Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

వజ్రాయుధంలాంటి కవి ఆవంత్స సోమసుందర్‌

   ఆచార్య ఎన్‌ ఈశ్వర రెడ్డి

జీవితాన్ని మొత్తానికి మొత్తంగా సాహిత్యానికి అర్పించిన కవి, విమర్శకుడు, అనువాదకుడు, నాటక కర్త, కథకుడు ఆవంత్స సోమసుందర్‌ (నవంబరు 18,1924 – ఆగష్టు 12,2016). బహుముఖ ప్రజ్ఞాశాలిగా శతాధిక గ్రంథకర్తగా ఆయన చేసిన సాహితీసేవ అనన్యం. వృత్తి, ప్రవృత్తి రెండూ సాహిత్యమే కావడంవల్ల ఆయన నిరంతర అభ్యాసిగా, సృజనశీలిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. శ్రీశ్రీ, నారాయణబాబు,ఆరుద్ర, దాశరధి, రమణారెడ్డి మొదలైన మొదటితరం అభ్యుదయ కవుల్లో సోమసుందర్‌ ఒకరు. స్వాతంత్రోద్యమకాలంలో బ్రిటిష్‌ వారి దౌర్జన్యానికి గురైన సోమసుందర్‌, వారికి వ్యతిరేకంగా గొంతును సవరించుకోవడం ప్రారంభించాడు. ‘ఒక వ్యక్తి సాంఘిక జీవితమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది’ అన్న కారల్‌ మార్క్స్‌ మాటలు పొల్లుపోనట్టు సోమసుందర్‌ చుట్టూ ఉన్న సాంఘిక సామాజిక జీవితమే అతనిలో ఉద్యమ గొంతుకు పునాదులేశాయి.
ఆ అణచివేతే ఆయనను అభ్యుదయ కవిగా మార్చింది. అభ్యుదయ సాహిత్య ఉద్యమం బలోపేతం కావడానికి కారణ కర్తను చేసింది. నిజాం పైశాచిక నిర్బంధాల నుంచి తెలుగుజాతిని విముక్తం చేయడానికి జరుగుతున్న పోరాటానికి తానూ ఒక ఆయుధమై ప్రభవించాడు. ‘వజ్రాయుధం’ పేరుతో ఆయన రాసిన కవిత్వం ఎంతోమందిని ప్రభావితం చేసింది. ‘‘కదలండి కదలండి కదలి పోరాడండి. తెలుగు వీరుడు మరణ మెరుగడని చాటండి. ‘‘పిరికి వానికి వేయి చావులని తెలపండి. పోరండి పోరండి బ్రతుకుకై, పోరండి పుడమికై, పోరండి స్వేచ్ఛకై’’ అంటూ తెలుగువారిలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్పకవి సోమసుందర్‌. ‘ఖబర్దార్‌ ఖబర్దార్‌ నిజాం బాదుషా హే! బానిసత్వ విముక్తికై, రాక్షసత్వ నాశముకై, హిందూ ముస్లిం పీడిత శ్రమజీవులు ఏకమైరి, ….నైజాం కీచకుడా! నీ పీచ మణచ ప్రజలంతా ఒక పిడికిట, ఒక గొంతుక, ఒక మ్రోతై ధ్వనిస్తారు. మృతవీరుల స్మరిస్తారు. నవయోధుల సృజిస్తారు’ అంటూ చైతన్యాన్ని, నమ్మకాన్ని తెలంగాణ పోరాటవీరుల్లో రేకెత్తించాడు. సోమసుందర్‌ రాసిన కవిత్వం స్థానిక, దేశీయ, అంతర్జాతీయ స్థాయిలోని సమస్యలను వస్తువుగా స్వీకరించింది. సోమసుందర్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనడంవల్ల తనకు జాతీయ, అంతర్జాతీయ సమస్యలు ఆకళించుకునే అవకాశం వచ్చిందని తనే రాసుకున్నాడు. పిఠాపురంలో కమ్యూనిస్టుపార్టీ ఆఫీసు అప్పటికే ఉండడంవల్ల, తను కూడా క్రియాశీల కార్యకర్తగా అందులో పని చేశాడు. దాని నిర్వహణకయ్యే ఖర్చుని తానే భరించడానికి నిర్ణయించుకున్నాడు. అంతేగాక రాంషా అనే మిత్రుడి సాయంతో సొంత ప్రెస్‌ ప్రారంభించి అభ్యుదయ కవిత్వ సేవకు పూనుకున్నాడు.
ప్రభుత్వ ఆంక్షలు ముళ్ళ కంచెల్లా అడ్డుపడుతున్నా ‘వజ్రాయుధాన్ని’ ముద్రించాడు. అప్పటికి శ్రీ శ్రీ మహాప్రస్థానం పుస్తక రూపంలో రాలేదు. 1949 మార్చి 5న వజ్రాయుధం విడుదలైంది. కావ్యాన్ని దాశరధి, రమణారెడ్డి, ఆరుద్ర, అనిశెట్టి మొదలైన సమదర్శకులకు అందరికీ పంచి వాళ్ళ కావ్యాలను కూడా అచ్చేయమని ప్రోత్సహించాడు. ఆరుద్ర త్వమేవాహాన్ని సోమసుందర్‌ తన ఖర్చుతో అచ్చేయించాడు. ఆ ఉత్సాహంతోనే అనిశెట్టి ‘అగ్ని వీణ’, ‘దాశరది’ó, ‘అగ్ని ధార’, ‘రమణారెడ్డి’, ‘అడవి’ కవితా సంపుటాలు వెలుగు చూశాయి. ప్రారంభదశలోనే అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి సోమసుందర్‌ గొప్ప ఊపు నిచ్చాడు. ‘సామ్యవాదం, కమ్యూనిజం ఆయన స్వప్నాలు’. వాటినిమాత్రం వదలడానికి ఏ దశలోనూ సిద్ధపడలేదు. తన కవితా జీవితమంతా సామ్యవాద ఆదర్శాలతోనే సాగింది. కాహళి, గోదావరి జలప్రళయం, రక్తాక్షి మేఘరంజని, సోమరసం సుందరకాండ, మిణుగురులు, అనల కిరీటం, వెన్నెలలో కోనసీమ, రాలిన ముత్యాలు, మా ఊరు మారింది, ఆగతానికి శుభారంభం, బృహత్కావ్యాలు, ఒక్క కొండలో వేయి శిల్పాలు, ఆంగ్లసీమలో ఆమని వీణలు, గంధ మాదనం, చేతావని, దోనాపాల, రక్ష రేఖ, మనస్సంగీతం, హృదయంలో హిరోషిమా, చిన్మయలహరి, జీవనలిపి సీకింగ్‌ మై బ్రోకెన్‌ వింగ్స్‌ మొదలైన కవితా సంపుటాలు ఆయన ఆలోచనకు, శ్రమకు సాక్ష్యం చెబుతాయి. సోమసుందర్‌ కథలు, మంది-మనిషి నాటకం, బుద్ధదేవ్‌ బోస్‌, లియోనార్డో డావిన్సీ, హంసధ్వని, కాజీనజ్రుల్‌ ఇస్లామ్‌, కాళిదాసు రామకథ, షెల్లీ జీవితం వంటి ప్రత్యేక రచనలు, రుధిర జ్యోతిర్దర్శనం, జాతికి జ్ఞాననేత్రం, కవిత్వం కాలాతీత కాంతిరేఖ, ఆధునిక కావ్య ప్రకాశిక, అమృత వర్షిణి, సాహిత్యంలో సంశయ కల్లోలం, అక్షర సమార్చన, ఆ తరం కవితా తరంగాలు, నారాయణ చక్రం, గోపుర దీపాలు, గురజాడ గురుత్వాకర్షణ, శరచ్చంద్రిక, పురిపండా ఎత్తిన పులిపంజా, నూరుశత్తులు, సైకత తీరంలో సాగర ఫేనం, నగరం నుంచి గగనం దాకా మనిషి, గవాక్షంలో అంతరిక్షం, మొదలైన విమర్శా గ్రంథాలు, కలలు కన్నీళ్ళు, కెరటాలు – కిరణాలు స్వీయ అనుభవ సంపుటులు ఆయన కలం నుండి రూపుదిద్దుకున్నవే.
మనిషిని మించిన దేవుడు లేడనే సత్యాన్ని, శ్రమను మించిన సౌందర్యం లేదనే తత్వాన్ని, త్యాగానికి మించిన తృప్తి ప్రపంచంలోలేవని సోమసుందర్‌ తన జీవితంలోనూ, సాహిత్యంతోను నిరూపించి చూపాడు. తన గమనం పొడవునా ఆశను ఒక దీపంలా వెలిగించుకున్నాడు. సంప్రదాయం తగిలించిన ఇనుప గొలుసులు తెంచేశాడు. కనిపించని స్వర్గ నరకాలను ఎండగట్టాడు. మనిషిని శాసించిన మతాలను, అవి సృష్టించిన పాప పుణ్యాలను కాకమ్మ కథలుగా తేల్చేశాడు. పిల్లి నడకలు, బల్లి శాస్త్రాలను ఊడ్చి పారేశాడు. మార్క్స్‌ నేర్పించిన గతి తార్కిక భౌతిక వాదం, ఐన్‌స్టీన్‌ విప్పిన గురుత్వాకర్షణ రహస్యం, ఫ్రాయిడ్‌ నిరూపించిన మనస్తత్వ సిద్ధాంతాలు ఆధునిక సమాజ ముఖ చిత్రాన్ని మార్చినట్టే సోమసుందర్‌ ఆలోచనారీతిని కూడా మార్చేశాయి. వీటి వెలుగులో సోమసుందర్‌ బలపరచుకున్న హేతువాదాన్ని కొలమానంగా స్వీకరించి పాటించాడు. ఎవరెంత సాధించినా, మనిషే చివరి లక్ష్యం కావాలని బోధించాడు. మానవ శ్రేయస్సు కోరలేని ఏ కళైనా, ఏ శాస్త్రమైనా వృథా అని చాటి చెప్పాడు. గేయ-వృత్త-వచన రూపాలు, అభివ్యక్తి-సంవిధానంలో ప్రదర్శించిన టెక్నిక్‌లు సోమసుందర్‌ విశిష్ట శిల్పానికి ప్రాణం పోశాయి. ‘ఉపమల’ కన్నా ‘రూపకాలకే’ బలమైన వ్యక్తీకరణ శక్తి ఉందని నమ్మే సోమసుందర్‌లో విభిన్న వస్తు-రూపాలను గమనించవచ్చు. రానున్న కాలంలో మానవ సమాజం ఎలా ఉండాలో చెప్తూ.. ‘‘ఆగామిక శతాబ్దంలోనైనా ఆకలినీ కన్నీళ్ళనీ నిషేధించుకొనే అమృత శక్తిని అందించనీ. మట్టికి జలసత్వాలనూ, మనిషికి జవసత్వాలనూ చేకూరుస్తూ శుభోదయాల స్వాగతిస్తాను’’(జీవన లిపి). తను చేయాల్సిన పని ఇంకా మిగిలిఉందని, అది గాంధేయ మార్గంలో సాధించాల్సిన అవసరంఉందని మథన పడుతూ.. ‘‘ కర్తవ్య పాలనమై ఇన్ని దశకాలైపోయిందా – ఐనా నా గుండెలోని ముసలాయని రాట్నం వడకడం మానలేదు. అదేం చిత్రమో ఆ మధుప రaుంకారం – చిత్ర చంచరీకమై ఎన్నెన్ని భాషలనో అంతర్నిబిడీకరించుకుంది. ఆయన జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఎన్నో మైళ్ళదూరం ముందుకు సాగాలి. ఇంకా ఎన్నో వాగ్దానాలు నెరవేర్చాలి. ఇంకా ఎన్నో ముళ్ళ డొంకల్ని కూకటి వ్రేళ్ళతో పెకలించి దహనం చేయాలి’’ (సీకింగ్‌ మై బ్రోకెన్‌ వింగ్‌) అని కోరుకున్నాడు. మానవతావాదిగా, అభ్యుదయ కవిత్వ ప్రవర్థకుడిగా ఎనలేని సేవచేశాడు. విమర్శకుడిగా దాదాపు అభ్యుదయ కవులందరి సాహిత్య సమాలోచనచేసి, సాహిత్య విమర్శా చరిత్రలో కూడా తనపేరు సుస్థిరం చేసుకున్నాడు. సుమారు డెబ్బై ఏళ్ళ సాహితీ జీవితాన్ని ఉన్నత విలువలకోసం త్యాగం చేశాడు. భారతీయ నాగరికతలోని ఉత్తమ సంప్రదాయాలను గౌరవిస్తూనే, విప్లవాత్మకమైన నూతన విలువల్ని సమాజంలో పరిణమింపజేయడానికి సోమసుందర్‌ కృషి చేశాడు. తెలుగు సాహిత్య చరిత్రలో సోమసుందర్‌ స్థానం చెరిగిపోనిది. వజ్రాయుధ కవిగా, వజ్రాయుధం లాంటి సాహిత్య కారుడుగా ఆయన సేవలు అజరామరం.
(సోమసుందర్‌ సాహిత్య కార్య క్షేత్రం అయిన పిఠాపురంలో శతజయంతి ప్రారంభసభ జరుగుతున్న సందర్భంగా)
(రచయిత అరసం కడప జిల్లా అధ్యక్షుడు
సెల్‌: 8328296952)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img