగులు, ప్రజలు ప్రతిపక్షాల ఆందోళనలను ఉపశమింప చేయాల్సిన ప్రధాని పార్లమెంట్‌ నుండి పరారయ్యాడు. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ నిఘా నీడలో పాలన చేస్తూ విపక్షాల గొంతు నొక్కుతూ, మరోవైపు దేశ ప్రజ కలత చెందుతూ పార్లమెంట్‌ వేదికగా వివరణ కొరకు వేచి ఉండగా, నిర్దేశిత గడువు కన్న రెండు రోజుల ముందే పార్లమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేసారు. 303 మంది సభ్యుల సంపూర్ణ మద్దతు పార్లమెంట్‌లో, తన బలంతో పాటు రాజ్యసభలో రెండు తెలుగు రాష్ట్రాల పాలక, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో ఓటింగ్‌లో నెగ్గగలిగిన బలమున్నా చేష్టలులుడిగి చేతులెత్తేసి ప్రజలను ఉసూరుమనిపించి ప్రజా ధనాన్ని ఖర్చు చేసి పార్లమెంట్‌ స్తంభనకు కారకుడైనాడు. ప్రజలకు 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో ఈ అంశాలపై వివరణ ఇవ్వాల్సిన పెద్దమనిషి ఆ పని చేయకపోగా విద్వేషాలను తిరిగి రగల్చడానికి ఇక ఇప్పటినుండి ప్రతి ఏటా ఆగస్టు 14న విభజన గాయాల స్మారక దినం జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు. ఈ పిలుపే దుర్బుద్ధితో కూడుకున్నది. దేశ విభజనను కోరుకున్న విష నాగుల సంతతి వారసుడైన మోదీ ఇంతకంటే మంచి ఆలోచన ఎట్లా చేస్తారు. విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపు కోవాలనే ఆరాటం ఇందులో దాగి ఉంది. స్వతంత్ర పోరాట కాలంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రబోధించి బ్రిటీష్‌ వారికి లొంగి ఉద్యమంలో పాల్గొనబోమని లేఖలు రాసి ఇచ్చిన బీజేపీ మాతృక ఆర్‌.యస్‌.యస్‌. భావజాలంతో ఉన్న మోదీ స్వాతంత్రం పొందిన ఆనందంతో పాటు విభజన వేదనలు, గాయాలు ఉన్నాయని 74 సంవత్సరాల తర్వాత మాట్లాడం అంటే ముస్లిం మైనార్టీలపై విద్వేషాన్ని చిమ్మాలనే ఆలోచనే. దేశ విభజనను కోరుతూ ముస్లిం లీగ్‌ 1940లో తీర్మానం చేసిన రోజును పాకిస్థాన్‌ ప్రతి సంవత్సరం ‘‘నేషనల్‌ డే ఆఫ్‌ పాకిస్థాన్‌’’ గా జరుపుకుంటున్నది. దీనికి మోదీ శుభాభివందనాలు తెల్పుతారు. వారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు తెల్పుతారు. ఇక్కడేమో మత ఉన్మాదాన్ని రెచ్చగొడతారు.
విభజన సమయంలో తన దుష్టపాత్రను, విభజనను వ్యతిరేకించిన జాతిపిత మహాత్ముడ్ని పొట్టన పెట్టుకున్న నికృష్ఠ చరిత్రను చెరిపి వేయడానికి, వాస్తవాల నుండి ప్రజల ఆలోచనను పక్కదారి పట్టించడానికి, 2024 ఎన్నికల్లో తిరిగి బీజేపీని అధికారంలో నిలబెట్టడానికి మోదీ ఉద్దేశపూర్వకంగానే దేశ విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ఇక మిగతా ప్రసంగ అంశాలన్నీ పాతవి, కొత్తవి కలగా పులగం చేసి తన డెమగాగి ఉపన్యాసంతో తొంబై నిమిషాలు (మోదీ భక్తుడైన సత్యకుమార్‌ లెక్క ప్రకారం 88 నిమిషాలు) ఊదరగొట్టారు. 2017న ఎర్రకోట నుండి చేసిన ప్రసంగంలో నవీన్‌ భారత్‌ లక్ష్యాన్ని 75వ స్వతంత్య్ర దినోత్సవానికి రూపుకట్టిస్తానని ప్రగల్భించాడు. కరోనా కల్లోలాన్ని తట్టుకొని భారతదేశం స్వయం సమృద్ధి (ఆత్మ నిర్భర్‌ భారత్‌) దిశగా పయనిస్తుందని 20 లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించాడు. ఇది ఆచరణలో ఎంత స్వయం సమృద్ధి సాధించిందో దేశ వాసులందరికీ ఎరుకే. 20 లక్షల కోట్ల ప్యాకేజి చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు, వలస కూలీలకు, దినసరి కూలీలకు, చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడకపోగా వారందరినీ దివాలా తీయించింది. 13.50 లక్షల చిన్న, చితక పరిశ్రమలు మూతబడి దాదాపు 60 లక్షల మంది కార్మికులు వీధుల పాలైనారు. మొత్తంగా 45 కోట్ల మంది పనులు లేక నానా అవస్థలు పడినారు. ఇంకా ఆ బాధలు తగ్గనేలేదు.
మోదీ భాషలో స్వయం సమృద్ధి అంటే ` తన సొంత రాష్ట్రానికి చెందిన కార్పొరేటు కంపెనీలు. ఆదానీ ఆస్తులు ఈ కరోనా సమయంలో కూడా 280 శాతం, రిలయన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ ఆస్తులు 480 శాతం పెరిగాయి. వీరి ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొనే కాబోలు నరేంద్రమోదీ స్వయం సమృద్ధి, సబ్‌ కా వికాష్‌, సబ్‌ కా సాత్‌, సబ్‌ కా విశ్వాస్‌ అని ప్రవచించారు. ఆగస్టు15న ఎర్రకోట ప్రసంగంలో పై మూడు నినాదాలకు తోడుగా సబ్‌ కా ప్రయాస్‌ అందరూ కష్టపడాలని అన్నారు. 135 కోట్ల ప్రజలంతా కష్టపడితే అమృత ఘడియలు స్వాతంత్య్ర దినోత్సవ శతాబ్ది ఉత్సవాల నాటికి సిద్ధిస్తాయని అందుకొరకు 100 లక్షల కోట్లు (కోటి కోట్లు) మౌలిక సదుపాయాల విస్తరణ కొరకు ప్రధానమంత్రి గతిశక్తి ప్రణాళికను సిద్ధం చేస్తునట్లు నొక్కి వక్కాణించారు.
ఎర్రకోటపై 8వ సారి త్రివర్ణ ప్రతాకాన్ని ఎగరవేసిన మోదీ గత 7 పర్యాయాలు ఇలాంటివి అనేకానేక ఊకదంపుడు ఉపన్యాసాలు, సొల్లు కబుర్లు చాలానే చెప్పారు. ఏ ఒక్క వాగ్దానం (అందరికీ మరుగుదొడ్లు, దేశమంతటా విద్యుదీకరణ, స్వచ్ఛమైన, పరిశుభ్రమైన నీరు, పోషకాహారం, అందరికీ ఆవాసం, అక్షరాస్యత, ఉపాధి, అవకాశాల కల్పన) ఆచరణలో పూర్తిగా పరిష్కరించలేదు. ఇప్పుడేమో కోటి కోట్ల ప్రధాని గతిశక్తి. ఆత్మనిర్బర్‌ ఎలా అయితే ప్రజావంచనతో కార్పొరేట్‌ లాభాల కొరకు సాగిందో ప్రధాని గతిశక్తి కూడా గతి తప్పుతుందనే సంశయాలు దేశప్రజల్లో మెండుగానే ఉన్నాయి.
పొంతన లేని ఆయన మాటలే ఇందుకు నిదర్శనం. రైతుల పాలిట శాపంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని అంతా అడుగుతూ ఉంటే ఎర్రకోట నుండి అదే స్వతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో వ్యవసాయ చట్టాల వలన 2 హెక్టార్ల భూమి ఉన్న రైతులందరికీ గొప్ప వరం అని చెప్పటం చూస్తే నోరు మాట్లాడుతుంది, నొసలు ఎక్కిరిస్తుంది అనే సామెత లాగా ఆయన వాలకం ఉంది. రైతులు చర్చలు జరపవచ్చు, చట్టాలకు సవరణలు కోరవచ్చు అని ఒక వైపు పార్లమెంటు సమావేశాల్లో నమ్మ బలుకుతూ సమావేశాలు ముగియగానే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు.
చట్టసభల్లో ముఖ్యంగా పార్లమెంటు చేసే బిల్లులపై సమగ్ర చర్చ జరుగనందువల్లే చట్టాలలో లొసుగులు, లోపాలు ఉన్నాయని, దీనికి ప్రజలు బలి పశువులవుతున్నారని చీఫ్‌ జస్టీస్‌ రమణ ఆగస్టు 15 నాడే మోదీ ఏకపక్ష నియంతృత్వ పోకడలతో, మంద బలంతో బిల్లులు పాస్‌ చేయించుకునే పద్ధతిని ఎండగట్టారు. పార్లమెంటు దేవాలయం, గర్భగుడి అని చెప్పే మీరు, మీ నాయకుల మాటలు నిజమైతే ప్రజాస్వామ్య పద్ధతులు పాటించండి లేదా ప్రజలు సరైన తీర్పు చెపుతారు.
వ్యాస రచయిత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img