Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

రైతులు శపిస్తారు… జాగ్రత్త…

శుభ్రంగా కడిగేసిన ఆకుపచ్చటి అరటి ఆకు. ఆ ఆకులో కుడివైపు చివర పసుపు రంగు చీరకు ఎర్రటి జరీ అంచున్న కంచి పట్టు చీరలా ఉంది టమాటా పప్పు. అరటి ఆకు కుడివైపునే పైభాగంలో టమాటా పచ్చడి. ఇది ఆ పట్టు చీరకు అతికినట్టుగా కుట్టిన మ్యాచింగ్‌ జాకెట్‌లా ఉంది. అరటి ఆకుకు ఎడమ వైపు చిక్కుడుకాయ, టమాటా కూర. వీటికి మధ్యలో పిండి ఆరబోసిన వెన్నెల తునకల్లా తెల్లటి నెల్లూరు మొలకల బియ్యంతో వండిన అన్నం. అరటి ఆకుకి కాస్త దూరంగా స్టీలు గిన్నెలో ఉన్న టమాటా చారులో ఓ పది వరకూ నెలవంకలా తరిగిన టమాటా ముక్కలు తేలుతున్నాయి. వాటితో పాటు నాలుగైదు కరివేపాకు రెబ్బలు. కమ్మటి వాసన వస్తున్న నెయ్యి, దాని పక్కనే నువ్వులనూనె. ఆ విస్తరి ముందు కూర్చున్న టమాట్రావ్‌ అన్నం కలుపుకుంటూండగా పాత సినిమాల్లో హఠాత్తుగా ప్రవేశించిన పోలీసుల్లా ‘యు ఆర్‌ అండర్‌ అరెస్ట్‌’ అన్న డైలాగ్‌ వినిపించింది. అన్నం తింటూంటే అరెస్టేంటి… ఈ సమయంలో అన్నం తినకూడదా. ఇది ఏలికల విధించిన శిక్షా….విధి ఆడిన వింతపరీక్షా… అని అనుకుంటూ ‘‘వద్దు ఈ టమాటా పప్పు తినే వరకూ నన్ను అరెస్టు చేయకండి… ఆ టమాటా పచ్చడి నాలికమీద రాసుకునే వరకైనా ఆగండి….ఆ టమాటా చిక్కుడుకాయ కూడా రుచి చూసే భాగ్యాన్ని కలగనీయండి…. బేలగా నా వైపే చూస్తున్న టమాటా చారుని రెండు చెంచాలైనా తాగనివ్వండి’’ అంటూ అరుస్తున్నాడు టమాట్రావ్‌ మంచం పై నుంచి. ఆ అరుపులకు, ఈ టమాటా గోలేంట్రా అని చిర్రెత్తుకొచ్చిన భార్య పంట ఎత్తుకు పోయిన టమాటా రైతులా ఆగ్రహించి ఓ తన్ను తన్నింది. అంతే మంచం మీంచి కింద పడ్డాడు టమాట్రావ్‌. ‘‘ఏది నా టమాటా పప్పు… పచ్చడి, కూర…’’అంటూ చిన్నపిల్లాడిలా నేలమీద దొర్లుతున్నాడు. ఇలా జరిగిన కొంతసేపటికి తెలిసొచ్చింది తాను ఇంత వరకూ కల కన్నానని, టమాటాతో ఏ వంటకం తినడానికైనా అదేదో సినిమాలో కమల్‌ హాసన్‌ అన్నట్లు నుదిటి మీద రాసి ఉండాలని జ్ఞానోదయమైంది.
అంటే అన్నానంటారు గానీ పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పారు తన కాల జ్ఞానంలో. వచ్చేవన్నీ గడ్డు రోజులర్రా అని. విన్నామా…. ఆయన చెప్పినవి ఎన్ని జరగలేదు. మనలో కొంతమంది వినలేదేమోనని పెద్ద ఎన్టీఆర్‌గారు ఏకంగా వీరబ్రహ్మంగారి సినిమాయే తీసారు. అయితే, ఈ టమాటాల గురించి వీరబ్రహ్మం గారు చెప్పారో లేదో కాని… ఇన్ని హితబోధలు చేసినాయన ఈ మాట కూడా చెప్పకుండా ఉంటారా అని సమాధాన పడాలంతే.
కలికాలం కాకపోతే…. టమాటా దొంగతనాలేమిటి. అది కూడా దొంగిలించిన వారు ఎవరో తెలియకుండా హెల్మెట్‌ పెట్టుకుని మరీనూ. విడ్డూరంగా లేదు. ఇంతేనా…టమాటా పండిరచిన ఓ రైతును దారి కాచి చంపేసి టమాటా మూటలు ఎత్తుపోయారు దుర్మార్గులు. అర్ధరాత్రి కాబట్టి, అక్కడ సీసీ కెమెరాలు లేవు కాబట్టి ఆ హంతకదొంగల్ని ఇంకా పట్టుకోలేకపోయారు మన పోలీసులు. అసలు టమాటాలకి ఇంత గిరాకీ ఎందుకొచ్చింది. ఇంతకుముందు ఇదే టమాటాకి ధర రాలేదంటూ రైతులు కిలోలకు కిలోలు రోడ్డు మీద పారపోయడం ఏమిటీ…? అప్పుడు అలా జరగడమేమిటీ…. ఇప్పుడు ఇలా జరుగుతున్నదేమిటీ… ? ఈ రెంటికి మధ్య ఉన్న జరుగుతున్న బ్రహ్మ రహస్యం ఏమిటీ. చాలాసేపు ఆలోచిస్తే బుర్ర పగలి టమాటా పిండితే వచ్చే రసంలాంటి రక్తం కారుతోంది కాని సమాధానం దొరకడం లేదు.
అప్పుడెప్పుడో తెలంగాణాలో పత్తి రైతు ఆత్మహత్యకి కారణం కూడా ఇంకా తెలియరాలేదు. దిల్లీ వరకూ పాదయాత్ర చేసిన పంజాబ్‌ రైతులపై పడిన లాఠీ దెబ్బలకు, వారు చేసిన ఆర్తనాదాలకు కూడా కారణాలు కనుక్కోవాల్సి ఉంది. అంతకు ఇంకా ముందే సుష్మా స్వరాజ్‌ ఏలికలో ఉన్న కమలనాధుల దిల్లీ ప్రభుత్వం కూడా కేవలం ఉల్లిపాయల వల్లే కూలిందనడానికి కారణాలూ తెలియాల్సి ఉంది. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదనే సామెత ఎంతవరకూ నిజమో నాకు తెలియలేదు కాని, దిల్లీ ప్రజలకు మాత్రం ఆ రోజుల్లో తల్లి కంటే ఎక్కువే మేలు చేసిందని ఆనాటి బ్యాలెట్‌ బాక్సులు చెప్పాయి.
నేను ఓ పత్రికలో రాజకీయ విలేకరిగా ఉన్న సమయంలో ఆనాటి సమైక్య రాష్ట్రంలో చింతపండు ధర కూడా ఇలాగే ఆకాశాన్నంటింది. ఆ రోజుల్లో చింతపండు కోసం దొంగతనాలు, హత్యలు జరగలేదు కాని, తెలుగువారి ఇళ్లలో చాలాకాలంపాటు చింతపండుతో చేసిన వంటకాలు కానరాలేదు. ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీట్‌ ద ప్రెస్‌లో చింతపండు ధరలు పెరగడం, ఈ ధర స్థిరీకరణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని నేను ఆయన్ని అడిగాను. దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ‘‘మా చర్యలు మేం తీసుకుంటున్నాం. అయినా.. చింతపండు దొరకక పోతే టమాటాతో చారు చేసుకుంటారు’’ అన్నారు. ఆ సమాధానానికి నేను ‘‘మీరు ముఖ్యమంత్రి. సమస్యపరిష్కరించాలి తప్ప ప్రత్యా మ్నాయం… అదే ఆల్టర్‌నేటివ్‌ చూపకూడదు కదా’’ అన్నాను. దానికి చంద్రబాబు నాయుడికి చాలా కోపం వచ్చి ‘‘తర్వాత ప్రశ్న’’ అంటూ ఆ విధంగా ముందుకు పోయారు. ఆ సమాధానానికి నాకు ఒకింత అసహనం వచ్చింది కాని… తెలుగు ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడికి ఆ నాటి నుంచి నేటి వరకూ ఆయన అన్నట్లుగానే ప్రత్యామ్నాయం అదేనండి ఆల్టర్‌నేటివ్‌ చూపిస్తునే ఉన్నారు. టమాటా మొక్కే కదాని పీకి పారేస్తేనూ…. ఉల్లిగడ్డే కదా అని పెరికి విసిరేస్తేనూ… పత్తే కదా అని పకపకా నవ్వుకుంటేనూ… రైతులు ఈ భూమి మీద నడయాడుతున్న అన్నపూర్ణలు. వారి కష్టంతో అన్నమూ పెడతారు…ఉరిమే కళ్లతో శాపమూ ఇస్తారు.
సీనియర్‌ జర్నలిస్టు, 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img