Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

యదార్థవాది శ్రేయోభిలాషి, అబద్ధాలకోరు లోక విరోధి

డాక్టర్‌ దేవరాజు మహారాజు

‘‘ఏం జరుగుతుందో బిగ్గరగా చెప్పడమే ఎవరైనా, ఎప్పుడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన పని.’’ మార్క్సిస్టు సిద్ధాంతకర్త, మేడమ్‌ రోజా లగ్జెంబర్గ్‌. పోరాట యోధులకు, దేశద్రోహులకు తేడా ఈ విధంగా ఉంటుంది. భగత్‌సింగ్‌ బ్రిటీష్‌పై తిరుగుబాటు చేసినందుకు ఇరవైమూడేళ్ల వయసులో ఉరిశిక్షకు గురయ్యాడు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ కూడా బ్రిటీష్‌వారిపై తిరుగుబాటుచేసిన వాడే. కానీ, శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక ఇరవైఐదేళ్ల వయసులో పిస్తోలు తన కణతలకు గురిపెట్టి కాల్చుకున్నాడు. పోరాట యోధులకు, ఉద్యమకారులకు ఇప్పటికీ వీరు స్పూర్తి దాయకులే! ఇక సావర్కర్‌ ఏం చేశాడన్నది ప్రపంచానికి తెలుసు. క్షమాబిక్ష పిటిషన్లు రాసిరాసి, బ్రిటీష్‌వారికి లొంగిపోయిన దేశద్రోహి సావర్కర్‌, ఇక ఆ రోజుల్లో మహ్మద్‌ అలీ జిన్నాతో చేతులు కలిపి, స్వాతంత్య్రోద్యమాన్ని నీరుగార్చడానికి, బ్రిటీష్‌ వారికి సహకరించిన దేశద్రోహి శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ! యోధులకు, ద్రోహులకు తేడా తెలుసుకోవాలంటే, ఈ నలుగురి జీవిత చరిత్రలు తెలుసుకుంటే చాలు! ఇక గోల్వాల్కర్‌ ఏమన్నాడో చూడండి. ‘‘హిందుస్తాన్‌లోఉన్న విదేశీ జాతులు వారంతా హిందూ సంస్కృతిని, భాషను అవలంబించాలి! హిందూ మతంపై గొప్ప భక్తి శ్రద్ధలను కలిగిఉండాలి. దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. హిందూజాతిని కీర్తించడం తప్ప, వారు మరొక భావజాలాన్ని కలిగిఉండకూడదు. వారు, వారి ప్రత్యేకమైన ఉనికిని వదులుకుని, హిందూ జాతిలో కలిసిపోవాలి. లేదా దేశంలో ఉంటే హిందూ జాతికి పూర్తి బానిసలుగా ఉండాలి. దేనినీ తమదిగా ప్రకటించుకోరాదు. వారికి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలూ ఉండగూడదు. పౌరహక్కులు సైతం ఉండగూడదు అని స్పష్టంగా రాశారు గోల్వాల్కర్‌. ‘‘అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్డ్‌’’ అనే గ్రంధంలో ఈయన ఆర్‌ఎస్‌ఎస్‌కు రెండో గురువు. అర్‌ఎస్‌ఎస్‌ స్థాపించింది హెడ్గేవార్‌ అయినప్పటికీ, గోల్వాల్కర్‌ నేతృత్వంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం బాగా వ్యాప్తిచెందింది. ఆ రోజుల్లో జర్మన్‌ జాతిప్రతిష్ట విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ జాతి స్వచ్ఛతను, సంస్కృతిని కాపాడుకోవడానికి తమ దేశాన్ని యూదులు లేని దేశంగా(సెమిటిక్‌) శుభ్రపరచుకోవాలని అనుకున్నారు. దీనినే ఆర్‌ఎస్‌ఎస్‌ భారతదేశంలో అమలు చేయాలని యూదులపై హత్యాకాండ జరిపించిన హిట్లర్‌ను, జర్మనీని గోల్వాల్కర్‌ కీర్తించాడు. ప్రపంచమంతా జర్మనీని ఫాసిస్టు దేశంగా, హిట్లర్‌ను ఫాసిస్టు నియంతగా తిట్టిపోస్తుంటే ఇక్కడ గోల్వాల్కర్‌ మాత్రం యూదుజాతి లేకుండా జర్మనీ తననుతాను శుభ్రపరచుకుందని కీర్తించాడు. ఆ విధంగా ఆ దేశం కల్తీలేని స్వచ్ఛమైన జాతిగా ఆవిర్భవించిందని ప్రశంసించాడు. అదే జర్మనీ ఫార్ములాను భారతదేశంలో అమలుచేయాలని కలలుగన్నాడు. భారతదేశంలో స్వచ్ఛమైన హిందూజాతిని మాత్రమే మిగుల్చుకుని, మిగతావారిని ఇక్కడినుండి తరిమేయాలని పథకాలు, కుట్రలు సిద్ధం చేసుకున్నారు. గోల్వాల్కర్‌ వారసులు 2002లో గుజరాత్‌లో సృష్టించిన అల్లర్లను తాజాగా గుర్తుచేసుకోవచ్చు. గోద్రాలో రైలు తగలబెట్టి, వేలమంది మరణానికి కారణమైన ఆ నరమేథాన్ని ఎలా మరవగలం? గుజరాత్‌లో ముస్లింలపై సాగించిన హత్యాకాండ, వేలమందిని గాయాల పాలుచేసిన వికృతచేష్ట ఆర్‌ఎస్‌ఎస్‌ వారిదే కదా? వారి భావజాలానికి గుజరాత్‌ను ఒక ప్రయోగశాలగా చేసుకున్నారు. మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీలు ఒకప్పటి ఫాసిస్టు జర్మనీని ఇప్పటికీ అనుసరిస్తున్నాయి. అధిక సంఖ్యాకులైన ఈ దేశ ప్రజల అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. మరీ ముఖ్యంగా సమకాలీన భారతదేశపు యువతీయువకుల అభిప్రాయం లౌకిక తత్వంవైపు ఉంది. ఎందుకంటే ఈ భారతదేశం ఒక లౌకికదేశం. ఇక్కడ లౌకిక వాదులే ఉండాలని యువతరం ఆశిస్తోంది. ఈ దేశంలోని హిందూ మతతత్వవాదులు వారికి ఇష్టమైతే నేపాల్‌ వెళ్లిబతకొచ్చు. అది హిందూ దేశ గనక వారికి అక్కడ ఇబ్బందులు ఉండవు. అలాగే ముస్లిం మతతత్వవాదులు పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ లాంటి షరియత్‌ దేశాలకు వెళ్లి బతకొచ్చు. అవి ముస్లిం దేశాలుగనక, వారికి అక్కడ ఇబ్బందులు ఉండవు. అప్పుడు ఈ దేశంలో మిగిలిన లౌకికవాద ప్రజలకు సమస్యలుండవు. అలాకాకుండా, అందరూ లౌకికవాదాన్ని బలపరిచేవారైతే అందరూ నిరభ్యంతరంగా ఈ దేశంలోనే ఉండొచ్చుఎవరూ ఎక్కడికీ వెళ్లనక్కరలేదు అనేది దేశంలోని లౌకికవాదుల భావన! ఈ దేశ వాసులను దేశంవిడిచి వెళ్లమనే హక్కు ఎవడూ ఎవడికీ ఇవ్వలేదు. అయితే లౌకివాద మూలసూత్రాలు అర్థంకాని మూర్ఖులు ఎవరికివారే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలనే వాదన ఇప్పుడు బలపడుతూ ఉంది. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌విశ్వ హిందూ పరిషత్‌ పుట్టుకొచ్చి కనీసం వందేళ్లయినా కూడా కాలేదు. మరి అంతకుముందు దేశంలో హిందువులు లేరా?’’ అని చత్తీస్‌ఘర్‌ ముఖ్యమంత్రి భూపేష్‌బఘేల్‌ ప్రశ్నించారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ ఎక్కడినుండి వచ్చింది! వారు ఆరాధించే దేవుడూ దేవతా ఎవరూ? అని నిలదీశారు. హింస, గుండాగిరి, మన దేశ సంస్కృతి కాదని చెపుతూ మహాత్మాగాంధీని పొట్టన పెట్టుకుంది ఆ సంస్థేనని గుర్తు చేశారు. ‘‘మనుషుల్ని జంతువులకన్నా హీనంగా చూసేవారు ఈ సంస్థ సభ్యులే’’ అని దుయ్యబట్టారు. ఆయన అన్నదాంట్లో అబద్దాలేమీ లేవు. యదార్థవాది లోకవిరోధి అనే మాటను మార్చుకోవాల్సి ఉంది. యదార్థవాదే లోకానికి శ్రేయోభిలాషి. అబద్దాలు చెప్పేవాడే లోకవిరోధి. అంటే లోకానికి కీడుచేసేవాడు. ఉదాహరణకు మాతా కల్కి శివజ్యోతి ప్రకటనను గమనించండి. ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ నాయకులు వారి అనుయాయులు జనాన్ని ఎలా రెచ్చగొట్టగలరో ప్రతి నిత్యం మీడియాలో చూస్తున్నాం. ‘‘ఒక అమ్మాయి రేప్‌కు గురైందంటే, అది ఆమె ఖర్మ ఫలితం! గత జన్మలో ఆమె పురుషుడిగా ఉన్నప్పుడు అన్యాయంగా అక్రమంగా ఏ అమ్మాయినో రేప్‌చేసి ఉంటుంది. దాని ఫలితమే ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తుంది’’ అనే ఒక తుక్కు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అయితే దైవభక్తి పరులే ఇంతటి మూర్ఖజ్ఞానాన్ని జనానికి ప్రసాదించగలరు.
విశ్వహిందూపరిషత్‌, బజ్‌రంగ్‌దళ్‌లకు మన భారతీయ స్టాండ్‌అప్‌ కమేడియన్‌ కునాల్‌కబ్రా లేఖ రాశాడు. ‘‘నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీ మనోభావాలు దెబ్బతింటాయి. మీరు నిజంగా భరతమాత బిడ్డలైతే ‘‘గాడ్సే ముర్దాబాద్‌’’ అని నినదించడండి. చూద్దాం! అలా చేయలేకపోతే మిమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా, ఉగ్రవాదులగా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితిని గమనించే ఉర్దూకవి అక్బర్‌ అలహాబాదీ అంటారు. ‘‘ఆప్‌ భి కర్‌తే హై/తో హూెెజాతేహై బద్‌నామ్‌) ఓ కత్ల్‌ భి కర్‌తాహై/తో చర్చా నహీ హోతీ’’ అని. మేం వేదన ప్రకటిస్తేనే నిందకు గురిఅవుతాం. అదేమిటో వాడు హత్యచేసినా అది చర్చకేరాదు అన్నది ఆ చరణాల సారాంశం. అధికారాన్ని దుర్వి నియోగం చేసేవారు ఉన్నంతకాలం, నిజాయితీ పరులైన సామాన్య జనానికి బాధలు తప్పవు. జేబులు కత్తిరిస్తూ చిన్న చిన్న దొంగతనాలు చేసిన వారి ఫొటోలు పోలీస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌లలో పెడతారు. మరి కోట్లకు కోట్లు బ్యాంకురుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్‌ దొంగల ఫొటోలు అన్ని బ్యాంకుల దగ్గరపెట్టాలికదా? మన దేశప్రధాని ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు. ఆ దొంగలు విదేశాల్లో విలాసవంతంగా /జీవిస్తున్నారంటే వారికి సహకరిస్తున్న ప్రభుత్వ దొంగలెవరో కూడా సామాన్యజనానికి తెలియాలి కదా?
హిజాబ్‌(తలపై కప్పుకునే గుడ్డ) ధరించడం, ధరించకపోవడం ఆయా మహిళలఇష్టం. ఇరాన్‌లో హిజాబ్‌ వద్దంటున్నారు. మన కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్‌ కావాలంటున్నారు.అలాగే బీచ్‌లో బికినీ ఎందుకువేస్తారు? చలి దేశాలలో ఎండ ఎప్పుడోగాని రాదు. శరీరానికి ఎండ తగిలి విటమిన్‌ డి అందుతుందని బికినీ వేస్తారు. అది వేసుకునేవారి ఇష్టం. అమెరికాలోని మియామీ బీచ్‌లో స్త్రీపురుషులు నగ్నంగా తిరుగుతారు. అది ప్రకృతిలో ఏకం కావడంగా వారు భావిస్తారు. అది అక్కడి ప్రజలఇష్టం! మన దేశంలో కూడా జైనుల్లో రెండు శాఖలున్నాయి. దిగంబరులుశ్వేతాంబరులు అని. అయితే గౌతమ బుద్ధుడు దిగంబర పద్ధతిని వద్దనిఅన్నాడు. ఆయనకాలంలో ఆ పద్ధతి చాలా వరకు తగ్గింది. ఇప్పటికీ జైనమత గురువులు కొందరు నగ్నంగానే తిరుగుతారు. దేశ ప్రధాని మోదీతో పాటు, ఆయన అనుచర గణమంతా ఆ నగ్నస్వాముల ముందుసాగిల పడుతుంటారు. వీరికి డ్రెస్‌ కోడ్‌ వర్తించదా? కర్ణాటకలోని బీజేపీప్రభుత్వం 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఒక అసంబద్ధమైన అంశం ప్రచురించారు. పిల్లలకు బోధిస్తున్నారు. విషయం ఏమంటే సావర్కర్‌ అందమాన్‌ సెల్యులార్‌ జైలులో ఉండగా మాతృభూమిని చూడాలని అనిపించినప్పుడల్లా అక్కడ ఉండే బుల్‌బుల్‌ పక్షుల రెక్కల మీద కూర్చుని భారతదేశం వచ్చేవాడట. దేశాన్ని కళ్లారా చూసుకుని మళ్లీ వెనక్కి వెళ్లిపోయేవాడట. చరిత్రను పురాణంగా, పురాణాన్ని చరిత్రగామలిచే తెలివితేటలు అదేమిటో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలకే ఉంటాయి. ఆ పాఠం చదువుకుంటున్న బాలబాలికల పరిస్థితి ఏమిటీ? రేపువారు నిజం తెలుసుకుని కల్పించిన అబద్దాలను పాఠ్యాంశాలుగా ఎందుకుపెట్టారని నిలదీస్తే ప్రభుత్వ పెద్దలుఎక్కడ దాక్కుంటారు? అయినా జైలునుండి బైటపడి పక్షి రెక్కలమీద ఇండియా రాగలిగినవాడు ఇక్కడే ఉండి పోవచ్చుగదా? క్షమాపణలు కోరుతూ బ్రిటీష్‌వారి కాళ్ల మీద ఎందుకు పడ్డాడూ?
అయినా వారిని అని ఏమీ లాభంలేదు. సంసారం ఎలా నడపాలో సన్యాసిని అడిగే అలవాటు మన దేశ ప్రజలది. అందుకే చూడండి ఇల్లూ ముంగిలీలేని, బాధ్యత తెలుసుకోని సన్నాసులకు అధికారం కట్టబెడు తున్నారు. ప్రజలే తప్పు తెలుసుకోవలసి ఉంది.
కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img