Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మిథునం… ప్రతీ ఏటా వస్తుంది

ఎవరికైనా ఒక్క పేరే ఉంటుంది. కొందరికి ముద్దు పేర్లు ఉంటాయనుకోండి. కవులు, రచయితల్లో కొందరు అసలు పేరుతో రాస్తే మరికొందరు కలం పేరుతో రాస్తారు. కాని, శ్రీరమణగారికి మాత్రం మూడు పేర్లు. ఎవరింట్లో పుట్టారో ఆ పేరు వంకమామిడి రాధాకృష్ణ. పదిహేడో ఏట తాత గారింటికి దత్తత వెళ్లాక కామరాజు రామారావు. బుడుగన్నట్లు నాఅంత వాడ్ని నేను అని అనుకున్నాక ఈ రాధాకృష్ణ, రామారావులు కాదని శ్రీరమణగా మారారు ఈ కధా రచయత. నేను ఇది వరకెప్పుడో చెప్పినట్లుగా ఆనాటి విద్యార్ధులను చెడగొట్టిన అనేకానేక మందిలో శ్రీ రమణ ఒకరు. చెడగొట్టడం కాకపోతే…. బంగారు మురుగు కథ రాయడం ఎందుకు చెప్పండి. అంతేనా… వరహాల బావి అట…. ధనలక్ష్మి అని మరోటి. ఈ భూమి మీద ఎవడైనా సోడా తాగుతాడు కాని సోడా నాయుడు కథ రాస్తాడాండి. రాస్తే రాసారు…. పైగా వెటకారం ఒకటి. ఇద్దరు ముసలాళ్లు ఆయనకే కనపడ్డారా. ఏం మనకి కనపడలేదా. మనం చూడలేదా. పెద్ద.. ఆయనకే కనిపించినట్లు…. వారి ఇద్దరి ప్రేమ ఆయనకే తెలిసినట్లు రాసేయడం. అలా రాసిన దానికి మిథునం అని ఓ పేరు పెట్టేసి ఆనక ఆచ్చేసేయడం. ఆ బాపు ఒకరు ఈ సాహిత్య ప్రాణులకి. తగుదునమ్మా అంటూ మిథునం కథ మొత్తం తన చేత్తో రాసేసి ఇచ్చేశారు నోట్లో ఓ పైపు పెట్టుకుని. పోనీ ఆ సంగతేదో ఆ బాపుకీనూ, ఈ శ్రీరమణకి తెలిస్తేచాలు కదా… అబ్బే అలా అనుకుంటే బాపు ఎందుకవుతారు. ఆ పళంగా అలా శ్రీరమణ గారు రాసేసిన కథని విమానంలో అమెరికా పంపించేశారు. అక్కడ జంపాల చౌదరి అని ఓ పెద్దాయన. ఉద్యోగం కోసం వెళ్లినాయన ఆ పనేదో చేసుకోక… ఇదిగో బాపు చేతి రాతతో ఉన్న మిథునం కథని అచ్చేశారు. అప్పుడెప్పుడో ఆంధ్రజ్యోతిలో శ్రీరమణగారిని కలిసినప్పుడు అడిగాను మిథునం ఎన్ని కాపీలు వేసారండి అని. రెండున్నర లక్షలు అన్నారు ఎత్తు పళ్లల్లోంచి. మళ్లీ ఇదిగో నిన్నటికి నిన్న టీవీ తీతువు పిట్టలు అరిచిన తర్వాత తెలిసింది మిథునం కథ ఏకంగా నాలుగు లక్షలు వేసారని…. ఇలా రాసేయడం, లక్షలకు లక్షలు కాపీలు వేసేయడం ఇది వరకెప్పుడైనా విన్నామా…. చదివామా… మాయదారి కధ… మాయదారి కధాని…. ఏమిటో కొన్ని పేజీలు చదివాక అక్షరాలు కనపడవేం. మసకేసేసాయ్‌.
మొదటిసారి మా అమలాపురంలో చదివినప్పుడే కాదు… నిన్న శ్రీరమణగారు వెళ్లిపోయారని తెలిసిన తర్వాత చదివితే కూడా అదే పరిస్థితి. అక్షరాలా ఇంటర్మీడియట్‌లో పరిచయం అయ్యారు శ్రీరమణ. ఇక సివిక్స్‌ ఏదీ, ఎకనామిక్స్‌ ఏదీ, కామర్స్‌ ఎక్కడ, ఇంగ్లీషు సరేసరి. ఏమాట కామాటే చెప్పకోవాలి తెలుగొచ్చిందండోయ్‌ ఈ శ్రీరమణని చదివాక. ఆ సమయంలోనే తెలుగు ఆకాశం ఒకింత ఎర్రగా ఉండేది. మరొకింత… ఆరడుగుల పొడవుండి అంతకంటే పొడుగ్గా ఉన్న కుర్రాడు అమ్మాయి కోసం ఎదురు చూస్తున్న సన్నివేశాలూ ఉండేవి. అదిగో ఆ సమయంలో దొరికారు శ్రీరమణ. సాయంత్రం పూట వీలున్నంత మంది అమ్మాయిలని ప్రేమించేసి, అర్ధరాత్రుళ్లు గోడల మీద విప్లవాలమై విరగబూసేసి, తెల్లవారు జామున శ్రీరమణని చదివేసి పరిపూర్ణ మానవులం అయిపోయామని కాలర్‌ ఎగరేసే వాళ్లం. కవిత్వానికి, పాటలకు పేరడీలు చేయడం పెద్దగొప్పేం కాదు. ఈ మధ్య అయితే, హిట్లర్‌ మీసమున్న ఓ పెద్దాయన ‘‘నాటు’’గా రోజుకి పదో పరకో ప్యారడీలు గుప్పించేస్తున్నారు. పైగా ఆయనే పాడుతూ. ఇదో ఖర్మ. శ్రీరమణ గారు అలా కాదు. తెలుగులో ఉన్న లబ్దపత్రిష్టులైన వారి వచనానికి ప్యారడీలు రాసారు. ఒకవేళ ఈ ప్యారడీలు ముందే చదివితే నవ్వుకుంటాం. ఆయా రచయితలని చదివి శ్రీరమణని చదివితే నవ్వుకోవడం ఒక్కటే కాదు… కిందపడి దొర్లుతాం. ఇలా రాయాలంటే పడిగట్టు పదాలు కాదు కావాల్సింది… ఆయా రచనలపై పట్టుండడం. శ్రీరమణగారు నొప్పించి… తానొవ్వి ఇలా రాసారు. తెలుగు సాహిత్యం చేసుకున్న పుణ్యం, పాపం ఒక్కటే. ఈ సాహితీలోకంలో ఎక్కువ మంది జర్నలిస్టులు కావడం. ఇది మాయాదారి వృత్తి. రోజుకి ఇంత అని విడతల వారీగా శ్వాసను వదిలేసే వృత్తి. ఇందుమూలంగా ఏం జరుగుతుందంటే సృజన అనే పదార్ధం ఆవిరై పోతుంది. మంచి హెడ్డింగుకో, మంచి వాక్యానికో భాష పరిమితమైపోతుంది. దాన్ని నుంచి బయట పడి సృజన చేయడం చాలా కష్టం. అదీ నిత్య వెటకారంతో. అదేమిటో శ్రీరమణ గారికి ఈ రెండు పడవల మీద ప్రయాణం ఎలా అబ్బిందో. ఇంచక్కా గోదారి మీద రెండు పడవల్లోనూ ఏక కాలంలో ప్రయాణం చేసేశారు శ్రీరమణ గారు. అదీ రెండు పడవలు మునిగిపోకుండా కాదు… అధ్బుతమైన ఒడ్డుకు చేరేలా.
‘‘చావు అందరికీ సమానమే అయినా… చావు అందరినీ సమానంగా చూడదు… సమానంగా శ్వాసించదు’’ అంటాడు కె.శివారెడ్డి. అలాగే జీవ ధర్మాన్ని అనుసరించి శ్రీరమణ వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ భవిష్యత్‌ తరాలకి కూడా కొన్ని వందల పేజీల్లో వురేయ్‌ అబ్బాయిలు, ఇగో అమ్మాయిలు ఇలా బతకండేం అని చెప్పి వెళ్లిపోయారు. అంటే సామానంతా ఇంట్లోనే పెట్టి అలా బయటకు వెళ్లినట్లే కదా… శ్రీరమణ కూడా అంతే. నిగమనం కోసం పక్కింట్లో పెట్టిన బట్టల మూట పెట్టేసి అలా వెళ్లారంతే…. మూట తీసుకుందుకు వస్తారు. అవును మిథునం ప్రతి ఏడాదీ వస్తుంది.
సీనియర్‌ జర్నలిస్టు, 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img