Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రైతు ఉద్యమాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ దుష్ప్రచారం

అరుణ్‌ శ్రీ వాస్తవ

పట్టణ, నగర ప్రాంతాల్లో మత విభజన సృష్టించి, హిందూత్వ నినాదంతో హిందువులను ఆకట్టుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రామీణ ప్రాంతాల్లో హిందువులు, ముస్లింల మధ్య వైరాన్ని రగిల్చేందుకు పూనుకొన్నది. ఇందుకుగాను స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో దేశ వ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమాలపై దుష్ప్రచారానికి సిద్ధమైంది. వలస పాలకుల కాలంలో రెండు గొప్ప రైతు పోరాటాలు జరిగాయి. కేరళలో మల్బార్‌ (మల్పా ఉద్యమం) రైతుల తిరుగుబాటు, బెంగాల్‌లో టిటుమీర్‌ పోరాటం. ఈ రెండు ఉద్యమాలకూ ముస్లిం రైతు నేతలే నాయకత్వం వహించారు. బ్రిటీషు పాలకులు, వారి భూస్వామ్య మిత్రులు హిందువుల చర్యలకు వ్యతిరేకంగా 1921లో మప్పిల ముస్లింలు సాయుధ తిరుగుబాటు చేశారు. రెండు చోట్ల జరిగిన తిరుగుబాట్లు బ్రిటీషు పాలకులకు, వారికి విశ్వాసంగా ఉంటున్న భూస్వాముల పైనే జరిగాయి. అణచివేతను, చిత్రహింసలను భరించలేని పేద రైతులు తిరుగుబాటు చేశారని చరిత్ర పరిశోధకులు వెల్లడిరచారు. భూస్వాముల క్రూరమైన చర్యలపై అనేక పరిశోధనా పత్రాలు తగినన్ని ఆధారాలతో వెలువడ్డాయి. కొన్ని చోట్ల తిరుగుబాటు చేసిన రైతులను చంపివేశారు. భూస్వాముల వద్ద పనిచేసే అంగరక్షకులు ముస్లిం మహిళలపై అత్యాచారాలు చేయడం సాధారణమైపోయింది. కరువు కాటకాలు, వరదల సమయాల్లోనూ భూస్వాములకు రైతులు కౌలు చెల్లించక తప్పేదికాదు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవలసి వచ్చేది. అయితే కొందరు భూస్వాములు ఉదారంగా ఉండేవారు. ఇలాంటి వారి సంఖ్య తక్కువగానే ఉండేది.
ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ భూస్వాములు సన్మార్గులని, రైతులను పోషించే వారన్న ప్రచారానికి పూనుకున్నది. హిందూ భూస్వాముల పైన ముస్లింలు దాడులు చేశారని దుష్ప్రచారం సాగిస్తూ, రైతుల పోరాటాలను కించపరుస్తున్నారు. బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు రామ్‌మాధవ్‌ వక్రంగా మాట్లాడుతున్నాడు. ఇటీవల ఆయన కేరళలో పర్యటించిన సందర్భంగా మప్ల తిరుగుబాటుదారులు తాలిబన్‌ల వలే వ్యవహరించారని చరిత్రను వక్రీకరించారు. మప్ల తిరుగుబాటును స్మరించుకున్న కేరళ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల పోరాటాలను తాలిబన్‌లతో పోల్చడం ద్వారా విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని స్పష్టమవుతోంది. పోరాటాలను, వాటికి నాయకత్వం వహించిన వారిని ఆయన టెర్రరిస్టులుగా చూస్తున్నారు. ఉద్యమాలపై ఇంత అధమస్థాయి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వ్యక్తి తాను గొప్ప మేధావినని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ముస్లింల పట్ల ద్వేషమే ఆయన మాటల్లో కనిపిస్తుంది. బ్రిటీష్‌ కాలంలో పోరాడిన నేతలకు, స్వాతంత్య్ర యోధులకు ఇచ్చే పెన్షన్లు ఇవ్వటానికి బీజేపీ వ్యతిరేకిస్తోంది.
1792లో బ్రిటీష్‌ పాలనలో మలబార్‌ ఉన్నది. అంతక్రితం మప్లలు మంచి స్థితిలో ఉన్న వర్తకులు. అయితే ఇంగ్లీషు వాళ్లు, పోర్చుగీసు వాళ్లు సముద్రం ద్వారా జరిగే వాణిజ్యాన్ని హస్తగతం చేసుకోవడంతో మప్లాలు పేదరికంలోకి వెళ్లిపోయారు. బ్రిటీష్‌ కాలంలో మలబార్‌ ప్రాంత భూస్వాములంతా దాదాపు హిందువులే. భూమి విధానాన్ని భూస్వాములకు అనుకూలంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును వ్యతిరేకిస్తూ, మప్లాలు తిరుగుబాటు జరిపారు. ఆనాటి తిరుగుబాట్లను బ్రిటీష్‌ చరిత్రకారులు నమోదు చేశారు. భూమి విధానంతో పాటు మత ఉన్మాదంపైన కూడా బ్రిటీష్‌ అధికారులు చర్చించారని చరిత్రకారుడు స్టీఫెన్‌ డేల్‌ వివరించారు. హింసకు ఈ రెండు అంశాలే కారణమని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఎలాంటి కవ్వింపు లేకుండానే హిందువులను చంపివేశారని చరిత్రకు, కేరళలో మెజారిటీ ప్రజలకు అవమానకరమైన విషయమని బీజేపీ చెప్తోంది. కేరళలో హిందూ ఓట్లను సమీకరించేందుకుగాను సంఫ్‌ుపరివార్‌ తరుచుగా ఇలాంటి ప్రచారాన్నే చేస్తోంది. ఈ విషయంలో సంఫ్‌ుపరివార్‌ పెద్దగా ప్రయోజనం పొందలేదు.
తిరుగుబాటు ఉద్యమానికి వందేళ్లు అయిన సందర్భంగా దాడులలో హిందువులు ఎక్కువగా నష్టపోయారని బీజేపీ ప్రచారం చేస్తోంది. అలాగే దేవాలయాలను ధ్వంసం చేశారని వేలాది మంది హిందువులను హతమార్చారని చెబుతోంది. ఈ అంశాన్నే తీసుకుని 1921 పేరుతో మళయాళం చిత్రాన్ని 1988లో నిర్మించారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించగా ఐ.వి.శశి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర ధరించిన వ్యక్తి వరియం కున్నద్‌ కుంజ అహ్మద్‌ హాజీ బ్రిగేడ్‌కు చెందిన ప్రముఖ ముస్లిం నాయకుడు. ఇదే అంశాన్ని తీసుకుని ఆషిక్‌ అబు మరో కొత్త ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినప్పుడు సంఫ్‌ు పరివార్‌ హిందువులను చంపివేసిన ముస్లిం నాయకుడిని ప్రశంసించినట్లవుతుందని వ్యతిరేకించింది. రైతుల తిరుగుబాట్లను కించపరిచేందుకు ఆనాడు హిందువులను హతమార్చిన అంశాన్ని ప్రముఖంగా చిత్రీకరించాలని బీజేపీ నాయకుడు, చిత్ర దర్శకుడు అయిన అషిక్‌ అబూ మరో ప్రాజెక్టును ప్రకటించారు. మలబార్‌ ప్రాంతంలో రైతుల తిరుగుబాటు స్వచ్చందంగా రైతులు నిర్వహించిందే. రైతుల ఆగ్రహాన్ని ప్రదర్శించిన గొప్ప సంఘటన ఇది. బ్రిట్రీష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమిదని రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు సౌమియేంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రకటించారు.
జమీందార్లకు, మహాజన్‌లకు అండగా నిలిచిన ఈస్టిండియా కంపెనీ సాయుధ దళాలు, బ్రిటీష్‌ పోలీసులకు వ్యతిరేకంగా సయ్యద్‌ మీర్‌ నిస్సార్‌ అలీ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. జమీందారులు, వాళ్ల మనుషులు గడ్డాలు పెంచుకుని పన్నులు వసూలు చేయటానికి వచ్చి ముస్లింలను హింసించారు. బలవంతంగా పన్నులు రుద్దుతున్న ఈస్టిండియా కంపెనీ పాలకులకు, జమీందార్ల అమానుషమైన చర్యలకు వ్యతిరేకంగా సయ్యద్‌ మీర్‌ నిస్సార్‌ అలీ పోరాటం చేశారు. ఆయన గొప్ప రైతు నాయకుడు. 1831లో నర్కల్‌ బిరియా తిరుగుబాటుకు కూడా నాయకత్వం వహించారు. బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు మతాన్ని అంటగట్టటం సంఫ్‌ుపరివార్‌ నాయకులకే చెల్లింది. దేశ ప్రజాస్వామిక లక్షణాలను ధ్వంసం చేసేందుకు బీజేపీ ప్రమాదకరమైన పంథాను అనుసరిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img