Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు

తాటిపాక మధు

తొందరలోనే మనం అధికారంలోకి వస్తున్నాం.
ఈ ప్రభుత్వంలో మన దళిత బిడ్డలకు రక్షణలేదు.
కనీసం అంబేద్కర్‌ విగ్రహం కూడా పెట్టనివ్వడం లేదు.
మనం అధికారంలోకి రాగానే ఏ ఒక్క దళిత బిడ్డకు అన్యాయం జరగదు.
దళిత సంక్షేమమే మన ప్రభుత్వ లక్ష్యం.

ఈ వ్యాఖ్యలు 2018 సంవత్సరంలో ప్రతిపక్షపార్టీ నాయకుడిగా రాష్ట్రంలో నిర్వహించిన పాదయాత్రలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్న మాటలు. నాడు ప్రతిపక్షనేతగా చేసిన వ్యాఖ్యలకు నేడు జరుగుతున్న వాటికి సంబంధమేలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు లెక్కలేని దాడులు దళితులు, మైనారిటీలపై జరుగుతూనేఉన్నాయి. దళిత వ్యవసాయ కూలి నుంచి వైద్యులు, న్యాయవాదులు వరకూ వైకాపా ప్రభుత్వంలో దాడులు, హత్యలకు బలైపోతూనేఉన్నారు. గత ప్రభుత్వం కన్నా ప్రస్తుత ప్రభుత్వంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులు, హత్యలు నాలుగుశాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉంది. ప్రశ్నించడమే పాపమన్నట్లు దాడులకు తెగబడుతున్నారు. కొన్ని చోట్ల హత్యలకు పాల్పడుతుండగా, మరికొన్నిచోట్ల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారపార్టీ నేతలు అక్రమాకు పాల్పడుతున్నారు. ఏకంగా ఎస్సీలపై ఆట్రాసిటీ కేసులు పెడుతున్న విచిత్ర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవు తుందో అర్థంకావటంలేదని ఎమ్మెల్యేగాఉన్న తానే ఏపీలో అడుగు పెట్టాలంటే భయపడుతున్నానని ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేసారంటే రాష్ట్రంలో పరిస్థితి¸ ఎలా ఉందో అర్థంచేసుకోండి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలంలో అధికారపార్టీ ఇసుక దోపిడీని ప్రశ్నిస్తున్నాడనే నెపంతో ఇండుగపల్లి వరప్రసాద్‌ అనే దళిత యువకుడిని పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారపార్టీకి చెందిన నేతలు అరెస్టు చేయించి పోలీస్‌స్టేషన్‌లోనే శిరోముండనం చేయించారు. ఈ దారుణానికి పాల్పడిన ఎఎస్‌ఐ, కొందరు కానిస్టేబుల్స్‌పైన ప్రోత్సహించిన అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులపై నేటికి చర్యలు తీసుకున్న దాఖలాలులేవు. అలాగే కాకినాడలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ తనవద్ద డ్రైవర్‌గా పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్యచేసి డోర్‌ డెలివరీ చేసిన సంఘటన చూశాము. కరోనా ఎక్కువగా ఉన్న సమయంలో మాస్కులు లేకుండా వైద్యం ఎలాచేయాలి అన్నందుకు డాక్టరును పోలీసులు చేతులు, కాళ్ళు కట్టేసి లాఠీలతో చిత్ర హింసలకు గురిచేసి ఆఖరికి ఆయనను పిచ్చోడినిచేసి పిచ్చాసుపత్రిలో చేర్చగా ఆయన మానసికంగా కుంగిపోయి ఆఖరుకు చనిపోయాడు. ఈ దారుణానికి వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత. మాస్క్‌ పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారంటూ దళిత యువకుడు కిరణ్‌ కుమార్‌ను లాఠీలతో చితకబాది అతని చావుకు కారణమయ్యారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు జిల్లాకు చెందిన దళితుడు, మాజీ న్యాయవాది రామకృష్ణపై అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా హింసించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన పుప్పాల సత్యనారాయణ, ఆయన సోదరుడు గంగాధర్‌నొ పోలీసులు అన్యాయంగా బెదిరించారు. ఆ జిల్లాలో ముగ్గురు దళితులు వైకాపా ఆగడాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన దళిత యువకుడు ఆలపు గిరిష్‌ బాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక మున్సిపల్‌ ఎన్నికల్లో గిరీష్‌ అన్నయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. దీంతో వైసీపీ నాయకుడు ఆ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేసుపెట్టించారు. పోలీసులు వేధింపులవల్ల 14 జిల్లాల్లో 21 మంది దళితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. స్థానిక వైసీపీ నాయకుల అండదండలతో రాష్ట్రంలో 31 ఇళ్ళను కూల్చి వేశారు. ఆ కుటుంబాలన్నీ రోడ్ల పాలయ్యాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని కడప పశువైద్యశాలలో డిడిగా పనిచేస్తున్న దళిత అధికారి చిన్న అచ్చెన్నను ఇలాగే చంపేశారు. అచ్చెన్న కనిపించట్లేదంటూ అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వారం రోజుల క్రితం కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో గ్రామదేవతల జాతర సందర్భంగా చోటుచేసుకున్న గొడవల్లో దళితులపై మరోవర్గం కర్రలు, రాళ్ళతో దాడికి పాల్పడిరది. ఈ ఘటనలో దళిత యువకుడు నడిపల్లి రాము(23) ప్రాణాలు కోల్పోయాడు.
దళిత సంక్షేమంలో కోత : ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత వేలకోట్ల రూపాయలు సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్ళించారు. నవరత్నాల పేరు చెప్పి అనేక సంక్షేమ పథకాలను ఎత్తివేశారు. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం దళితుల పథకాలను మంగళం పాడారు. ప్రైవేటు విద్యాలయాల్లో దళిత పిల్లలు చదువుకోవడానికి బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ ఎత్తివేశారు. భూమి కొనుగోలు పథకానికి నిధులు ఇవ్వడంలేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అంబేద్కర్‌ విదేశీ విద్య పథకం కింద దళిత పిల్లలు ఎవ్వరు వెళ్ళినా వారికి రుణంమంజూరు అయ్యేది. ఇప్పుడు దానికి మంగళం పాడి కొన్ని కళాశాలలకే పరిమితం చేశారు. ఎస్సీ సంక్షేమానికి వచ్చే కేంద్ర నిధులను దారి మళ్ళించి దళితులను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు డిఎస్‌సి లేదు, ఎస్సీ, ఎస్టి బ్యాగ్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడంలేదు. ఎస్సీ కార్పోరేషన్లు మూతపడ్డాయి. ఇప్పటి వరకు 4 జిల్లాల్లో 9 మంది దళిత యువకులను శిరోముండనం చేయించారు. రావులపాలెంలో అంబేద్కర్‌ బొమ్మను చెత్తబుట్టలో ఎందుకు వేశారు అని ప్రశ్నించిన పాపానికి వైపిసి ఎమ్మెల్యే ముక్కుపచ్చలారని 14మంది దళిత బిడ్డలను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్ళి లాఠీఛార్జి చేయించి జైలుకు పంపే ఏర్పాటుచేశారు. శిరో ముండనం చేయించిన తోట త్రిమూర్తులును పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ చేశారు. ఇలా రాష్ట్రంలో ఇది అన్యాయం అని ప్రశ్నించిన ప్రతి దళితులు, దళిత మేధావివర్గంపై దాడి చేసి హత్యలు చేస్తున్నారు. ఇవి కేవలం కొన్ని సంఘటనలకు తార్కాణం మాత్రమే. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించి దళిత, మైనార్టీ, బహుజనులందరూ ఐక్యం అవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశవైఖరిపై దళిత ఆత్మగౌరవ పోరాటయాత్ర చేయాలి.
(దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై నేడు విజయవాడలో రౌండ్‌టేబుల్‌)
వ్యాస రచయిత సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img