Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

వామపక్ష ఐక్యతకు నాంది పలకాలి

ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన తరుణంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ 19వ మహాసభలు జరుగుతున్నాయి. నేడు మానవాళి ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలను, కీలక సమస్యలను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా, సాంఘికంగా, రాజకీయంగా, సాంకేతికపరంగా, ఆర్థికపరంగా అనేక అంశాల్లో ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. కార్పొరేట్‌ సంస్థలు లాభాలవేటలో అధికారం, ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. సామ్రాజ్యవాదం ఫాసిజం రూపంలో పడగలెత్తి ప్రపంచ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రజల మధ్య, దేశాల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగతున్నాయి. మరో పక్క ప్రపంచశాంతి కనుమరుగవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పర్యావరణం మరింతగా క్షీణిస్తోంది. తత్ఫలితంగా నెలకొన్న భూకంపాలు, వరదలు, ఉప్పెనలతో ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. ఖనిజసంపద, భూ సంపద సామ్రాజ్యవాద శక్తుల దోపిడీకి గురవుతున్నాయి. ఆహార అభద్రత, ధరల పెరుగుదల, అసమానతలతో ఎక్కువశాతం ప్రజల జీవితాలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. బలవంతపు వలసలు, అటవీ సంపద తరుగుదల, సహజవనరుల విధ్వంసం, ఆవాసాల నష్టం ప్రజల జీవితాలను సమూలంగా నాశనం చేస్తున్నాయి. తాజాగా విజృంభించిన కోవిడ్‌ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా వర్గ విభజనలు తలెత్తాయి. గుత్తాధిపతులు వేలాదికోట్లు కూడగడుతుంటే, మరోవైపు కోట్లాదిమంది తమ జీపనోపాధిని కోల్పోయి తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఆధారంగా, దాదాపు 70 కోట్ల మంది పోషకాహారలోపంతో సతమతమవుతున్నారు. కోవిడ్‌ ప్రభావంతో 13 కోట్లమంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇది అత్యంత విచారకరం. అదే సమయంలో సామ్రాజ్యవాదం అన్ని రంగాల్లో విజయం సాధించలేకపోతోంది. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన కోసం ప్రపంచ దేశాలు ఉద్యమిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనోద్యమాలు జరుగుతున్నాయి. వర్ణవివక్ష, ఫాసిజానికి వ్యతిరేకంగా అనేక దేశాల్లో పోరాటాలు, ఉద్యమాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా అమెరికా సామ్రాజ్యవాదం అనేక ఎదురు దెబ్బలను, సంక్షోభాలను అనుభవిస్తోంది.
సామ్రాజ్యవాదానికి సంక్షోభ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పోరాటాలు, ప్రజా ఉద్యమాల పునరుజ్జీవనం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. సామ్రాజ్యవాద విధానాలను, వ్యవస్థలను ఆయా దేశాల ప్రజలు కుప్పకూల్చారు. ఆఫ్గానిస్తాన్‌లో అమెరికా సామ్రాజ్యవాదం కుప్పకూలడం, కజికిస్తాన్‌, క్యూబాలో ప్రభుత్వాలను కూలదోయడానికి పన్నిన కుట్రలకు తీవ్ర భంగపాటు ఎదురైంది. ఒకవైపు నాటో కూటమి ఐరోపా యూనియన్‌ సహకారంతో రష్యాకు వ్యతిరేకంగా చేపట్టిన తిరుగుబాటు ప్రయత్నాలు విఫలమయ్యాయి. యూరప్‌, నాటో మిత్రదేశాలతో ముప్పు ఉన్నప్పటికీ రష్యాఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఐరోపాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభం నాటో కోరికమేరకే జరుగుతోంది. మొత్తం సంఘర్షణలన్నీ అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాదుల దుర్మార్గపు ఎజెండాను తెరపైకి తెచ్చింది. మరోపక్క ఏళ్లతరబడి పాలస్తీనా ప్రజలపై దురాక్రమణలు, అకృత్యాలు, కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ దురాక్రమణలను అందరూ ఖండిరచాల్సిన అవసరం ఉంది. తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని అమెరికా సామ్రాజ్యవాద శక్తులు ఆక్రమించుకున్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో అమెరికా గుత్తాధిపత్య ధోరణి పేట్రేగుతున్న పరిస్థితుల్లో ఉద్రిక్తతల తీవ్రతను పెద్ద ఎత్తున ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి సంఘర్షణలు నివాసితులకే కాకుండా మొత్తం ప్రపంచాన్నే ఊహించలేని అగాధంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా అమెరికా ఆధిపత్యానికి లాటిన్‌ అమెరికా దేశాలు గట్టి సవాలుగా నిలిచాయి. లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రగతిశీల శక్తులు విజృంభిస్తున్నాయి. నూతన వామపక్ష పోరాటాలు జరుగుతున్నాయి. ఆర్థిక ఆంక్షలు, ప్రేరేపిత తిరుగుబాట్లు, హైబ్రిడ్‌ యుద్ధాలతో అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తున్నాయి. అమెరికా మద్దతుతో కూడిన తిరుగుబాటుకు వ్యతిరేకంగా సార్వత్రిక ఎన్నికల్లో బొలీవియన్లు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రజాస్వామ్య మార్గాలతో మట్టిగరిపించారు. లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్‌ ఇటీవలి ఎన్నికల్లో లూలా డా సిల్వాను ఎన్నుకుంది. దాని కీలుబొమ్మ ప్రభుత్వంతో అమెరికా చేసిన కుతంత్రాలకు వ్యతిరేకంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆ సందర్భంగా బ్రెజిల్‌ విప్లవ ప్రజలకు అభినందనలు తెలియ జేద్దాం. గాయపడిన పులి చాలా ప్రమాదకరమైంది. తన వేటకోసం మరిన్ని వికృతరూపాలను చేపట్టినట్లుగా సామ్రాజ్య వాదం కుతంత్రాలను రచిస్తోంది. బలహీనమైన భయంకరమైన సామ్రాజ్యవాదం మరింత ప్రమాదకరమైన విధ్వంస దశలోకి ప్రవేశించింది. క్షీణిస్తున్న దాని ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తన సైనిక ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. దాని యుద్ధ తంత్రం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కబళిస్తోంది. 2008 ప్రపంచ ఆర్థికమాంద్యం తర్వాత, ప్రజల జీవన విధానంలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఆర్థిక సంక్షోభంతో నిరుద్యోగం, అసమానతలు గతంలోకంటే మరింతగా ఎక్కువయ్యాయి. ఏది ఏమైనప్పటికీ, నయా-ఉదారవాద పెట్టుబడిదారీ విధానం వైఫల్యం అనేక దేశాలలో ప్రస్ఫుటించింది. తద్వారా మితవాద శక్తులు ఏకీకృతం కావడానికి, ప్రధాన రాజకీయ శక్తులుగా అవతరించడానికి వీలు కల్పించింది. ప్రజల్లో వైషమ్యాలను సృష్టించడం ద్వారా నయా ఉదారవాద వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు పెట్టుబడిదారీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. జెనోఫోబియా, మతతత్వం, జాత్యహంకారం, కలహాలు ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టాయి. ప్రజల మధ్య విద్వేషపు గోడలను సామ్రాజ్యవాద శక్తులు సృష్టిస్తున్నాయి. మితవాద శక్తులు విజృంభించి ప్రపంచశాంతికి ముప్పును కలిగిస్తున్నాయి. ప్రజల మధ్య శాంతి, సామరస్యం, మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజలను ఏకం చేయడం ద్వారా మనం గట్టి ప్రతిఘటన చేపట్టాల్సి ఉంది. ఈ సమావేశం భారతదేశ రాజకీయ జీవితంలో ముఖ్యమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. సామ్రాజ్యవాదం ముసుగులోే నడిచే మనదేశంలోని నయా ఉదారవాద పెట్టుబడీదారీ విధానం అనేక సంక్షోభాల్లో కూరుకుపోయింది. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని ఎన్‌డీఏ రెండోసారి విజయం సాధించడంతో ఉపఖండంలో ఫాసిజం పట్టు సాధించింది. మన దేశంలో రెండోసారి యూపీఏ ప్రభుత్వ పరాజయం తరువాత అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఐ ప్రభుత్వం ఫాసిస్టు మతతత్వాన్ని మన దేశంలో పెంచి పోషిస్తోంది. దేశంలోని లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రభుత్వం గుత్తాధిపతులకు విక్రయించడానికి పన్నాగాలు పన్నుతోంది. తద్వారా మన జాతీయ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మోదీషా ద్వయం దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని కార్పొరేట్‌, బహుళజాతి సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు మార్గాలను సుగమం చేస్తోంది. మరోవైపు ఎప్పటిప్పుడు సరికొత్త దోపిడీ బిల్లులను తీసుకొచ్చి చట్టాలను సవరించడం ద్వారా ప్రజలను విపరీతమైన ఇబ్బందులకు గురిచేసేందుకు అవకాశం కల్పిస్తోంది. నిత్యావసర చట్టాలను సవరించడం ద్వారా మన దేశ ప్రజల స్థితిగతులను మరింత నిర్వీర్యం చేసింది. బ్యాంకింగ్‌రంగాన్ని పూర్తిగా నిర్వీర్యంచేయడం ద్వారా దిగువ, మధ్యతరగతి ఆదాయవర్గాలపై ఒత్తిడి పెరిగింది. రైతు వ్యతిరేక, శ్రామికవర్గ వ్యతిరేక చర్యలను అమలు చేయడం ద్వారా దేశంలోని రైతాంగం, శ్రామిక వర్గ సమస్యలు మరింతగా పెరిగాయి. రైతుల ఆత్మహత్యలు, ఆహార ధాన్యాలపై సబ్సిడీ తగ్గింపు, శాశ్వత రుణభారం వంటి సమస్యలు దేశీయ వ్యవసాయ రంగానికి పెనువిపత్తుగా మారాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా తన నిరంకుశ విధానాలతో ముందుకు వెళుతోంది. ఈ ఆధిపత్య ధోరణితో మీడియాలో వ్యవస్థీకృత ప్రచారానికి గాను బీజేపీ శక్తులు మీడియానే కొనుగోలు చేశాయి. మోదీ ప్రభుత్వం ఆర్థికంగా, రాజకీయంగా దేశ నిర్మాణాన్ని ప్రమాదంలో ముంచెత్తుతోందని స్పష్టంగా చెప్పవచ్చు. బీజేపీ హానికారక లక్ష్యాలను సాధించడంలో భాగంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా దాడులను ప్రారంభించింది. జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవవస్థీకరణ చట్టం2019ని ఆమోదించడం, ఆర్టికల్‌ 370ని రద్దుచేయడం ద్వారా జమ్ముకశ్మీర్‌ను మూడు ముక్కలుగా విభజించి రాజ్యాంగ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది. ఈ విధంగా బీజేపీ దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేయడమేకాకుండా ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని, సోదరభావాన్ని ఛిద్రం చేసేందుకు యత్నిస్తోంది. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన భారత పౌరుల ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కుతోంది. ఇప్పుడు మనం ఈ మతతత్వ ఫాసిస్టు శక్తుల నుంచి లౌకిక ప్రజాస్వామ్య రాజకీయాలను ఎలా కాపాడుకోవాలన్నదే ప్రశ్న. ఇటీవల విజయవాడలో జరిగిన 24వ మహాసభల్లో ఈ అంశంపై సీపీఐ చర్చలు జరిపింది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ అభివృద్ధికి అన్ని లౌకిక, ప్రజాతంత్ర వామపక్ష శక్తుల విస్త్రత కూటమి అవశ్యంమనీ, ఈలక్ష్యాన్ని సాధించడానికి మతతత్వ ఫాసిస్టు శక్తులను ఓడిరచడానికి ప్రత్యామ్నాయంగా వామపక్షశక్తుల ఐక్యత, పునరేకీకరణకు నాందిపలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చింది. ప్రస్తుత రాజకీయపరిస్థితులపై ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 19వ కాంగ్రెస్‌ తీవ్రంగా చర్చించి లౌకిక, ప్రజాస్వామ్య వామపక్ష నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పాన్ని బలోపేతంచేసి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వస్తుందని నమ్ముతున్నాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img