Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

రైతు ప్రయోజనాలు విస్మరించిన బడ్జెట్‌

వైసీపీ ప్రభుత్వ 2023-24 వార్షిక రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ 16-3-23న శాసనసభలో ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్‌ అంచనా 2,79,279 కోట్లు కాగా రెవిన్యూ వ్యయం 2,28,540 కోట్లు. మూలధనం 31,061 కోట్లు. రెవిన్యూ లోటు 22,316 కోట్లు. ద్రవ్య లోటు 54,587 కోట్లు. పూర్తి బడ్జెట్‌ అమలు జరగాలంటే 50కోట్లకు పైగా కొత్త అప్పులు చేయాలి.
బడ్జెట్‌ ప్రవేశపెడుతూ సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన అంగాలు వ్యవసాయ, పారిశ్రామిక రంగం. ప్రజల ఆర్థికాభివృద్ది వీటిపై ఆధారపడి ఉంది. ఈ రంగాలను రాష్ట్ర బడ్జెట్‌ చిన్నచూపు చూసింది. సంక్షేమ పథకాల చుట్టూ బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి. బడ్జెట్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 41,436.29 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్‌ కేటాయింపుల కన్నా 1,616.49 కోట్లు తక్కువ. ఇందులో వ్యవసాయానికి 11,384.48 కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్ని గమనిస్తే సేద్యానికన్నా, సేద్యేతర కోళ్ల ఫారాలకు, శీతల గిడ్డంగులకు, ట్రాక్టర్ల కొనుగోలుకు బడ్జెట్‌ కేటాయింపులు ఎక్కువ. సంపన్న వర్గాలు ఈ బడ్జెట్‌ ద్వారా ప్రయోజనం పొందుతాయి.
వ్యవసాయానికి తక్కువ కేటాయించి, వ్యవసాయ రంగం అత్యధిక ప్రాధాన్యత కలదని, ఆ రంగాన్ని వైయస్‌ఆర్‌ రైతు భరోసా-పిఎం కిసాన్‌ పథకం, వైయస్‌ఆర్‌ పంటల భీమా పధకం, సున్నా వడ్డీకే పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ధరల స్థిరీకరణ నిధి, రైతుభరోసా కేంద్రాలద్వారా తక్కువ ధరలకు నాణ్యమైనఎరువులు, రైతుల నుంచి పంటల కొనుగోళ్లు మొదలైన పథకాలతో ఆదుకుంటున్నామని, ఇది రైతాంగ ప్రభుత్వమని వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి గొప్పలు చెప్పారు. వైయస్‌ఆర్‌ రైతుభరోసా, పిఎం కిసాన్‌పథకం ద్వారా మూడుసార్లు 13,500 రూపాయలు ముందస్తు పంట పెట్టుబడి కోసం రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈ సహాయం ద్వారా రైతాంగాన్ని ఉద్దరిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం ఎరువుల, విత్తనాల, పురుగు మందుల, డీజిల్‌ ధరల పెరుగుదల గమనిస్తే పంటల ముందస్తు పెట్టుబడి వలన రైతాంగానికి చేకూరిన ప్రయోజనం ఏమీలేదు. ఒక్క ఎరువులపైనే గత సంవత్సరంలో 50 కేజీల ఎరువుల బస్తాపై 8 వందల రూపాయల వరకు ధర పెరిగింది. పంట ముందస్తు పెట్టుబడి కూడా ఒకేసారి ఇవ్వకపోవటం కూడా రైతాంగానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతున్నది. ఇంత గొప్పగా చెప్పుకుంటున్న ఈ పథకానికి కేటాయింపు పెంచక పోవటం, రాష్ట్రం ఇచ్చే మొత్తాన్ని 3,900 నుంచి 4,020 కోట్లకు నామ మాత్రంగా పెంచటం రైతుల ఎడల వైసీపీ ప్రభుత్వ కపటప్రేమకు అద్దం పడుతున్నది.
రైతాంగం పండిరచే పంటలకు న్యాయమైన ధరలు కల్పించి, వాటి కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తే, అది రైతాంగానికి ప్రయోజనంగా ఉంటుంది. రైతాంగం కోరుకునేది కూడా అదే. వైసీపీ ప్రభుత్వానికి రైతాంగం ఎడల ప్రేమ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు అధనంగా ప్రోత్సాహక ధరను ప్రకటించాలి. రాష్ట్రాలు ఆపని చేస్తున్నాయి. అలాంటి చర్య తీసుకోకుండా రైతు భరోసా పథకం పేరుతో రైతాంగాన్ని ఉద్దరిస్తున్నట్లు నాటకమాడుతున్నది. బహిరంగ మార్కెట్‌లో ధరలు పడిపోకుండా చూసేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు 3వేల కోట్లను కేటాయించింది. దాని ద్వారా పంటలకు కనీస ధరలు లభించేలా చేస్తామని ప్రకటించింది. గత రెండేళ్లలో బహిరంగ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతుధర లభించక రైతాంగం అతి తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైంది. ధరల స్థిరీకరణ అలంకార ప్రాయంగా మిగిలింది. ఈ బడ్జెట్‌లో కూడా పథóకానికి నిధి ఏ మాత్రం పెంచకుండా 3వేల కోట్లను ప్రతిపాదించారు. ఈ మొత్తం, ఏ మాత్రం రైతుల ప్రయోజనాలు కాపాడలేదు. ఈ మేరకు కూడా అమలు చేస్తుందనే నమ్మకం లేదు.
ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు విపత్తులనిధిని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం గత సంవత్సరం 200 కోట్లు కేటాయించింది. ఈ సంవత్సరం ఏమాత్రం పెంచకుండా అంతే మొత్తాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ప్రతి సంవత్సరం అతివృష్టి, అనావృష్టి, చీడపీడల వలన రైతులు వేలాది కోట్లు రూపాయలు నష్టపోతున్నారు. అందుకు అనుగుణంగా రైతులకు పరిహారం అందటం లేదు. నష్టాన్నిలెక్కించే విధానమే లోపభూయిష్టంగా ఉంది. దాని ఫలితంగా రైతులు నామమాత్రపు పరిహారం పొందుతున్నారు. ఇది కూడా చాలా మంది రైతులకు అందటం లేదు.
వైయస్‌ఆర్‌ ఫసల్‌ పంటలబీమా ద్వారా నష్టపోయినరైతులు పరిహారం పొందే విధంగా బీమా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తం చెల్లిస్తామని చెప్పింది. అందుకోసం ఈ బడ్జెట్‌లో 1600 కోట్లు ప్రతిపాదించింది. గత వార్షిక బడ్జెట్‌ కన్నా 2,802.04 కోట్లు తక్కువ. దీన్ని గమనిస్తే ప్రీమియం చెల్లింపును తగ్గించుకుని రైతులపై భారం మోపనున్నదని అర్ధమౌతున్నది. మోదీ ప్రభుత్వం కూడా ప్రీమియం కేటాయింపు మొత్తాన్ని తగ్గించి రైతులపైనే భారం వేసేందుకు సిద్దమైంది. కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. అసలు పంటల బీమా పధకం రైతుల ప్రయోజనాల పేరుతో దేశ, విదేశీ బీమా కంపెనీల లాభాల కోసం, రైతులకు, బ్యాంకులు ఇచ్చే రుణాలకు గ్యారంటీ కోసం ప్రవేశపెట్టిందే. ప్రస్తుత బడ్జెట్‌లో వ్యవసాయ యాంత్రీకరణ కోసం 1,212 కోట్లు కేటాయించింది. ఇది రైతాంగ ప్రయోజనాల కోసం కాదు. బడా వ్యాపారస్తుల యంత్రాల మార్కెట్ల కోసం కేటాయింపు మాత్రమే. రాష్ట్రంలో అవసరానికిమించి వ్యవసాయ యాంత్రీకరణ ఉపాధికి ప్రమాదంగా మారి గ్రామీణ పేదరికాన్ని పెంచుతుంది. రైతాంగానికి ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు సంస్థాగత రుణాలు చాలా తక్కువగా అందుతున్నాయి. 27శాతం మించి రైతులకు రుణాలు ఇవ్వలేదు. సున్న వడ్డీ రుణాలు ఆర్భాట ప్రచారమే తప్ప, ఆచరణలో అందుతున్నది కొద్ది మంది రైతులకే. అందుకు కేటాయించినదే నిదర్శనం. బ్యాంకులు ఇచ్చే రుణాల్లో భూస్వాములు, సంపన్న వర్గాలే అత్యధికంగా పొందుతున్నారు. అత్యధిక మంది రైతులు వడ్డీల వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు.
ఎంతో ‘ప్రాధాన్యతగల నీటిపారుదల రంగానికి బడ్జెట్‌లో ప్రతిపాదించింది 11,085 కోట్లు కాగా, నిరుటి కన్నా 200 కోట్లు తక్కువ. నీటిపారుదల రంగానికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా! ఈ మొత్తంతో పూర్తి కావాల్సిన, మరమ్మతులు చేయాల్సిన పోలవరం, గోదావరి డెల్టా, పులిచింతల, తెలుగుగంగ, గాలేరు-నగరి, కండలేరు, వంశధార ఫేజ్‌ 2, హంద్రీనీవా, కండలేరు ఎత్తిపోతల పథకం, తోటపల్లి మొదలైన ప్రాజెక్టులు ఎలా పూర్తి అవుతాయి. గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా రాష్ట్రంలో 40 రోజులకు మించి పనులు లభించటం లేదు. కూలీలకు నెలల తరబడి కూలి డబ్బులు అందటం లేదు. కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా ఇతర పధకాలకు మళ్లిస్తున్నారు. పనులు కల్పనలో, వేతన చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.
బొల్లిముంత సాంబశివరావు, సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img