Friday, March 31, 2023
Friday, March 31, 2023

మనకు తప్పని ఆర్థికమాంద్యం

ప్రపంచ దేశాలన్నీ 2023లో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కో నున్నాయని, ప్రపంచ జిడిపీ కుచించుకుపోనున్నదనే కఠిన వాస్తవాన్ని ‘సెంటర్‌ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రీసెర్చ్‌ (సిఈబిఆర్‌)’ సంస్థతో పాటు ఇతర అంతర్జాతీయస్థాయి సంస్థలు హెచ్చరికలు చేసాయి. 2022లో ప్రపంచ ఆర్థికవ్యవస్థ 100 ట్రిలియన్‌ డాలర్లకు చేరడం, 2023లో అక్కడే ఆగిపోవడం గమనిస్తున్నాం. ‘బ్లూమ్స్‌బర్గ్‌’ వివరణ ప్రకారం 2023లో దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని గత అక్టోబర్‌-2022లోనే అంచనా వేసింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ఏషియా పసిఫిక్‌ దేశాల్లో 2037 నాటికి ఆర్థికప్రగతి రెట్టింపు కావచ్చని, యూరోపియన్‌ దేశాల్లో మాంద్యం ఇంకా కొనసాగవచ్చని తెలుస్తున్నది. ప్రపంచ ఆర్థిక మాంద్య అగ్నికి రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, చైనాను వెంటాడుతున్న కోవిడ్‌మహమ్మారి ప్రభావం, అధిక ద్రవ్యోల్బణం, కఠిన ఆర్థిక పాలసీలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, వివిధ దేశాల్లో రాజకీయ సంఘర్షణలు ఆజ్యం పోస్తున్నాయని తెలుస్తున్నది. నేడు ప్రపంచ ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ట స్థాయికి చేరినట్లు, దీనికి విరుగుడుగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచడం గమనించాం. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం 2023 తొలి త్రైమాసికంలోనే అమెరికా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోనున్నట్లు హెచ్చరిస్తున్నారు.
రానున్న ఆరు మాసాల్లో భారతదేశ ఆర్థిక మాంద్యాన్ని చవిచూడ వచ్చని, దీని ఫలితంగా ఆర్థికవ్యవస్థ మందగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంగీకరించడం, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ హెచ్చరించడం గమనించాం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు దేశాలు అప్పులు చేయడానికి కూడా వెనకాడడం లేదు. అధిక ద్రవ్యోల్బణానికి ప్రతిస్పందనగా వడ్డీరేట్లు పెరగడంతో 2023లో ఆర్థికమాంద్యం ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉన్నట్లు తెలుపుతున్నారు. రానున్న మాసాల్లో ప్రపంచ ఆర్థికవ్యవస్థలు మూడోవంతు కుదించుకు పోవచ్చని తెలుపుతున్నారు. 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతూ 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా నిలుస్తుందని ఊహిస్తున్నారు. రానున్న 15 ఏండ్లలో యూకె ఆరవ పెద్ద ఆర్థికవ్యవస్థగా, ఫ్రాన్స్‌ ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలువవచ్చని అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన సూపర్‌ పవర్‌ అమెరికాలో మాంద్యం ఏర్పడితే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా పడుతుందని వివరిస్తున్నారు. ప్రపంచ ఆర్థికమాంద్యం కారణంగా యూరోపియన్‌ బ్యాంకులు విఫలంకావడం, స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడం, భారత మార్కెట్‌ విలువలు పడిపోవడం జరుగవచ్చని తేల్చారు. అమెరికా ఏజన్సీలతో దగ్గరి సంబంధాన్ని కలిగిఉన్న భారత్‌లో ఆర్థిక మాంద్య ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. 2008లో ప్రపంచం చవిచూసినా ఆర్థికమాంద్య ప్రభావంనుంచి నాటి భారతం బయట పడడానికి మనదేశంలోని వ్యవసాయరంగం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం, విదేశీ కంపెనీల ప్రాజెక్టులు కొనసాగడం, దేశీయ బ్యాంకింగ్‌ రంగం సుస్థిరతను ప్రదర్శించడం లాంటి వివిధ కారణాలు దోహదపడడం గమనించాం. దేశ ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కోవడానికి వివిధ సంస్థలు ఉద్యోగులను తొలగించడం ఇప్పటికే ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అధిక ఆర్థిక మందగమనం కనిపించినప్పటికీ దాని ప్రభావం ఇండియాపై అంతగా ఉండకపోవచ్చని తెలుస్తున్నది. ఇండియాలో తయారీ రంగ సరఫరా శృంఖలం పటిష్టంగా ఉండడంతోపాటు తయారీదారులు చైనాను వీడి ఇండియా వైపు చూడడం కూడా శుభపరిణామంగా పేర్కొంటున్నారు. ఇటీవల మన దేశంలో ఆర్థిక సూచీలు మెరుగైన పనితీరును కనబర్చడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, నవంబర్‌-2022లో పారిశ్రామికోత్పత్తి 7.1శాతం పెరగడం, కంపెనీలు మెరుగైన ప్రణాళికలు కనబర్చడం లాంటివి భారత ఆర్థిక స్థిరత్వాన్ని నిలుపుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలకు కారుమబ్బులు కమ్ము కుంటున్నాయని, ద్రవ్యోల్బణం దశాబ్దాల గరిష్టానికి ఎగబాకిందని, అన్ని దేశాలకు వీటి ప్రభావం పడుతున్నదని ఐఎంయఫ్‌ హెచ్చరించడం గమనార్హం. ప్రపంచ దేశాల్లో 33శాతం వరకు ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటాయని, ప్రపంచ జిడిపీ 2శాతం కన్న తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఇవన్నీ ఆర్థిక మాంద్యానికి సూచికలని తెలుపుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా వ్యవసాయరంగం భారతానికి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తున్నదని, దీనితో పాటు పారిశ్రామిక రంగంకూడా ఇండియా ఆర్థిక పటుత్వానికి ఊతం ఇవ్వాలని కోరుకుందాం. ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్య షాకులకు గురైనప్పటికి ఇండియా మాత్రమే ఆర్థికంగా స్థిరత్వాన్ని ప్రదర్శించాలని ఆశిద్దాం, మన వంతు కర్తవ్యాలను నిర్వహిద్దాం.
డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి, 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img