Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

మోదీ`షాలకు కర్ణాటక ఎన్నికల గుబులు

అరుణ్‌ శ్రీవాత్సవ

మరో నెలన్నరలో జరగనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాల మనసుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మోదీ 45 రోజుల్లోనే ఇప్పటికి మూడుసార్లు కర్ణాటకలో పర్యటించారు. సంఫ్‌ుపరివార్‌ కార్యకర్తలు అన్నిటినీ సిద్ధంచేసి ఉంచారు. రెండు నెలలుగా ఈ రాష్ట్రంపైనే బీజేపీ కేంద్రీకరించింది. రాష్ట్రంలో మోదీ మరో డజనుసార్లు పర్యటించనున్నారని తెలుస్తోంది. అమిత్‌షా దాదాపు నెలరోజులుగా ఇక్కడే తిష్టవేసి రాష్ట్ర బీజేపీలో చోటుచేసుకున్న అంతర్గత కలహాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. మోదీకి రాష్ట్ర అసెంబ్లీలో గెలిచినా, గెలవకపోయినా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మూడవసారి ప్రధాని కావాలన్న తహతహ బాగా పెరిగింది. ప్రథమ ప్రధాని నెహ్రూ వరుసగా మూడుసార్లు ఎన్నికై ప్రధాని అయ్యారు. ఆయనతో పోటీ పడాలన్నదే మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకనే మధ్యతరగతిని ఆకర్షించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయాల అసెంబ్లీ ఎన్నికల్లో తామే గొప్ప విజయం సాధించినట్లుగా ప్రచారం చేసుకుంటున్న మోదీ గొప్ప మాటలమారి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ మోదీ, షాలు లెక్కలేనన్నిసార్లు పర్యటించి అనేక రోడ్‌షోలు నిర్వహించినప్పటికీ మేఘాలయలో 60సీట్లకు గాను 58 సీట్లలో బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. త్రిపురలో గతంలో వచ్చిన సీట్లకంటే ఈసారి 11సీట్లు తగ్గాయి. నాగాలాండ్‌లో 2సీట్లు దక్కాయి.
కర్ణాటకలో లింగాయత్తులపై గట్టిపట్టుఉన్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను రాష్ట్ర బీజేపీ వ్యవహారాల నిర్వాహకుడిగా మోదీ ఎంపికచేసి ఎన్నికల్లో విజయం సాధించాల్సిన బాధ్యతను అప్పగించారు. ఇది జరిగిన 15రోజుల్లోనే సీను మారింది. ఎన్నికల నిర్వహణ బాధ్యత అంతా ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మయ్‌ చేతికివెళ్లింది. అంతర్గత కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. యడియూరప్పకు, బొమ్మయ్‌కు సంబంధాలు దాదాపుగాలేవు. బొమ్మయ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రచారకమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. యడియూరప్పపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనపై గతంలోఉన్న ఆదరణ తగ్గిపోయింది. బొమ్మయ్‌ కూడా లింగాయెత్తే. ఈ వర్గంపై యడియూరప్పకు ఉన్న పట్టు బొమ్మయ్‌కు లేదు. యడియూరప్పకు బాధ్యత అప్పగిస్తే మరో వెనుకబడిన కులం ఒక్కలిగ కూడా బీజేపీవైపు రావచ్చునన్న ఆశతో మోదీ ఆయనను ఎంపిక చేసుకున్నారు. మోదీ ఎంపికకు కూడా విలువలేకుండాపోయింది. ఇప్పుడు బీజేపీలో అంతర్గత సంక్షోభం ముదిరింది. ఒక్కలిగల ఓట్లను పొందడంకోసం వారిలో పలుకుబడికలిగిన కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) పార్టీల నుంచి కొందరు నాయకులను తమ పార్టీలో ఎలాగైనా చేర్చుకోవాలని మోదీ,షాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఓటర్లలో గణనీయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమైందని, ప్రజలకు ఎలాంటి ప్రయోజనకరమైన కార్యకలాపాలు నిర్వహించలేదన్న అభిప్రాయంతో వారిలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిరది. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించడంలేదు.
దాదాపు 15 రోజుల క్రితం రాష్ట్ర బీజేపీ నాయకుడు కటీల్‌ టిప్పు సుల్తాన్‌పైన దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత మరో సీనియర్‌ నాయకుడు ఈశ్వర్‌ ముస్లింల ప్రార్థనలపైన తీవ్రమైన వ్యాఖ్యలుచేసి వారి ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ముస్లింలప్రార్థన రోజూ తలనొప్పిగా మారిందని, లౌడ్‌ స్పీకర్‌లు చెవుడు తెప్పించేట్లుగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకులు పార్టీని నడిపించి, గెలిపించే బాధ్యత మోదీనే అన్నట్లుగా ఉంటున్నారు. రెండురోజుల క్రితమే మాండ్య, హుబ్బళి, థార్వాడ్‌ జిల్లాలలో 16వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేసివెళ్లారు.
ఈ సందర్భంగా జరిగిన సభల్లో తాను అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పుకున్నారు. పైగా కాంగ్రెస్‌ తనకు సమాధి కట్టాలని అంటోందని వ్యాఖ్యానించారు. బెంగళూరు`మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను మోదీ ప్రారంభించారు. ఆయన శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మాజీ ప్రధాని జేడీ(ఎస్‌) నాయకుడు హెచ్‌డి దేవగౌడకు మంచిపట్టుఉంది. అలాగే కాంగ్రెస్‌కు కూడా గణనీయమైన పలుకుబడిఉంది. మాండ్య, మైసూర్‌, చామ్‌రాజ్‌ నగర్‌ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ బళ్లారి రెడ్డి సోదరులు స్వంత పార్టీ (కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష) ఏర్పాటు చేసుకున్నందున బీజేపీకి పెద్దగా ఫలితం ఉండదు. పైగా ఈ ప్రాంతంలో బీజేపీని ఓడిరచి తీరుతామని ఆ పార్టీపై ఆగ్రహంగాఉన్న జనార్థన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీచేయిస్తామని జనార్థన్‌రెడ్డి చెప్పారు. ఆయనపైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. జైలుశిక్ష కూడా అనుభవించారు. గత మూడు సంవత్సరాల్లో మత ఘర్షణలు రాష్ట్రంలో రెట్టింపయ్యాయి. ముస్లింలపై వేథింపులు తీవ్రంగా జరిగాయి. శివమొగ్గలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. హిందువుల మనోభావాలను గెలుచుకునేందుకు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థపై బీజేపీ నిషేధం విధించింది. ఈ చర్య బీజేపీకే ఎదురుదెబ్బ అయింది. 2022లోనే దాదాపు 22చోట్ల మతఘర్షణలు జరిగాయి. వీటికి బీజేపీనే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంఐఎమ్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ తమ పార్టీ 30చోట్ల పోటీచేస్తుందని ప్రకటించి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని మరింత క్లిష్టం చేశాడు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చే పనులు ఆయన చేస్తాడన్న ఆరోపణ ఉంది.
ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్న విశ్వాసంతో కాంగ్రెస్‌ నాయకత్వం పనిచేస్తోంది. సాధారణంగా ముస్లింలు ఎప్పుడూ కాంగ్రెస్‌కే ఓటు వేస్తున్నారు. ఈసారి ఎంఐఎమ్‌ అభ్యర్థులు పోటీచేస్తే, కాంగ్రెస్‌కు వచ్చే ఓట్లు తగ్గిపోతాయన్న అంచనాఉంది. రాహుల్‌గాంధీ నిర్వహించిన భారత్‌ జోడోయాత్ర ప్రభావం గణనీయంగా ఉందని భావిస్తున్నారు. మీ ఓట్లు సావర్కర్‌కా, టిప్పుసుల్తాన్‌కా అంటూ మతాల మధ్య చిచ్చు రేపడానికి, తద్వారా హిందువుల ఓట్లను పదిలపరచు కునేందుకు బీజేపీ ప్రచారం సాగిస్తోంది. ఈ ప్రచారం కారణంగా మత ఘర్షణలు, అరాచకం చోటుచేసుకున్నాయి. వీటికి బీజేపీ దేశంలో ప్రతీకగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకుని ప్రయోజనం పొందడంలో బీజేపీదే పైచేయి. నిధులు ఎన్నయినా ఖర్చు చేయగల సామర్థ్యం బీజేపీకే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img