చలసాని వెంకటరామారావు
ఒక మహిళ దేశ అధ్యక్ష పీఠం అధిరోహించి ఉన్నా స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత కూడా జనాభాలో సగభాగం ఉన్న మహిళల సాధికారత గూర్చి చర్చ జరుగుతున్నది. మహిళలపై పురుషుల దృక్పధం మారాలని, స్త్రీల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు . మహిళా సాధికారత కోసం ‘బేటీ బచావో బేటీ పడావో’ వంటి పథకాలు వచ్చాయి. తల్లి, చెల్లి, ఆలి వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్త్రీ పుట్టినింట ఆంక్షలతో పెరుగుతున్నది, అత్తింటికి వచ్చి ఆరళ్ళకు గురౌతున్నదనే విషయం వాస్తవం. స్త్రీలు పురుషులతో సమానమైన హోదా, అవకాశాలు పొందకుండా సాధికారత పొందటం సాధ్యం కాదు. కుటుంబం, దేశం పురోగమనంలో మహిళల పాత్రను నేడు విస్మరించలేం. విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, సమాన హోదా పురుషులతో సమానంగా సాధించకుండా దేశం అభివృద్ధి పథంలో నడవటం సాధ్యం కాదు.
అనాదిగా మహిళలు అణచి వేతకు, నిరాదరణకు గురౌతున్నారు. మనుస్మృతి మహిళల స్వేచ్ఛను హరించింది. మతం పేరుతో మహిళలకు సముచితస్థానం నిరాకరించారు. వంట ఇంటికి, పడక గదికి మహిళలను పరిమితం చేసింది. మనుస్మృతి ‘‘ స్త్రీలు వ్యభిచారులు, పాపులు, చపలచిత్తులు, పురుషులను చెడుదారి పట్టించటమే వీరి పని’’ అని ప్రచారం చేసింది. స్త్రీలు స్వాతంత్య్రానికి అనర్హులని ‘ఆకుకు అందని పోకకు పొందని’ సిద్ధాంతాలతో స్త్రీలను బానిసల కన్నా హీనంగా ఒక నాటి సమాజం ఆంక్షలు విధించింది. మధ్య యుగాలలో స్త్రీల స్థాయి మరింత దిగజారింది. సతీసహగమనం, బాల్య వివాహాలు, విధవలపై ఆంక్షలతో నాటి సమాజం మహిళను ఒక ఆట వస్తువుగా భావించింది. ముస్లిం దండయాత్రలతో మహిళలను పరదాల చాటుకు నెట్టివేశారు. జౌహార్ (రాజస్థాన్), దేవదాసీ, జోగినీ, మాతంగినీ వంటి పేర్లతో లైంగిక వేధింపులకు మహిళలు గురయ్యారు. బ్రిటీష్ పాలనాకాలంలో భారత దేశంలో రాజారామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫూలే వంటి వారు మహిళాభ్యున్నతికి పోరాడారు. ఆంధ్ర దేశంలో కందుకూరి వీరేశలింగం మహిళల హక్కులు, సంస్కరణల కోసం ఉద్యమించారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో 1917 ప్రాంతం నుండి మహిళలు రాజకీయ హక్కుల ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెసు మహిళల రాజకీయ హక్కులకు మద్దతు ఇచ్చి స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళా శక్తిని సమీకరించింది. జాతీయోద్యమం ఇచ్చిన ఉత్తేజంతో అనిబిసెంట్ నాయకత్వాన శ్రీమతి మార్గరెట్ కజిన్స్ 1917లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనే మహిళా సమాజాన్ని స్థాపించారు. వీరు మహిళలకు ఓటు హక్కును డిమాండ్ చేశారు. 1927లో సరోజినీ నాయుడు, విజయలక్ష్మీ పండిట్ నాయకత్వంలో అఖిల భారత మహిళా సంఘం ఏర్పడిరది. ఆంధ్ర ప్రాంతంలో బండారు అచ్చమాంబ, కందుకూరి రాజ్యలక్ష్మమ్మ మహిళా సంఘాలు స్థాపించి విద్యావ్యాప్తికి, మూఢాచారాల నిర్మూలనకు కృషి చేశారు. అంతకు ముందే 1910 లో సరళాదేవి చౌదురాణి ‘భారత్ స్త్రీ మహామండల్’ అనే సంస్థను అలహాబాదులో స్థాపించి మహిళా విద్యకు పునాదులు వేశారు. 1937 లో దుర్గాబాయి దేశముఖ్ ‘ఆంధ్ర మహిళాసభ’ ను స్థాపించారు. సరోజనీనాయుడు, కస్తూరిబాయి గాంధీ, విజయలక్ష్మి పండిట్, అనిబిసెంట్, కమలా నెహ్రూ, సరళాదేవి చౌదరి, దుర్గాబాయ్ దేశముఖ్‌లు 20వ శతాబ్దంలో గుర్తించదగిన మహిళా నాయకురాళ్లుగా జాతీయోద్యమంలో పాల్గొని బహుముఖంగా పోరాడారు. కల్పనాదత్, ప్రీతిలత వడ్డేదార్‌లు చిటగాంగ్ ఆయుధాగారం దోపిడీలో, అరుణా అసఫ్ ఆలీ క్విట్ ఇండియా ఉద్యమంలో, లక్ష్మీ సెహగల్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉండి పోరాడారు. సావిత్రీబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సనాతన వాదులను ఎదుర్కొని, అవమానాలను భరించి మహిళా విద్యకై పోరాడారు. సంఘసంస్కరణ వాదుల కృషి, మహిళా సంఘాల కృషి ఫలితంగా సతీ సహగమన నిషేధ చట్టం – 1829, పునర్వివాహ చట్టం – 1856, బాల్య వివాహ నిషేధ చట్టం – 1872, దేవదాసీ నిషేధ చట్టం – 1925 వంటి చట్టాలు వచ్చాయి. మహిళా హక్కులు, వివాహ సంస్కరణలు, శ్రామిక మహిళా హక్కులపై 1927లో అఖిల భారత మహిళా మహాసభ ఏర్పడిరది. 1920లో బంగియా వార సమాజ్ బెంగాల్‌లో ఏర్పడి మహిళా ఓటింగ్ హక్కుకై ఉద్యమించింది. 1954లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ కలకత్తా కేంద్రంగా ఏర్పడిరది. ఇది మొట్ట మొదటి వామపక్ష మహిళా సంఘం. ఈ సంఘం స్థాపనకు రెండు దశాబ్దాల ముందే ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టుల చొరవతో ఒక ప్రజాతంత్ర ఉద్యమంగా మహిళా ఉద్యమం సాగింది. ఫ్యూడల్ సాంప్రదాయ సంకెళ్ళను ఛేదించి మహిళలను బయటకు తీసుకు రావటమే కోకుండా వీరేశలింగం సాగించిన సంఘ సంస్కరణోద్యమాన్ని కొనసాగించింది. సంస్కరణ వివాహాలు, విధవా పునర్ వివాహాలు జరిపించి సాంప్రదాయ వాదుల దాడులను ఎదిరించి నిలిచారు.
ఆధునిక మహిళ అన్ని రంగాలలో పురోగమిస్తున్నది. రాజకీయాలు, క్రీడలు, సాహిత్యం, కళలు, సంస్కృతి, మీడియా, సేవారంగం, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగం, పోలీసు, సైన్యం, విమానయానం, సాఫ్ట్‌వేర్, వ్యాపారం, ఫార్మా, విద్యా, వైద్యరంగాలు ఉపాధ్యాయులుగా, అంతరిక్షయానం, బ్యాంకుల నిర్వహణ వంటి సమస్త రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. సమానత్వం పాతిపదికన రాజ్యాంగం ఎన్నో హక్కులు ఇచ్చింది. అయినా మహిళలు వివక్షతకు గురవుతున్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. భ్రూణ హత్యలు, లింగ వివక్ష, వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహహింస, లైంగిక వేధింపులు సాగుతున్నాయి. వైద్య సౌకర్యాలు అందక గిరిజన మహిళలు నేటికి మృత్యువాత పడుతున్నారు. మహిళా సాధికారత గూర్చి పాలకులు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా గత 10 ఏళ్ళ బీజేపీ పాలనలో మహిళలకు ఒరిగింది ఏమిలేదు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో పేర్కొన్న ప్రకారం 2021లో 4 లక్షల 28 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అందుకు ముందు సంవత్సరంతో పోల్చితే 15.3 శాతం నేరాలు ఎక్కువగా మహిళలపై నమోదయ్యాయి. పిల్లలపై అత్యాచారాలు, అపహరణలు, అత్యాచారం, గృహహింస, వరకట్న దాడులు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. మహిళలపై నేరాలలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలు ముందు వరసలో ఉన్నాయి. ప్రపంచ ‘రేప్ రాజధాని’ గా భారత్ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంది. ప్రభుత్వ వైఖరి మహిళలపై నిర్దయగా ఉందనే భావన ప్రభలంగాఉంది. రోజురోజుకు ఒంటరి మహిళలసంఖ్య రోజు రోజుకు పెరగటం ఆందోళ కలిగించే అంశం. మహిళా సాధికారతకు ఎన్ని పథకాలు పెట్టామని చెప్పినా నేటికి ‘సమాన పనికి సమాన వేతనం’ లేదు. ‘స్కీం వర్కర’్ల పేరుతో వెట్టి చాకిరీకిగురై దేశ వ్యాపితంగా కోటికిపైగా మహిళలు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పేరుతో లక్షలమంది మహిళా కార్మికులు ఉద్యోగ భద్రతలేక దినదిన గండం నూరేళ్ళ ఆయష్షు అన్న చందంగా జీవిస్తున్నారు. ఇక రాజకీయ రంగంలో మహిళా రిజర్వేషన్ 33శాతం పార్లమెంటు ఆమోదించినా అమలు ఎప్పుడు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. 2029 తర్వాత అమలుచేస్తామని ప్రభుత్వం చెబుతున్నది. 2024 ఎన్నికలనుండి అమలు చేయాలని మహిళా సంఘాలు ముక్త కంఠంతో నినదిస్తున్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించటంలేదు, మహిళలు రాజకీయ భాగస్వామ్యం లేకుండా సాధికారత సాధించటం అసాధ్యం. మహిళా సమాఖ్య జాతీయ, రాష్ట్ర మహాసభలు ఈ క్రమంలో ఒక పోరాట కార్యక్రమాన్ని ప్రకటించనున్నాయి. పోరుబాటలో మహిళా సాధికారతకై భారతీయ మహిళలు ఉద్యమించాలి.
(నవంబరు 17 నుండి నంద్యాలలో మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలు జరుగనున్న సందర్భంగా…)
ఫోన్: 9490952093