Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

వట్టి మాటలు వద్దు గట్టి చేతలు కావాలి

బినయ్‌ విశ్వం

ప్రపంచ వ్యాప్తంగా భూతాపం పెరుగు తున్నందున మానవాళి చరిత్రలో ఏనాడూ లేని సవాళ్లను నేడు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన వాతావరణ కార్యక్రమాన్ని సవరించి అడవుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ దేశమూ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో కలుగుతున్న వాతావరణ ప్రభావాన్ని విస్మరించలేదు. భూతాపంపై 1997లో 84 దేశాలతో జరిగిన క్యోటో సదస్సు చేసిన నిర్ణయాలు మైలురాయి లాంటివి. భూతాపం పెరుగుదలపై ఆయా దేశాల నేతలు ఆందోళనవ్యక్తం చేశారు. మానవాళి భవిష్యత్తుపై మృత్యుఖడ్గం వేలాడుతున్నదని హెచ్చరికలుచేశారు. పారిశ్రామిక విప్లవం తరవాత గడిచిన వందేళ్లలో దాదాపు 1.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరిగాయి. తక్షణ చర్యలు తీసుకుని భూతాపాన్నితగ్గించకపోతే మానవాళిసమస్తం అంతమయ్యే ప్రమాదంఉందని పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హెచ్చరిక చేస్తున్నాయి.
ఉష్ణోగ్రతలను తగ్గించకపోతే ప్రపంచ వ్యాప్తంగా 6 డిగ్రీల సెల్సియస్‌ భూతాపం పెరిగే ప్రమాదం ఉందని క్యోటో ఒప్పందం హెచ్చరించింది. ఐరాస, ఆయా దేశాలు ప్రపంచ భూతాపాన్ని నిరోధించేందుకు చర్యలను ఆలోచిస్తూ వస్తున్నాయి. పారిస్‌లో 2015లో 192 దేశాల నేతలు పాల్గొని చర్చించి ఒకఒప్పందాన్ని చేసుకున్నాయి. దీన్నే పారిస్‌ ఒప్పందం అంటున్నాం. పారిశ్రామిక విప్లవం ప్రారంభంలో ఉన్న ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ను తగ్గించాలని పారిస్‌ ఒప్పందం పిలుపు నిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 3డిగ్రీల సెల్సియస్‌ఉష్ణోగ్రతలు మించకుండా చూసుకోవాలని ఆ ఒప్పందం నొక్కి చెప్పింది. కర్బనపు విషతుల్య వాయువుల విడుదలను నియంత్రించటం ఈ ఒప్పందంలోని ప్రధానఅంశం. ఇందుకు అడవులు, సముద్రాలు, మంచుప్రాంతాలను పరిరక్షించి తీరాలని ఆఒప్పందం కోరింది.
నేడున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులలో చెప్పిన మాటలను ఆచరణలో చూపడం పెద్ద సవాల్‌గా నిలిచింది. ప్రపంచ భూతాపం నేపథ్యంలో ఆర్థికం, రాజకీయం అత్యంత కీలకంగా మారాయి. మానవ మనుగడనే ప్రశ్నిస్తున్న ప్రపంచ భూతాపంపై అమెరికా తదితర దేశాలు చిత్తశుద్ధిని కనపరచటం లేదు. పారిస్‌ ఒప్పందంపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఊగిసలాడు తూనే ఉన్నాడు. ఒక దశలో పారిస్‌ ఒప్పందాన్ని బహిష్కరిస్తానని కూడా బెదిరించారు. ప్రపంచీకరణకు భూతాపానికి పరస్పర సంబంధం ఉన్నది. వాతావరణ మార్పు, భూతాపం పెరుగుదలకు సంబంధించి అనేక సంద ర్భాలలో బహుళ జాతి కార్పొరేషన్లు వైట్‌హౌస్‌పై ఒత్తిడి చేసి తమ లాభాల కోసం షరతులను విధించాయి.
ఈ నేపథ్యంలో గ్లాస్గోలో వాతావరణ సదస్సు జరుగుతున్నది. సదస్సులో మాట్లాడిన నేతలు చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. మోదీ 2070 నాటికి కలుషిత వాయువుల విడుదలను జీరో (శూన్యం) స్థాయికి తగ్గిస్తామని వాగ్దానం చేశారు. గ్లాస్గ్గో సదస్సు ప్రారంభంలో 2030 నాటికి పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన వాతావరణాన్ని ఏర్పర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న దేశాలు తమ మాటలను ఆచరణలో పెడతాయా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఈ విషయంలో భారతదేశం అయిదు అంశాలతో కూడిన ప్రణాళికను ప్రకటించింది. మోదీ ఆకర్షణీయమైన ప్రసంగం సరిపోదు, ఆచరణ ముఖ్యం. ఇందుకు దృఢమైన రాజకీయ సంకల్పం కావాలి. గతంలో ఐరాస వేదిక నుండి మాట్లాడిన స్వీడన్‌ యువతి గ్రెటా థన్‌బర్గ్‌ పర్యావరణ కాలుష్యం, భూతాపం, మానవాళి ఎదుర్కొంటున్న ప్రమా దాలపై ప్రపంచ దేశాల నేతలను ప్రశ్నించింది. కొందరు నేతలు ప్రశంసించగా, ట్రంప్‌ లాంటి వారు విమర్శించారు. భారతదేశం అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించాలని చేసిన నిర్ణయం అడవుల విధ్వంసానికి, సముద్రాల వినాశనానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మోదీ గ్లాస్గోలో ప్రకటించిన అంశాలను సవరించుకుంటారా?

వ్యాస రచయిత సీపీఐ కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img