Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

విశ్వవిద్యాలయాలకూ నిధుల కోత!

భారతదేశ వ్యాప్తంగా 1,057 విశ్వవిద్యాలయాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో 54 సెంట్రల్‌ యూనివర్సిటీలు, 453 స్టేట్‌ యూనివర్సిటీలు, 126 డీమ్డ్‌ యూనివర్సిటీలు, 410 ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన తొలి 500 విశ్వవిద్యాలయాల్లో భారతదేశానికి చెందిన 8 యూనివర్సిటీలు, తొలి 1,000 విశ్వవిద్యాలయాల్లో 35 మాత్రమే ఉండడం మన ఉన్నత విద్యాసంస్థల విద్యా ప్రమాణాలను ఎక్కిరిస్తున్నాయి. వైభవంగా విశ్వ విజ్ఞానాన్ని పంచిన గత సరస్వతి విశ్వవిద్యాల యాలు నేడు అనేక సవాళ్ళ నడుమ దుస్థితికి చేరడం యువభారతానికి శాపంగా మారతున్నది. ఉన్నత విద్యపై ప్రభుత్వ నిధుల కేటాయింపులు గత దశాబ్దకాలంగా బడ్జెట్‌లో 1.5 శాతం కన్న పెరగడం లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,482 కోట్లు ఉండగా, 2022-23లో 2,078 కోట్ల మాత్రమే కేంద్ర విద్యాశాఖ కేటాయించడం విచారకరమే కాదు ప్రమాదకరం కూడా. కేటాయింపులు తగ్గడంతో పాటు 25 శాతం విద్యార్థుల ప్రవేశాలను పెంచడం, అధ్యాపకుల సంఖ్యను మాత్రం పెంచకపోవడం విచారకరం.
దీనికి తోడుగా యూనివర్సిటీల్లో పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలకు 8 శాతం నిధుల కోతను విధించడంతో గోరుచుట్టుపై రోకలి పోటులా యూనివర్సిటీ విద్య, పరిశోధనలు, మౌళిక వసతులు కొరవడి వెలవెలబోతూ, యువతను ఉన్నత విద్యతో ప్రయోజకులను చేసే యజ్ఞంలో విఫలం అవుతున్నాయి. భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అర్హతగల అధ్యాపకుల కొరత, లైబ్రరీ నిధుల కోతలతో జర్నల్స్‌/పుస్తకాల కొరత, జీతభత్యాల చెల్లింపులో జాప్యం, సౌకర్యాల కొరత, తరగతి గదుల్లో అతిగా విద్యార్థుల సంఖ్య, వసతులులేని హాస్టల్స్‌, పారిశుధ్యలేమి లాంటి అనేక సమస్యలు చుట్టు ముట్టి విద్యాబోధన, పరిశోధనలు అంతరించే స్థాయికి చేరడం దేశ ప్రగతికే గొడ్డలి పెట్టు కానున్నాయి. విశ్వవిద్యాలయాలు రోజువారి ఖర్చుల నిమిత్తం 2022-23లో రూ: 4,900 కోట్లు ఉండగా, 2021-22లో రూ: 4,693 కోట్ల నిధులు విడుదల చేశారు. ప్రతి పైసాకు రాష్ట్ర/కేంద్ర/డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు శ్రమపడాల్సి వస్తున్నది. దేశ రాజధానిలోని అనేక యూనివర్సిటీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. యూజీసీ నుంచి మేజర్‌, మైనర్‌ పరిశోధనల ప్రాజెక్టులకు కేటాయింపులు 2016-17లో 42.7 కోట్లు ఉండగా, 2020-21లో 38 కోట్లకు కుదించడం జరిగింది. దేశవ్యాప్త విశ్వవిద్యాలయాల్లో 2.7 శాతం మాత్రమే పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. బలహీన పాలనా వ్యవస్థల నిర్మాణాలు, రాజకీయ ఒత్తిడిలు, పారదర్శకత/జవాబుదారీతనం లోపించడం, మౌళిక వనరుల అగాధాలు, అధ్యాపకుల ప్రమాణాల్లో కొరతలు, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తిలో వ్యత్యాసాలు, పరిశోధనా నిధుల కోతలు, పీహెచ్‌డి ప్రోగ్రామ్స్‌ లేకపోవడం, విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు తరగడం, కనీస అవసరాలకు నిధులు కాకపోవడం లాంటి అనేక తీవ్ర సమస్యల వలయంలో చిక్కుకున్న విశ్వవిద్యాలయాలు యువభారతానికి ఆశించిన స్థాయిలో ఉన్నత విద్యను అందించడంలో విఫలం అవుతున్నాయి.
విశ్వవిద్యాలయాల్లో తగ్గిన విద్యా ప్రమాణాలు, ప్రయోగశాల సౌకర్యాల లేమి, అధ్యాపకుల కొరత లాంటి సమస్యలకు సమీప భవిష్యత్తులో సమాధానం దొరికే దారులు కనిపించడం లేదు. దీనికి తోడు నకిలీ డిగ్రీలు, పేపర్‌ లీకేజీలు, కలుషిత మూల్యాంకన కథనాలు, అవినీతి రాజ్యమేలడం, క్యాంపస్‌లో పోలీసు స్టేషన్లు వెలువడం, భావప్రకటనా స్వేచ్చను హరించడం, యువత చుట్టు కంచె కట్టి మేధో విస్తృతిని కుదించడం, ప్రజాస్వామ్య హక్కులకు కత్తెర వేయడం, విశ్వవిద్యాలయాలు అధికార పార్టీల స్థావరాలు కావడం, విసీలు అధికార యంత్రాంగానికి లొంగిపోవడం లాంటి పలు తీవ్ర సమస్యలు నేటి యువ విద్యార్థుల ఎదుగుదలకు విఘాతాలను కలిగిస్తున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లోని అనేక విశ్వవిద్యాలయాలకు చెందిన తెలంగాణ, ఉస్మానియా, జెయన్‌టియూ, కాకతీయ లాంటి యూనివర్సిటీల ఉప-కులపతులపై తీవ్రమైన అవినీతి మరకలు, నిధుల దుర్వినియోగ ఆరోపణలు నిత్యకృత్యం కావడం ఉన్నత విద్యను వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉపకులపతికి ఇతర పాలకవర్గానికి మధ్య రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం, విసీ చేసిన నియామకాలు విమర్శల పాలు కావడం విశ్వవిద్యాలయ పరువును దిగజార్చడం చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డి ఫీజును 2,500/-ల నుంచి ఏకంగా రూ:25,000/-లుకు పెంచడం విమర్శలకు దారి తీశాయి. జెయన్‌టియు విసీ నియామకంతో పాటు అతను తీసుకున్న పొరుగు సేవల సిబ్బంది నియామకాల విషయంలో ఆరోపణలు చుట్టుముట్టాయి.
బాసర ఆర్‌జియూకెటిలోని ఐఐఐటీ విద్యార్థులు హాస్టల్‌ వసతులు, ఆహార నాణ్యత, ప్రయోగశాల సౌకర్యాల విషయాల్లో రోడ్డుకెక్కడం చూసాం. నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ద్వారా రాబోయే ఐదు ఏళ్ళలో రూ: 600 కోట్లు వెచ్చించనున్నారు. నూతన విద్యావిధానం-2020 అమలు ద్వారా యువభారత మెదడులో క్రిటికల్‌ థింకింగ్‌, సమస్య పరిష్కారం, సామాజిక-మానవీయ-భావోద్వేగ విలువల విత్తులు నాటడం జరగాలని కోరుకుందాం. విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడడం, అవసర నిధులను కేటాయించడం, విద్యను పరిశోధనలకు ముడిపెట్టడం, విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తిని కాపాడటం, పాలనా సంస్కరణలు తేవడం, క్యాంపస్‌లో విద్య వాతావరణాన్ని నెలకొల్పడం, అధ్యాపకుల నియమకాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించడం, ఆధునిక డిజిటల్‌ యుగ మేధో వికాసం ఫలించడం, నైపుణ్య యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, విసీలను రాజకీయాలకు అతీతంగా నియమించడం లాంటి పరిష్కార చర్యలతో భారతీయ యువత ప్రపంచానికి జ్ఞాన వెలుగులు పంచడం జరగాలి. ఇదే విధంగా ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తే యువశక్తి నిర్వీర్యం కావడం, అశాంతితో ఎదురు తిరగడం, నిరుద్యోగం పేట్రేగి పోవడం జరిగే ప్రమాదం నుంచి పాలకులు సరైన సత్వర పరిష్కారాలు చూపాలి.
డా: బుర్ర మధుసూదన్‌రెడ్డి, 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img