Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

‘లా’ కప్పులో తుపాను

చింతపట్ల సుదర్శన్‌

అరుగుమీద అసహనంగా అటూ, ఇటూ తిరుగుతున్నది డాగీ. అది అలా తోకని రెండు వైపులకీ విసిరికొడుతూ తిరుగుతుండటానికి కారణం ఒక దోమ. కంటికి లీలామాత్రంగా కనిపించే దోమే. ఒక చోట కుదురుగ్గా నిలబడలేక పోతున్నది డాగీ. కూర్చోవడం అసాధ్యమై పోయింది డాగీకి. విసిగి వేసారిపోయి ఎందుకే దోమా నా తోకచుట్టూ తిరిగి నన్ను హింస పెడ్తున్నావు అనరిచింది డాగీ. నిన్నేమన్నా అంటున్నానా. నీ తోకచుట్టూ తిరుగుతుంటే ఎంతో సరదాగా ఉంది. భలేగా కూడా ఉంది అంది దోమ. నీకు నా భాష అర్థమైందే అని ఆశ్చర్యపడ్దది డాగీ. మనుషుల్లోలా మనకు వేరువేరు భాషలు లేవు. మనుషులుకాని వాళ్లందరి భాషా ఒకటేననుకుంటాను అంది దోమ. నీ సరదా చట్టుబండలవనూ నాకిక్కడ చచ్చే చావులాగుంది. కూర్చోలేనూ నించోలేను మధ్యమధ్య తోక మీంచి లేచి వచ్చి నా చెవుల దగ్గర పాడే సంగీతం చిర్రెత్తిస్తున్నది. నా వెంట పడ్డావేం మనుషులెవరూ దొరకలేదా అంది కోప్పడుతూ డాగీ. కోపం మంచిదికాదు బాసూ. మనుషులను చూడగానే తోక ఊపుతావు విశ్వాసం ప్రదర్శిస్తావు ఎందుకు ఈ కుక్క బుద్ధి మార్చుకోలేవా. నన్నుచూడు నేనే కాదు మా జాతి మొత్తం మనుషుల్ని శత్రువులుగా భావించి చెడుగుడు ఆడుకుంటాం. మా కారణంగానే మలేరియా వ్యాధి సోకుతుందని వందా పాతిక ఏళ్లకిందట ‘రోనాల్డ్‌ రాస్‌’ అనేవాడు కనిపెట్టాట్ట. ఆదొక్కటేకాదు ఇప్పుడు డెంగ్యూ అనే వ్యాధిని తగిలిచ్చి మనుషుల ప్రాణాల మీదికి తెస్తున్నాం. వాళ్లు దయతలిచిపెట్టే తిండితింటూ తోకాడిస్తున్నారు మీరు. కానీ మేం మా స్వశక్తిని నమ్ముకుని ప్రాణాలకు తెగించి మనిషి నెత్తురు తాగుతాం. మమ్మల్ని నాశనం చెయ్యడానికి ఎన్నో ఎత్తులు వేస్తున్నాడు జిత్తులమారి మనిషి. కానీ మేం ‘సర్వవ్యాపకులం’ దేశమేదైతేనేం, ప్రాంతం ఏదైతేనేం, మనుషులెవరైతేనేం మా ‘స్టేబుల్‌ ఫుడ్డు’ మనిషి బ్లడ్డే అంది దోమ. అప్పుడే అరుగు ఎక్కుతూ ఆ మాటలు విన్నది డాంకీ. ఎవర్రా మాట్లాడేది.. కనపడ్డంలేదు కాని వినపడ్తున్నది అంది. వచ్చావా బ్రో రారా! ఈ దోమ ఒకటి నాతోక వెంటపడ్డది అంది డాగీ. అదా సంగతి అందుకా ఆ తోక ఊపుడు అని ఇకిలిస్తూ గోడకి జారిగిల పడ్డది గాడిద. నా తోకచుట్టూ తిరగడం మానేసి మా డాంకీ తోకను నమలరాదూ అంది డాగీ. నీ తోకలా కుచ్చు లేదు నా తోకకి కర్రలా ఉంది వాలిందంటే గోడకేసి బాదనూ అంది డాంకీ. ‘బ్రో దీని బాధ వదిలించు బ్రో’ అంది డాగీ దీనంగా. దోమా ఏ సీమ దానివే! ఎక్కడ్నించి వచ్చావే? అసలు నీ ప్రాబ్లమ్‌ ఏమిటే? కొంపదీసి రాజమండ్రి జైలు బ్యాచ్‌ దానివైతే కావు కదా! అంది డాంకీ. జైలు బ్యాచి ఏంటి బ్రో అనడిగింది డాగీ. తెలీదూ నిన్న ఓ నాయకుడు సెలవిచ్చాడు కదా. ఓ మహా నాయకుడ్ని అన్యాయంగా జైలుపాలు చేశారని అంతటితో అక్కసుతీరాక జైల్లో ఉన్న ఆ మహామేధావిని ఆ కంప్యూటర్‌ పితామహుడ్ని కాటేసి చంపడానికి ఓ దోమల మందను జైల్లోకి పంపారని. జైలుకు రవాణా చేస్తున్న ఆ దోమల్లోంచి తప్పించుకు వచ్చిందేమో ఈ దోమ అని ‘డవుటు’ అంది డాంకీ. ఎవడుపడితేవాడు ఏది పడితే అది మాట్లాడ్తాడు. అయినా ఎవరో ఎవరినో కుట్టి చంపమంటే చంపటానికి మేం ఎవరి నౌకర్లమో, చాకర్లమో కాము. అది బుర్ర ఉన్నోడైనా, లేనోడైనా నాయకుడైనా, ఓటరుడైనా ‘వీ డోంట్‌ కేర్‌’ అది బెడ్రూమైనా ‘జైల్‌సెల్‌’ అయినా మాకు ఒకటే. మా మీద నిందవేసి నాయకుడికి బోలుడు సానుభూతి సంపాదించాలను కుంటున్నారేమో అంది దోమ.
సానుభూతి అనేది ‘పెయిడ్‌ ఈవెంట్‌’ అయిపోయింది అంటూ అరుగుఎక్కాడు అబ్బాయి. కుక్కతోకను వదిలి మనిషి బ్లడ్‌ టేస్టు బాగా మరిగిన దోమ అబ్బాయి ముఖం మీద వాలి ఖర్మకాలి అతని రెండు అరచేతుల మధ్య శాశ్వత నిద్రలోకి జారిపోయింది. నువ్వన్నమాటకు అర్థం ఏమిటో చెప్పరాదూ అంది డాంకీ. ఏముంది వెరీ సింపుల్‌. స్వాతంత్య్ర సమరంలో జైలుకువెళ్లిన వాళ్లకు ఇంత పబ్లిసిటీ ఎక్కడేడిసింది! ఇంత ఫాలోయింగ్‌ ఉండేడిసిందా? ఇప్పుడు చూడుడి ఒకానొక లీడర్‌గార్ని జైల్లో పెడితే వంద దేశాల్లో జనం ఏడ్చి మొత్తుకుంటున్నారంట అన్నాడబ్బాయి. గుండెలు పగిలేవాళ్లూ, గుండెలాగిపోయిన వాళ్లూ అంటూ కట్టు కథలు కల్పించకు బ్రో అంది డాగీ. కట్టు కథలకాలం ఇది. మరి సోషల్‌ మీడియానే ఓ కట్టుకథల పుట్ట అదలాఉంచు. అక్కడెక్కడో జైలు ఊచలు లెక్కపెడ్తున్న నాయకుడికోసం ఇక్కడ మన సిటీలో కంప్యూటర్‌ ఇంజినీర్లు ఊరేగింపులు, నిరసనలు సాగించలేదా అన్నాడబ్బాయి. ఆ మర్నాడు ఈయన చేత ఊచలు లెక్కపెట్టించాలని సరదాపడ్డ నాయకుడికోసం కూడా ఇంజినీర్లు రోడ్ల మీదికి వచ్చారు కాదా అంది డాంకీ. అందుకే మరి సానుభూతి ఓ ‘పెయిడ్‌ ఈవెంటో’ ‘ప్రీ ప్లాన్డు ఈవెంటో’ అంటున్నానన్నాడబ్బాయి. ‘స్కిల్లు’ తెల్సిన వాడెగాన్ని ‘స్కాము’ లెరుగని వాడు అని సర్టిఫికెట్టు ఇచ్చేవారెందరో అంది డాంకీ. ఎవరికి వారు క్లీన్‌చిట్‌ ఇచ్చేస్తే ఎలా మరి కోర్టులూ, జడ్జిలూ ఉన్నావెందుకట అంది డాగీ. నేరం చేసినవాడు నేరం చేశానని ఒప్పుకోడు. నేరం రుజువు కాకపోతే ఎవరినీ కోర్టు శిక్షంచలేదు. ఎంతపెద్ద కార్చిచ్చయినా ఈ రోజుల్లో చప్పున చల్లారనూ వచ్చు అన్నాడు అబ్బాయి అరుగు దిగిపోతూ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img