Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

మోసాలతో అదానీ గ్రూపు లూటీ

డాక్టర్‌ సోమ మర్ల

ప్రపంచ కుబేరుల్లో రెండవ పెద్ద సంపన్నుడిగా ప్రకటితమైన గౌతమ్‌ అదానీ స్థాపించిన గ్రూపు అనేకరకాల మోసాలకు పాల్పడిరదని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ ఆర్థిక పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడిరచిన అంశాలు నివ్వెరపరచాయి. ఈ వార్త ప్రపంచమంతటా ప్రకంపనలు పుట్టించింది. 2022 సెప్టెంబరులో ప్రపంచ ఆర్థిక దినపత్రిక ‘ఫోర్బ్స్‌’ అదానీ రెండవ అతిపెద్ద సంపన్నుడని ప్రకటించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తదితరాల నుంచి అదానీ గ్రూపు పెద్దఎత్తున రుణాలు తీసుకున్నది. ఎకౌంట్లు చూపడంలో మోసాలు, స్టాక్‌ మార్కెట్‌లో అక్రమాలకు పాల్పడినట్లుగా హిండెన్‌బర్గ్‌ 2023 జనవరి 31వ తేదీ ఉదయం ప్రకటించింది. 155.5 బిలియన్‌ డాలర్ల సంపన్నుడు అదానీ అని పోర్బ్స్‌ తెలిపింది. ఈ సంస్థ మోసాలన్నీ బట్టబయలైనతర్వాత రెండు రోజుల్లో స్టాక్‌ మార్కెట్లు ఇతర విధాలుగా సంస్థ 5.2లక్షల కోట్ల రూపాయలు(65 బిలియన్‌ డాలర్లు) నష్ట పోయింది. శుక్రవారంనాటికి నష్టాలు 8లక్షలకుపైగా ఉన్నాయని వార్తలు. దాదాపు 160పేజీల హిండెన్‌బర్గ్‌ నివేదిక అనేక లోతు అంశాలను వెల్లడిరచింది.
మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా ప్రైవేటీకరణ ద్వారా అనేక ప్రభుత్వ ఆస్తులను అదానీ గ్రూపుకి కట్టబెట్టింది. ఓడరేవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, బొగ్గు దిగుమతులు, విద్యుత్‌ ప్లాంట్‌లు, సిమెంట్‌ కంపెనీలు గ్యాస్‌, సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు వంటికీలకమైన వాటిని అదానీకి కట్టబెట్టారు. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ తదితర ప్రభుత్వ ఆర్థిక సంస్థలనుంచి భారీ మొత్తాలను అదానీ గ్రూపుకి చాలా ఉదారంగా రుణాలరూపంలో అందించి దేశసంపద లూటీచేసేందుకు సహకరించారు. వీటిని కట్టబెట్టడం కూడా పోటీలేకుండా ఒకే టెండర్‌ను ఆధారంచేసుకుని అతి తక్కువ ధరలకు అదానీకి ఇచ్చేశారు. ఎలాంటి సెక్యూరిటీ, హామీలు లేకుండానే అదానీ గ్రూపుకు ఏర్పడిన ‘సద్భావన’ పైన మాత్రమే చాలా ఉదారంగా వేలాది కోట్ల రూపాయల రుణాలనుఇచ్చేశాయి. ఆశ్రిత పెట్టుబడీదారుడైన అదానీకి, భారత ప్రభుత్వానికి మధ్య పెనవేసుకుపోయిన బంధాన్ని ఈ కుంభకోణం తెలియజేస్తున్నది. స్వయం ఉపాధికోసం రుణం తీసుకునే చిన్న పారిశ్రామిక వేత్తలు, లేదా రైతులకు అదానీకి ఇచ్చినంత ప్రాధాన్యతను మనం ఊహించగలమా?
పెద్దఎత్తున జరిగిన ఈ మోసం దేశ ఆర్థికవ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టే అవకాశాలున్నాయి. మీడియా వార్తలప్రకారం, ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, తదితర ఆర్థిక సంస్థలు అదానీ గ్రూపు ప్రాజెక్టులకు నిధులను అందచేసి వేలాదికోట్ల రూపాయలు నష్టపోయాయి. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం, అదానీ గ్రూపుకి 2లక్షల కోట్ల అప్పులున్నాయి. ఇందులో మన ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ లాంటి ఆర్థికసంస్థలు, ఎస్‌బీఐ ఇచ్చిన రుణాలు మొత్తం అప్పుల్లో 40శాతం ఉన్నాయి. నిజ విలువకంటే అత్యధిక రేట్లకు స్టాక్‌ మార్కెట్‌లలో అదానీ షేర్లను ఎల్‌ఐసీ ఒక్కటే 77వేలకోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. జనవరి 30వ తేదీ నాటికి ఈ సంస్థ 23,500కోట్ల రూపాయలను నష్టపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటుబ్యాంకుల వలెనే అదానీ గ్రూపుకి రెండుసార్లు రుణాలిచ్చాయి. కష్టపడి డిపాజిట్ల రూపంలో పొదుపుచేసుకున్న మిలియన్ల మంది భారతీయులు తీవ్ర రిస్క్‌ను ఎదుర్కొంటున్నారు. ఇంతకల్లోలం జరిగినప్పటికీ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల్లో కొద్దివాటికి మాత్రమే అదానీ గ్రూపు సమాధానమిచ్చింది. అభివృద్ధిచెందుతున్న భారతదేశంపై దుష్టప్రచారం చేసేందుకే హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిందని ఇదంతా ఒట్టిదని అదానీ గ్రూపు వాదిస్తుంది. జాతీయవాదం ముసుగు కింద తీవ్రమైన మోసాన్ని తేలికజేసి మాట్లాడేందుకు అదానీ ప్రయత్నిస్తున్నారు.
ఆశ్రిత పెట్టుబడిదారు వ్యవస్థతో బీజేపీ బంధం
అదానీ సంపద నీటి బుడగ ఒక్కసారిగా పేలిపోయింది. ఆర్థిక అంచనాలు, స్టాక్‌ మార్కెట్‌లో ప్రభుత్వ సంపదను, బ్యాంకుల నిధులను పెట్టి వ్యాపారంచేసి అదానీ సంపదను పెంచారు. 2001లో అదానీ అంబానీతో పోలిస్తే చిన్న వ్యాపారి. ఆనాడు అదానీ కంటే అంబానీ 500 రెట్లు ఎక్కువ సంపదపరుడు. ఆనాటినుంచీ మోదీ సహాయంతో అదానీ అతి పెద్ద కార్పొరేట్‌ కుబేరుడయ్యాడు. కాలేజీలో చదువు మధ్యలో ఆపేశాడు. 1980లలో వస్తు వ్యాపారాన్ని ప్రారంభించాడు. 1990లలో సరళీకరణ, ప్రపంచీకరణ రాజ్యం అవతరించడంతో 1995లో అదానీ ముంద్రా పోర్టును స్థాపించాడు. 2002లో అదానీ ప్రధాన హోల్డింగ్‌ కంపెనీ విలువ 70 మిలియన్‌ డాలర్లు. దశాబ్ది కాలంలో ఆయన సంపద 20వేల మిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. అంటే 300 రెట్లు సంపద పెరిగింది. కార్పొరేట్‌ చరిత్రలో ఇంత వేగంగా పెరిగిన దాఖలా గతంలో లేదని ఫోర్బ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఎనిమిదేళ్ల కాలంలో కార్పొరేట్‌`మోదీ నాయకత్వంలోని కాషాయ ప్రభుత్వం వల్ల అదానీ సంపద 800శాతం పెరిగింది. 2019లో ఆరు విమానాశ్రయాలను ప్రభుత్వం ప్రైవేటీకరించగా వాటన్నింటినీ అదానీ గ్రూపు స్వాయత్తం చేసుకుంది. గతంలో ఏ మాత్రం అనుభవంలేని అదానీ కంపెనీకి మోదీ ప్రభుత్వం వీటిని కట్టబెట్టింది. ఒక వ్యాపారాన్ని ఆధారం చేసుకుని మరో వ్యాపారానికి అదానీ తన అర్థిక వనరులను కొత్త కంపెనీలకు విస్తరించడానికి బ్యాంకులు సహకరించాయి. గుజరాత్‌ ముంద్రాలో ప్రత్యేక ఆర్థిక జోన్‌, ఒక ఓడరేవును ఏర్పాటుచేశాడు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద వ్యాపార కేంద్రం. ఈ జోన్‌లో బొగ్గు మొదలు ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీ ఏర్పాటువరకు ఉన్నాయి. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తివైపు ఎక్కువగా కేంద్రీకరించారు. ఇందులో భాగంగా అదానీ గ్రీన్స్‌ను ప్రభుత్వంతో కలిసి ఏర్పాటుచేశారు. కర్బనపు వాయువులు విడుదలకాని ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇక్కడే బొగ్గు వినియోగ విద్యుత్తు ప్లాంటు నెలకొల్పారు. ఈ విషయంలో ఫ్రాన్స్‌ సంస్థ టోటల్‌ ఎనర్జీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాడు. గ్రీన్‌ హైడ్రోజన్‌ను 20 బిలియన్‌ డాలర్లతో ఉత్పత్తి చేయాలన్నదే లక్ష్యం. ఎన్‌డీటీవీలో భారీ వాటాలను దక్కించుకున్నాడు. తద్వారా ఉదారమైన జర్నలిజాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను హరించడానికి పూనుకున్నారు. ఆశ్రిత పెట్టుబడీదారీ విధానాన్ని మరింత బలోపేతంచేశారు. మోదీ ప్రభుత్వం అత్యంత మితవాద విధానాలను అమలు చేసిన ప్రధాని మోదీ, అదానితో ఉన్న అనుబంధంవల్ల ఆర్థిక కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. భూములు, సహజ, ఖనిజ వనరులు, ఫ్యాక్టరీలు తదితరాలను అతిచౌకగా స్వాధీనం చేసుకోగలిగారు. ఆయన ఏరోజూ ఉత్పత్తిరంగంలోకి ప్రవేశించలేదు. ఆయన తీసుకున్న రుణాలన్నీ నకిలీ కంపెనీలలోనూ ఊహాజనిత స్టాక్‌మార్కెట్‌ వాణిజ్యంలోనూ పెట్టుబడిగా పెట్టారు. అనుత్పాదిక పెట్టుబడులను పెట్టడంద్వారా చాలా వేగంగా ధనాన్ని సంపాదించగలిగారు. అయితే ఇదంతా గాలిబుడగలాగా పేలిపోయింది. అదానీకి అప్పులిచ్చిన ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, తదితర సంస్థలు భారీగా నష్టపోయాయి. ఆర్థికంగా కుదేలైపోయి దేశసంపదను కొల్లగొట్టడానికి వెనుక మోదీ అండలేదని చెప్పగలరా? చిన్నచిన్న డిపాజిట్‌ దారులు కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఆయనను ఆదుకునేందుకు ప్రభుత్వ ధనాగారం నుంచి ఉద్దీపన నిధులను అందించరాదు. ఉద్దీపనలు ప్రకటించి ఆశ్రిత పెట్టుబడీదారీ సంక్షోభం నుంచి ి కార్పొరేట్లను రక్షించడానికి ప్రయత్నం చేయరాదు. ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాదాన్ని, ప్రైవేటీకరణను, ప్రభుత్వ ఆస్థులను నామక: ధరలకు పెట్టుబడుదారులకు కట్టబెట్టకుండా నిరోధించడానికి ట్రేడ్‌ యూనియన్‌ ప్రజలు ఉద్యమాలు చేయాలి. ఇలాంటి లూటీలతో ఆర్థిక సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి కార్పొరేట్ల వల్ల దేశప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశాన్ని నివారించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img