Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

విగ్రహాలు సరే… వారి ఆశయాల మాటేంటి

పాలకులు చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉండటంలేదు. దేశంలో అనేక చోట్ల ప్రముఖుల విగ్రహాలను కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించారు. అయితే ఆ ప్రముఖుల సందేశాలను గానీ, వారి ఆశయాలను గానీ పాలకులు అనుసరించిన దాఖలాలు లేవు. గుజరాత్‌ రాష్ట్రంలో నర్మదా నది సమీపంలో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం సుమారు 3000 కోట్లతో 597 అడుగుల ఎత్తుగల స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చెప్పిన ‘‘ఐక్యత’’ అనే భావన నేటి ప్రభుత్వాలు ఏమేరకు అమలు చేస్తున్నాయి అనేదే ప్రశ్న..!? మరో సమతావాది, ఆధ్యాత్మిక గురువు సుమారు 1000 సంవత్సరాల క్రితం భారత్‌లో ఉన్న కుల, లింగ వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ‘‘రామానుజాచార్యులు’’ 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని సుమారు 135 కోట్లతో, హైదరాబాదు ముచ్చిం తల్‌లో నెలకొల్పారు. ఈయన సిద్ధాంతం కుల/ మత /లింగ వివక్ష లేని సమాజం అందరికీ సమానమైన అవకాశాలు నేటి పాలకులు అందిస్తున్నారా…!?
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో 108అడుగుల ఎత్తు, 218 టన్నుల బరువు కలిగిన నవీన బెంగళూరు నిర్మాతగా సంఘ సంస్కర్తగా, వాటర్‌ రిజర్వాయర్‌ నిర్మాణాలకు ఆద్యుడుగా పేరుగాంచిన ‘‘కెంప గౌడ’’ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, ఆరోజుల్లో మోరస్‌ ఒక్కలిగల వర్గంలో ఉన్న ‘‘ఆడపిల్లల ఎడమ చేయి చివరి రెండు వేళ్ళను నరికి(తొలగించే) అమానుష ఆచారాన్ని తొలగించిన ‘‘అసమాన సంఘసంస్కర్త ‘‘కెంప గౌడ’’ నేడు అదే ప్రాంతంలో బురఖా/హిజాబ్‌ ధరించే విషయంలో వివక్షతలు రేపుతూ మహిళలను చదువుకు దూరం చేసే పనిలో మతోన్మాద శక్తులున్నాయి. కెంప గౌడ ఆశయాలను ఈ పాలకులు ఏమి పాటిస్తునట్లు…!? ఇక రాజస్థాన్‌లోని పాలీ ప్రాంతంలో 151 అడుగుల ఎత్తు, 8 లోహాలతో తయారుచేసిన జైన ఆచార్య ‘శ్రీ విజయ్‌ వల్లభ సురేష్వర్‌ జీ మహారాజ్‌’ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఆచార్యుడు మహాత్మా గాంధీ చేస్తున్న అహింసా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు ఇస్తూ, దేశవ్యాప్తంగా విద్యాభివృద్ధికి కృషి చేశారు. ముఖ్యంగా మహిళలు, బాలికలు విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన పాలకులు విద్యను వ్యాపారం చేశారు. చరిత్రను తిరగరాసే పనిలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో నేటి పాలకులు ఈ విగ్రహ వ్యక్తుల ఆశయాలకు విరుద్ధంగా, పైకి మాత్రం షో చేస్తూ పాలన చేస్తున్నారు. ఇక కోయంబత్తూరులో ఆదియోగి విగ్రహం, కేరళలో కొల్లాం వద్ద జటాయువు విగ్రహం ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లో నేటి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ప్రపంచంలోనే ఎత్తయిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తు, 146 కోట్లతో నిర్మించారు. ‘స్ఫూర్తి ప్రదాత/ స్టాట్యు ఆఫ్‌ నాలెడ్జ్‌’గా పిలవవచ్చు. ప్రపంచం లోనే అత్యంత మేధావిగా పేరుగాంచిన అంబేద్కర్‌ ఈ దేశంలో కుల వివక్షత పూర్తిగా నశించాలని ఆశించాడు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాం గం ద్వారా అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాడు. అయినాసరే నేటికీ సమాజంలో 65శాతం పైబడి ఉన్న యస్‌సి, యస్‌టి, బిసి, మైనారిటీలు వర్గాల ప్రజలు అనేక విషయాలలో వెనుకబడి ఉన్నారు. స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి అయినా, రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 సంవత్సరాలు పూర్తి అయినా అందరికీ విద్య, వైద్యం అందుబాటులో లేదు. సరికదా నేటి పాలకులు అంగట్లో సరుకు వలే వ్యాపారవేత్తలకు వదిలివేశారు. నేటి సమాజంలో అంబేద్కర్‌ ప్రసాదించిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను పాలకులు హరిస్తున్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధకాండ, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌లు, రాజద్రోహం కేసులు. ఇలా పాలన చేస్తున్న పాలకులకు ఇటువంటి మహోన్నత వ్యక్తులు, సంఘసంస్కర్తల విగ్రహాలు ఆవిష్కరించే నైతిక విలువలు ఉన్నాయా….!! ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎన్నికలవేళ అనేక వర్గాలు, ఉద్రేకాలు సామాన్య ప్రజల్లో కలిపిస్తూ, ప్రజలను కుల, మత, ప్రాంతీయ, భాషా, లింగ ఆధారంగా విభజిస్తూ చౌకబారు రాజకీయ ఎత్తుగడలతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై, నియంతలు మాదిరిగా పాలిస్తున్నారు. సమస్యలతో ఉన్న ఉద్యోగ, ఉపాధి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మహానుభావులు విగ్రహాలు నిర్మించి ఫలితమేముంది? సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఏమి చేస్తున్నారో నేటి పాలకులు సమాధానం చెప్పాలి…? ధరలు పెరుగుదల, నిరుద్యోగం, రకరకాల వివక్షతలు, ఆర్థిక అసమానతలు, బాలకార్మికులు, బాల్య వివాహాలు, మహిళలపై అఘాయిత్యాలు, పని గంటలపెంపు, పోషకాహారలోపం, అనారో గ్యాలు, హత్యలు, ఆత్మహత్యలు, నకిలీ దందా, కాలుష్యాలు, ఆకలి కేకలు, రాజ్యాంగ సంస్థలు స్వయంప్రతిపత్తి కోల్పోవడం, అవినీతి, అభ్రతాభావం, రైతుల బాధలు, విద్య, వైద్యం అందుబాటులో లేక అనేక సమస్యలతో నేటి ప్రజలు సతమతం అవుతున్నవేళ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు భారత రాజ్యాంగం ప్రకారం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరిపాలన అందించాలి. ఏయే విగ్రహాలను ఇటీవల ఆవిష్కరిస్తున్నారో, వారి ఆశయాలను ప్రజలకు అందించేందుకు ప్రయత్నించాలి. ` రావుశ్రీ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img