Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

మోదీ నియంతృత్వ పాలనకు అంతం పలుకుదాం

ముప్పాళ్ళ నాగేశ్వరరావు

మోదీ ప్రభుత్వ ఆడంబర పాలన భారతదేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. గడిచిన 9 సంవత్సరాల పాలనలో తీసుకున్న నిర్ణయాలన్నీ గ్రామీణ రైతులకు, దేశ ప్రజలకు, చిన్నచిన్న పారిశ్రామికవేత్తలకు, చిరు వ్యాపారులకు, అన్ని వర్గాల ప్రజలకు నష్టం కలిగిస్తూ బడా కార్పొరేట్లకు వేల కోట్లు దోచుకొనుటకు అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా కుబేరుల సంఖ్య పెరిగి మధ్యతరగతి నుండి దిగువ వర్గాల నిజ ఆదాయాలు తగ్గిపోయాయి. సాంస్కృతిక, మెజారిటీ జాతీయవాదం పేరుతో సాగిస్తున్న పాలన దేశంలో మత ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. పాలనలో పారదర్శకత నిజాయితీ ఉంటుందని మోదీ చెప్పిన మాటలు ఆదృశ్యమైపోయాయి. కనీస పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతులను పాటించకుండా బీజేపీకి బలం లేని రాష్ట్రాలలో సైతం ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టి లేక ఎమ్మెల్యేలను చీల్చి తన ప్రభుత్వాలను ఏర్పరచుకొనే దిగజారుడు తనానికి మోదీ పాల్పడ్డాడు.
ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నానని ప్రగల్భాలు పలికిన మోదీ, బీజేపీ ఈ కాలంలో అవినీతిని కార్పోరేటీకరణ చేసింది. మోదీ నామధేయులు లక్షల కోట్లు బ్యాంకుల నుంచి కాజేసి మోదీ అండతో విదేశాలకి పారిపోయారు. తమకి నచ్చని, ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపైకి సీబీఐ, ఈడీ సంస్థలను ఉసిగొల్పి వేధించడం, జైల్లో పెట్టించడం పరిపాటిగా మారింది. ప్రతిపక్షాలకు చెందిన వివిధ రాష్ట్రాలలో వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహించే నేతలపై ఈడీని ప్రయోగించి, భయపెట్టి లొంగదీసుకుని నిస్సిగ్గుగా బీజేపీలోకి చేర్చుకుంటున్నారు. అదాని కంపెనీల ఆర్థిక నేరాలపై హిండెన్‌ బర్గ్‌ నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేసి చర్చించడానికి మోదీ ప్రభుత్వం భయపడిరది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి విద్యావంతులైన నిరుద్యోగులను నిట్ట నిలువునా బీజేపీ ప్రభుత్వం మోసంచేసింది. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది.
నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్లు రద్దు అని చెప్పి మోదీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మూడు మాసాలలో ఆర్థిక వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు వస్తాయని ఓర్పు పట్టండని నమ్మబలికి 74 మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నాడు. 1000 రూపాయల నోట్లు రద్దు చేసి 2000 నోట్లను ముద్రించి నల్ల డబ్బు దాచుకోవడానికి సులభతరం చేశాడు. 2014 ఎన్నికల ప్రచార సభలలో విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తెప్పించి కుటుంబానికి 15 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పిన మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క పైసాకూడా తేలేదు. బ్యాంకుఖాతాలో వెయ్యలేదు. బ్యాంకులకు రుణాలను ఎగవేసిన వారి జాబితాలు కూడా బైటపెట్టలేదు. 2014లో డీజిల్‌, పెట్రోలు ధరలను తగ్గిస్తానని చెప్పి అడ్డగోలుగా పెంచి వినియోగదారులను నిలువు దోపిడి చేస్తున్నాడు. 2014లో 404 రూపాయలు ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు 1120 రూపాయలకు పెంచి మహిళల సహనానికి పరీక్ష పెట్టిన కిలాడి నరేంద్ర మోదీ. రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి భూమిని రైతుకి దూరంచేసే స్థితికి ఒడిగట్టాడు. దిల్లీ చారిత్రక రైతు పోరాటంతో ఎత్తుగడగా క్షమాపణ చెప్పి మూడు చట్టాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించినా రైతుకు మేలు చేసింది ఏమీ లేదు. రైతు స్థితి నానాటికి దిగజారిపోతోంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని విభజన సందర్భంగా డిమాండ్‌ చేసిన బీజేపీి వచ్చేది మేమే ! ఇచ్చేది మేమే అని ఆడంబరాలు పలికి నేడు అది ముగిసిన అధ్యాయమని చెప్పి నవ్యాంధ్రను దారుణంగా మోసగించింది. దిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామన్న మోదీ అమరావతి మూడు ముక్కలు చేస్తానంటున్న జగన్మోహన్‌ రెడ్డికి వత్తాసుగా నిలబడడం హేయమైన చర్య! జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరించక అడ్డంకులు సృష్టించడం, నిధులివ్వకపోవడం క్షమార్హం కాదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ అన్న మాటను నీట ముంచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు బీజేపీ చేసిన ద్రోహం ఎన్నటికీ క్షమించరానిది.
25 పార్లమెంటు సీట్లిస్తే కేంద్ర ప్రభుత్వ కాలరు పట్టుకొని హోదా తెస్తానన్న సీఎం జగన్మోహన్‌ రెడ్డి మోదీ, అమిత్‌ షాలకు పాదాభి వందనాలు చేస్తూ తన బెయిల్‌ రద్దు కాకుండా వేడుకుంటున్నాడు. తన బాబాయి హత్యకు కుట్ర దారులేవరో, హంతకులెవరో ప్రజలలో నిర్ధారణ జరిగిపోయింది. కనీసం వచ్చే ఎన్నికల దాకా విచారణ జాప్యం చేయడం కోసం ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నానా తంటాలు పడుతూ ఓట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలకు పంగనామాలు పెడుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడవలసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోరెత్తకుండా మోదీ ప్రభుత్వానికి ‘‘జీ హుజూర్‌’’ అంటూ సాగిలపడుతోంది.
రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి నిత్యం ఓట్ల కొనుగోళ్ల స్కీములతో ముఖ్యమంత్రి తన్మయత్వం చెందుతున్నాడు. ఉన్నాడు. చెత్త పన్ను, విద్యుత్‌ మోటార్లకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు, విద్యుత్‌ ఛార్జీల పెంపు, ఆర్టీసి చార్జీల పెంపు, ఇళ్ల పన్నుల పెంపు, ఇసుక దందా, మద్యం దందాలతో వైసీపీ ప్రభుత్వం మునిగి తేలుతోంది. అధిక భారాలను, పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొంటున్న ప్రజల పైన, ప్రశ్నిస్తున్న సంఘాలపైన పోలీసుల దమన కాండలతో మోదీకి నేనేమీ తగ్గను అన్నట్టు ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడలకు పోతున్నాడు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అలుముకున్న కారు చీకట్ల నుండి బయటపడడానికి చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన బాధ్యత మనపైఉంది. ఈ నేపథ్యంలో సీపీఐ దేశవ్యాప్తంగా స్థానిక స్థాయిలలో పాదయాత్రలను ఈనెల 14 నుంచి మే 15 వరకు స్థానిక స్థాయిలో పాదయాత్రలకు పిలుపు ఇచ్చింది. మన రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం ఉభయులు కలిసి ఈనెల 14 నుండి 30 వరకు ఉమ్మడిగా పాదయాత్రలు, ప్రచార సభలు నిర్వహిస్తున్నాయి. మే డే అనంతరం మే 15 వరకు ఈ పాదయాత్రలను సీపీఐ ఆయా జిల్లాలలో కొనసాగించ నున్నది. ఈ యాత్రలో ప్రచార సభలలో పార్టీ, ప్రజా సంఘాల కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొనాలని దేశభక్త లౌకిక ప్రజాస్వామ్య వ్యక్తులు శక్తులందరినీ కూడగట్టి గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లాలని సీపీఐ రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తున్నది.
వ్యాస రచయిత సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img