రుణ ఎగవేత దారులకు బాధ కలగకుండా మొండి బాకీలకు బ్యాంకులు పెట్టిన పేరు నాన్ పెర్‌ఫార్మింగ్ ఎస్సెట్స్ (ఎన్.పి.ఎ). వాటినే నిరర్థక ఆస్తులు అంటున్నారు. బ్యాంకులు ఇతరులకిచ్చిన రుణాలను ఆస్తులుగా పరిగణిస్తాయి. బ్యాంకులకు చెల్లించవలసిన రుణ వాయిదాను బకాయిపడిన 90 రోజులులోగా చెల్లించకపోతే ఆ రుణాన్ని ఎన్.పి.ఎ.గా భావిస్తారు. దేశ ఆర్థికవ్యవస్ధకు ద్రవ్యోల్బణం అదుపుచేయటం ఎంత ముఖ్యమో, బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తుల కట్టడి అంత ముఖ్యం. నూటికి నూరుశాతం రుణాలు వసూళ్ళు ఆచరణ సాధ్యంకాదు. కనుక రానిబాకీలను ఎన్.పి.ఎ.లుగా వర్గీకరించటం, వసూళ్ళకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసిన తరువాత వాటిలో కొన్ని మాఫీచేయటం ఆనవాయితీ. ప్రస్తుతమున్న కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిరర్థక ఆస్తులు తీవ్రంగా పెరుగుతున్నాయి. బ్యాంకు డైరెక్టర్లను రాజకీయంగా ప్రభావితంచేసి రుణాలు పొందటం, ఎగవేయటం లాంటి దుస్సంప్రదాయం పెరిగింది. తీసుకున్న రుణాలను ప్రక్కదారులకు మళ్లించటం, ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, చేతులెత్తేయటం కొన్ని కార్పొరేట్ సంస్ధలకు రివాజుగా మారింది. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డి.హెచ్.ఎఫ్.ఎల్) సంస్ధ దివాళాకు ఇదే కారణం. దీనికి 17 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కలిసి మొత్తం రూ.34615 కోట్లు రుణాలు ఇచ్చాయి. గుజరాత్‌కు చెందిన ఎ.పి.జి షిప్ యార్డు సంస్ధ ఏకంగా 28 బ్యాంకులకు రూ.22,800 కోట్ల మేరకు టోకరా ఇచ్చింది. ఇది కూడా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కలిపి ఇచ్చిన రుణం. రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన వారు విలాసవంతమైన జీవితాలు సాగిస్తున్నారు. స్వదేశీ జైళ్లలో ఉన్నవారు కూడా వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని జైళ్లలో కంటే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలోనే సేద దీరుతున్నారు.
ఐదేళ్లలో రూ.10.5 లక్షల కోట్ల రుణాలు రద్దు
గత ఆర్థికసంవత్సరంలో దాదాపు రూ.2 లక్షల కోట్లు, గడిచిన ఐదేళ్లలో దాదాపు రూ.పదిన్నర లక్షల కోట్లు రుణాలు రద్దు చేసినట్లు రిజర్వుబ్యాంక్ తెలిపింది. దీనిపై ప్రతిపక్షాలు, బ్యాంకు యూనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రద్దు అని రిజర్వు బ్యాంక్ వాడిన పదం కొంత గందరగోళానికి, అయోమయానికి గురిచేసింది. దీనికి అది ఇచ్చే భాష్యం కూడా కొంత కారణం. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశారా? అని ప్రశ్నిస్తే…వాటిని పూర్తిగా రద్దుచేసినట్లు కాదని అంటున్నది. మరి వాటిని బ్యాంక్ బ్యాలన్స్ షీట్లో ఎందుకు చూపటం లేదని అడిగితే రద్దు ఖాతాకు మార్చామని అంటున్నది. రద్దు అంటే పూర్తిగా మాఫీకాదని ఆ రుణాల విలువను సున్నా (జీరో)కు తగ్గిస్తున్నామని, ఆ రుణాలు తీసుకున్న వాళ్ళు కట్టవల్సిందేనని రిజర్వ్‌బ్యాంక్ వాదన. ఇది కొంతమేరకు వాస్తవం. పరిశ్రమలకు, కార్పొరేట్ సంస్థకు బ్యాంకు లిచ్చిన రుణాలకు స్ధిరచరాస్తులు ఎంతోకొంత తనఖా రూపేణా, మరోవిధంగా సెక్యూరిటీగా ఉండకపోవు. విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీల రుణాలకు కూడా కొంత సెక్యూరిటీ ఉంటుంది. కోర్టుల ద్వారానో, ట్రిబ్యూనల్స్ ద్వారానో వీటి నుండి పాక్షికంగా కొంత రివకరీ రాబట్టవచ్చు. ఈ విధంగా రద్దు అనే ఖాతా నుండి మూడేళ్ళలో రూ.1.09 లక్షల కోట్లు రాబట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. రుణాల రద్దు ఆషామాషీ వ్యవహారంకాదు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేశారో అంత మొత్తం బ్యాంకు లాభాల నుండి తగ్గించుకొని వాటికి కేటాయింపులు చేయాలి. గడచిన మూడేళ్లలో రూ.5.86 లక్షల కోట్లు రుణాలు రద్దుచేయగా, రికవరీ చేసింది కేవలం రూ.1.09 లక్షలు మాత్రమే. ఇది 20శాతం కూడా లేదు. ఇలా రికవరీ కాగా ఎటువంటి సెక్యూరిటీ లేక పూర్తిగా మాఫీ అయిన రుణాలు ఏడాదికి దాదాపు రూ.లక్ష కోట్లుగా అంచనా. ఈవిధంగా గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులు దాదాపు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేశాయి. అంటే అంత మొత్తం లాభాలు కోల్పోయాయి. సామాన్య కస్టమర్లు, నిజాయితీగా రుణాలు కట్టిన వారి నుండి వచ్చిన ఆదాయాన్ని కార్పొరేట్లకు, పారిశ్రామికవేత్తలకు దారపోయటం జరుగుతోంది.
కావాలని ఎగవేసే వారికీ రాయితీలు
ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేసిన వారి విషయంలోనూ బ్యాంకులు ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. వందల కోట్ల ఆస్ధి ఉన్న వ్యక్తి పదికోట్ల రూపాయల రుణం కట్టలేదంటే అది ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్లు భావించాలి. వారికి కూడా బ్యాంకులు వడ్డీ రాయితీ ద్వారా రాజీ పరిష్కార (కాంప్రమైజ్డ్ సెటిల్మెంట్) మార్గం చూపిస్తున్నాయి. ఇలా కట్టిన వారికి 12నెలల తరువాత మళ్లీ రుణం తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాయి. ఇలాంటి చర్యలు బ్యాంకింగ్ రుణవ్యవస్ధ క్రమశిక్షణను దెబ్బతీస్తాయి. ఇది కార్పొరేట్ సంస్ధలకు తప్పుడు సంకేతాలిచ్చినట్లు అవుతుంది. అసలు పాక్షికంగా రికవరీకి అవకాశమున్న రుణాలను రద్దు ఖాతాకు బదిలీచేయటానికి రిజర్వ్‌బ్యాంక్ చెప్పిన కారణాలు సమంజసంగా లేవు. పన్నులభారం తగ్గించుకోవడానికి ఈ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. పన్నులభారం తగ్గించుకోవడానికి ప్రక్కదారులు తొక్కితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకోదు. బ్యాంకులు ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఆలోచించాలి. పన్నులు కట్టాలనే సాకుతో రుణాలు రద్దుచేసి, ఉన్న ఆదాయం నుండి వాటికి కేటాయింపులు చేయటం సరికాదు. నిరర్ధక ఆస్తులు తక్కువచేసి చూపడానికి, కార్పొరేట్ సంస్ధలకు లబ్ది చేకూర్చడానికి మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు భావించవలసి వస్తుంది. మన బ్యాంకులు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగివున్నాయని చూపడానికి పడే తాపత్రయంతప్ప ఇది మరొకటి కాదు. గత ఐదేళ్లలో రద్దుచేసిన రుణాలను నిరర్ధక ఆస్తులలో కలిపితే ఇప్పుడున్న ఎన్.పి.ఎ.ల రేటు 3.9శాతం నుండి దాదాపు రెట్టింపు అవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చితే చాలా ఎక్కువ. అనారోగ్యాన్ని గుర్తించి వైద్యం చేయాలి. లేదని భావిస్తే పరిస్ధితి విషమిస్తుంది.
ఎస్.జి.కె.