Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

రాజకీయ ట్యూషన్‌ సెంటర్‌

‘‘రాయి.. ఒక్కోటి పదేసి సార్లు రాయి’’ కుర్చీలో కూర్చున్న ఓ పెద్దాయన తన కాళ్ల దగ్గర కూర్చున్న 17 సంవత్సరాల కుర్రాడ్ని గదమా యిస్తున్నాడు. ఆ కుర్రాడు ‘‘ మాస్టారు’’ అని వినయంగా రాయడానికి సిద్ధంగా పెన్ను, రూళ్ల బుక్‌ తీసుకున్నాడు. ‘‘బట్టలూడదీసి తంతా’’ ఇది మొదటిది…
‘‘నా కొండెల్లారా…. రోడ్డు మీద పరుగులు పెట్టిస్తా’’ ఇది రెండోది. ‘‘తాట తీస్తాను… ఉతికి రోడ్డు మీద ఆరేస్తా’’ ఇది మూడోది. ఇవన్నీ పదేసిసార్లు తక్కువ కాకుండా రాయాలి. మరో విషయం ఇవన్నీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడాల్సిన మాటలు’’ చాలా వివరంగా చెప్పారు పెద్దాయన. మళ్లీ ఆయనే ‘‘ముఖ్య విషయం గుర్తెట్టుకో. బహిరంగ సభల్లోను, మీ పార్టీ మీటింగుల్లోను ఇవి వాడాలి. సరేనా’’
‘‘అలాగే మాస్టారు. మరి అధికారంలో ఉంటే’’… తన సందేహం వ్యక్తం చేసాడు ఆ కుర్రాడు. ‘‘అదీ చెప్తాను కంగారు పడకు’’ ‘‘నువ్వు బట్టలూడదీస్తే మేం ఊడదీయ లేమా….’’ ఇది అధికార పక్షంలో ఉండగా వాడాల్సిన మాట. అలాగే…. ‘‘తాట తీయడం, ఉతికి ఆరేయడం మాకూ వచ్చురోయ్‌’’ ఇది కూడా పదిసార్లు రాయి’’ ఇలా చెబుతున్న పెద్దాయన మరోమాట కూడా అన్నారు.
‘‘నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఈ విలేకరులు వస్తారు చూడు. అప్పుడు వాళ్లు నిన్ను ‘‘ఫలానా ఆయన మిమ్మల్ని ఇలా తిట్టారు. మీ కామెంట్‌’’ అని గొట్టాలు మూతి దగ్గర పెడతారు. అప్పుడు కూడా ఏం మాట్లాడాలో చెప్తాను. రాసుకో ‘‘ అని చాలా నెమ్మదిగా, కుర్రాడికి బాగా అర్ధమయ్యేలాచెప్పారు పెద్దాయన. మళ్లీ ఆయనే ‘‘ఈ గొట్టాలు ఎక్కువై పోయాయి. ఆళ్లకి తొందరెక్కువ. అందుకని వాటికి దగ్గరగా వెళ్లకు. నీ మీద కోపం ఉన్న ఏ విలేకరో సందులో సందు దొరికిందనుకుని మూతో, ముక్కోపగిలిపోయేలా ఆ గొట్టంతో ఒక్కటిస్తాడు. వెంటనే సారీ సార్‌ అంటా డనుకో…లోలోపలమాత్రం…బోయినాలకి, గిఫ్టులకి ఆళ్లని పిలుత్తావా… ఈ ముష్టి ఖండనలు, ముండనలు అయితే మేం కావాలా అని తెగ సంబరపడిపోతాడు’’ అని జాగ్రత్తలు కూడా చెప్పారు.
‘‘అసలు విషయానికి వద్దాం. ఈ విలేకరులు నువ్వు పిలిచినప్పుడో, లేదూ ఆళ్లే వచ్చినప్పుడో ఇలా మాట్లాడాలి. ఇది కూడా రాసుకో…’’ అన్నారు. ‘‘ఆడా ముసలాడైపోయాడు. రేపో, మాపో అన్నట్లు ఉన్నాడు. ఇక ఆడి కొడుకు’’ అని ఆపారు పెద్దాయన. ‘‘గురువుగారు ఎందుకాపారు’’ అని వినయంగా అడిగాడు కుర్రాడు కమ్‌ శిష్యుడు.
‘‘ఆడికొడుకు అని తిట్టేప్పుడు అది ఏ సీజనో గుర్తెట్టుకుని ఆ కాలంలో వచ్చే కూరగాయలతో తిట్టాలి. అంటే ఆడో మామిడికాయ పప్పు. లేదు టమాటా పప్పు. ఆనపకాయ పప్పు అనాలన్నమాట’’.
అరగంట నుంచి జరుగుతున్న ఈ గురుశిష్యుల సంభాషణలని కాసింత దూరంగా స్తంభానికి ఆనుకుని చేతులు కట్టుకుని వింటున్న ఓ 50 ఏళ్ల పెద్ద మనిషి వీరిద్దరి దగ్గరికి వచ్చాడు. అరమోడ్పు కన్నులతో, ఒకటిన్నర ఆనందభాష్పం నేల రాలుతుండగా గురువు గారికి రెండు చేతులతోను దండం పెట్టి ‘‘మా అబ్బాయి నా వారసుడిగా రాజకీయ ప్రవేశం చేస్తున్న సమయంలో మీలాంటి గురువు దక్కడం నిజంగా నా అదృష్టం. మా నాన్న చేతగాని వాడు. అందుకే నాకోసం ఏ గురువును పెట్టలేదు. ఆయన సర్పంచ్‌గా మరణించాడు. నేను ఎమ్మెల్యేగా కాలం చేస్తాను. నా కొడుకు మాత్రం మీ శిక్షణలో రాటుదేలి కచ్చితంగా మంత్రి అవుతాడు’’ అన్నాడు. ‘‘ఏదో మీ అభిమానం. అయినా…ఈ మాత్రాని కేనా… ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నింటిని ఔపోసన పట్టించేయను. వచ్చే ఏడాదికి మీవాడికి ఓటు హక్కు…..దాని తర్వాత ఆపై ఏడాది వచ్చే ఎన్నికల్లో విజయం, మంత్రి పదవి వచ్చేలా చేయడమే నా లక్ష్యం’’ అన్నారు. తర్వాత మళ్లీ ఆ గురువుగారే… ‘‘మీరు వెళ్తే మిగిలినవి కూడా చెప్తాను. మీరుంటే పిల్లాడు సిగ్గుపడతాడు నే చెప్పే మాటలకి’’ అన్నాడు.
గురువుగారి మాటకి అడ్డొచ్చిన ఎమ్మెల్యేగారు గురువు గారి చెవి దగ్గర తన మూతిని పెట్టి ‘‘వీడు సిగ్గుపడడం కాదండి మాస్టారు. వీడికి ఓటేసిన వాళ్ల సిగ్గు పడేలా వీడిని తయారు చేయాలి’’ అని గుసగుసలాడారు.
‘‘మీ నాన్నగారికి నేనంటే వల్లమాలిన గౌరవం. సరే, ఇప్పుడు హోం వర్క్‌ ఇస్తా. అది రాసుకుని బట్టీ పట్టు. ఈ సూత్రాలు చాలా ఉపయోగపడతాయి’’ అన్నారు గురువుగారు. ‘‘చెప్పండి మాస్టారు’’ అని రాసుకుందుకు హుషారుగా సిద్ధమయ్యాడు శిష్యుడు.
‘‘ముందుగా నువ్వు వేసుకున్నవి కాకుండా అథమపక్షం మూడు జతల చెప్పుల జతలు నీ బ్యాగులో ఉండాలి….’’
ఇక రెండోది…. మరీ ముఖ్యంగా… నువ్వు చాలా పెద్ద నాయకుడివి అయ్యాక చేయాల్సింది…. విలేకరుల సమావేశంలో ఎక్కిళ్లతో… మాట వినపడకుండా ఏడవాలి’’ ‘‘ఏడుపు రాకపోతే ఎలా గురువుగారు’’ అమాయకంగా అడిగాడు శిష్యుడు.
‘‘Gశీశీస ూబవర్‌ఱశీఅ …. అప్పుడేం చేయాలంటే… నువ్వు గెలిస్తే వచ్చే మంత్రి పదవో, ముఖ్యమంత్రి పీఠాన్నో గుర్తు చేసుకో. అంతే వెంటనే ఏడుపొచ్చేస్తుంది’’ అన్నారు గురువు గారు.
ఇంకో కిటుకుందోయ్‌….ఉత్తరాంధ్రలో ఓమంత్రిగారు ఉపయోగిస్తారు. నేను నేర్పుతాను. నువ్వు పెద్దాడివి అయ్యేప్పటికి ఆయన రిటైర్‌ అవుతాడు. ఆయన దగ్గరికి వెళ్లి కాళ్ల మీద పడి నేర్చుకో’’ అంటూ…
చాలా పెద్ద స్కామో….ప్రశ్నాపత్రాలు లీకవడమో వంటివి జరిగితే ఆయన ఇలాంటివే చేస్తాడు’’ అన్నారు. ‘‘ఏం చేస్తారు సారు ఆయన’’ ఉత్సాహంగా అడిగాడు. అంటే మైకులముందు నుల్చుని ‘‘ఉఉఉఉఉఉ…. ఆఆఆఆఆ… ఈఈఈఈఈ…అది. నమస్కారం’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవాలి. ‘‘ఈ ఆఖరిది మాత్రం సూపర్‌ గురువుగారు’’ అంటూ పొగిడాడు శిష్యుడు. ‘‘అన్నట్లు…ఇంకెవరైనా నీలాంటి కుర్రాళ్లు రాజకీయా ల్లోకి వస్తారేమో కనుక్కో…నాలుగుబూతులు వాళ్లకీ నేర్పుతా…నాలుగురాళ్లు వెనకేసుకుంటా’’ అంటూ పంచె పైకి లాక్కుంటూ కుర్చీలోంచి లేచి లాల్చీ జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోయారు పెద్దాయన.
సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img