ఎం. కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోదీఇంద్రుడు చంద్రుడు అంటూ భజన చేస్తున్న గోదీ మీడియా పరిస్థితి మింగా కక్కలేకుండా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మోదీపై అనేక అతిశయోక్తులతో కూడిన కుహనా, వక్రీకరణ సమాచారం హిందుత్వ శక్తులు పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజమే అని నమ్మిన మీడియా కూడా భుజాన వేసుకొని తరువాత తేలుకుట్టిన దొంగల్లా ఉన్న ఉదంతాలు ఎన్నో. తాజాగా మోదీని అపహాస్యంపాలు చేసే ఉదంతం జరిగింది. అది ఏ బీబీసీ లేదా మరొక విదేశీ సంస్థ చేసి ఉంటే ఇంకేముంది ? నోబెల్ శాంతి బహుమతికి మోదీ అతిపెద్ద పోటీదారుగా ఉన్నట్లు, విశ్వసనీయత ఉన్న పెద్దవాడైన రాజనీతిజ్ఞుడిగా గుర్తించినట్లుగా నోబెల్ బహుమతి కమిటీ ఉపనేత అస్లీ టోజె చెప్పారని జాతీయ మీడియా ప్రచారం చేసింది. తానసలు అలా చెప్పలేదని టోజె ఖండిరచాడు. అది నకిలీ వార్త అన్నాడు. మోదీకి శాంతి బహుమతి లాంఛనంగా ప్రకటించటమే తరువాయి అన్నట్లుగా మీడియా పెద్దలు కథలు అల్లారు. ఒక టీవీ సంపాదకుడు, బడా టీవీ ఛానళ్లు, పత్రికలు దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయ మన్నట్లుగా వ్యవహరించాయి. నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం ఫలానా సంవత్సర బహుమతుల కోసం ఎందరు, ఎవరు పోటీ పడ్డారు అన్న వివరాలను ఐదు దశాబ్దాల పాటు వెల్లడిరచకూడదు అన్నది నిబంధన. అలాంటిది కమిటీ ఉపనేతే మోదీ ప్రధాన పోటీ దారు అని చెప్పాడంటే వాస్తవమా.. కాదా అన్నది నిర్ధారించు కోవాలి. దిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అస్లీ టోజెతో విలేకర్లు మాట్లాడారు. టోజె చెప్పినదానిని వక్రీకరించారు. తాను నోబెల్ కమిటీ ఉపనేత హోదాలో దిల్లీ రాలేదని, అంతర్జాతీయ శాంతి అవగాహన సంస్థ డైరెక్టర్‌గా ఇండియా సెంటర్ ఫౌండేషన్(ఐసిఎఫ్) స్నేహితుడిగా వచ్చానని టోజె ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పాడు. అస్లీ టోజె టైమ్స్‌నౌ ఛానల్ విలేకరితో మాట్లాడుతూ ‘‘ఉక్రెయిన్ సంక్షోభంలో ప్రధాని ఒక సానుకూలవైఖరితో స్పందించారు. అణ్వా యుధాలను వాడవద్దని రష్యాను హెచ్చరించారు. వర్తమానం యుద్ధాల యుగం కాదని వ్లదిమిర్ పుతిన్‌కు చెప్పారు. ప్రపంచంలో బాధ్యత కలిగిన ఏ నేత అయినా ఇలాంటి సందేశమివ్వటానికే ఇష్టపడతారు. అన్నింటి కంటే ముఖ్యమైనదేమంటే భారత్ వంటి శక్తిమంతమైన దేశం నుంచి ఇలాంటి సందేశం వచ్చింది.’’ అని చెప్పాడు. నకిలీ వార్తను వండి వార్చింది టైమ్స్ నౌ అని తేలింది. ఏకంగా దాని సంపాదకుడు రాహుల్ శివశంకర్ తప్పుదారి పట్టించే ట్వీట్లు చేశారు. మోదీని పొగడటాన్ని అవకాశంగా తీసుకొని నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన పోటీ దారుగా ఉన్నట్లు చిత్రించి ఆ మాటలను టోజె నోట్లో పెట్టారు. దీంతో మోదీని ఆకాశానికి ఎత్తుతూ మిగతా వారంతా నిర్ధారించుకోకుండా ప్రచారం చేశారు. ఐసిఎఫ్ చైర్మన్ వైభవ్ కె ఉపాధ్యాయ ఈ వార్త గురించి మాట్లాడుతూ టోజె చెప్పిన మాటలను తప్పుగా చిత్రించారన్నారు. టీవీ ఛానళ్లు పొరపాటున లేదా అత్యుత్సాహంతో అలా చేసి ఉండవచ్చు. పధకంప్రకారం చేసిఉంటే అది నేరపూరితం అన్నారు. ఐసిఎఫ్ కార్యక్రమం కోసం ఏర్పడిన కమిటీ సభ్యుడైన మనోజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ తాను పూర్తిగా అస్లీ టోజెతోనే ఆ రోజు మౌర్య షెరటన్ హోటల్లో ఉన్నానని, టైమ్స్ నౌ విలేకరితో సహా ఇతరులతో మాట్లాడినపుడు తాను విన్నానని వారితో లేదా ప్రధాన ప్రసంగంలో గానీ మోదీ గురించి అలాంటి మాటలు చెప్పలేదని స్పష్టం చేశారు. న్యూ ఇండియన్ ఛానల్ యాంకర్ మోదీ
బహుమతి గురించి అడిగిన అంశం మీద టోజె మాట్లాడుతూ ఏ నాయకుడైనా బహుమతిని గెలుచుకొనేందుకు తగినంత కృషి చేయాలి. ముందు పని జరగాలి తరువాత బహుమతులు వస్తాయి’’ అన్నాడు తప్ప మోదీ పోటీదారనో మరొకటో చెప్పలేదు. నోబెల్ బహుమతి సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 2023 బహుమతికి 305 నామినేషన్లు రాగా, వాటిలో 212 మంది వ్యక్తులవి, 93 సంస్థలవి ఉన్నాయి.
మన పత్రికలు, టీవీ ఛానళ్ల తీరు తెన్నులు, అవి ప్రచారంచేసే నకిలీ వార్తల గురించి గత సంవత్సరంలో లాజికల్ ఇండియా పేర్కొన్నవాటిని కొన్నింటిని చూద్దాం. టిప్ టిప్ భర్సాపానీ అనే మన హిందీ పాటకు పాకిస్తాన్ రాజకీయవేత్త అమీర్ లియాకత్ హుసేన్ డాన్స్ చేసినట్లు ఒక వీడియో వైరలైంది. నిజానికి అతను సొహాయిబ్ షుకూర్ అనే డాన్స్‌మాస్టర్. టైమ్స్ నౌ, నవభారత్ రాజకీయవేత్తగా చిత్రించాయి. అసోంలోని ఒక టీ అమ్మే కుర్రాడు రాహుల్ కుమార్ దాస్ నీట్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ర్యాంకు తెచ్చుకొని ఎయిమ్స్‌లో సీటు పొందినట్లు మీడియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచారంలో పెట్టింది. తీరాచూస్తే అతను పరీక్ష రాసింది నిజమే కానీ వచ్చిన ర్యాంకు 9,29,881. మార్కులను తిమ్మినిబమ్మిని చేసి అతను చెప్పిన కథనాన్ని గుడ్డిగా ప్రచారం చేశారు. నిజం వెల్లడికాగానే అతను, అతని సోదరి, తల్లి కనిపించకుండా పోయారు. టీవీ9 భరత్‌వర్ష్ ఛానల్ శ్రీలంకలోని హంబంటోటా రేవు గురించి ఒక కథనాన్ని ప్రసారం చేసింది.
ఆ ప్రాంతమంతా చైనా అదుపులో ఉందని, మొత్తం ఐదు వందల తనిఖీ కేంద్రాలున్నట్లు, పైకి కనిపించకుండా చైనా మిలిటరీ ఉందని, చైనాలోని ఉఫీుర్ ముస్లింలను బానిసలుగా తెచ్చి అక్కడ పనిచేయిస్తున్నారని దానిలో పేర్కొన్నది. అదంతా అవాస్తవం అని, సంచలనం కోసమే అలాంటి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసినట్లు తేలింది. అసోంలో భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో ఒక వంతెన కూలినట్లు ఆజ్‌తక్, టీవీ9, ఇండియాటీవి, ఆసియానెట్, ఇతర సంస్థలు ప్రసారం చేశాయి. నిజానికి ఆ వంతెన ఏడాది క్రితం ఇండోనేషియాలో కూలింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ముస్లిం దుండగులు హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు మీడియా సంస్థలన్నీ ప్రసారం చేశాయి. నిజానికి ఆ ఉదంతంలో పాల్గొన్నది హిందువులని తేలింది. తెలంగాణాలో వరదలు అంటూ టీవీలు ఒక వీడియోను ప్రసారం చేశాయి.
జెసిబి ట్రాక్టర్ నుంచి వరద బాధితులను కాపాడుతున్న హెలికాప్టర్ దృశ్యమది. నిజానికి ఆ ఉదంతం 2021నవంబరులో అదీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని చిత్రావతి నదిలో జరిగింది. ఒక కామెడీ కథనాన్ని నిజమని నమ్మి చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ను అరెస్టు చేశారంటూ సాగించిన తప్పుడు వార్తలు, దృశ్యాల గురించి తెలిసిందే. పదకొండు సంవత్సరాల నాటి 2జి కుంభకోణంలో అరెస్టయిన మాజీమంత్రి ఏ రాజా అంటూ ఒక వార్తాసంస్థ ఇచ్చిన వార్తను అనేక పత్రికలు, టీవీలు గుడ్డిగా తాజా వార్తగా ప్రసారంచేశాయి. ఫీఫా ప్రపంచకప్‌లో అర్జెంటైనా మీద గెలిచిన సౌదీ అరేబియా క్రీడాకారులందరికీ రోల్స్‌రాయిస్ కార్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు వచ్చిన తప్పుడువార్తను ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రముఖంగా ఇచ్చాయి. తమ నేత పరువుతీసిన ఈ ఉదంతం గురించి ఎలా స్పందిస్తారు?