Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

మతోన్మాద ఉక్కు సంకెళ్లు!

కూన అజయ్‌బాబు

అఫ్గానిస్థాన్‌లో అరాచకాలు పెరిగే కొద్దీ మహిళా హక్కుల గురించి పదేపదే మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఇస్లామిక్‌ చట్ట పరిధిలోనే అఫ్గాన్‌ మహిళలు తమ హక్కులు కలిగివుంటారని తాలిబన్లు ప్రకటించారు. ఇస్లామిక్‌ చట్టమంటే వారి దృష్టిలో ‘షరియా లా’. ‘‘ఇది దేవుడిచ్చిన, ఆదేశించిన నైతిక స్మృతి. దాన్ని అఫ్గాన్‌ మహిళలు పాటించి తీరాల్సిందే. దానికి కట్టుబడి ఉండాల్సిందే. దీంట్లో వేరే ఆప్షన్లు లేవు. అఫ్గాన్‌ ప్రజలంతా హాయిగా వుండవచ్చు, తిరగవచ్చు. ఎవరికీ హాని తలపెట్టం. కాకపోతే ఇది పురుషులకు మాత్రమే వర్తిస్తుంది. మహిళలు ఎట్టిపరిస్థితు ల్లోనూ విచ్ఛలవిడిగా బయట తిరగడానికి వీల్లేదు. మగతోడు లేకుండా ఏ ఒక్క మహిళ ఇంటి బయటకు రాకూడదు. బుర్ఖా తప్పనిసరి. వైద్యం పేరు చెప్పి ఏ మగ డాక్టర్‌ మిమ్మల్ని తాకకూడదు. మగాళ్లతో కలిసి చదవు అభ్యసించడానికి అసలు వీల్లేదు. దేవుడు రూపొందించిన ‘షరియా లా’ ప్రకారం మీరు నడుచుకోవాలి’’ అని కొన్ని రోజుల క్రితం తాలిబన్లు కాబూల్‌లో బహిరంగంగా చేసిన ప్రకటన యిది. ఇది జరిగిన కొద్ది రోజులకే తాలిబన్లు తొలి ఫత్వాను జారీ చేశారు.
తాలిబన్లు రెండోసారి అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత ‘అఫ్గాన్‌లో సహవిద్యపై నిషేధం’ విధిస్తున్నట్లు ఒక ఫత్వా ద్వారా వారు ప్రకటించారు. ముందుగా హెరాత్‌లో దీన్ని విడుదల చేసి, ఆ తర్వాత అన్ని ప్రాంతాలకు వర్తింపజేస్తున్నారు. పురుషులు, మహిళలు కలిసి చదువుకోకూడదు అనేది ఈ ఫత్వా ఉద్దేశం. ‘సామాజిక జాఢ్యాలన్నింటికీ మూలం ఇదే’ అని సహవిద్యను తాలిబన్లు అభివర్ణించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలపై ఈ ఆంక్షలు విధించారు. నిజానికి మహిళావిద్య ఒక్కటే కాదు… పాఠశాలలు, కళాశాలలు, ఉన్నతవిద్య అంటేనే తాలిబన్లకు ద్వేషం. ఒక్క హెరాత్‌రాష్ట్రంలోనే 40వేలమందికి పైగా మహిళా విద్యార్థినులు చదువుకుంటున్నారు. 2 వేల మందికి పైగా పురుష లెక్చరర్లు వున్నారు. మహిళలకు మహిళాఅధ్యాపకులు మాత్రమే చదువు చెప్పాలన్నది తాలిబన్ల నిబంధన. కానీ మహిళా అధ్యాపకులు పదుల సంఖ్యలో మాత్రమే వున్నారు. దీన్ని బట్టిచూస్తే, మహిళా విద్య ఈ దేశంలో ఇక లేనట్లేనని తేటతెల్లమవుతున్నది.
‘షరియా లా’కు తాలిబన్లు భిన్నమైన భాష్యం చెపుతున్నారు. మహమ్మద్‌ ప్రవక్త నైతిక జీవితం గురించి అద్భుతంగా చెప్పారు. జనం సృష్టించుకున్న ‘దేవుడు’ అనే కాన్సెప్ట్‌కు సరిగ్గా సరిపడే వ్యక్తి మహమ్మద్‌ అని చెపుతుంటారు. నిజానికి ఆయన బోధనలకు, ‘షరియా లా’కు సంబంధం లేదని ముస్లిం వర్గాల్లోని అభ్యుదయవాదులు చెప్తారు. ప్రవక్త తర్వాత ఆ మతానికిచెందిన పండితులు, ఛాందసులు తలోదారిలో విచక్షణారహితంగా రాసే రాతల్లో ‘షరియా లా’ ఒకటని స్పష్టమవుతున్నది. సమసమాజ భావనకు ఇది పూర్తిగా విరుద్ధం. కేవలం లింగం ఆధారంగా వివక్షను ప్రదర్శించి జీవితాంతం శిక్ష విధించే హక్కును, అధికారాన్ని తాలిబన్లకు మతోన్మాదమే ఇచ్చింది. షరియా ప్రకారం న్యాయవ్యవస్థను సృష్టిస్తే భావస్వేచ్ఛ మొదలుకొని అన్నిరకాల స్వేచ్ఛలకు అది ఆటంకంగా మారుతుంది. దొంగతనం, కల్తీ, అక్రమసంబంధాలువంటివి ఈ చట్టం క్రింద కఠినశిక్షలకుపాత్రమైనవి. కఠినశిక్షలంటే రెండుమూడేళ్ల జైలుశిక్షలు కాదు…తల నరికేయడం, కాళ్లుచేతులు వేరుచేయడం, నాలుక తీసేయడం వంటి శిక్షలన్నమాట. ‘షరియా లా’కు మత ఛాందసులు, ఉగ్ర వాదులు…ఇలా ఎవరికివారు ఇచ్చుకున్న భాష్యాలపై ముస్లిం ప్రపంచంలో చర్చ జరుగుతూనే వుంది. కొన్ని ముస్లిం దేశాలు ‘షరియాలా’కు దూరంగా ఉంటూ మహిళాభ్యున్నతికి కృషి చేస్తున్నాయి. ముస్లిం మహిళలు ఎంతో ఎత్తుకుఎదిగిన సందర్భాలు, మహోన్నతపదవులు,ఉద్యోగాలు సంపాదించిన ఉదాహరణలు కోకొల్లలు. కానీ అఫ్గాన్‌ను కొన్ని యుగాల క్రితం నాటికి నెట్టేయడాన్ని హక్కుల కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అఫ్గాన్‌లో మిలటరీకోడ్‌ లేదా మొరాలిటీ కోడ్‌ ఉండాల్సిందేనా అని అక్కడి మహిళలు వాపోతున్నారు. ఏ కోడ్‌లూలేకుండా స్వేచ్ఛగాబతకలేమా అన్నది వారి ప్రశ్న.
అఫ్గానిస్థాన్‌ను పక్కనబెడితే, భారతదేశంలో కూడా ‘షరియా లా’ అమలవుతున్నదా? కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇటీవలనే బీహార్‌లోని భాగల్‌పుర్‌లో ఉన్న సుందరావతి మహిళా మహా విద్యాలయం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కళాశాల ఆవరణలో యువతులుపక్కాగా జడవేసుకుని కనిపించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా ఈ ఏడాది ఇంటర్‌లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను నిర్దేశించింది. దీనితో పాటు విద్యార్థినులు కళాశాలఆవరణలో సెల్ఫీలు తీసుకోవడంకూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అమ్మాయిలు లూజ్‌ హెయిర్‌తో వస్తే వారిని కళాశాలలోకి అనుమతించబోమని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రామన్‌ సిన్హా తేల్చి చెప్పారు. సంస్థ అదేశాలను ఎవరైనా అతిక్రమించి డ్రెస్‌కోడ్‌ లేకుండా, జడ వేసు కోకుండా వచ్చే వారికి ప్రవేశం లేదని ‘ఫత్వా’ జారీ చేసింది. కళాశాల కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. మతోన్మాదులు అధికారంలోకి వస్తే… అది అఫ్గాన్‌ అయినా ఇండియా అయినా ఇలాంటి షరియా తరహా ఆంక్షలు అమలవుతాయని ప్రజలు తెలుసుకోవాల్సిన తరుణమిది!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img