Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

మూడో ట్రిబ్యునల్‌కు కేసీఆర్‌ పట్టు! ఆదమరిస్తే ముప్పే!

వి. శంకరయ్య

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన పెట్టుకున్న తర్వాత జరిగిన ప్రచారం నిజం చేస్తూ రెండు మూడు రోజులు దిల్లీలో వేచి వుండి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్‌తో సమావేశమై కృష్ణా నదీజలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపకానికి మూడవ ట్రిబ్యునల్‌ నియమించాలని డిమాండ్‌ చేశారు. షెకావత్‌ అందుబాటులో లేకున్నా వచ్చేంత వరకు దిల్లీలో మకాం వేశారు. అంటే కేసీఆర్‌ ఇతర అంశాల కన్నా మూడవ ట్రిబ్యునల్‌ నియామకం కోసమే దిల్లీ పర్యటన పెట్టుకొన్నారని జరిగిన ప్రచారం నిజం చేశారు. వాస్తవంలో ఇది న్యాయపరంగా సాధ్యమా? 1956 అంతర్‌ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్‌ 3 కింద నియామకమైన బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు అతీగతీ తేలకుండా అదే చట్టం అదే సెక్షన్‌ అదే అంశంపై మరో ట్రిబ్యునల్‌ను అయితేగియితే కేంద్రం నియమించితే న్యాయస్థానాల్లో సమీక్షకు నిలబడుతుందా? రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు తిరిగి పంపకానికి మూడవ ట్రిబ్యునల్‌ నియామకం కోసం కేసీఆర్‌ సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఒకందుకు ఆయనను మెచ్చుకోవాలి! చట్టబద్దం కాని అంశాల కోసం కూడా వెరవకుండా చివరకంటా పోరాటం సాగించడం ఆయనకే చెల్లు. ప్రస్తుతం బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు అమలులో వుందని విభజన చట్టం కూడా అదే చెబుతున్నదని కృష్ణా బోర్డు కూడా అదే చెబుతుందని తెలిసి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ నీటి వాటా డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి స్థాయి కూడా మరచి తనే వచ్చి బోర్డు సమావేశంలో తేల్చుకుంటానని పెద్ద హడావుడి చేశారు. తుదకు ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో బోర్డు అధికారులు తెలంగాణ వాదనను తిరస్కరించారు. ఇది తీవ్ర పరాభవమే. దీనికి తోడు రిజర్వాయర్‌లపై విద్యుదు త్పత్తి బేషరతుగా నిలుపుదల చేయాలని బోర్డు తేల్చి చెప్పడం అంతకన్నా ఎదురు దెబ్బే. అయితే మొండివాడు రాజు కన్నా బలవంతుడన్న సామెతను నిజం చేస్తూ విద్యుదుత్పత్తి సాగిస్తున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కృష్ణా బేసిన్‌లోని ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నదనే భావన ఏర్పడి చులకన అయింది. అంతవరకైతే ఫర్వాలేదు. ఈ సంఘటనలు సంభవించిన వెనువెంటనే ముఖ్యమంత్రి దిల్లీలో మకాం బెట్టి ప్రధానమంత్రి మొదలుకొని కేంద్ర మంత్రులందర్నీ కలిశారు. ఒక ముఖ్యమంత్రి ఇలా కలవడంలో తప్పు పట్టవలసినది లేదు. కాని కృష్ణా నదీ జలాలు రెండు రాష్ట్రాల మధ్య పంపిణీకి మూడవ ట్రిబ్యునల్‌ నియా మకం కోసం వెళ్లారనే ప్రచారం జరగడం గమనార్హం. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకటి బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు అతీగతీ తేలకుండా మూడవ ట్రిబ్యునల్‌ వేస్తానని కేంద్ర మంత్రి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఎలా హామీ ఇచ్చారు? అయితే కేంద్ర మంత్రి మెలిక పెట్టారు. న్యాయ పరమైన సమస్యలు లేకుంటే అని చెప్పారు. ఆ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ ప్రతిపాదనను ఎలా ఆమోదించారు? ఈ సమావేశంలో డిసెంట్‌ నోట్‌ ఎందుకు పెట్టలేదు? అన్ని అడ్డంకులూ తప్పించుకొని ట్రిబ్యునల్‌ నియామకం జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టమని బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు తేలకుండా మరో ట్రిబ్యునల్‌ నియామకం చట్ట విరుద్ధమని జగన్మోహన్‌ రెడ్డి సమావేశంలో వాదించారా? ఈ అంశంపై ముఖ్యమంత్రికి వందలాది వున్న సలహాదారులు ఐఏఎస్‌ అధి కారులు ఫీడ్‌ ఇచ్చారా? ఈ అంశంలో రాష్ట్ర ప్రజలకు జలవనరుల శాఖ స్పష్టత ఇవ్వాలి. ఇప్పటివరకు బోర్డు చట్టపరంగా తమకు అండగా వుందని రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు సంతృప్తి పడితే చాలదు. న్యాయపరంగా మూడో ట్రిబ్యునల్‌ నియామకం సాధ్యం కాకున్నా, ఒకవేళ కేంద్రం సిద్ధమైతే తీవ్ర ఇబ్బందులు తప్పవు. వాస్తవం చెప్పాలంటే సమయానుకూలంగా వ్యవహ రించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. వాస్తవంలో అపె క్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చినపుడు జగన్మోహన్‌ రెడ్డి వ్యతిరే కించి వుంటే కేంద్ర మంత్రి దాన్ని సాకుగా తీసుకోనేవారు కదా? లేదా చర్య ల్లోకి వచ్చేది. ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్‌ తాము వ్యతిరేకించినట్లు చెప్ప డం లేదు. ప్రస్తుతం ఈ ఫైల్‌ కేంద్ర న్యాయశాఖ వద్ద వుందని చెబుతున్నారు.
2010లో బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ మధ్యంతర తీర్పు వెల్లడిరచినపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తిరిగి 2013లో తుది అవార్డు వెలువరించగానే తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టు నుండి స్టే తేవడంతో అవార్డు నోటిఫికేషన్‌ ఆగిపోయింది. నోటిఫై చేసే వరకూ దానికి చట్ట బద్దత వుండదు. అంటే ఇప్పటికీ బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు అమలులో వుంది. ఈ లోపు రాష్ట్ర విభజన జరిగింది. అయితే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 89 మేరకు రెండు రాష్ట్రాలు అవతరించిన తర్వాత పంపిణీ కాని జలాలు వుంటే పంపిణీ చేస్తూ నీటి ఎద్దడి రోజుల్లో ప్రొటొకాల్‌ నిర్ణయించే బాధ్యతను మాత్రమే బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఈ అంశాలపైనే ట్రిబ్యునల్‌ విచారణ జరుపుతోంది. తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వైమనష్యాలు వివరించనక్కర లేదు. ఈ నేపథ్యంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా సరైన సమాధానం రాలేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. గమనార్హమైన అంశమే మంటే ఒక్క బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డులోనే కాకుండా కోర్టు స్టేతో వున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పులో కూడా న్యాయం జరగలేదని తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ లోపు కర్నాటక ప్రభుత్వం కూడా ఆర్డీయస్‌కు బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ నాలుగు టిఎంసిలు కేటాయించడంపై సుప్రీంకోర్టు కెక్కింది. ఈ మూడు పిటిషన్లు 2015లో సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు విచారణకు వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ వేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే విచారణ జరగాలని చెప్పింది. అయితే బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది అవార్డుపై వున్న కేసు ఇప్పటికీ ఏళ్ల తరబడి సుప్రీంకోర్టులోనే వుంది. ఈ కేసునే తెలంగాణ ఇప్పుడు వెనక్కి తీసుకొనేందుకు సిద్ధమైంది. బేషరతుగా ఉపసంహరించుకొనేందుకైతే తమకు అభ్యంతరం లేదని కర్నా టక, ఆంధ్రప్రదేశ్‌లు అభ్యంతరం పెట్టడంతో కేసు ధర్మాసనానికి వెళ్లింది. రేపు విచారణ సందర్భంగా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై తాము వేసిన కేసు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ గట్టిగా కోరాలి. అంతే కాకుండా ఈ కేసు పరిష్కారం అయ్యేంత వరకు మూడవ ట్రిబ్యునల్‌ నియామకం కూడదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుగానే ధర్మాసనం దృష్టికి తేవాలి. ఫలితంగా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు నోటిఫై అయ్యే అవకాశాలు వుండవు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మూడవ ట్రిబ్యునల్‌ నియామకానికి ఆమోదంఇచ్చే అవకాశాలు వుండకపోవచ్చు. తెలంగాణ ఒక్క బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డుపై వేసినకేసు వెనక్కి తీసు కుంటుందా? లేక బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు విషయంలో ఏ వైఖరి తీసుకుంటుందో తేలవలసి ఉంది.
గత సంవత్సరం అక్టోబరులో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో మూడవ ట్రిబ్యునల్‌ ప్రతిపాదన వచ్చినపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి డిసెంట్‌ నోట్‌ పెట్టకుండా వుండి వుంటే అది తప్పిదమే అవుతుంది. ప్రస్తుతం కృష్ణా బోర్డు తెలంగాణకు వ్యతిరేకంగా తమకు అనుకూలంగా వ్యవహరించు తోందని రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ఆదమర్చితే… పొరపాటున కేంద్రం మూడవ ట్రిబ్యునల్‌ నియామకానికి సిద్ధమైతే ఇప్పటిలాగే రాష్ట్ర జల వనరులశాఖ వేచిచూచేధోరణి అవలంభించితే…రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలకే కాకుండా డెల్టా సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు ప్రమాదం పొంచి వుంది.
వ్యాస రచయిత విశ్రాంత పాత్రికేయులు, 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img