ఆర్వీ రామారావ్
దిక్కుతోచనప్పుడు రాజకీయ నాయకులు దిక్కుమాలిన నిర్ణయాలే తీసుకుంటారు. ఏదో సంఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తినప్పుడు మరింత కఠినమైన చట్టాలను తీసుకు రావడానికి ఉపక్రమిస్తారు. కోల్‌కతా వైద్య కళాశాలలో ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేసి చివరకు హతమార్చిన సంఘటనపై పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మవచతా బెనర్జీని ఇరకాటంలో పడవేసింది. ఈ నిరసనలు ఎవరి ప్రోద్బలంతో జరిగాయో అందరికీ తెలుసు. మమతా బెనర్జీని ఎన్నికలలో ఓడిరచలేని బీజేపీ అవకాశం దొరికినప్పుడల్లా రచ్చకీడుస్తోంది. కోల్‌కతా అత్యాచారం, హత్య తరవాత బీజేపీ ఈ పద్ధతినే అనుసరిస్తోంది.
ఈ బహుముఖ దాడులను తట్టుకోలేని స్థితిలో పడి పోయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహిళలపై అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష విధించాలని అంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో భారతీయ న్యాయ సమ్హిత (ఇది వరకు భారత శిక్షా స్మృతి) ఆధారంగా హత్యలకు పాల్పడిన వారిక్కి మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించే వారికి, తిరుగుబాటును ప్రోత్సహించే వారికి, కూట సాక్ష్యాలు సృష్టించే వారికి, డబ్బు లాగడం కోసం అపహరణలకు పాల్పడే వారికి, అత్యాచారం చేయడమే కాక మరణానికి దారితీసే పనులు చేసే వారికి లేదా అత్యాచారానికి గురైన మహిళ జీవచ్ఛవంలా మిగిలి పోయిన సందర్భంలో, 18 ఏళ్ల లోపు అమ్మాయిల మీద మూక పద్ధతిలో అత్యాచారం చేసిన వారికి, అత్యాచారం చేయడం అలవాటుగా మారిన వారికి మాత్రమే మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. హేయమైన రీతిలో జరిగే అత్యాచారాలకు మరణ శిక్ష విధించే అవకాశం ఇప్పటికే ఉన్నప్పటికి తాము అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించే వీలు కల్పించడానికి అనువుగా కొత్త చట్టం చేస్తామని మమతా బెనర్జీ అంటున్నారు. మరో వారంలో శాసనసభ సమావేశం ఏర్పాటుచేసి ఈ బిల్లును ఆమోదించినా ఆశ్చర్య పడవలసిన పని లేదు. శాసనసభ బిల్లును ఆమోదించినా దానికి రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ బిల్లును ఆమోదిస్తారన్న నమ్మకం లేదు. తాత్సారం చేయడానికి ఆయన ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించవచ్చు. రాష్ట్రపతి సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు ఇటీవలే బయట పడ్డాయి కనక అంతిమంగా బెంగాల్ శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుకు ఆమోదం ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో తెలియదు.
బిల్లు వ్యవహారం అలా ఉంచినా మరణ శిక్ష విధిస్తారన్న భయంవల్ల అత్యాచారాలు ఆగుతాయన్న హామీ లేదు. పైగా నాగరికత వికసిస్తోంది అనుకుంటున్న దశలో చాలా దేశాలు మరణ శిక్షను రద్దు చేశాయి. ఇప్పటికి 121 దేశాలు మరణ దండనను రద్దు చేశాయి. కొన్ని దేశాల్లో ఈ అవకాశం చట్ట రీత్యా ఉన్నా అమలు చేయడం లేదు. 2022 నాటి అంతర్జాతీయ క్షమా సంస్థ అంచనా ప్రకారం 55 దేశాల్లో మరణ దండన చట్ట రీత్యా సమ్మతమైందే. అందులో మన దేశం కూడా ఉంది. మరణ దండన పైశాచికమైందని, ఎంత తీవ్రమైన నేరానికి పాల్పడ్డా మరణ శిక్ష విధించకూడదన్న అభిప్రాయానికి బలం చేకూరుతున్నందువల్ల మన దేశంలో అరుదాతి అరుదైన సందర్భాలలో మాత్రమే మరణ దండన విధిస్తున్నారు.
చట్ట రీత్యా అవకాశం ఉన్నందువల్ల న్యాయస్థానాలు మరణ శిక్ష విధించినా అన్ని సందర్భాలలో అమలు జరగడం లేదు. వివిధ కోర్టులను ఆశ్రయించి ఈ శిక్ష రద్దు చేయమని కోరే హక్కు ప్రజలకు ఉంది. అక్కడా కుదరక పోతే క్షమాభిక్ష పెట్టమని రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవచ్చు. కోర్టులు మరణ శిక్ష విధించినా అమలు చేయడంలో విపరీతమైన జాప్యం తప్పక పోవడంవల్ల ఆ శిక్షపడ్డ వారు రోజులు లెక్కపెట్టుకుంటూ జైళ్లల్లో మగ్గవలసి వస్తోంది. ఇలా నిరంతరంగా అమలుకు వేచి ఉండడం మరణశిక్ష అనుభవించడంకన్నా వేదనా భరితమైంది. మరణ శిక్ష విధించడానికీ అవకాశం ఉన్న దేశాలలోనూ 23 దేశాలు గత పది సంవత్సరాల నుంచి ఎవరికీ మరణ శిక్ష విధించలేదు. ఈ 55 దేశాలలో తొమ్మిది దేశాలు హీనాతి హీనమైన నేరాలకే మరణ శిక్ష విధిస్తున్నాయి. దీన్నే మన దేశంలో అరుదాతి అరుదైన సందర్భాలుగా వ్యవహరిస్తున్నాం. అప్పుడూ ఒక ప్రశ్న వస్తుంది. ఒక నేరం అరుదాతి అరుదైందని నిర్ణయించేది చివరకు న్యాయస్థానాలే. నికరంగా చెప్పాలంటే న్యాయమూర్తులే. వారికి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉండొచ్చు. స్వీయ మానసిక ధోరణులు ఉండొచ్చు. చట్ట రీత్యా అవకాశం ఉన్నా మరణ శిక్ష విధించడం ఇష్టం లేని న్యాయమూర్తులు ఉండొచ్చు. అనాలోచితంగా ఈ శిక్ష విధించే వారూ ఉండొచ్చు. గతంలో అనేక కేసుల్లో మరణ శిక్ష విధించి పొరపాటు చేశామని ఆ తరవాత న్యాయమూర్తులే నాలిక కరుచుకున్నారు. అంటే అలా మరణ శిక్ష విధించించి, అమలు కూడా అయిపోతే న్యాయమూర్తులు తమ తప్పును తీరికగా గుర్తించినా పోయిన ప్రాణం తిరిగి రాదు. ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, అమెరికా దేశాల్లోనే మరణ శిక్షలు ఎడా పెడా విధిస్తున్నారు. ఇరాన్‌లో అయితే 2022లో ముగ్గురికి బహిరంగంగా మరణ శిక్ష విధించారు. ఇరాన్ లో 2022 మందికి మరణ శిక్ష పడితే సౌదీలో 55 మందికి, సింగపూర్‌లో 11 మందికి మరణ శిక్ష విధించారు. 2022లో మరో ఆరు దేశాలు ఈ శిక్షను అనాగరకంగా భావించి రద్దు చేశాయి.
హేయమైన నేరాలకు మరణ శిక్ష విధిస్తారన్న భయం ఉంటే అది హేయమైన నేరాలకు పాల్పడకుండా నిరోధిస్తుందన్న భ్రమ మన దేశంతో సహా అనేక దేశాల్లో ఉంది. కానీ మరణ శిక్ష అమలు చేస్తున్న దేశాలలో హేయమైన దేశాలు తగ్గిన సూచనే లేదు. మరణ శిక్ష రద్దు చేసిన దేశాల్లో హేయమైన నేరాలు పెరిగిన దాఖలాలూ లేవు. అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధిచడానికి చట్టాల్లో వెసులుబాటు ఉన్న కొన్ని రాష్ట్రాలు ఆ ‘‘సదుపాయాన్ని’’ వినిపించుకోవడం లేదని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అంగలారుస్తున్నారు. అత్యాచారాలకు లేదా అత్యాచారం చేసి హత్య చేసే వారికి మరణ శిక్ష విధించాలని మమతా బెనర్జీ అనడం నిస్సహాయంగా మిగిలిపోవడంవల్ల చేస్తున్న వాదనే. ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు తమ ప్రభుత్వం ఉపేక్షించదని జనాన్ని నమ్మించడానికే. వ్యక్తులు నేరం చేస్తే మరణ శిక్ష విధించే అవకాశం ఉండడం వల్ల అలాంటి నేరాలు తగ్గుతాయన్న భరోసా లేదు. వ్యక్తులు చేసే హేయమైన నేరాలకు అంతిమ శిక్ష అయిన మరణ శిక్ష విధించడమే అనాగరకమైంది అయినప్పుడు రాజ్యానికి ఆ అవకాశం ఇవ్వడం హేయాతి హేయం. ఇది విలోమ ఆలోచన.