Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

మార్పురావాలి

రా బావ ఏంటి ఏదో పాటపాడుతూ వస్తున్నావు. పార్వతి మీ అన్నయ్యవచ్చాడు కాఫీ వేడిగా పట్టుకురా. కాపీ తాగే వచ్చాను బావ. ఫరవాలేదు. మరోసారి తాగు ఏం కాదు. నీకు గ్యాసు ప్రాబ్లమ్‌ లేదుగ. సరే ఇప్పుడు చెప్పు మారాలి అంటూ పాడుతున్నావు మళ్లీ ఎక్కడ విన్నావ్‌ ఈ పాట. ఒక చోట ఏమిటిబావ ఏ రాజకీయపార్టీ మీటింగు పెట్టినా ఇదే పాట. మారాలి మారాలి ప్రజలంతా మారాలి. ప్రజలంతా సొంతంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించాలనే పాట. అసలు మారాలనే నాయకుడు మారడు కాని ప్రజలంతా మారి ఆయన చెప్పినట్లు చేయాలి. ఏంటి నే చెబుతుంటే నవ్వుతావు. చూడు అసలు ప్రాధమికంగా మనిషి ఆలోచనా విధానం మారాలి. నాయకుణ్ని గుడ్డిగా అనుసరించి ఆచరించకుండా స్వంతంగా ఆలోచించాలి. ప్రస్తుతం నాయకులలో స్వార్థం పెరిగిపోయింది. స్వార్థ పరుడైన నాయకుడు తన సంపాదనకోసం వెనుక నమ్ముకున్న ప్రజల్ని, అనుయాయుల్ని నట్టేట ముంచుతున్నాడు. ఒక రకంగా సమాజానికి ద్రోహం చేస్తున్నాడు. స్వార్థంతో పార్టీలు మార్చేస్తున్నారు. పార్టీని నమ్మి ఓటేసిన ప్రజల్ని మోసంచేసి మరో పార్టీ కండువా కప్పుకొని నిస్సిగ్గుగా దర్జాగా ఉంటున్నాడు. అందుకే తరచూ పార్టీలుమారి మరీ మొహం మీద నవ్వు పులుముకొని ప్రజలవద్దకు వస్తున్నాడు అందుకే నాయకులు ఎలాగో స్వార్థంతో మారుతున్నారు కనుక ప్రజల ఆలోచనావిధానంలో మార్పురావాలి. పార్టీలు మ్యానిఫెస్టో ఎవరికి వారు అధ్యయనం చేయాలి. ఇచ్చిన వాగ్ద్గానాలు అమలు పరచని పార్టీని బహిష్కరించాలి. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారంకోసం ప్రజలమధ్య తిరుగుతూ వాటిని పరిష్కరించే వ్యక్తినే ఎన్నుకోవాలి. ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాతే ప్రజల ముఖం చూచే నాయకుణ్ని రానీయకుండా తిరగబడాలి. అటువంటి చైతన్యం ప్రజల్లో రావాలి. అది సరే అటువంటి మంచి నాయకులు అధికారులలో ఉండటంలేదు గద. బావ మనం చేసే తప్పు అదే. ఎన్నికల రోజున రెండువేలు తీసుకుని ఓటువేసిన తరువాత మన సమస్యల్ని పరిష్కరించమని వాడిని అడిగేందుకు జంకుతున్నాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలకోసం పనికివచ్చేవాటిని ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వర్గ విభజనతో కూడుకున్న సమాజంలో లేనివారికి పనికివచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉన్న వాడికి కోపం. నిజం చెప్పాలంటే గత 75 ఏళ్లగా ప్రభుత్వాలు ఉన్నవాడికే మేలు చేకూర్చాయి. అంతెందుకు ప్రస్తుతం పేదలు చదివే పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుచేసినా ఉన్న వాడికి కోపం వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలల యజమానులు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు బావ ఒకనాడు మాలపల్లి నవలరాసిన ఉన్నవ వారిని బహిష్కరించాలని అన్నారు. ఉన్నవ లక్ష్మీనారాయణ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారని ఆనాటి ఛాందసవాదులు ఆయన్ని తిట్టేవారు. ప్రస్తుతం ఆ ఆచారాలు అటకెక్కినా ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ వారు మనువాదాన్ని ప్రచారం చేస్తున్నారు. లేనివాడు సంపాదిస్తే ఉన్నవాడికి అసూయ. డబ్బంతా వాడి ఇంట్లోనే ఉండాలి. అందుకే ప్రపంచంలోని సొమ్మంతా ఒక శాతం వారి వద్దే పేరుకుపోతోంది. అందుకే కమ్యూనిజం అంటే గిట్టదు. కమ్యూనిజం అవుట్‌డేటెడ్‌ అని మను సిద్ధాంతం వల్లెవేసే బీజేపీవారు అసలైన సమసమాజ నిర్మాతలం మేమే అంటున్నారు. అది సరే అసలు మార్చే వాడెవరు? మారవలసింది ఎవరో నా కర్థంకావడంలేదు. ఆర్థికంగా లేనివాళ్లు చదువులేని వాడు మారాలా లేక అన్నీ ఉండి దానికితోడు అధికారం కూడా ఉండి తప్పుచేసేవాడు మారాలా? లేనివాడు డబ్బు కక్కుర్తితో ఓటు అమ్ముకుంటుంటే అధికారంలో ఉన్నవాడు సంపా దించింది చాలక స్వార్థంతో ప్రజాధనం లూటీ చేస్తుంటే ఎవరు మారాలి. నిజమే అసలు వ్యవస్థే కుళ్లిపోయింది. మొత్తం వ్యవస్థే సమూలంగ మారాలి. అది నిజమే అలా సమాజాన్ని నిస్వార్థంతో మార్చడానికి ప్రయత్నిస్తున్న రచయితలు, సంస్కర్తలను అడ్డగోలుగ చంపుతున్నారు కద. ఈ పరిస్థితుల్లో ఇంకెవరు ముందుకొస్తారు. నిజమేఎవరు లేరని కృంగిపోవద్దు. 60 సంవత్సరాలు వెనక్కు వెడితే రాత్రి పాఠశాలలు నడిపి పనిచేసుకుని బతికేవారిని కూడా చదివించి తద్వారా పత్రికలు చదివించిన కమ్యూనిస్టులు ఎంతో చైతన్యం తెచ్చారు. అందుకే 1952లో కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడిరది. 1955లో ఆంధ్రాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వస్తుందని ఊహించారు. కొన్ని సడలింపులవల్ల ప్రజలు వారికి దూరమయ్యారు. ఇప్పటికైనా సామాన్యుల నివాసాలకు వెళ్లి జరుగుతున్న అన్యాయం వివరిస్తే ప్రజలు తప్పక వింటారు. ఆ రకంగా సామాన్యప్రజల్లో చైతన్యం తేవటం పెద్దకష్టమేమీ కాదు. అందుకు సరైన కార్యాచరణ ఏర్పాటు చేసుకుని పనిచేస్తే చైతన్యవంతులవుతారు.
వ్యాస రచయిత సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img