Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

రేపిస్టులకు స్వేచ్ఛ హోంశాఖ ‘పుణ్యమే’

అరుణ్‌ శ్రీవాస్తవ

ప్రపంచం ముందు తలవంచుకునే చర్యలు అనేకం నరేంద్రమోదీ పాలనలో జరిగాయి, జరుగుతున్నాయి. గుజరాత్‌లో 2002లో జరిగిన సామూహిక మారణకాండ సందర్భంగా బిల్కిస్‌ బానోపై అత్యాచారానికి పాల్పడి జైలు నుండి విడుదల కావడానికి కేంద్ర హోం శాఖే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సత్యం. జీవితఖైదీలుగా ఉన్న 11 మంది క్రూరులైన దోషుల ప్రవర్తన బాగుందని చెప్పి గుజరాత్‌ ప్రభుత్వానికి అనుమతించిన హోంశాఖ ఏమీ ఎరగనట్లు మౌనం వహించడం బీజేపీ పాలకుల దుష్టవ్యూహానికి పరాకాష్ట. మహిళలకు ప్రతిష్టను, గౌరవాన్ని సాధికారత కల్పిస్తామని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి మాట్లాడుతూ డంబాలు పలికారని ఈ ఘటన రుజువు చేస్తోంది. మోదీ నారీశక్తి లాంటి నినాదాలు ఇవ్వడంలో అగ్రగణ్యుడు. మోదీ ప్రసంగానికి 35రోజులు ముందుగానే హోంశాఖ దోషులను జైలు నుంచి విడుదలకు గుజరాత్‌ ప్రభుత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ వాస్తవాన్ని బైటపెట్టింది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వమే కమిటీ వేసి దాని నివేదిక ప్రకారమే విడుదల చేసినట్లు అబద్దాలు చెప్పింది. కమిటీలో ఎక్కువ సభ్యులు బీజేపీ, సంఫ్‌ుపరివార్‌కు చెందినవారే. సామూహిక అత్యాచారం చేసి, పసిబిడ్డతో సహా ఒక కుటుంబంలో ఏడుగురిని చంపిన ‘మానవ భక్షకులను’ విడుదల చేయడమేగాక వారిని వీహెచ్‌పీ ఆఫీసులో సన్మానించడం మరింత దుర్మార్గం. ఇలాంటి దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పిన వారు పాలకులు కావడం నేటి విషాదం. మోదీ చేతలకు, మాటలకు సంబంధమే ఉండదని ఈ ఎనిమిదేళ్ల పాలనలో వందలసార్లు రుజువైన నిజం. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఎన్ని అబద్దాలనైనా చెప్పగలరు.
అమిత్‌షా ఆధ్వర్యంలో నడిచే హోంశాఖ కుచ్చితమైన రేపిస్టుల విడుదల రహస్యం సుప్రీంకోర్టు బైటపెట్టడం వల్లే వెలుగులోకి వచ్చింది. రాజకీయాలలో అనేక లోపాయికారీ అక్రమ ‘ఒడంబడికలు’ జరుగుతాయి కానీ బీజేపీ పాలనలో లోపాయికారి అక్రమాలది అగ్రస్థానం అని సుప్రీంకోర్టు సీనియర్‌ లాయరు అభిషేక్‌ సింఘ్వి వ్యాఖ్యానించారు. రాజకీయ మనుగడకోసం ఎన్ని అబద్దాలనైనా చెప్పడం, ఎన్ని అక్రమాలకైనా పాల్పడడం బీజేపీకున్న రికార్డు మరెవరికీ లేకపోవచ్చు. గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు బైటపెట్టిన నిజంపై తేలుకుట్టిన దొంగలాగా మౌనం వహించింది. పైగా 1992లో తీసుకున్న క్షమాబిక్ష విధానానికి అనుగుణ్యంగానే విడుదల చేశామని తప్పుడు సాకు చెప్పి రేపిస్టులను విడుదల చేసింది. దీని వెనుక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ఈ దోషులను విడుదల చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అజాదీకా అమృతోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఖైదీలలో భాగంగానే వీరిని వదిలేశామని చెప్పడం మరింత విడ్డూరం. రేపిస్టులకు, హత్యచేసిన దోషులకు 1992 క్షమాబిక్ష విధానం వర్తించదని సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వును సైతం గుజరాత్‌ ప్రభుత్వం ఉల్లంఘించింది. రాజ్యాంగసూత్రాలు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకపోవడం బీజేపీ పాలకులకు సర్వసాధారణ విషయమని చెప్పవచ్చు. రేపిస్టుల విడుదలకు హోంశాఖ అనుమతికోరుతూ గుజరాత్‌ ప్రభుత్వం జూన్‌ 28, 2022న లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వును ప్రధాన పాలనావిభాగం హోంశాఖ కూడా పట్టించుకోకపోవడం బీజేపీ పాలకుల బరితెగింపునకు తార్కాణం కాదా? హోంశాఖ కుట్రకు మరో తార్కాణం ఉంది. దోషుల విడుదలకు పోలీసు ఎస్‌పీ, సీబీఐ, ముంబై స్పెషల్‌ క్రైం బ్రాంచి, గ్రేటర్‌ ముంబై నగర సివిల్‌ సెషన్స్‌ కోర్టు స్పెషల్‌ జడ్జి వ్యతిరేకించినప్పటికీ కేంద్ర హోంశాఖ అనుమతినివ్వడం దాని దుష్టపాలనా విధానాన్ని బైటపెడుతుంది. హత్యలు, విచారణ లేకుండా చిత్రహింసలు పెడుతున్న కేసులలో దోషులైన ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ శ్రేణులకు, కార్యకర్తలకు స్వేచ్ఛ ఇస్తున్నారని చెప్పడానికి ఇది సరైన తార్కాణం. రేపిస్టుల విడుదలపై సుప్రీంకోర్టు వివరణ కోరగా దోషులకు సంబంధించిన అసలు విషయాన్ని దాటవేసిన భారీ రిపోర్టు ప్రభుత్వం పంపడంవల్ల ప్రభుత్వం తన చర్యలనుండి వెనక్కు వెళ్లదని కోర్టు భావించడం కూడా ఆసక్తికలిగించే విషయం.
‘‘వివిధ తీర్పులను ఉటంకిస్తూ ఇలా కౌంటర్‌ ఆఫిడవిట్‌ దాఖలు చేయడం నేను ఇంతవరకు చూడలేదు. అసలు జరిగిన విషయం తెలియజేస్తూ అఫిడవిడ్‌ దాఖలు చేసి ఉండవలసింది. అత్యంత ఎక్కువ పేజీలతో దాఖలుచేసిన అఫిడవిట్‌లో అసలు అంశాలు ఎక్కడ? దీనిపై కేంద్రీకరించిందెక్కడ’’? అని అజయ్‌రస్తోగి నాయకత్వంలోని ధర్మాసనం గుజరాత్‌ ప్రభుత్వంపై వ్యాఖ్యానించింది. సీపీఎం నాయకురాలు సుభాషిణీ అలి, రేవతిలాల్‌ (జర్నలిస్టు), రూప్‌రేఖ వర్మ (లక్నో యూనివర్సిటీ మాజీ వీసీ) టిఎంసీ పార్లమెంటుసభ్యురాలు మహువ మొయిత్రలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అసలు పిటిషన్‌ దాఖలకు వారికి అర్హతలేదని గుజరాత్‌ ప్రభుత్వం నిందించింది. ఈ కేసుతో సంబంధంలేకపోయినా ప్రజాప్రయోజన పిటిషన్‌ దాఖలు చేయవచ్చునని గుజరాత్‌ ప్రభుత్వానికి తెలియని విషయం ఏమీకాదు. రేపిస్టుల దుర్మార్గాన్ని నరేంద్రమోదీ ఏనాడు ఖండిరచలేదు. మైనారిటీలను ప్రత్యేకించి ముస్లింలను బెదిరిస్తూ, విద్వేష విషం గక్కుతున్న వారినుద్దేశించి ప్రధాని ఏనాడు హెచ్చరించలేదు. గతంలో బీజేపీ నాయకులు కపిల్‌మిశ్రా, లోక్‌సభ సభ్యుడు ప్రవీణ్‌వర్మ మరో ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌లాంటి వాళ్ల్లు విద్వేషప్రచారం చేసినప్పటికీ మోదీ మౌనం వీడలేదు. ఉక్కుమనిషి అనిపించుకుంటున్న మోదీ కీలకమైన అంశాలపై ప్రత్యేకించి ముస్లింలకు సంబంధించి మాట్లాడకుండా ద్వంద్వప్రమాణాలనే పాటిస్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో మత ఘర్షణలు, హింసాకాండ సాగుతున్నా మౌనం పాటించడం ఏమిటని ప్రతిపక్ష నాయకులు, మేథావులు, సామాజిక కార్యర్తలు విమర్శించి మాట్లాడలేదు. సమాజాన్ని మతాలు, కులాలవారీగా చీల్చడానికి కారకులైన వారి చర్యలనూ ఖండిరచలేదు. మత విద్వేష ప్రసంగాలు చేసే బీజీపీ నాయకులను ఏనాడు అదుపు చేయలేదు, మౌనం వీడలేదు. మౌనం వెనుక ఆయన ఉద్దేశాలు, రహస్య లక్ష్యాలు దాగి ఉన్నాయి. సామాజిక కార్యకర్తలు, అసమ్మతి వాదులపై ఉక్కుపాదం మోపడం ఆగలేదు. ఈ దుర్మార్గ పరిస్థితులను ఇప్పటికైనా ఎదుర్కోవడం అత్యవసరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img