Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

మానవవాదులు మనలోనే ఉన్నారు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

ఈ భూ గ్రహానికి గల పెద్ద ప్రమాదం ఏమిటంటే దీన్ని ఎవరో వచ్చి రక్షిస్తారన్న విశ్వాసంతో ఉండడంఈ మాట అన్నది రాబర్ట్‌ ఛార్లెస్‌ స్వాన్‌. తొలిసారి ఉత్తర ధృవం (1989) దక్షిణ ధృవం (1986) వెళ్లి, అక్కడ గడిపి, పరిశీలించి వచ్చిన బ్రిటీష్‌ పౌరుడు. ఈ భూమిని, ఇక్కడి వాతావరణాన్ని, ప్రకృతిని, జీవరాసుల్ని, మానవాళిని మొత్తానికి మొత్తంగా అన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని బలంగా చెప్పినవాడు. అలాంటివారి అనుభవాల్ని తెలుసుకుని, అందులోంచి మనం గ్రహించాల్సిన విషయం గ్రహించి, మనల్ని మనం, మన సమాజాన్ని మనం పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ప్రపంచ ప్రసిద్ధి రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టాయ్‌ అంటారు ‘‘ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మార్పు మనతోనే మొదలైతే ప్రపంచం అదే మారుతుంది!’’ అని! వృద్ధాప్యంలో కన్నబిడ్డలు వదిలేసినా, పూర్వ విద్యార్థులు పూనుకుని, తమ ఉపాధ్యాయురాలిని చేరదీసిన సంఘటన కేరళలోని మలప్పురంలో జరిగింది. అక్కడ ఒక ప్రైవేటు పాఠశాలలో ఒకప్పుడు ఎంతో తెలివైన ఉపాధ్యాయురాలిగా పేరున్న ఒక టీచరు కాలక్రమంలో వీధిపాలైంది. స్వంత కొడుకులు, కూతుళ్లు ఆమెను వదిలేశారు. జీవిత చరమాంకంలో ఆమె చాలా కష్టాలపాలైంది. కూడూ, గూడూ లేక వీధుల్లో తిరగాల్సి వచ్చింది. తన వాళ్లంతా ఎక్కడికి వెళ్లారో ఎక్కడ ఉన్నారో కూడా ఆమెకు తెలియదు. చివరకు బతకడానికి రైల్వేస్టేషన్‌ ముందు బిచ్చమెత్తుకోవలసివచ్చింది. ఎందరి ఛీత్కారాలకో గురవుతూ, మొండిగా అక్కడక్కడే కాలం గడుపుకోసాగింది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఒక పూర్వ విద్యార్థిని గమనించింది. అతికష్టం మీద గుర్తుపట్టింది. దగ్గరికి వచ్చి వివరాలు అడిగింది. అంతే! ఆమె తనకు పాఠాలు చెప్పిన విద్యాటీచర్‌ అని పూర్తిగా నమ్మింది. తనకు దివ్యగా పరిచయం చేసుకుంది. తనది ఏ బ్యాచో, తన బ్యాచిలో ఎవరెవరు ఉండేవారో చెప్పుకుంది. సంభాషణలు సంబంధాన్ని మరింత బలపరిచాయి. ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికిన విద్యాటీచర్‌ జీవితం అలా కావడం ఆ పూర్వ విద్యార్థినికి నచ్చలేదు. ఎంతగానో బాధపడిరది. ఊరికే బాధపడితే లాభమేమిటీ? ఏదో చెయ్యాలని అనుకుంది. ఒకప్పటి ఆ విద్యార్థిని దివ్య ఇప్పుడు ఐఏఎస్‌ అధికారి. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లి సాన్నం చేయించి, వేరే శుభ్రమైన బట్టలిచ్చి, భోజనం పెట్టి పడుకోబెట్టింది. అధికారంలో ఉన్న అధికారి గనుక, దగ్గరలో అన్ని వసతులు ఉన్న చిన్న ఇల్లు వెతకండని మనుషుల్ని పంపింది. తనతో చదువుకున్న పూర్వ విద్యార్థినీ విద్యార్థుల్ని సంప్రదించింది. విషయం వారందరికీ తెలియజేసింది. అంతేకాదు, తన సర్కిల్‌లో ఉన్న పెద్దపెద్ద వాళ్లకు చెప్పి, అందరినీ కదిలించింది. తన విద్యాటీచర్‌ భవిష్యత్తుకోసం కొంత నిధి ఏర్పాటుచేసింది. అలా తమ స్కూలు టీచర్‌కు మంచి జీవితం అందించాలన్న పూర్వ విద్యార్థుల సంకల్పం నెరవేరింది. తన చొరవ తీసుకుని, అందరినీ కలుపుకుని సమిష్టిగా ఒక ప్రయత్నంచేసి విజయురాలైంది. ఐఏయస్‌ దివ్య. ప్రతివారిలో మానవీయ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. వాటిని మనం జాగృతం చేసుకుంటూ ఉండాలి. మానవవాదులు మనలోనే ఉన్నారు. అంటే మన మధ్యే ఉన్నారని అర్థం. అంతేకాదు. మనలో అంటే ప్రతిఒక్కరి మనసుల్లో ఉంటారు. స్వార్థం, కుత్సిత బుద్ధి పక్కన పెడితే, మనుషులంతా మానవవాదులే కదా? మన సమాజంలో ఇలాంటి పనులు ఎంతమంది చేస్తున్నారూ! అని నిట్టూర్పులు విడిచి, నిరాశ పడకుండా ‘మనమేమైన చేయగలమా’! అని ఎవరికి వారు కార్యాచరణకు పూనుకోవాలి. వారి పరిధిలో వారు చేయగలిగింది చేయడానికి సిద్ధపడాలి. మానవవాదులంటే ఎవరో ప్రత్యేకంగా ఉండరు. మన‘లోనే’ ఉంటారు. మన ఆలోచనల్లోనే ఉంటారు. చేయవల్సిందల్లా ‘వారిని’ బయటకి తీయడమే. అంటే ఆ ఆలోచనలతోనే మరో పదిమందికి స్పూర్తి నందించడం. జిలుగు వెలుగుల సినిమా రంగంలో ఉండికూడా ప్రజలపక్షాన నిలిచిన నటులు కొందరు మనకు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన వాడు నానాపాటేకర్‌, తన ఆదాయంలో తొంభై శాతం చారిటీలకు ఇచ్చారు. గతంలో కార్గిల్‌ యుద్ధ సమయంలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. తన ఆదాయంలో ఎక్కువ మొత్తం రైతుల అభ్యున్నతికి ఖర్చుపెట్టారు. కరువుకు గురైన నాలుగు గ్రామాల్ని దత్తతకు తీసుకున్నారు. పేద ప్రజలకొరకే తనజీవితం అన్నట్లుగా అన్ని వేళలా వారికి అండగా ఉంటున్నారు. ఉదాహరణకు ఇక్కడ ఒక్క నానాపాటేకర్‌ గురించి చెప్పుకున్నాం. కానీ, సమాజంలో అక్కడక్కడా ఇలాంటి వారు ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం మనలోంచే ప్రారంభం కావాలి! అలాగే ఇటీవల కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులుకు రవాణా సౌకర్యం కల్పించి స్వంత ఖర్చుతో వారిని వారి వారి గమ్యాలకు చేర్చిన ఘనత నటుడు సోనూసూద్‌కు చెందుతుంది. వెండితెర మీద విలన్లుగా నటించినా, నిజ జీవితంలో గొప్ప హీరోలుగా నిలిచారు. ‘‘ప్రయత్నిస్తూ ఉండేవారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు’’ అని అన్నాడు అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ ‘‘జీత్‌ తొ పతా నహీ లేకిన్‌ య చరాగ్‌ కంసె కం రాత్‌క నుక్సాన్‌ బహుత్‌ కర్‌తాహై’’ ఉరుదూ కవి ఇర్ఫాన్‌ సిద్దీఖి. విజయం సంగతి తెలియదు కానీ, ఈ దీపం రాత్రికి చాలా నష్టం కలిగిస్తుంది. అని అర్థం. ఇందులో రాత్‌ అంటే రాత్రి. అమానవీయంరాత్రి గాక మరేమిటీ? ఆశ అనే దీపం ప్రయత్నమనే దీపం పట్టుకుని పోతూ ఉంటే చీకట్లు వాటికవే తొలిగిపోతుంటాయన్న ఆశావాద దృక్పధం ఈ చరణాలలో ఉంది. సమకాలీనంలో జరుగుతున్న ఘోరాల్నిచూసి బెంబేలెత్తి పోవడం కాదు, ప్రయత్నించి ఎదుర్కొంటూపోతేనే విజయం వరిస్తుంది.
కేరళ కొజికోడ్‌ జిల్లాకు చెందిన శశి తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. కొన్నేళ్ల క్రితం బ్యాగుల పరిశ్రమ పెట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా నుండి యాభైవేలు అప్పు తీసుకున్నారు. అసలూ, వడ్డీ ఏదీ చెల్లించక పోవడంతో బ్యాంకు అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు వెళ్లారు. శశి నిస్సహాయత, కూలిపోయే అతని పాత ఇంటిని చూసి చలించిపోయారు. తొమ్మిదిమంది ఉద్యోగులు కలిసికట్టుగా తమ స్వంత డబ్బుతో అతడి ఇల్లు బాగు చేయించి ఇచ్చారు. అంతేకాదు, ఆ బ్యాంకు ఉద్యోగులే తమ స్వంత డబ్బుతో అతడి బ్యాంకు లోన్‌ చెల్లించారు. దేశంలో ఇలాంటి వారుకూడా ఉన్నారు. ప్రతి దేశస్థుడి అకౌంట్‌లో పదిహేను లక్షలు వేస్తానన్నవాడు రెండుసార్లు ప్రధానిగా వెలిగిపోయారు గానీ, ఇలాంటి ఏ చిన్నపాటి సహాయమూ దేశంలో ఎవరికీ చెయ్యలేదు. ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. రైతు తీసుకున్న అప్పు సకాలంలో బ్యాంకుకు తిరిగి చెల్లించలేదని ఒక బ్యాంకర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్ను జస్టిస్‌ చంద్రచూడ్‌ కొట్టేశారు. ‘‘రైతు అప్పు చెల్లించలేని అతన్ని కోర్టుకు లాగుతారా? ముందు అప్పు ఎగ్టొట్టి పారిపోయిన ‘‘పెద్ద దొంగలును’’ పట్టుకోండి!’’ అంటూ ఆయన తన తీర్పులో సూచించారు. ప్రకృతి పరిరక్షణ కార్యకర్త డాక్టర్‌ వందనాశివ అంటారు‘‘భూమి హక్కులను రక్షించు కోవడమన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఇదే మన కాలంలో మనంజరిపే అతిపెద్ద శాంతిఉద్యమం. సామాజిక న్యాయాన్ని, మానవ హక్కులను రక్షించడం అందులో భాగమే!’’ ఒక స్థాయికి ఎదిగి ఆలోచించే వారికి మాత్రమే ఆమె మాటలు అర్థమవుతాయి. భూమితో రైతుకు మాత్రమేకాదు, మనుషులందరికీ ఉన్న సంబంధం గూర్చి అవలోకించగలగాలి. అది మానవవాదులయితే గాని చేయలేరు! ఇండోనేషియాలో ముస్లింలు 90శాతం, హిందువులు రెండు శాతం, మిగతా ఎనిమిది శాతం ఇతర మతస్తులు, అలాగే అమెరికాలో 70 శాతం క్రైస్తవులు, 30శాతం ఇతర మతస్థులు, అయినా, ఆయా దేశాల్లో అల్లర్లు లేవు. అక్కడ మతాన్ని అడ్డుపెట్టుకని ఎవరూ రాజకీయాలు చేయడం లేదు. మెజారిటీలదే రాజ్యం అనికూడా అనడం లేదు. మన భారతదేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీ.జే.పీలు అధికారంలోకి వచ్చినప్పటినుండి ఈ దేశం హిందువులదే నని అంటున్నారు. మిగతామతస్థులపై దాడులు చేస్తున్నారు. ఇక్కడ మరొక విచిత్రం జరుగుతూ ఉంది. ఆవుపాలు నేలపాలు చేస్తారు. ఆవు నెయ్యి నిప్పులో తగలేస్తారు. అవుమూత్రం మాత్రం తాగుతారు. ఈ పరిస్థితి ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేదు. కొందరికి, ముస్లింలు ప్రమాదంలోఉన్నారని అనిపిస్తుంది. మరి కొందరికి హిందువులు ప్రమాదంలో ఉన్నారని తోస్తుంది. ఆసలు విషయమేమిటంటే దేశమే ప్రమాదంలో ఉందన్నది అందరూ గ్రహించాల్సి ఉంది. దీనికి ఒక్కటే పరిష్కారం జాతి,మత, కుల, ప్రాంతీయ భేదాల్ని పక్కనబెట్టి కలిసిమెలిసి జీవించడమే!
మానవవాదుల్ని వారు కులమతాల్ని సరిగా త్యజించాలి. అర్థిక స్థోమతల్ని పట్టించుకోకూడదు. మానవాభ్యుదయమే ధ్వేయంగా ఆధునిక స్రీ,్త పురుషు లందరూ కలిసికట్టుగా ఒక మానవవాద ప్రపంచాన్ని సృష్టించుకోవాలి! పోయిన తరాలవారికి ఈ అవకాశం లేదు. వాళ్లంతా ఏదో ఓ మతంలో, ఏదో ఓ కులంలో పుట్టారు. ఆ చట్రంలోనే పెరిగారు. వాటికి అతీతంగా ఆలోచించడం ప్రారంభించే సరికి, వారు మధ్యవయస్కులో, వృద్ధులో అయిపోయి ఉంటారు. అప్పటి పరిస్థితులు కూడా వేరుగా ఉండేవి. కానీ, ఇప్పటి ఈ తరం నవ యువతీ యువకులకు అన్నిబంధాల్ని తెంచుకుని స్వేచ్ఛ లోచనలతో ఆ చట్రంలోంచి బైటపడే అవకాశాలు ఎక్కువ!
డెన్మార్క్‌ వంటి దేశాల్ల్లో విచిత్రమైన గ్రంధాలయా లున్నాయి. అక్కడ మీరు పుస్తకానికి బదులు ఒక వ్యక్తిని తీసుకోవచ్చు. అతను మీ ఎదురుగా కూర్చొని, మీ బాధలు, వ్యథలు ఓపికగా వింటాడు. మిమ్మల్ని పూర్తిగా చదివేస్తాడు. అంటే ఓపికగా వింటూ, మీ మానసిక ఒత్తిడిని, వేదనను అతను స్వీకరిస్తూ ఉంటాడన్నమాట! అంతేకాదు, దీనివల్ల మీ అహం, కోపం కూడా తగ్గుముఖం పడతాయి. వీటిని ‘మానవగ్రంథాలయాలు’ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మానవ గ్రంథాలయాలు ఎనభై అయిదు దేశాలలో ఉన్నాయి. చురుకుగా పని చేస్తున్నాయి. ఎదుటివాటి బాధలు విని, అర్థంచేసుకుని, గాయపడి అతని/ఆమెమనసు తేలికపడడంలో సహాయ పడడమంటే అది మానవత్వమే కదా? మానవీయ విలువల్ని నిలబెట్టడమేకదా? అలాంటి గ్రంధాలయాల్లో మీకు ఎదురుగా వచ్చి కూర్చునే వ్యక్తులు మానవవాదులు కాకపోతే మీ వేదనను పోగొట్టలేరు కదా?
`కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img