Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

విమోచనం కాదు- ప్రజలకు విద్రోహం!

బొల్లిముంత సాంబశివరావు

తెలంగాణలో మూడు నెలల్లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం వివిధ రాజకీయ పార్టీలు అంది వచ్చిన అవకాశాలను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ విముక్తి అనే పేరుతో ఉత్సవాల నిర్వహణకు మేమంటే మేమని పోటీ పడుతున్నారు. ఈ ఉత్సవాలు నైజాం దోపడీ అణచివేత బంధనాలనుంచి ప్రజలను విముక్తి చేయటానికి రైతాంగ సాయుధ పోరాటం గురించి కాదు. రైతాంగ పోరాటంపై అతి క్రూరంగా అణచివేతను ప్రారంభించి, నైజాం నవాబుని, జాగీర్దార్లను, భూస్వాములను రక్షించటానికి నెహ్రు, పటేల్‌లను తెలంగాణ విముక్తి ప్రదాతలగా కీర్తించటానికి బీజేపీ, కాంగ్రెస్‌, బీఅర్‌ఎస్‌ పోటీ పడుతున్నాయన్న అంశాన్ని నేటి యువత అర్ధం చేసుకోవాలి.
భారత రైతాంగ ఉద్యమ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నైజాం నిరంకుశ పాలనకు, జమీందారీ విధానానికి వ్యతిరేకంగా భూమికోసం, విముక్తి కోసం తెలంగాణ ప్రజల జరిపిన పోరాటం అది. ఈ పోరాట ప్రాముఖ్యత నేటి తరం తెలుసుకోకుండా పాలక పార్టీలన్నీ విమోచన నాటకాన్ని తెరమీదకు తెస్తున్నాయి. నైజాం నవాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎట్టి హక్కులు లేకుండా, వెట్టిచాకిరిచేస్తూ, దారుణ దోపిడీకి గురౌతున్న సమయంలో ఆంధ్ర మహాసభ ఏర్పడిరది. మొదట భాషోద్యమం కోసం సంఘం కృషి చేసింది.1940లో మితవాద నాయకత్వం నుండి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల నాయకత్వంలోకి వచ్చింది. అప్పటినుంచి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టింది. వెట్టి చాకిరిరద్దు, కౌలు తగ్గింపు, దున్నే వానికే భూమిపై హక్కుల డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. సంఘంలోకి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి సంఘటితమయ్యారు. నీ బాంచన్‌ దొర అన్న పేదప్రజల కమ్యూనిస్టు పార్టీ కలిగించిన చైతన్యంతో జమీందార్ల, దేశ్‌ముఖ్‌ల, భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించసాగారు. వెట్టి చాకిరిని వ్యతిరేకించారు. భూమికోసం పోరు ప్రారంభమైంది. జమీందార్ల, దేశ్‌ముఖ్‌ల గుండెల్లో వణుకు పుట్టింది. ఆంధ్ర మహాసభ ప్రతి గ్రామానికి విస్తరించింది. సభలు, సమావేశాలతో మారు మోగింది. తన భూమి, పంట రక్షణ కోసం చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ భూ పోరాట ప్రధాన్యతను ముందుకు తెచ్చింది.
జనగామ తాలూక కడివెండి గ్రామంలో దేశ్‌ముఖ్‌ వినుసూరి రామచంద్రారెడ్డి గుండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వంతో పోరాటం కొత్తమలుపు తీసుకున్నది. దేశ్‌ముఖ్‌ల, జమీందార్ల దాడులను సాయుధంగా ప్రతిఘటన చేయాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. రైతాంగ ఉద్యమంపై నిజాం నవాబు ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. నిజాం రజాకార్లు ప్రజలపై పాశవిక దాడులు చేశారు. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన ఈ దాడులను తిప్పికొట్టేందుకు గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. నిజాం సైన్యాలను, రజాకార్లను దెబ్బమీద దెబ్బగొట్టి విజయపరంపరలను కొనసాగించాయి. పోరాటం ద్వారా పదిలక్షల ఎకరాల భూములు ప్రజలు స్వాధీనపర్చుకుని సాగుచేశారు. వేలాది గ్రామల్లో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాశక్తికి భయపడి జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, పట్టణాలకు పారిపోయారు. నిజాం నిరంకుశ ప్రభుత్వం రైతాంగ పోరాటంపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది.
రజాకార్లు గ్రామాలపై జగుప్సాకరమైన దాడులు చేశారు. రైతాంగ పోరాట ప్రాంతంలో ప్రతి నాలుగుమైళ్లకు మిలటరీక్యాంపు పెట్టి గ్రామాలపై దాడులు సాగించింది. తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. ప్రజలను ఒకేచోట మందవేసి పాశవికంగా హింసించారు. స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. పచ్చి బాలింతలను కూడా వదిలిపెట్టలేదు. ఇనుప పట్కార్లతో స్త్రీల రొమ్ముల పట్టి లాగటం, తల్లుల ఎదుటే పిల్లలను చంపటం జరిగింది. ఎంత నిర్బంధం ప్రయోగించినా రైతాంగ సాయుధ పోరాట విస్తరణను నిజాం ప్రభుత్వం ఆపలేకపోయింది. రైతాంగ సాయుధ పోరాటాన్ని అడ్డుకునే శక్తి నిజాం నిరంకుశ ప్రభుత్వ కోల్పోయింది. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నెహ్రు ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్ట్టించింది. నైజాం సైన్యాలు, రజాకార్లు కమ్యూనిస్టుల నాయకత్వాన సాగుతున్న ప్రజాఉద్యమాన్ని ఎదుర్కోలేక పోతున్నారని గ్రహించి, ఉద్యమం కొనసాగితే కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగి ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు ప్రారంభమౌతాయని నెహ్రు ప్రభుత్వం భయపడిరది. ఉద్యమాన్ని అణచివేసే బాధ్యత ప్రత్యక్షంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యమం ఇతర ప్రాంతాలకు విస్తరించటం అత్యంత ప్రమాదకరని భావించింది. 13-9-1948న హైద్రబాద్‌ సంస్థానానికి సైన్యాలను పంపింది. నిజాం సైన్యాలు బూటకపు ప్రతిఘటన నాటకమాడి రెండు రోజుల్లోనే నైజాం రాజు లొంగిపోయినట్లు ప్రకటించి, నెహ్రు సైన్యాలకు స్వాగతం పలికాడు. దీన్నిగమనిస్తే ముందుగానే సైనిక చర్యగురించి నెహ్రు ప్రభుత్వానికి, నైజాం నవాబు మధ్య ఒప్పందం జరిగిందనే అవగాహన ఉందని వెల్లడౌతుంది. నిజాం నవాబును గద్దెదింపటానికే సైన్యం వస్తే, మరి నవాబును (రాజుని) అరెస్టుచేసి నిర్బంధించాలి. కాని అలా జరగలేదు. రాజ్య ప్రముఖుడిగా నిజాం రాజుని ప్రకటించి 1950 జనవరి 26 వరకు నైజాం ప్రాంతాన్ని అతని పాలనలోనే ఉంచి, నెహ్రు ప్రభుత్వం 17-9-1950లో భారత యూనియన్‌లో విలీనంచేసింది. ఈ క్రమంలో గ్రామాలకు సైన్యాలను పంపి ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను జమీందార్లకు, భూస్వాములకు అప్పగించింది. దీన్ని గమనిస్తే నైజాం నవాబును, జమీందారీ, జాగీర్దారులను, భూస్వాములను రక్షించటానికే రైతాంగ సాయుధ పోరాటంపైకి మిలటరీదాడి అన్నది స్పష్టమౌతున్నది. అందుకు అనుగుణంగానే పెద్దఎత్తున నిజాం రాజ్యంలో సైన్యాన్నిదింపి రైతాంగ పోరాటంపై విరుచుకుపడిరది. నిర్బంధ క్యాంపులు పెట్టి ప్రజలను తీవ్ర చిత్ర హింసలకు గురిచేసింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. నాయకులను, కార్యకర్తలను పట్టుకుని కాల్చి చంపింది. నాలుగు వేలమంది కమ్యూనిస్టు ముద్దు బిడ్డలను, మరో రెండువేలమంది ప్రజలను నెహ్రు ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. వేలాదిమందిపై కేసులు బనా యించడమైంది. తెలంగాణ పోలీసురాజ్యంగా మారింది. రైతాంగ పోరాటానికి భయపడి పట్టణాలకు పారిపోయిన జాగీర్దార్లు, జమీందార్లు మిలటరీ రక్షణలో తిరిగి గ్రామాలకు వచ్చి బీభత్సం సృష్టించారు. 17-9-1948లో నెహ్రు సైన్యాలు చేసింది తెలంగాణ విముక్తి కాదు, జాగీర్దార్లను, దేశ్‌ముఖ్‌లను, భూస్వాములను రైతాంగ ఉద్యమం నుంచి రక్షించ టానికేననేది స్పష్టం. ఇది నెహ్రు ప్రభుత్వం చేసిన ప్రజాద్రోహం. నెహ్రు ప్రభుత్వం ఎంత నిర్భందం ప్రయోగించినా రైతాంగ సాయుధ పోరాటం కొనసాగింది. పార్టీలో చోటుచేసుకున్న మితవాద, అతివాద ధోరణులను 1951, అక్టోబర్‌ 31 మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమణకు కారణమైంది. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్మించింది కమ్యూనిస్టు పార్టీ అందుకు అనేక త్యాగాలు చేసింది కమ్యూనిస్టు పార్టీనే. అందువలన ఆ పోరాట వారసులు కమ్యూనిస్టులే. ఇతరులు దాన్ని ఉచ్చరించటానికి కూడా హక్కులేదు. ఇప్పుడు విద్రోహ కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వ్యతిరేక పార్టీలైన బీజేపీ, భారత రాష్ట్ర సమితి, మజ్లిస్‌ పార్టీలు సెప్టెంబర్‌ 17ని తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తామని, ఉత్సవాలు జరుపుతామని, అందుకు వారసులం మేమంటే మేమని పోటీ పడుతున్నాయి. ఆ రోజు జరిగిన విద్రోహం వలన ప్రజావ్యతిరేక దోపిడీ పాలకులు పాలన సాగించాయి, సాగిస్తున్నాయి. అందుకే ఈ మూడు పార్టీలు విద్రోహదిన వారసత్వం కోసం పోటీ పడుతున్నాయి. దీన్ని దేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గ్రహించాలి. 17-9-50న జరిగినది విమోచనం కాదు, ప్రజలకు విద్రోహ దినమని ప్రజలు గొంతువిప్పాలి. తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని నినదించాలి.
సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img