టి.వి.సుబ్బయ్య
అవినీతిని నిర్మూలిస్తానని వాగ్దానంచేసి ప్రధాని మోదీ అధికారానికి వచ్చారు. మరి అవినీతిని నిర్మూలించారా? అవినీతి పరులంతా ఒక్కటయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తూ మాట్లాడారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ‘40శాతం కమిషన్ ప్రభుత్వం’ అని పేరుపడిరది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని భరించలేకుండా ఉన్నామని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ప్రధానమంత్రికి నేరుగా లేఖరాసింది. దాని మీద ప్రధాని స్పందనేలేదు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప చేయించిన పనులకు బిల్లు పాస్ చేయడానికి కాంట్రాక్టు మొత్తంలో 40శాతం ముడుపులివ్వాలని వేధించడంతో కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆత్మహత్య చేసుకున్నది ఎవరో కాదు బీజేపీలో క్రియాశీలంగా తిరిగే ఒక మాదిరి నాయకుడు. ఇటీవల కర్నాటకలో మాదల్ విరూపాక్షప్ప అనే బీజేపీ ఎంఎల్‌ఏ కుమారుడు తండ్రి తరఫున రూ.40లక్షలు ముడుపు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు ప్రత్యక్షంగా పట్టుకొని అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా విరూపాక్షప్ప ఐదారు రోజులు తప్పించుకొని తిరిగాడు. అరెస్టు చేసేలోపు ముందస్తు బెయిల్ తీసుకొని బైటపడ్డాడు. తప్పించుకు పోలేదని విరూపాక్షప్ప చెప్పాడు. అయితే పోలీసులు ఇంటికెళ్లి అరెస్టు చేయడానికి వెనక ఎవరున్నారోనని సందేహించవలసి వస్తుంది. అంతేకాదు తర్వాత జరిగిన దాడుల్లో తండ్రీ కొడుకుల వద్ద రూ.8కోట్లు నగదు దొరికింది.
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప, ఆయన కొడుకు ఇతర కుటుంబసభ్యులు తీవ్ర అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. యడియూరప్ప ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర ప్రజలలో విస్త్రత ప్రచారం జరిగాక తదుపరి ఎన్నికల్లో గెలవలేమని భావించిన మోదీఅమిత్‌షాలు 2021లో ముఖ్యమంత్రిని మార్చి వేశారు. యడియూరప్పను తప్పించి బసవరాజ్ బొమ్మయ్‌ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. ఒక్క ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ తప్ప తక్కిన బీజేపీ ముఖ్యమంత్రులంతా మోదీ
షాలు చెప్పినట్లు తలాడిరచవలసిన వారే. బొమ్మయ్‌పాలన వచ్చాక అవినీతి ఏమీ తగ్గలేదని చెప్పడానికి ఎంఎల్‌ఏ విరూపాక్ష ముడుపులు తీసుకున్న ఘటనకంటే మరే ఇతర రుజువులు కావాలి? ఈ అవినీతిని కప్పి పుచ్చేందుకు ఈ నాటికీ బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని,హోంమంత్రి వీటి గురించి మాట్లాడారు. యడియూరప్పపైన 18 అవినీతి కేసులు పెండిరగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికలో ఉన్నాయన్న విషయం విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. ఈ కేసుల్లో 14 యావజ్జీవ శిక్షకు అర్హమైనవిగా, 4కేసులు పదేళ్ల్లు జైలుశిక్ష విధించదగినవని తేల్చింది. భారీగా లంచాలు చెల్లించాలని వత్తిడి చేస్తున్నారని 13వేల స్కూళ్లకు సంబంధించిన రెండు ఉపాధ్యాయ సంఘాలు ప్రధాని మోదీకి లేఖ రాసినప్పటికీ మౌనమే సమాధానమైంది. చివరకు మతపీఠాలకు కూడా లంచాల చెల్లింపు జాడ్యం తప్పలేదు. 30శాతం ముడుపులు మినహాయించుకొని మఠాలకు నిధులు విడుదల చేస్తున్నారని ప్రముఖ లింగాయత్ మఠాధిపతి దింగలేస్వర్ స్వామి బహిరంగంగా ప్రకటించారు. పోలీసులు, ఎస్‌ఐల నియాయకానికిసైతం భారీగా ముడుపులు తీసుకున్న కుంభకోణం వెలుగుచూసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, మోదీ`షాల నుంచి స్పందనలేదు. ప్రతిపక్ష నేతలపై ఒంటి కాలిమీదలేచి వారి ఇళ్లపై దాడులుచేస్తున్న దర్యాప్తు సంస్థలు ఏనాడూ బీజేపీ నేతలు, మంత్రులు,ముఖ్యమంత్రుల జోలికి వెళ్లలేదు.
పార్లమెంట్‌లో, బీజేపీ సభ్యులలో ఎంతమంది అవినీతిపరులో మోదీ ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు. కేంద్రమంత్రి షెకావత్ రాజస్థాన్‌లో సంజీవని కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో 900 కోట్ల నిధులు కాజేశారని వేసిన కేసు ప్రస్తుతం విచారణలోఉంది. అరెస్టును తప్పించుకొనేందుకు ముందుస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అంతేకాదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాత్ తనను అప్రతిష్టపాలు చేశారంటూ ఆయన మీద దిల్లీ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ వ్యాపం కుంభకోణం కేసులో ఇరుక్కున్న విషయం ఎవరికీ తెలియందికాదు. చివరకు ఇప్పుడు ప్రజలకు పంపిణీచేసే రేషన్ విషయంలో వందలకోట్లు అవినీతి జరుగుతోందని ఆ రాష్ట్ర అకౌంటెంట్‌జనరల్ నివేదిక బైటపెట్టిం దది. ఇక 180దేశాల్లో అవినీతిపై సర్వే చేయగా మనదేశం 78వ స్థానంలోఉందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడిరచింది. బీజేపీ పాలనలోఉన్న ఉత్తరప్రదేశ్‌లో 78శాతం అవినీతి ఉందని వెల్లడిరచింది. కర్నాటకలో లంచాలివ్వకుండా పనులు చేయించుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారని అంచనా.. ఎన్నికల బాండ్ల ద్వారా వేలకోట్లు పొందుతున్న వ్యవహారం అధికారికమైందా? ఆశ్రిత పెట్టుబడీదారులు పన్నులు ఎగవేసి బాండ్లరూపంలో రాజకీయ పార్టీలకు ఇచ్చేది కాదా? ఈ అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. పెద్దనోట్ల రద్దువల్ల ఆశ్రిత పెట్టుబడిదారులు తమ వద్దగల నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు, ఉపయోగపడిరదని ఎందుకు భావించరాదు? మోదీ పాలనలో అవినీతి పెరిగిందని తాజాగా అదానీ గ్రూపు కంపెనీలలో జరిగిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలు తార్కాణం. అవినీతిలో కూరుకుపోయిన కర్నాటక వెళ్లి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుందికదా. ఓటర్లు ఇప్పుడు ఆలోచించవలసింది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం స్వాతంత్య్ర పరిరక్షణ గురించే. అది ఓటర్ల చేతిలో ఉంది.