Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

మైనారిటీల వెతలకు విముక్తి ఎప్పటికి?

అజిత్‌ సింగ్‌

సమాన హక్కులకు హామీనిచ్చే, నిస్వరులకు వాణినవుతానని భరోసా కల్పించే ప్రజాస్వామ్య భావన ప్రపంచాన విఫలమైంది. నిరంకుశ, అరాచక ప్రభుత్వాల్లో జరిగే అన్యాయం, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేస్తూ మానవ హక్కుల పర్యవేక్షిణిగా ఉండాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థ కునారిల్లిపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న మనదేశంలో మైనారిటీలకు ఇంకా సమానత్వం సుదూరంలోనే ఉంది.
ఈ ఆగస్టు 15వ తేదీన భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, ఏడాదులు గడిచిపోతున్నాయి గానీ సమానత్వం, హక్కులు అనేవి ఇంకా ఇక్కడ ముస్లింలు, దళితులు, వెనుకబడిన కులాలు, తెగలకు కల్లలుగానే ఉన్నాయి.
వెనుకబడిన తెగల్లో ప్రతి రెండో వ్యక్తి, వెనుకబడిన కులాల్లో ప్రతి మూడో వ్యక్తీ ఇప్పటికీ పేదరికం గుప్పెట్లోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, దారిద్య్రం, మానవాభివృద్ధి చర్యలపై ఆక్స్‌ఫర్డ్‌ నివేదిక వెల్లడిరచింది. అలాగే ముస్లింలలో ప్రతి మూడో వ్యక్తీ ఇదే దుస్థితిలో ఉన్నారు. అదే అగ్ర వర్ణాల విషయానికొస్తే ఇందుకు భిన్నమైన పరిస్థితి. వీరిలో కేవలం 15 శాతం మంది మాత్రమే బీదరికంలో ఉన్నారు.
భారత్‌లో మైనారిటీలు సామాజికఆర్థిక అసమానతలనే కాదు హింస, అకృత్యాలు, అత్యంత తీవ్ర మితవాద గ్రూపుల నుండి హత్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కబోధిలా వ్యవహరిస్తుండడంతో పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), పౌరుల జాతీయ పట్టిక (ఎన్‌ఆర్‌సి), మతమార్పిడి నిరోధక చట్టం, బీఫ్‌పై నిషేధం .. ఇవన్నీ భారత ప్రజాస్వామ్య, లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. భారత్‌ రాజ్యాంగబద్ధ పాలనా మార్గంలో నడవడం మెజారిటీవాదానికి కంటగింపుగా ఉంది. మైనారిటీల విషయంలో మన దాయాది దేశం పాకిస్తాన్‌ కూడా ఇదే బాటలో ఉంది. నిర్బంధ మత మార్పిడిలు. దేవాలయాలు, చర్చిలు, గురు ద్వారాల విధ్వంసం, కరుడు గట్టిన ఇస్లామిస్ట్‌ గ్రూపులు మైనారిటీల జీవితాలకు ముప్పుతెస్తున్నాయి. ఈ దేశంలో మైనారిటీలు వ్యవస్థీకృత, సంస్థాగత వివక్షను ఎదుర్కొంటున్నారు. హిందువులు, సిక్కులు దేశద్రోహులని, ముస్లింలను అణచివేస్తారని చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రాయడం వారి దుర్మార్గ ధోరణికి ఒక మంచి ఉదాహరణ. తమ దేశ విద్యార్థుల మనస్సుల్లో మతతత్వ బీజాలను నాటడమే లక్ష్యంగా ఈ తప్పుడు, ప్రమాదకరమైన ప్రచారాన్ని సాగిస్తున్నారు. ‘‘ కాలం గడిచిపోయినా హిందువులు హిందువులుగానే ఉంటారు, ముస్లింలు ముస్లింలుగానే ఉంటారు. నేను ఇది మత కోణంలో చెప్పడం లేదు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరి వ్యక్తిగతమైన విశ్వాసం. నేను మాట్లాడుతున్నది ఈ దేశ పౌరులుగా రాజకీయ కోణంలో’’ అని మహ్మదాలీ జిన్నా పాకిస్తాన్‌ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి 1947, ఆగస్టు 11వ తేదీన చేసిన ప్రసంగంలో హామీనిచ్చారు. ఎలాంటి భయం లేకుండా ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించేలా పాకిస్తాన్‌ ఉండాలనే ఆయన కల ఇంకా వాస్తవరూపం దాల్చలేదు. యూరప్‌లోనూ ఇస్లాం ఫోబియా, యూదులపై జాతి, మత వివక్ష ఉన్నాయి. తమ ముస్లిం వ్యతిరేక ధోరణితో ‘ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ అండ్‌ ఫ్రాన్స్‌ నేషనల్‌ ర్యాలీ’ లాంటి తీవ్ర మితవాద పార్టీలు నిలదొక్కుకుంటున్నాయి. యూరప్‌లో మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలూ లేవు. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ నిషేధానికి ఫ్రాన్స్‌ సెనేట్‌ (ఏప్రిల్‌లో) ఆమోదం తెలియజేయడం దేశానికంతటికీ దిగ్భ్రాంతి కలిగించింది. ప్రవచనకారుల స్వేచ్ఛ, లౌకిక భావనలకు ఇది ఊహించని విఘాతం. రాజ్యాంగబద్ధమైన లౌకిక సూత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఫ్రెంచ్‌ సమాజంపై ఉంది. ముస్లింల సాంస్కృతిక గుర్తింపు, మతాచారానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇమ్మాన్యువల్‌ మాక్రాన్‌ ప్రభుత్వానికి లేదు. తీవ్ర మితవాద గ్రూపులకు చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకే ఈ పని చేశారు. యుదుల ప్రార్థనా మందిరాలపై దాడులు, యూదు వ్యతిరేక ప్రదర్శనలు యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో పెచ్చుమీరాయి. కొవిడ్‌19 కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ యూదు వ్యతిరేకతకు తోడు మరిన్ని కుట్ర కోణాలు హెచ్చాయి. నాజీల నుంచి యూదులకు స్వేచ్ఛ లభించి 75 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా యూదులపై వివక్ష ఇంకా ఇంకా పెరుగుతుండడం విచారకరం.
మధ్యప్రాచ్యంలోనూ మైనారిటీల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పలస్తీనాకు చెందిన భూభాగం దాదాపుగా 4,244,776 ఎకరాలు 1946 నుంచి ఇజ్రాయిల్‌ ఆక్రమణలోనే ఉంది. ఈ ఆక్రమిత ప్రాంతంలో యూదుల ఆవాసాలు, గృహాలను ఇజ్రాయిల్‌ భద్రతా బలగాలు ధ్వంసం చేసాయి. గాజా ప్రాంతాన్ని ఇజ్రాయిల్‌ దిగ్భంధించడాన్ని, వేధించడాన్ని, వెస్ట్‌బ్యాంక్‌, గోలాన్‌ హైట్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు పదేపదే ఖండిస్తూనే ఉన్నాయి. ఆక్రమిత తూర్పూ జెరూసలెంలోని షేక్‌ జరాపై ఇజ్రాయిల్‌ ఇటీవల జరిపిన దాడులు, గాజాపై వరస బాంబు దాడులు మైనారిటీలపై అణచివేత చర్యలకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రపంచమంతా ఒక్కటి కావాలి. ఈ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు అవసరమైన ప్రణాళికను అమలు చేయాలి. తమ సొంత ప్రాంతంలోనే శరణార్థులుగా బతుకీడుస్తున్న లక్షలాదిమంది పలస్తీనీయుల దుస్థితికి తెరపడేందుకు ఈ చర్య అత్యావశ్యకం.
టర్కీలో దేశాధ్యక్షుడు రిసెప్‌ తాయిప్‌ ఎర్డోగాన్‌ తన ఆర్థిక అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మత జాతీయవాదాన్ని ఉపయోగిస్తున్నారు. గత ఏడాది (2020) జూన్‌లో ఆయన ప్రభుత్వం ఇస్తాంబుల్‌లోని హజియా సోఫియా మ్యూజియంను మసీదుగా మార్చింది. ఎర్డోగాన్‌ రాజకీయ జూదం ఆడుతున్నారని ఈ చర్యపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
టర్కీలో క్రిస్టియన్‌ జనాభా శతాబ్ద కాలంగా క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం వారిని తరచుగా లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రపంచంలో అత్యంత పీడనకు గురవుతున్న మైనారిటీ వర్గంలో ఒకరైన కుర్దులు ఇదే బాధను అనుభవిస్తున్నారు. టర్కీ మొత్తం జనాభాలో పావు వంతు ఉన్న కుర్దులు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అభద్రత, ముప్పును ఎదుర్కొంటున్నారు.
టర్కీ 2019, అక్టోబరు 9వ తేదీన ఆక్రమించుకున్న ఉత్తర సిరియా నుంచి నిరాశ్రయులైన 2 లక్షల మందికి పైగా కుర్దులు సిరియాటర్కీ సరిహద్దుల సమీపంలో తలదాచుకున్నారు. సిరియాకుర్దిష్‌ మహిళా రాజకీయ నాయకురాలు, మహిళా హక్కుల పరిరక్షణ నేత హెవ్రిన్‌ ఖలాఫ్‌తో సహా నిరాయుధులైన పౌరులపై దాడులు, యుద్ధ నేరాల ఆరోపణలు టర్కీ మీద ఉన్నాయి. ఈ నేరాలపై టర్కీని అంతర్జాతీయ సమాజం ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది.
రష్యాలో స్వలింగ వివాహాలు, హిజ్రాల దత్తతను నిషేధిస్తూ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ వరసగా రాజ్యాంగ సవరణలు చేశారు. ఈ సవరణలను గత జూన్‌లో జరిగిన జాతీయ రెఫరెండంలో ఆమోదించారు. మానవ హక్కుల అమలులో హీనమైన రికార్డు ఉన్నప్పటికీ రష్యా, చైనా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆ దేశాలలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఐక్యరాజ్యసమితి అంతగా పట్టించుకోవడం లేదనే విషయాన్ని ఇది తెలియజేస్తోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
ప్రజలపై పెద్దఎత్తున దౌర్జన్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఏ దేశంలో జరిగినా అది ఆయా దేశాల అంతర్గత వ్యవహారమని సరిపెట్టుకోరాదు. మైనారిటీలకు ముప్పు తెచ్చే ఎలాంటి పరిస్థితులనైనా అంతర్జాతీయ సమాజం పరిగణనలోకి తీసుకోవాలి, మెరుగైన, సక్రమమైన ప్రపంచాన్ని రూపొందించేందుకు పూనుకోవాలి. ‘‘జీవితంలో నిరంతరం, అత్యవసరంగా వేసుకోవాల్సిన ప్రశ్న ఏమంటే… ‘ఇతరుల కోసం నీవేం చేస్తున్నావు?’’’ అని మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ చెప్పిన విషయాన్ని ఎప్పుడూ గమనంలో ఉంచుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img