Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

మానని మణిపూర్‌ గాయాలు

వినయ్‌ విశ్వం

మణిపూర్‌ను ప్రజలు భారత్‌కు మణి అంటారు.. ఆ తరవాత ప్రభుత్వం కూడా ఈ పదాన్ని తమ వ్యాపార ప్రకటనల్లో వాడుకుంది. మణిపూర్‌ చరిత్ర, సంస్కృతి, కళలు చాలా కాలంగా పరిణామంచెందుతూ వచ్చాయి. దీనిలో ప్రధాన పాత్ర ప్రజలదే. మెయితీలు, కుకీలు, నాగాలు ఆ అందమైన రాష్ట్రంలో ఉంటారు. దీనిలో మెయితీలు అధిక సంఖ్యాకులు. ఆ తరవాతి స్థానం కుకీలు, నాగాలది. వారు ఇన్నాళ్లూ కలిసి మెలిసే ఉన్నారు. అంతమాత్రం చేత ఈ తెగల మధ్య వివాదాలు, ఘర్షణలు లేవని కాదు. గతంలో ఘర్షణలు తలెత్తినప్పుడు రాజకీయ జోక్యం, వివేకం కారణంగా ఈ వివాదాలు సద్దుమణిగేవి. సామరస్య పూర్వకంగా పరిష్కారం అయ్యేవి. దీనితో మణిపూర్‌ సామాజిక,సాంస్కృతిక జీవనం అక్కడి ప్రజలను పరస్పరం సన్నిహితం చేసింది. కానీ బీజేపీ విచ్ఛిన్న విధానాల కారణంగా ప్రజలు సాధించిందంతా బూడిదపాలైంది.
మణిపూర్‌లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్కడి ప్రజలకు శాంతి, అభ్యున్నతి మాయమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల మీద ఆర్‌.ఎస్‌.ఎస్‌. పట్టు సంపాదించిన తరవాత ఈ దురవస్థ మొదలైంది. అస్సాంలో అధికారం సంపాదించిన తరవాత ఆర్‌.ఎస్‌.ఎస్‌. మణిపూర్‌ మీద పట్టు సంపాదించింది. 2017లో బీజేపీ ప్రయత్నించినా విజయం దక్కలేదు. కానీ కేంద్ర నాయకత్వం మద్దతు, డబ్బు సంచులవల్ల ఎమ్మెల్యేలను కొని కృత్రిమంగా మెజారిటీ సాధించారు. ఆ రకంగా అయిదేళ్లు అధికారంలో ఉన్నారు.
2022లో మెయితీలు, కుకీల మద్దతుతో మెజారిటీ సాధించారు. అయితే మెయితీలకు, కుకీలకు బీజేపీ పన్నాగం అర్థం కాలేదు. ప్రజలు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించవలసి వస్తోంది. బీజేపీ పాలనలో నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటివి మణిపూర్‌ ప్రజలను వేధించడం మొదలైంది. ప్రజల కష్టాలకు ‘‘ఇతరులు’’ కారణం అని బీజేపీ మెయితీలను, కుకీలను నమ్మించింది. మెయితీలకు, గిరిజనులకు ఉండే హక్కులు కావాలన్న భావన బీజేపీ కల్గించినందువల్లే మెయితీలకు, కుకీలకు మధ్య అపనమ్మకం పెరిగింది. మే మూడున ప్రారంభమైన హింసాత్మక ఘటనలు దీని ప్రభావమే. అది ప్రారంభం మాత్రమే. మే మూడున ఘర్షణలు, దహనకాండ, పోలీసు కాల్పుల తరవాత పరిస్థితి దిగజారింది. విష్ణుపూర్‌, తంగ్నౌపల్‌, కంగ్పోక్పి, మొరే లాంటి చోట్లకు హింసాకాండ విస్తరించింది. మణిపూర్‌ లోయలో అలజడి తరవాత చురాచంద్‌ పూర్‌లో, ఇతర కొండప్రాంతాలలో అగ్గి అంటుకుంది. మెయితీలు, కుకీలు ఈ హింసాకాండలో అగ్రభాగాన ఉన్నారు. ఈ హింసకు బలైంది పేదలు, అమాయకులు, బలహీనులే. ఇదంతా ఆర్‌.ఎస్‌.ఎస్‌., బీజేపీ పన్నాగం ఫలితమే. వామపక్ష ఎంపీలమైన మేం అక్కడ పర్యటించినప్పుడు పునరావాస శిబిరాల్లో ఉన్నవారు పడ్తున్న బాధ ప్రత్యక్షంగా చూడగలిగాం.
మెయితీల, కుకీల పునరావాస శిబిరాల్లోని వారి కష్టాలు ఒకేలా ఉన్నాయి. 50,648 మంది పునరావాస శిబిరాల్లో ఉన్నారని ప్రభుత్వం చెప్తోంది కానీ వాస్తవంగా ఇంకా చాలా ఎక్కువే. అక్కడ వారి ఆకలి తీరుతూ ఉండొచ్చు. కాని మౌలిక అవసరాలైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, మహిళలకు అవసరమైన శానిటరీ పాడ్లు, పిల్లల పోషకాహారం లాంటివి మాత్రం లేవు. విద్యావ్యవస్థ కుప్ప కూలింది. చాలా మంది పిల్లలు శిబిరాల్లోనే ఉన్నారు. వారి పాఠశాలలు దగ్ధమైనాయి. ఇవి సహాయక శిబిరాలని ప్రభుత్వం అంటోంది కానీ జనం తమ దేశంలోనే శరణార్థులుగా బతుకుతున్నారు. ఈ ఘర్షణల్లో అనేక చర్చిలు, దేవాలయాలు, ఇళ్లు కాలి బూడిదైపోయాయి. మమ్మల్ని చూస్తున్న జనం కళ్లల్లో ఆందోళన కనిపించింది. ఇది పరస్పర విద్వేషానికి ప్రతీక. పాలకులు జాతుల మధ్య విద్వేషం రెచ్చగొడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వీటిని పాలకులు తార స్థాయికి చేర్చారు.
ప్రజల కష్టాలను చూసిన వారు ఎవరైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడ అని ప్రశ్నించక మానరు. మణిపూర్‌లో ప్రభుత్వం ఉన్న ఆనవాలే లేదు. అత్యధిక పాలన, అత్యల్ప ప్రభుత్వం అన్న బీజేపీ ప్రచారం పెద్ద అబద్ధం. వాగాడంబరుడైన మోదీ మౌన మునిగా ఉండిపోయారు. సరిహద్దు రాష్ట్రమైన మణిపూర్‌లో ఈ పరిస్థితి చాలా విస్ఫోటనకరమైంది. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ప్రభుత్వ అంగాలన్నీ స్తంభించిపోయాయి. ఇది బీజేపీ రాజకీయ నిష్క్రియాపరత్వపుణ్యమే. ప్రభుత్వ వైఫల్యానికి ప్రజలు మూల్యం చెల్లించవలసి వస్తోంది. మణిపూర్‌ పరిస్థితికి మొదటి ముద్దాయి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే.
ఆ రాష్ట్రంలో సామాజిక-జాతిపరమైన-రాజకీయ పరిస్థితి ఇంత సంక్షుభితంగా ఉంటే ఏ ప్రభుత్వమైనా పట్టనట్టు ఎలా ఉండగలుగుతుంది? బీజేపీ కార్యకర్తలు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి మణిపూర్‌ సమస్య పరిష్కారానికి తమ దేశం మద్దతిస్తుందని ప్రకటించారు. అమెరికా మద్దతు ఇస్తానన్నా భారత ప్రభుత్వం నిష్క్రియాపరంగా మిగిలి పోయింది అని కూడా ఆయన అన్నారు. వాస్తవం ఏమిటంటే అమెరికా ఎక్కడా జోక్యం చేసుకున్నా పరిస్థితి మరింత జటిలమే అయింది. పలస్తీనా, అఫ్గానిస్థాన్‌ దీనికి ప్రబల నిదర్శనాలు. అమెరికా జోక్యంతో పరిస్థితి మరింత క్షీణించకూడదన్నది సీపీఐతో పాటు ఇతర వామపక్ష పార్టీల నిశ్చితాభిప్రాయం. ‘‘ఆత్మ నిర్భర్‌ ప్రభుత్వం అని గుండెలు బాదుకుంటున్న మోదీకి ఇతర దేశం జోక్యాన్ని అయినా నిరోధించే ధైర్యం ఉండాలి. మణిపూర్‌ పరాయి దేశాలకు క్రీడాంగణం కాకూడదు.
మణిపూర్‌లో పర్యటించిన వామపక్ష ఎంపీలు అన్ని రంగాలకు చెందిన అంటే మేధావులు, పౌర సమాజ సంస్థలు, హిందూ, క్రైస్తవ మత నాయకులను కలుసుకోగలిగారు. ఇందులో మెయితీలు ఉన్నారు. కుకీలూ ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకోవడంలో వారి మధ్య తేడాలున్నాయి. కాని వారందరూ ప్రభుత్వం విఫలమైందని ముక్త కంఠంతో చెప్పారు. మణిపూర్‌ సంక్షోభం వెనక భూమి, సంపద సమస్యలున్నాయి. మణిపూర్‌ కొండ ప్రాంతాలు సంపన్నమైనవి. అక్కడ అనేక సహజ వనరులున్నాయి. అక్కడ గిరిజన హక్కుల చట్టాలు అమలవుతాయి. కొండ ప్రాంతాల్లో కుకీలు చాలా కాలంగా అక్కడ నివాసం ఉంటూ తమ ఆచారాలను, సంప్రదాయాలను అనుసరిస్తున్నారు.
జనాభా పెరిగినందువల్ల లోయ ప్రాంతంలో భూమి కొరత ఉన్న మాట నిజమే. తమకు గిరిజన హోదా కావలంటున్న మెయితీలు కూడా భూమి చెక్క కోసమే ఆ మాట అంటున్నట్టున్నారు. కానీ రాజకీయశక్తులు, వ్యాపార రంగంలో తైనాతీలు ఖనిజాలతో సుసంపన్నమైన అటవీ ప్రాంతాలను కబళించాలని కుట్ర పన్నుతున్నారు. విభజించి పాలించే విధానాలలో చీకటి శక్తులన్నీ కుమ్మక్కు అవుతాయి. ఈ శక్తుల దురాశను తీర్చాలని ప్రయత్నించే దిల్లీ, ఇంఫాల్‌లోని ప్రభుత్వాలు తమ మీద ఆధారపడ్డవారికి దోచిపెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. రాజకీయ ప్రమేయం, ప్రజల భాగస్వామ్యమే అంతిమ పరిష్కారం.
` సీపీఐ జాతీయ కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img