ఎం.కోటేశ్వరరావు
అప్పు చేయడం చెడ్డపని అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. తినటానికి లేకపోతే కడుపులో కాళ్లు ముడుచుకొని పడుకుంటాం గాని అప్పు చేసి పప్పుకూడు తినం అనే మాట ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. గతంలో అప్పులున్నవారెందరు అని వెతికితే ఇప్పుడు అప్పులేని వారెవరు అన్నది ప్రశ్న. భారతీయత గురించి లౌడ్ స్పీకర్లతో పని లేకుండానే గొంతెత్తి అరచి మాట్లాడేవారి పాలనలో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. మన పాలకులు ఎన్ని అప్పులు చేసినా అభివృద్ధి కంటికి కనిపించదు. తాజా బడ్జెట్ పత్రాల్లో వెల్లడిరచిన సమాచారం ప్రకారం 2022 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.1,35,87,893 కోట్లుగానూ 2023 మార్చి ఆఖరుకు అది రు.1,52,17,910 కోట్లకు పెరుగుతుందని ఉంది. అంటే ఏడాది కాలంలో 16లక్షల 30వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేయనుంది. వర్తమాన కరెన్సీ మారకపు విలువ, ఇబిఆర్, కాష్‌బాలన్సులను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తాలు 139, 155లక్షల కోట్లుగా ఉంటాయని ప్రభుత్వమే వివరణలో పేర్కొన్నది. నరేంద్రమోడీ సర్కార్ అధికారానికి వచ్చిన ఏడాది అంటే 2014 మార్చి ఆఖరుకు ఉన్న అప్పు రు.53,11,980 కోట్లు. ఎనిమిది సంవత్సరాల్లో కొత్త అప్పులు 99,05,930 కోట్లు. బహుశా దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమని జనం చెవుల్లో ఎక్కించేందుకు పూనుకోవచ్చు.పోనీ ఇంత చేసినా అభివృద్ధి కరోనాతో నిమిత్తం లేకుండా సాధారణ పరిస్దితి ఉన్నపుడే ఎనిమిది నుంచి నాలుగుశాతానికి తగ్గింది. ఏమిటీ నిర్వాకం అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు దేశభక్తులేనా, ఇక్కడి తిండి తింటూ ఇక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అని దాడి చేస్తారు.
కేంద్రానికి వచ్చే ఆదాయం వంద రూపాయలనుకుంటే దానిలో అప్పుల ద్వారా 35, జిఎస్‌టి ద్వారా 16, ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను ద్వారా 15 చొప్పున, ఎక్సయిజ్ పన్ను ఏడు, కస్టమ్స్, పన్నేతర ఆదాయం ఐదేసి చొప్పున, ఇతరంగా రెండు రూపాయలు వస్తోంది. దీన్ని ఖర్చెలా చేస్తున్నారు ? వడ్డీ చెల్లింపులకు 20, రాష్ట్రాలకు పన్నుల వాటాగా 17, కేంద్ర పధకాలకు 15, ఆర్ధిక సంఘం, ఇతర బదిలీలకు 10, కేంద్ర ప్రాయోజిత పధకాలకు 9, ఇతర ఖర్చులకు 9, సబ్సిడీలు, రక్షణకు ఎనిమిది చొప్పున, పెన్షన్లకు నాలుగు వంతున ఖర్చు చేస్తున్నారు. అప్పులు తీసుకురావటాన్ని తప్పు పట్టాల్సినపనేమీ లేదు గానీ దాని వలన జరుగుతున్న వృద్ధి ఎంత అనేది మాత్రం ప్రశ్నార్ధకమే. పెట్టుబడి ఖర్చును పెంచినట్లు చెబుతున్నారు. రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. దీని వలన కలిగే మేలు ఏమంటే రోడ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సిమెంట్, ఉక్కు, ఇతర ముడి సరకులకు గిరాకీ పెరుగుతుంది, ఆ పరిశ్రమలకు పని దొరుకుతుంది.గతంలో రోడ్ల నిర్మాణం అంటే మానవ శ్రమ గణనీయంగా ఉండేది, ఇప్పుడు యంత్రాలు ఆ పని చేస్తున్నాయి. ఇక ఈ రోడ్ల నిర్మాణానికి చమురు మీద సెస్‌లను విధించి జనాల నుంచే వసూలు చేస్తున్నారు. అదే జనాలు(ద్విచక్రవాహనాలు మినహా) రోడ్లను వినియోగిస్తే టోలు వసూలు చేస్తున్నారు. వాణిజ్యవాహనాలు చెల్లించే టోల్‌టాక్సు పరోక్షంగా తిరిగి జనం మీదనే రుద్దుతారు.
ఒక వైపు దేశాన్ని అప్పులపాలు చేయటంతో పాటు అనుసరిస్తున్న విధానాలు జనాలను కూడా అప్పుల ఊబిలో దింపుతున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వాలు, జనాలు ఇబ్బందులు, అప్పుల పాలయ్యారు, కుబేరులు మాత్రం మరింతగా పెరిగారు, బలపడ్డారు. ఇదెలా జరిగింది ? వారికి అనుకూలమైన విధానాలే కారణం, ఎవరినైనా ఇతర సహేతుక కారణాలు చెప్పమనండి. అనేక మంది పారిశ్రామికవేత్తలు కరోనా కారణంగా తమ సంస్ధలను మూసివేశారు, వాటిని పునరుద్దరించే పేరుతోనో మరొక సాకుతోనే ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందారు. పోనీ వాటిని తిరిగి పెట్టుబడిగా పెట్టి ఉపాధి కల్పించేందుకు పూనుకున్నారా అంటే అదెక్కడా కనిపించటం లేదు. కరోనా తొలి, ద్వితీయ దశల్లో అనేక కుటుంబాలు ఆసుపత్రి ఖర్చుల కోసం ఉన్న ఆస్తులు అమ్మి, అప్పుల పాలైనా అనేక కుటుంబాల్లో ఆప్తులు దక్కలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచటం లేదు.
కుటుంబాలు కరోనాతో ఎలా దెబ్బతిన్నాయో, వత్తిడి ఎలా పెరిగిందో వారి బంగారం తాకట్టు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వుబాంకు నివేదిక ప్రకారం 2019 నవంబరు 22 నాటికి బాంకుల్లో బంగారు రుణాల మొత్తం రు.29,514 కోట్లు కాగా 2021 నవంబరు 19 నాటికి 65,630 కోట్లకు పెరిగాయి. ఇది అర్ధిక వ్యవస్ధ సజావుగా లేదనేందుకు ఒక సూచిక. వారు వ్యక్తులు లేదా చిన్న, సన్నకారు సంస్ధల వారు ఎవరైనా కావచ్చు. పత్రికల్లో ఏ రోజు చూసినా బంగారు తాకట్టు సంస్దల వేలం వార్తలు కనిపిస్తాయి. ఒక నాడు ఆర్ధిక భరోసా లేదా భద్రతగా భావించి కూడపెట్టుకున్న బంగారాన్ని ఒకసారి తాకట్టు పెట్టిన తరువాత విడిపించుకోవటం పెద్ద సమస్యగా మారుతోంది ఇప్పుడు. ముత్తూట్ ఫైనాన్స్ వంటి బంగారం తాకట్టు కంపెనీలు గత ఏడాది 21శాతం లాభాలు సంపాదించాయి. ఈ ఏడాది తాకట్టు రుణాలు 15శాతం పెరిగే అవకాశా లున్నట్లు అంచనా.
గృహ రుణాల్లో వినిమయ వస్తువుల కోసం చేసిన వాటి నుంచి అనేక రకాలు ఉంటాయి.2020లో జిడిపిలో ఈ అప్పు 12.6శాతం ఉంటే 2021 మార్చి నాటికి 14.5శాతానికి పెరిగింది. ఈ కాలంలో జనాలు విలాసవస్తువుల జోలికి పోలే దన్నది అందరికీ తెలిసిందే. 1999లో ఇదికేవలం 2.2 శాతమే ఉంది. ఆ తరువాత జనాలతో అప్పులు చేయించి వస్తువుల కొనుగోలుకు ప్రోత్సహించిన అంశం తెలిసిందే.ఇదే కాలంలో కార్పొరేట్‌శక్తులు విద్య, వైద్యరంగాల్లో పెద్దఎత్తున విస్తరించటం, ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేసిన కారణంగా రుణగ్రస్త అంశాల్లో ఇవి కూడా ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. 2021 మార్చినాటికి గృహరుణ భారం 393 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. మన కరెన్సీలో దాదాపు 30లక్షల కోట్లరూపాయలు. కేంద్రప్రభుత్వ ఎన్‌ఎస్‌ఓ సమాచారం ప్రకారం గ్రామీణకుటుంబాల సగటు అప్పు 201218 సంవత్సరాలలో 84, పట్టణాలలో 42శాతం చొప్పున పెరిగింది. 2021ఐసిఇ 360 సర్వే ప్రకారం 2015
16 నుంచి 2020`21తో పోలిస్తే దేశంలో దిగువన ఉన్న 20 పేదగృహస్తుల ఆదాయం 53శాతంతగ్గితే ఇదే కాలంలో 20శాతం ధనికులకు 39శాతం పెరిగింది. ఈ కాలమంతా నరేంద్రమోదీ అమలుచేసిన విధానాలే ఇందుకు కారణం.