నంటూ బెనర్జీ
సార్వత్రిక ఎన్నికలకు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వాణిజ్యవేత్తలు, కార్పొరేట్లు ఇచ్చే విరాళాలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని హాని చేస్తాయి. ఎవరు ఇచ్చింది, ఎవరు తీసుకున్నది తెలియకపోతే, నల్లడబ్బు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఫ్రాన్స్ వ్యవస్థ చాలా మేలైనది. ఆ దేశంలో వ్యాపారవేత్తలు, కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడాన్ని నిషేధించారు. విరాళాలు ఇచ్చే కుబేరులు వాళ్ల పేర్లు కూడా చెప్పడంలేదు. భారతదేశంలో కార్పొరేట్లు, నల్ల కుబేరులు రాజకీయ పార్టీలకు అపారంగా విరాళాలు ఇస్తున్నారు. రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉండే రాజకీయ పార్టీలకు ఎన్నికల నిధులను ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నారు. తమ పనులు చేయించుకునేందుకు పెద్ద మొత్తాలలో రాజకీయ పార్టీలకు విరాళాలు గుప్పిస్తున్నారు. మన దేశంలో ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా పరిపాలన చేస్తున్న రాజకీయ పార్టీలకు విరాళాలు 2017 నుంచి ఇవ్వడం ప్రారంభమైంది. విరాళాలు అందుకునే పార్టీలలో బీజేపీకి అత్యధికంగా అంటే కనీసం 75శాతం అందుతున్నాయని ప్రజలకు తెలిసిందే. ఈ విరాళాలను అనుమతించకూడదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో ఇంకా విచారణ జరుగుతోంది. అత్యధికంగా విరాళాలు అందుకున్న పార్టీలు ఓట్ల కొనుగోలుకు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంతమంది ఎంఎల్‌ఏలు లేకపోతే తమకు కావలసిన ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసిన సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యమని అనిపించుకుంటుంది.
దాదాపు అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఆర్థిక పారదర్శకత ఉండడంకోసం చట్టాలు ఉన్నాయి. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో బహుళ రాజకీయ పార్టీలున్నాయి. ఈ పార్టీలు ఎన్నికల ప్రచారంకోసం కోట్ల రూపాయలు విరాళాలు వసూలు చేస్తున్నాయి. అయితే వసూళ్లను వెల్లడిరచడానికి తిరస్కరిస్తున్నాయి. వందలకోట్ల విరాళాలు వసూలుచేసి వాటిని విచ్చలవిడిగా ప్రచారంకోసం వినియోగిస్తున్నాయి. ఈ విరాళాలతో మద్యం కోనుగోలుచేసి ఓటర్లకు పంచుతూ వారిని తాగుబోతులుగా మారుస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రజాస్వామ్య నైతిక సూత్రాలను ఉల్లంఘించి రాజకీయ పార్టీలు రహస్యంగా వసూలు చేయడాన్ని కొందరు అంగీకరిస్తున్నారు. మరికొందరు అంగీకరించడం లేదు. భారతదేశంలో వాస్తవంగా ప్రధాన పార్టీలు, పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి ఎన్నికల కమిషన్ విధించిన షరతుకుమించి ఇష్టం వచ్చినట్లుగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. రాజకీయ జీవితంలో ఆర్థిక పారదర్శకత లేకుండా పోయింది. స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరిగే అవకాశమే లేకుండా పోయింది. 2018లో లోకసభలో రాజకీయ పార్టీలకు విరాళాలు, డోనేషన్లకు సంబంధించి ద్రవ్యబిల్లుగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటినుంచి బడా వాణిజ్యవేత్తలు, కార్పొరేట్లు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడం బాగా విస్తరించింది. కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ, ఎన్నికల బాండ్ల విక్రయం ద్వారా వసూలైన మొత్తంలో నాలుగింట మూడువంతులు పొందుతున్నది. 201920లో ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి 76శాతం విరాళాలు అందాయి. కాంగ్రెస్‌పార్టీకి ఎన్నికల బాండ్లద్వారా 9శాతం మాత్రమే అందింది. 2019
20లో మొత్తం 3355 కోట్ల రూపాయలు వసూలైనట్లు అంచనా. 202122లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పశ్చిమబెంగాల్‌లో 96శాతం వసూలైన మొత్తంలో లభించింది. అంటే టీఎంసీకి 2021
22లో 545.74కోట్లు దక్కింది. టీఎంసీకి కేవలం బాండ్ల ద్వారా 528.14కోట్లు లభించింది. పార్టీకి ఇచ్చే సభ్యత్వం తిరిగి వసూలుచేసే విరాళాలు, ఫీజుల ద్వారా కూడా కొన్ని కోట్లు వసూలు చేశారు.
ఎన్నికల బాండ్లను సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ఇందులో కొన్నిలోపాలు ఉన్నాయని భావించారు. చంద్రచూడ్ అధ్యక్షతన 5గురు సభ్యుల ధర్మాసనం ఎన్నికల బాండ్ల వ్యవహారంపై విచారణ చేస్తున్నది. కార్పొరేట్లు, నల్లకుబేరులు ప్రభుత్వంపై బలమైన పట్టుకలిగిఉండి ఆర్థిక విధానాలను తమకు అనుకూలంగా మార్చేందుకు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ పద్ధతిని అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ అనుసరిస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు పేదప్రజలకు అవసరమైన చట్టాలను లేదా చర్యలను తీసుకోవడం చాలా పరిమితమైంది. ఉచిత రేషన్లలాంటివి మాత్రమే పేదలకోసం ప్రవేశపెడుతున్నారు. అవసరం వచ్చినప్పుడు మన దేశంలో పేదరికంలేదని పాలకులు చెప్పుకుంటారు. ఓట్లు అవసరమయ్యేప్పటికి తాజాగా 80కోట్ల మందికి రేషన్ ఉచితంగా 5ఏళ్లపాటు ఇస్తామని ప్రకటించారు. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం, 2021లో నమోదైన మొత్తం సంపదలో 40.5శాతానికంటే ఎక్కువగా ఒక శాతం మంది వద్ద మాత్రమే సంపద మూలుగుతున్నది. ఇండియాలో ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థలలో ప్రభుత్వ విధానాలన్నీ సంపన్నులకు, తమకు కావలసిన రాజకీయ పార్టీలకు అనుకూలంగా రూపొందిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకునే సంపన్నులు అపారంగా డబ్బును దాచుకుంటున్నారు.