రా బావ ఏంటి ఈ రోజు ఏదో పాట పాడుతూ వస్తున్నావు. సరే ముందు కాఫీ తాగు తర్వాత పాడవచ్చు నా మాట విని నేను అన్నట్లుగా నీవు కూడా భక్తితో ఓ రామ శ్రీ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ అని నీవు కూడా స్నానం చేసి కాఫీ తాగకముందే నే చెప్పిన పదాలు వల్లె వెయ్యి నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. నీ కోరికలన్నీ తీరిపోతాయి. హేతువాదుల మాట విని అనవసరంగా ప్రాణం మీదకు తెచ్చుకోకు. ఈ ఒక్కసారైనా నా మాట విను బావ. అదిసరే తెల్లవారే సరికి ఎంత భక్తుడివయ్యావు ఏం జరిగింది.
ఏం లేదు. మా యింటి దగ్గరలో చిన్న రామాలయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి భజనలు చేయడం ఆరోజు భోజనాలు పెట్టడం పరిపాటి. ఈ సారి నవమి వెళ్లిపోయినా రోజూ గుడిలో భజనలు మానలేదు. ఎందుకని ఈ సంవత్సరం కొత్తగా ఏ మొచ్చింది అంటే అయోధ్యలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రామాలయం ప్రారంభమయ్యేవరకు ఇలాగే రోజూ భజనలు చేసి ఆ తరువాత ఈ భజన బృందం అయోధ్యకు వెళతారట. నిజమేదాన్ని పెద్దయాత్రాస్థలంగా మార్చే ఆలోచన బీజేపీకి ఉంది. అది కాదు మసీదులు పడగొట్టి రామాలయం కట్టకపోతే వేరే చోట కోరిన విధంగా కట్టుకోవచ్చు గదా. నిజమే అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు ఎంత స్థలం కావాలన్నా ఇచ్చి వేరేచోట కట్టుకోమన్నా వినలేదు. మత కలహాలు నివారించడానికి ప్రధానిగా ప్రయత్నించాడు. అయితే ముస్లింలు గతంలోఉన్న హిందూ దేవాలయాలు కూల్చి వాటిపైనే మసీదులు నిర్మాణం చేశారనేది విశ్వహిందూ పరిషత్ బీజేపీ నాయకుల వాదన. కోర్టులో తేలే వరకు ఉండి మసీదు పడగొట్టి రామాలయం నిర్మించారు. అయితే పునాదుల కోసమని అవసరానికిమించి లోతు తవ్వారు. అడుగున రామాలయ ఆనవాళ్లకోసం తవ్వి ఉన్నారు. కాని అటువంటివి కనబడినట్లులేదు. అయినా అక్కడే కట్టాలనే పట్టుదల దేనికి? వాళ్లు పడగొట్టి మసీదు నిర్మించారు కనుక వీరు పడగొట్టి రామాలయం నిర్మించాలనే కక్షపూరిత చర్య. అంతకంటే ఏమీలేదు. అది సరే ఈ మధ్య ప్రధాని మోదీ కొత్తరాగం అలపిస్తున్నారేమిటి. ఆయనకు సప్త స్వరాలతో పాటు అన్ని రాగాలు వచ్చు. అవసరాన్ని బట్టి రాగం మార్చి ఆలపిస్తుంటారు. అందునా ఆరున్నర శృతిలో పాడగలడు. అది సరే ఇపుడా కొత్త రాగం ఏమిటంటావు.
నీవు పేపరు చూడలేదా. అయనకు బుద్దుడు ఇపుడు గుర్తుకొచ్చి బుద్ధదేవుని బోధనలు ఆచరణీయం అంటున్నారు. అయితే కులమతాలు లేని సమసమాజాన్ని మోదీ అంగీకరిస్తాడా?. భలేవాడివి గుజరాత్ ముస్లింలను ఊచకోతకు కారణమైన మోది ఎలా అంగీకరిస్తాడు. రాజకీయాలతో అవసరానికి తగినట్లు మాట లుంటాయి. ఈ కొత్త రాగం ప్రస్తుతం కర్నాటక ఎన్నికలకు ఉపయోగ పడుతుంది. కాలానుగుణంగా అవసరాన్ని బట్టి రాగం,శృతి మారుతూ ఉంటుంది. బడుగుల పరామర్శకు వెడితే తీగను మీటి విషాదరాగాలు ఆలపిస్తాడు. నిజమేలే ఆర్‌ఎస్‌ఎస్ పునాదికదా ఆయనలో మార్పు ఎలా ఊహిస్తాం. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చి హిందువులు మాత్రమే హిందూ దేశంలో ఉండాలనే రాగం మనసులో ఆలపిస్తూ బైటకు ఇటువంటి కొత్తరాగాలు వినిపిస్తారన్నమాట. మనుస్మృతిని మననం చేసుకుంటూ చాతుర్‌వర్ణ వ్యవస్థ స్థాపనకోసం పరితపిస్తూ ఎన్నికలకోసం, ప్రతిపక్షాలు నోరుమూయించడానికి అప్పుడప్పుడూ కొత్తరాగం ఆలపిస్తారు. నిజమే బావ ఆయనకు, అమిత్‌షాకు హిందుస్తాని రాగాలన్ని వచ్చు. వీరిద్దరూ కల్సి ప్రాక్టీసు చేసి దేశాన్ని పాలిస్తున్నారు. అది సరే బుద్ధుని బోధనలు ప్రవేశపెట్టడం మాట అటుంచి మూడవసారి గద్దెనెక్కితే మనుస్మృతి మన నెత్తిన బలవంతాన రుద్దకుంటే అంతేచాలు బావ. భలేవాడివయ్యా వాళ్ల ధ్యేయమే అది. వాళ్లకెపుడు వీలుపడుతుందా ఆ రాగం పాడటానికని సమయంకోసం వేచిచూస్తున్నారు. అదను చూచి ప్రవేశపెట్టి ప్రజల కోరికమేరకు అని ఆ రాగానికి తాళం జతచేయక మానరు. అనుకున్న దానికంటే ఎక్కువే మెజారిటీ ఇచ్చి ఎన్నుకున్న ప్రజల ఆశ అనే రాగం తీయకమానరు. మరి మనది సెక్యులర్ స్టేట్ కదా ఎలా వీలు పడుతుంది. ఇంకా నీ వెక్కడున్నావు. అంబేద్కర్ రాజ్యాంగం తుంగలో తొక్కి ఇష్టంలేక పోయినా నాలుగుచోట్ల అంబేద్కరు విగ్రహాలు నెలకొల్పివారు నమ్మిన మనువాదరాగం ఆలపించడం ఖాయం. స్లో పాయిజను అంటారే అలాగ ఈ సంవత్సరమే పిల్లల పాఠ్యపుస్తకాలలో మనువాద రాగాన్ని ప్రవేశపెడుతున్నారు. చిన్నతనంలోనే బుర్రకు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారుగ. సత్యబామ పాడినట్లు మీరజాలగలడా నా ఆనతి అని అదే రాగం అందుకోవడం ఖాయం. కర్నాటకలో వారి పాచికలు పారితే ఇంకా ఎవరాపగలరు. విజయగర్వంతో శ్రీ రాగం అందుకుంటారు. మరోసారి బీజేపీ గెలిస్తే కర్నాటకలో బసవన్న ప్రభావం సన్నగిలినట్లే.
సెల్: 9885569394