Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

మోదీపై రైతు ఉద్యమ బాణం

జ్ఞాన్‌ పాఠక్‌

‘మోదీ గద్దె దిగండి’ అనే నినాదంతో రైతులు ఈ ఆగస్టు 9న పంజాబ్‌ నుంచి ఉద్యమం ప్రారంభించారు. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి, మే నెలలో జరగవచ్చు. బ్రిటీష్‌ వలస పాలకులు దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని కోరుతూ ఆగస్టు 9న క్విట్‌ఇండియా ఉద్యమం ప్రారంభించారు. అదే తేదీ నుంచి మోదీ గద్దె దిగండి నినాదంతో రైతులు ఉద్యమాన్ని ప్రారంభించారు. ముందుగా పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల మీద ఎక్కువగా కేంద్రీకరించారు. ఉద్యమం గ్రామ స్థాయి వరకు జరపాలని రైతులు నిర్ణయించారు. క్విట్‌ ఇండియా ఉద్యమం తర్వాత వలస పాలకులు 1947 ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించారు. రైతులను నష్టపరిచే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగించాలని నిర్ణయించారు.
గత ఏడాది నవంబరు 26న రైతు ఉద్యమం ప్రారంభమై ఎనిమిది నెలలు గడిచి తొమ్మిదవ నెలలో ప్రవేశించింది. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో దాదాపు 50 రైతు సంఘాలు కలిసి ఉద్యమాన్ని ప్రారంభించాయి. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్టుగా మోదీ ప్రభుత్వం వివాదాస్పద చట్టాలను రద్దు చేయటానికి తిరస్కరిస్తున్నారు. కిసాన్‌ మోర్చా, కేంద్ర ప్రభుత్వం మధ్య పదకొండు సార్లు చర్చ జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరిగా జనవరి 22న చర్చలు జరిగాయి. ఆ తరువాత కేంద్రం ఏ మాత్రం పరిష్కారానికి చొరవ తీసుకోలేదు. రైతులు చేస్తున్న మహత్తర పోరాటంలో తాము భాగస్వాములమవుతామని కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు, ఇతర కార్మిక యూనియన్లు, బ్యాంకులు, బీమా ఉద్యోగుల యూనియన్లు ప్రకటించాయి. దిల్లీ సరిహద్దుల్లో సింఘా, ఘజియాబాద్‌, టిక్రీ వద్ద రైతుల ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా, తాలూకా ప్రధాన కార్యాలయాల వద్ద రైతులు ఆందోళన చేశారు. దేశమంతటా ర్యాలీలు నిర్వహించారు. భారత్‌ బంద్‌ విజయవంతంగా జరిగింది. పార్లమెంటుకు సమీపంలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతులు ఈ నెల 13వ తేదీ వరకూ ధర్నా జరిపారు. పార్లమెంటు సమావేశాలూ ముగిసిపోయాయి.
రైతుల ఉద్యమం జాతీయ రాజకీయాలపైన గణనీయంగా ప్రభావం చూపనున్నది. ఈ ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీ గుర్తించకుండా ఉండదు. రైతు సమస్యలు దేశ ప్రజలందరికీ తెలిసినవే. రైతు సమస్యలపై చర్చించాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు పట్టుబడుతున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా తిరస్కరిస్తూ సభా సమయాన్ని వృథా చేస్తోంది. రైతు ఉద్యమం ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీతో నిమిత్తం లేకుండా కొనసాగుతున్నది. అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ రైతు పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల సందర్భంగా రైతులు బీజేపీకి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేశారు. బెంగాల్‌లో ప్రచార ప్రభావం ఎక్కువగా చూపింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించగా ఎన్నో ఆశలు పెట్టుకొన్న బీజేపీ ఓటమి పాలయింది. రైతు ఉద్యమం ప్రారంభ మయ్యాక వందలాది మంది రైతులు మరణించారు. అందువల్ల అన్ని రాష్ట్రాల్లోనూ రైతులు ఈ మరణాలను అంత తేలికగా మరిచిపోరు.
పంజాబ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆగ్రహం చెందిన రైతులు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారు. బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేస్తే చెప్పులతో సన్మానం చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రచారం కూడా బీజేపీ చేయలేక పోయింది. చాలా కాలంగా బీజేపీతో కలిసి ఉన్న శిరోమణి అకాలీదళ్‌ రైతు చట్టాలతో విభేదించింది. ఆ తర్వాత బీజేపీతో సంబంధాలను తెంచుకొన్నది. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్‌తో పాటు అప్‌, వామపక్షాలు రైతు ఉద్యమానికి తోడ్పాటుగా ఉన్నాయి. యూపి పశ్చిమ ప్రాంతంలో ఆర్‌ఎల్‌డీ నాయకుడు అజిత్‌సింగ్‌ ప్రభావం ఎక్కువగా ఉండేది. అజిత్‌సింగ్‌ మరణం తర్వాత రైతు నాయకుడిగా ఎవరూ ఎదగలేదు. ఈ ప్రాంతం నుంచి అత్యధిక మంది రైతులు ఘాజీపూర్‌లో జరుగుతున్న ధర్నాలో పాల్గొంటున్నారు. అందువల్ల రైతు పోరాట ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. యూపీప్రజలు యోగి ఆదిత్యనాథ్‌ పాలనపై భ్రమలు కోల్పోయారు. శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కరోనా బాధితులకు చికిత్స అందించటంలోనూ యోగి విఫలమయ్యారు. రాష్ట్రంలో ఓబీసీ రాజకీయాలు బలంగాఉన్నాయి. ఓబీసీలలో ఎక్కువగా అఖిలేష్‌యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాదిపార్టీకే అనుకూలంగా ఉన్నారు. బీజేపీ పలుకుబడి గణనీయంగా తగ్గింది. ఆ పార్టీకి అప్నాదళ్‌ మద్దతు ఉంది. రాష్ట్రంలో మోదీ గద్దె దిగాలనే నినాదంతో కాంగ్రెస్‌ ఉద్యమం చేపట్టింది. ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత తేలిక కాదని స్పష్టమవుతోంది. బీజేపీకి 100లోపే సీట్లు వస్తాయని ఆ పార్టీ జరిపిన సర్వేలో వెల్లడైనట్టుగా సమాచారం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img