Friday, June 2, 2023
Friday, June 2, 2023

రైతుల ఆత్మహత్యలు నివారించలేమా?

రైతులు, రైతుకూలీల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర 4,064 బలవన్మరణాలతో మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలతో 1065 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో, 889 ఆత్మహత్యలతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. రైతు సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, రైతులకు లక్షల కోట్ల హామీలు గుప్పించారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం, రైతులు సంతోషంగా ఉండేట్లు చూస్తాము అని ఉత్తరప్రగల్భాలు పలుకుతున్నారు. రైతు సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు. గత్యంతరం లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వందలాది మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. రైతు చనిపోతే రూ.7లక్షలు అన్న జగన్‌, రైతు బతికుండగా ఎందుకు పట్టించుకోరు? కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉంటున్నాయి. వాటిని నివారించేందుకే తెలంగాణలో 2018లో కేసీఆర్‌ ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. 2019లో ఆంధ్రప్రదేశ్‌ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ చర్యల కారణంగానే గత ఏడాది రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలంగాణ మంత్రులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడం, సకాలంలో విత్తనాల సరఫరా, మద్దతు ధరకే పంటలను కొనుగోలు చేయడం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించని కారణంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు ప్రతికూల పరిస్థితి కొనసాగుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా సూక్ష్మ బిందు సేద్యానికి, డ్రిప్‌, స్ప్రింక్లర్‌, మల్చింగ్‌ షీట్‌ ఇతర ఉపకరణలకు నయా పైసా కేటాయించలేదు. దీనికి తోడు కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక పథకాలకు మద్దతు తెలుపుతున్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తున్నారు.
భూమిలేని కౌలు రైతులకు, ఆదివాసీ ప్రాంతాల రైతులకు రైతుబంధు, రైతుబీమా అమలు కావడం లేదు. మహిళా రైతులను రైతులుగా గుర్తించడం లేదు. కౌలు రైతులను, పోడు రైతులను గుర్తించి వారికి రైతుబంధు, రైతు భరోసా ఇవ్వగలిగి, బీమా పథకం వర్తింపజేస్తే రైతు ఆత్మహత్యలు మరింత తగ్గుతాయని కన్నెగంటి రవి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ కూలీలకు సమగ్ర సాంఘిక సంక్షేమ పథకం అమలు చేయాలి. ఈ కుటుంబాలకు కూడా బీమా పథకం అమలు చేయాలి. నూతన ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయరంగం మూలాధారం. వ్యవసాయరంగంలో పరిశోధనలు, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడం, వ్యవసాయ విస్తరణకు ఆ వ్యవస్థ బలోపేతం చేయడం, పండిరచిన పంటకు మద్దతుధర కల్పించడం, నిల్వ సామర్థ్యం పెంచడంవంటి చర్యలు తీసుకోవాలి. రైతు మెరుగైన జీవితం గడపడానికి అవసరమైన ద్రవ్యాన్ని ఇచ్చేదీ గిట్టుబాటు ధర కానీ మార్కెట్లో ధరలు పడిపోయి రైతు తీవ్రంగా నష్టపోతే, ప్రభుత్వం రైతులకు కొంత సహాయం లేదా వెసులుబాటు కల్పించే నిమిత్తం మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఇది గిట్టుబాటు ధర కాదు. రైతులు గిట్టుబాటు ధర కోరుతున్నా ఇచ్చేది, ప్రకటించేది కనీస మద్దతు ధర మాత్రమే. దీనివల్ల రైతులకు లాభం చేకూరడం లేదు. ప్రజలకు ఆహారాన్ని అందించడానికి రైతు శ్రమ పడుతున్నారు. రైతు శ్రమను, రిస్క్‌ను ప్రభుత్వం, సమాజం గుర్తించాలి. వ్యవసాయం రైతుకు గిట్టుబాటు కావాలి. అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయరంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తున్నారు. దేశంలో అన్ని రకాలుగా వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులు అష్టకష్టాలు పడుతున్న వారిని, అన్ని రంగాల్లోనూ సంపూర్ణంగా ఆదుకోవ డానికి ప్రభుత్వ విధానాలు, చట్టాలు సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అభివృద్ధి రేటు పెరుగుతుందని అనుకున్నా అదే దామాషాలో రైతుల ఆదాయాలు పెరగలేదు. ఉత్పత్తి పెరుగుదలకు అనుగుణమైన గిరాకీ ఉంటేనే వ్యవసాయోత్పత్తులు వాస్తవధరలు నిలకడగా ఉంటాయి. వ్యవసాయం ద్వారా లభించే ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచడంతోపాటు, వైవిధ్యమైన ఆహారధాన్యాల ఉత్పత్తి చేయాలి. దేశంలో మార్కెటింగ్‌ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. దానిని పటిష్ట పరచాలి.
రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి ప్రభుత్వం నుంచి సకాలంలో లభించడంలేదు. అందుచేత రైతు అప్పుచేసి, పెట్టుబడి పెట్టి పంటను అప్పు తీర్చడానికి సరిపెట్టి చివరకు దివాళా తీస్తున్నారు. రైతులు సాధారణంగా పేదలు, నిరక్షరాస్యులు కావడంతో ఆధునిక పద్ధతులు అనుసరించడానికి వెనుకాడుతున్నారు. పాడి రైతులకు ప్రోత్సాహం లేదు, పశుసంపద గణనీయంగా తగ్గిపోయింది. పశువుల పెంపకాన్ని తగ్గించడంలో పొలాలకు ఆ ఎరువు లభ్యత బాగా తగ్గింది. ఫలితంగా భూసారంతగ్గి దిగుబడి తగ్గుతుంది. కుండపోత వర్షాలు, వరదల వల్ల భూమిపై ఉన్న సారవంతమైన పొర కొట్టుకుపోయి వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. రైతులకు జీవన భద్రత వైపు, వారి ఆదాయం పెంపుదల వైపు దృష్టి సారించకపోతే వ్యవసాయరంగం సంక్షోభాన్ని పరిష్కరించడం సాధ్యం కాదు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను విస్తారంగా ఏర్పాటు చేయాలి. ఉప ఉత్పత్తులు రూపకల్పనకు ప్రయత్నాలు ప్రారంభించాలి. రైతులకు విస్తారంగా ఫ్లెడ్జ్‌లోన్‌ అందించాలి. గ్రామం యూనిట్‌గా పంటలబీమా పథకాన్ని అమలుచేయాలి. వ్యవసాయానికి సమృద్ధిగా నీరు, సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక చేయూత అందించాలి. వ్యవసాయ రంగానికి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ పటిష్టంగా అమలుచేయాలి. పంటలలో వైవిధ్యం ఉంటే భూమి బాగుపడుతుంది. ఏళ్ల తరబడి ఒకే పంటసాగు చేయడం, అవగాహన లేక అవసరానికి మించి ఉత్పత్తి ఎరువులను ఉపయోగించడం, పురుగు మందులు విచక్షణ రహితంగా వాడటంతో రైతులు నష్టపోతున్నారు. పంటలబీమా, రుణాలు, పండిన పంటలను మార్కెట్‌ చేయడం, గ్రామీణ మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడం వంటి చర్యల ద్వారా చిన్న రైతులకు సాయం చేయాలి. నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి పరచాలి. రైతులు ఆత్మగౌరవంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ బతికేందుకు అనువుగా వ్యవసాయ రంగాన్ని సమూలంగా సంస్కరించాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. వర్షాధార ప్రాంతాల వ్యవసాయాభివృద్ధికి నీటి సంరక్షణ ముఖ్యమని గుర్తించాలి.
ఎక్కడపడిన వర్షపు నీటి చుక్కను అక్కడ ఇంకింపచేసేలా రైతులలో చైతన్యాన్ని పెంపొందించాలి. సేంద్రీయ ఎరువులను వృధా చేయకుండా రైతులు వాటిని నూటికి నూరుపాళ్లూ సద్వినియోగ పరిచేలా చూడాలి. సేంద్రియ ఎరువుల వనరుల్ని నిర్లక్ష్యం చేస్తూ రైతులు పాలకులు రసాయన ఎరువులవైపే మొగ్గు చూపుతున్నారు. పర్యవసానంగా భూసారం దెబ్బతింటోంది. అతివృష్టి, అనావృష్టి కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు మన ఆహార సమస్య తీవ్రతరం చేశాయి. అధిక వనరులున్న మన దేశం ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకొంటే అది జాతికే అవమానం. ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషిచేసి ఆహారం విషయంలో స్వయం సమృద్ధి సాధించడానికి పాటుపడాలి. ప్రజలు ఆహారధాన్యాలను వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ఆహారధాన్యాలను అక్రమ నిల్వలుచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు అవలంభించి అధికోత్పత్తి సాధించాలి. రైతులు పైరుపై ఏవగింపు కలగనీయక ధాన్యానికి తగిన రేటు ఇప్పించాలి. ఎరువులు సబ్సిడీ రేట్లకు ఇప్పించాలి. రైతు కూలీలకు తగిన కూలీ ఇప్పించి వ్యవసాయానికి వారిని ఇష్టులుగా చేయాలి. ఆహార ధాన్యపు రాబడిని పెంచడానికి రైతుకు తగిన వీలు కల్పించడం, పంటమార్పిడి, మిశ్రమ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆహారోత్పతులను పెంచడం, జనాభాను అరికట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన మౌలిక వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలి.
డాక్టర్‌ యం. సురేష్‌బాబు, ప్రజాసైన్స్‌ వేదిక అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img