Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

మరుగునపడిన ప్లాస్టిక్‌ నిషేధం

డాక్టర్‌ యం.సురేష్‌ బాబు

ఆచారం చెప్పిన హరిదాసు అదే కూటికి ఎగబడినట్లు. ప్లాస్టిక్‌ నిషేధం అప్పుడు ఇప్పుడు అని కేవలం మాటలకే పరిమతమయ్యారు పాలకులు. గ్రామాలలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు మెంబర్లు వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజు, పండుగలు, జాతరలు శంకుస్థాపనలు, అలాగే నగరాలలో ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ మేయర్లు మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినా పట్టించుకునే నాథుడేలేడు. ఫ్లెక్సీలు తయారీకి లక్షల్లో డబ్బు ఖర్చుచేస్తున్నారు, ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది? మంచి వాతావరణం పెంపొందించే దిశగా వీరి ప్రయత్నం లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలకు, నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీ నాయకులు తెగ తాపత్రయ పడుతున్నారు. చిత్తశుద్ధిలేని ఇలాంటి నాయకులను ఈసడిరచుకోవాల్సిన అవసరం పౌరసమాజంపై ఉంది. ప్లాస్టిక్‌తో అందరి జీవితాల్లో విడదీయరాని సంబంధం ఏర్పాటు చేసుకుని అనర్థాలు కొనితెచ్చుకుంటున్నారు. మనం వాడే చెప్పులు ప్లాస్టిక్‌, రాసే పెన్ను, దువ్వుకునే దువ్వెన, మంచినీరు తాగే బాటిల్‌ ప్లాస్టిక్‌, తినే ప్లేట్‌ ప్లాస్టిక్‌. మార్కెట్‌కు, సంతకు, నిత్యావసర సరుకులు కొనడానికి సంచి తీసుకుని వెళ్లడంలేదు. మటన్‌, చికెన్‌ షాపులకు కారియర్లు, స్టీల్‌ బాక్సులు తీసుకువెళ్లడం లేదు, ప్లాస్టిక్‌ కవర్లలో మాంసాన్ని తీసుకుపోతున్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్‌ కవర్లు మూగ జీవాల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఎంత మొత్తుకున్నా ప్రజలు మాత్రం పట్టించుకోవడంలేదు. పొట్టలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోవడంతో మూగజీవాలు చనిపోయిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టిక్‌వల్ల పశువులు అకస్మాత్తుగా మరణంబారిన పడుతున్నాయి. ఇలా చనిపోయిన పశువుల మాంసాన్ని తినడానికి గద్దలు, కాకులు కూడా ఆసక్తి చూపడం లేదు. తద్వారా జీవావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులకన్నా ప్లాస్టిక్‌ సంచులు వాడకం ప్రమాదం. పలుచగా ఉండే ఈ ప్లాస్టిక్‌ సంచులను అతిగా వాడి, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ప్లాస్టిక్‌ కవర్లు డ్రైనేజీలు, మురుగు కాలువల్లో పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులకు గురిఅవుతున్నా ప్లాస్టిక్‌ వాడకాన్ని వదిలించుకోలేకపోతున్నారు.
పశువుల్లో ఉన్న జీర్ణవ్యవస్థ నిర్మాణం ప్రకారం, ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకుంటున్న విషయం వాటికి తెలిసే అవకాశంలేదు. దీంతో ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు కూడా వాటి పొట్టలోకి చేరుతున్నాయి. వీటిని జీర్ణం చేసుకునే శక్తి గానీ, విసర్జించడం ద్వారానో, వాంతి చేసుకోవడం ద్వారానో వాటిని బయటకు పంపించే విధానం గానీ పశువుల్లో లేదు. దీంతో పొట్టలో గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్‌ పేరుకుపోవడంతో అవి పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకం విపరీతంగా పెరిగింది. ప్రతి శుభకార్యంలో కనీసం ఒక ట్రాక్టర్‌ వ్యర్థం బయటపడుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు వ్యర్థంతో ఎంత అనర్థం దాగుందో. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ సంచులను పూర్తిగా నిషేధించాలి. ప్లాస్టిక్‌ సంచులు తీసుకెళుతున్న వ్యక్తులపై జరిమానాలు విధిస్తే ప్రజలు బుద్ధి తెచ్చుకుంటారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాసైన్స్‌వేదిక, జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థల కృషిఫలించి ఒకసారి ఉపయోగించి పడేసిన ప్లాస్టిక్‌ కవర్లను కేంద్రప్రభుత్వం గత సంవత్సరం జులై 1 నుండి రద్దు చేశామని చెప్పడం ప్రకటనలకే పరిమితమైంది. ప్రభుత్వం ప్లాస్టిక్‌ కవర్లను నిషేధించడం కాకుండా వాటిని ఉపయోగించకుండా కఠిన నిర్ణయాలు అమలుచేసే బాధ్యత ప్రభుత్వం తీసుకొని వాటిని ఉపయోగించకుండా తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరంఉంది. గతంలో కూడా గుట్కా, పాన్‌ పరాగ్‌లు నిషేధం చేసినప్పటికీ అవి ఎక్కడో ఒక దగ్గర అమ్ముడు అవుతూనే ఉన్నాయి అటువంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలుచేసి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అదేవిధంగా ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్‌ కవర్లను రద్డుచేసుకొని, గుడ్డ సంచులు, చికెన్‌, మటన్‌, చేపలు తీసుకెళ్లడానికి టిఫిన్‌ కారియర్లు ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడడంలో తమ వంతు సహాయ పడాలి. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ పదార్థాలు సాధారణంగా పాలీ వినైల్‌ క్లోరైడ్‌ లేదా పాలిథిలిన్‌ వంటి బయోడిగ్రే డబుల్‌ కాని ప్లాస్టిక్‌ల నుండి తయారుచేస్తారు. ఈ ప్లాస్టిక్‌లు వందలసంవత్సరాలపాటు పర్యావరణంలో కొనసాగు తాయి, ఇది ప్రపంచ ప్లాస్టిక్‌ కాలుష్య సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీని తరచుగా ప్యాకేజింగ్‌, బ్యాగ్‌లు స్ట్రాస్‌వంటి సింగిల్‌-యూజ్‌ వస్తువులలో ప్లాస్టిక్‌ ఉపయోగిస్తారు, వీటిని తక్కువ వ్యవధిలో ఉపయోగించిన తర్వాత తరచుగా విస్మరిస్తారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధించడంవల్ల పల్లపుప్రాంతాలు మహా సముద్రాలలోకి ప్రవేశించే ప్లాస్టిక్‌వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించవచ్చు, పర్యావరణవ్యవస్థలు వన్యప్రాణులను రక్షించ వచ్చు. ప్లాస్టిక్‌ కాలుష్యం సముద్ర జీవులకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. బ్యాగులు ప్యాకేజింగ్‌ వంటి సౌకర్యవంతమైన ప్లాస్టిక్‌ వస్తువులను గాలి, నీటి ద్వారా జలమార్గాలు, నదులు, మహాసముద్రాలలోకి సులభంగా తీసుకువెళ్లవచ్చు.
తాబేళ్లు, పక్షులు, చేపలు వంటి సముద్ర జంతువులు ప్లాస్టిక్‌ ఫ్లెక్సీని ఆహారంగా భావించి తినవచ్చు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధించడం ద్వారా, సముద్ర పర్యావరణ వ్యవస్థలను రక్షించడంలో సున్నితమైన జల వాతావరణాలను సంరక్షించడంలో సహాయపడాలి.
ఫ్లెక్సీలలో ఉపయోగించే ప్లాస్టిక్‌లు ఆహారం, పానీయాలు పర్యావరణంలోకి ప్రవేశించగల రసాయనాలను కలిగిఉంటాయి. ఈ రసాయనాలు కొన్ని, థాలేట్స్‌ బిస్ఫినాల్‌ వంటివి ఎండోక్రైన్‌ అంతరాయం పునరుత్పత్తి సమస్యలతో సహా ప్రతికూల ఆరోగ్య ప్రభావాలతో ముడిపడి ఉన్నాయి. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వాడకాన్ని తగ్గించడం ద్వారా, ఇటువంటి హానికరమైన పదార్ధాలకు మానవులు గురికావడాన్ని తగ్గించవచ్చు. తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీని నిషేధించడం ప్లాస్టిక్‌ కాలుష్యం హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి శక్తిమంతమైన విద్యా సాధనంగా ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తులు, వ్యాపారాలు ప్రభుత్వాలను వారి వినియోగ విధానాలను పునఃపరిశీలించుకోవడానికి మరింత స్థిరమైన పద్ధతులను అనుసరించడానికి ప్రోత్సహిస్తుంది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై మనం ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ స్పృహ, సంస్కృతిని పెంపొందించుకోవచ్చు. దీర్ఘకాలిక ప్రవర్తన ద్వారా మార్పును ప్రోత్సహించవచ్చు.
ప్రజాసైన్స్‌ వేదిక అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img