చింతపట్ల సుదర్శన్
ఆకాశంలో నల్లమబ్బులు ఒక దానితో ఒకటి కుస్తీ పడుతున్నాయి. రూపాయి బిళ్లలు భూమ్మీద చిల్లులు పొడుస్తున్నాయి. నీటి కొరడాల చప్పుడు ఆగకుండా వినిపిస్తున్నది. అప్పుడప్పుడు మెరుపు ఒకటి తను అక్కడ ఉన్నానని కనిపించిపోతున్నది. ఛస్తార్రా పక్కకు తప్పుకోండి అంటూ క్రిందపడటానికి ముందు ‘హెచ్చరిక’ చేస్తున్నాయి పిడుగులు. ఇలా ఇంటర్వెల్ లేకుండా కురుస్తుంటే రోడ్డు ఎక్కడానికిలేదు. ఆకలికి ఆ సంగతి తెలీక ‘ఆగం’చేస్తున్నది అంది డాగీ. డ్రమ్ములాంటిపొట్ట ఖాళీగా ఉండటంతో ప్రేవులు అరిచి గీపెడ్తున్నవి అంది డాంకీ. కూలిన కొంపలో ఉన్నాం కనక కొంపకూలుతుందన్న భయంలేదు కానీ కూలే కొంపల్లో, కాలే కడుపుల్తో మనుషులుపాపం ఎలాఉన్నారో అని డాంకీ అంటే వాళ్లకేంలే ఏలే వారున్నారు. హెలికాప్టర్లనుంచి అన్నం పొట్లాలు విసిరెయ్యకపోరు. ఓట్లు వేసేవారు అవెయ్యడానికి చచ్చినట్టు బ్రతికుండాలి కదా. వానలుపడి రోడ్లు కొట్టుకుపోయి ఇళ్లుకూలి జనంభోరున ఏడుస్తుంటేనేకదా వారికి సేవ చేసుకునే లక్కీఛాన్సు దొరుకుతుంది లీడర్లకు అటూ లేచి నిలబడిరది డాగీ.
ఓ మనిషి ఆదారంట వస్తున్నాడు. ఓ చేతిలో గొడుగుంది మరో చేతిలో ఏదోకవరుంది. అరుగుమీది నుంచి కిందకి ‘జంపు’ చేసి ఆ మనిషి చేతిలో ఉన్న కవరును అందుకుని అరుగెక్కింది డాగీ. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. కుక్క తన పిక్క పట్టుకోనందుకు సంతోషిస్తూ, కవరు పోయినందుకు చింతిస్తూ పరుగు తీశాడు మనిషి. ఏమిటి నువ్వు చేసిన పని తప్పుకదా అంది కోప్పడుతూ డాంకీ. మనం ఎవరైనా దయతలిచి పెడితే తింటాం కానీ బలవంతంగా లాక్కొని మనుషుల్లా నీతి తప్పి బతకం. కానీ ప్రాణ విత్త మానభంగమని ఏదో అంటారే తప్పనిసరై తప్పే చేశాను. చూడు ఈ కవర్‌లో బ్రెడ్డుంది దీనితో ఈ రోజు గడుస్తుంది. నీకు డబుల్ థమాకా బ్రెడ్డుతో పాటు కవరూ ఆదుకుంటుంది అని డాగీ అంటుంటే అబ్బాయి కనిపించాడు. ఓటు వేశాక ఓటర్ని ఎవర్రా నువ్వు అని అరిచే నాయకుడిలా ఇల్లు దాటిపోతున్నావేం ‘అన్నా’ అంది డాగీ.
వాన తగ్గింది కాని మళ్లీ ఏ క్షణాన్నయినా రావచ్చునని వెళ్లున్నా. సరే కాసేపు ఉండిపోతాలే అంటూ ఆరుగు ఎక్కాడబ్బాయి. ‘వాన రాకడ, పదవి పోకడ’ ఎవరూహించగలరు కాని అల్పపీడనాలూ, వాయుగుండాలూ, పాదయాత్రలు చేసేవాళ్ల పాలిట ప్రతిపక్షాలవుతున్నాయి. ఇన్ని మైళ్లు నడిస్తే అన్ని ఓట్లు పడతాయనే సెంటిమెంటు పాదయాత్రయింది అంది డాంకీ. పాదయాత్రలు చేస్తూ చెవులు పిండుతున్నారు. నిన్న ఒక యువకిశోరం ఇరవై లక్షల ఉద్యోగాలిస్తామన్నాడు అన్నాడబ్బాయి. ఇంకేం నువ్వు ఓ ఉద్యోగివీ ఓ ఇంటోడివీ అయిపోవచ్చు. ఆ తర్వాత మీ ఆవిడకి వచ్చే అమ్మ ఒడితో పిల్లల్ని బడికి పంపవచ్చు అంది డాంకీ. ఇరవై లక్షల మందిలో మనోడుండాలిగా అంది డాగీ. ఉద్యోగంరాకపోతే నిరుద్యోగభృతి ఇస్తానన్నాడుగదా అంది డాంకీ. శుష్కప్రియాలు శూన్యహస్తాలు అనంటారు. మాటల సంతర్పణ ఎన్నికయ్యేదాకే. ఆ తర్వాత ఉద్యోగాలు అటకెక్కును. నిరుద్యోగభృతి హుష్‌కాకవును మసిపూసింది మారేడు కాయని అర్థంచేసు కోలేని వారెవరూ లేరిక్కడ అన్నాడబ్బాయి. అసలీ యాత్రా కథనం ఏమిటో ‘ఫుట్ వాకింగ్’ ట్రెండ్ ‘ట్రెండీ’ ఎందుకయిందో అంది డాగీ. ఒకప్పుడివి ప్రజలకు మేలు చేసినవే. ఉప్పు సత్యాగ్రహంలో మొదలైనవీ యాత్రలు. ఒకాయన భూదానం కోసం కాళ్లు అరిగేట్టు చెప్పు ల్లేకుండా తిరిగాడు. ఆ సందర్భాలు వేరు అవి ఓట్లు దోచుకోవడానికి కాదు అన్నాడు అబ్బాయి.
అవునవును. గుర్తొస్తున్నది. స్వతంత్రదేశంలో ఒక పెద్దాయన రతయాత్ర. ఆయన రథయాత్ర చేసి ‘మతదానం’ చేశాడు. ఒకాయన చైతన్య రథయాత్రసాగించి దారంట గడ్డం గీక్కుని, మరొకాయన పాదాలకు బలపాలు కట్టుకు తిరిగి అనుకున్నది సాధించారు కదా. ఇక పాదయాత్రల పరంపర ‘పరంపరై’ కూచుంది అంది డాంకీ. అవును సుమా! ఒక వనిత, పాదయాత్రతో ముప్పయి మూడేళ్లా! ‘లెఫ్ట్ ఫ్రంట్’ అధికారానికి చెక్ పెట్టింది. కోవిడ్‌ను తరిమి కొట్టడానికి చప్పట్లూ, పళ్లాల మీద గరిటెల గంటలూ ఉపయోగపడకపోవడంతో ఓ పార్టీ వారు జన ఆశీర్వాదయాత్ర సాగించారు అన్నాడు అబ్బాయి.
వెనుకట, సంతానంలేని రాజులు ‘సంతు’ కోసం తీర్థయాత్రలు చేసినట్లు ఇప్పుడు మనవాళ్లు కాళ్లకు బుద్ధిచెప్తున్నారు. జనం సభలకు రావడంలేదని, వాళ్లను లారీల్లో ఎక్కించడానికి బోలెడు డబ్బు ఖర్చవుతున్నదని ప్రజల వద్దకే పాలకులు సత్తుపళ్లెం పట్టుకు వస్తున్నారు. ఎక్కడ చిక్కిన జనానికి అక్కడే మాటల పంచదార పెడ్తున్నారు. అంది డాగీ.
భారత్‌యాత్ర, గుజరాత్ గౌరవ్ యాత్ర, మురుగన్ వేలాయుధం యాత్ర, నర్మదా పరిశ్రమ యాత్ర ఎన్నెన్ని యాత్రలో. యాత్రికులను రాజుల్ని చెయ్యడానికే రాజదండం అందించడానికే కొన్ని ‘యాత్రా స్పెషల్స్’ అన్నాడు అబ్బాయి. వయసుమీరిన బ్రహ్మచారి ఒక సంచారి అదేదో జోడోయాత్ర కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా సాగదీశాడు కదా. అయినా ప్రజలు ఆయన్ని వాళ్ల ఫ్యామిలీ కుర్చీకి జోడిస్తోరో లేదో అన్నది డాంకీ. ప్రజాసమస్యల్ని పట్టించుకోరు. ప్రజలకోసం ఉద్యమించరు. నిమ్మకు నీరెత్తినట్టుండి అల్లా ఉద్దీన్ అద్భుతదీపం చేత్తో పట్టుకు తిరిగేదో పాదయాత్రన్నమాట అన్నాడు అబ్బాయి.
అన్నా మళ్లీ వర్షం వచ్చేట్టుంది. బయల్దేరు. పాదయాత్రచేస్తూ ఇంటికి వెళ్లడం కష్టమవుతుందేమో అంది డాగీ!