డాక్టర్. కత్తి పద్మారావు
ఈనాడు భారతదేశంలో ఉన్న విశ్వ విద్యాలయాలన్నీ కూడా దళిత, ఆదివాసి, మైనారిటీల, వామపక్ష విద్యార్థులపై దాడులు చేస్తున్నాయి. దానికి కారణం ఈ బడుగువర్గాల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ధారణశక్తి, అభివృద్ధి, కవితాత్మకత, వ్యక్తిత్వ నిర్మాణ దక్షత విరివిగా ఉంటున్నాయి. దానికి అగ్రకులాల విద్యార్థులు, భూస్వామ్య కులాల విద్యార్థులు ఈర్ష్య పడు తున్నారు. భారతదేశంలో దళిత విద్యార్థుల అధ్యయనం పెరిగాక చరిత్ర, ఆర్థిక శాస్త్రం, మానవ పరిణామ శాస్త్రం, జీవశాస్త్రం, పురాతత్వ శాస్త్రం విస్తృతమయ్యాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో కూడా సివిల్, మెకానికల్ ఇంజ నీరింగ్‌లో దళిత విద్యార్థులు చొచ్చుకుపోతున్నారు. నిజానికి సాంకేతిక జ్ఞానం దళిత జీవనవిధానంలోనే ఉంది. వీరి తల్లిదండ్రులు శ్రమజీవులుకావడంతో చిన్నప్పటినుండి వీరి ఇళ్లల్లో కొడవళ్ళు, పలుగులు, పారలు, సుత్తులు,గొడ్డళ్లు, వలలు, మావులు దర్శనమిస్తాయి. ఆటల్లోకూడా దళిత, గిరిజన అమ్మాయిలు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారు. అందుకే అగ్రవర్ణ విద్యార్థులకు ఈర్ష్య, ద్వేషము, అసూయ, క్రోధంతో ‘‘మీరు రిజర్వేషన్లతో పైకి వచ్చిన వాళ్ళు, స్వయం ప్రతిభతో పైకి వచ్చిన వారు కాదు’’ అనే ముద్రతో వారిని వేటాడు తున్నారు. అనేక అవమానాలకు గురి చేస్తున్నారు. రిజర్వేషన్ గాళ్ళని హేళన చేస్తున్నారు.
మనుస్మృతి భావజాలాన్ని ఎదిరించడానికి నిజానికి విశ్వ విద్యాలయాలలో శాస్త్రజ్ఞానం పెంపొందించాల్సిన అవసరం ఉంది. దానికి తద్భిన్నంగా మతో న్మాద భావాలు విశ్వవిద్యాలయాలలో పెరగడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం. ఇటీవల జరిగిన మెడికో ప్రీతి ఆత్మహత్యను మనం తలచుకుంటే విశ్వవిద్యాలయాలలో మెడికల్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రొఫెసర్ దశకి వెళ్ళినవారు కూడా ఆదివాసీ, దళితుల నుంచి వచ్చిన విద్యార్థినులను వేధించడం చూస్తే వీళ్ల మానసిక వ్యవస్థలు ఎంత బలహీనంగా వున్నాయో మనకు అర్థమవుతుంది. వేధింపులలో ద్వేషం వుంది, లైంగిక ఉద్రేకత ఉంది. హింసాత్మక భావన వుంది, మానవతారహిత ధోరణి వుంది. 2022లో జాతీయ మహిళా కమిషన్ మహిళలపై హింసకు సంబంధించి 31,000 కేసులు స్వీకరించింది. ఇది 2014నుంచి వస్తున్న కేసులసంఖ్యలో అత్యధికం. అంత దూరం వెళ్లని కేసులు ఇంకెన్నో తెలియదు. కేవలం ఆరేళ్లలో అంటే 2016 నుండి 2022 వరకు మహిళల మీద నేరాలు 26.35 శాతం పెరిగాయి. కేవలం దేశ రాజధాని ఢల్లీిలో 2022 మొదటి ఆరు నెలల్లోనే 17 శాతం నేరాలు పెరిగాయని స్త్రీ వాదులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని స్త్రీలు ముందుకు వెళ్లుతున్నారు. ఆదివాసీలు, దళితులు యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలలో వేదనను అనుభవిస్తున్నారు. నిజానికి దళితులు, ఆదివాసీలు, స్త్రీలు ఈ మూడుశ్రేణులు భారతదేశానికి మూలశక్తులు. మరోపక్క వ్యవసాయ భూముల్లో పనిచేసే వారి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఆ కేసుల్ని భయపెట్టి మాఫీచేయగలుగుతున్నారు. 1989 ఎస్.సి., ఎస్.టి.లపై అత్యాచారాలకు నిరోధకచట్టాన్ని అన్ని పోలీస్‌స్టేషన్ అధికారులు నిర్వీర్యం చేస్తున్నారు.
కులాన్ని పోషించడానికీ హిందూమతం తన శక్తిని రంగరించి పోసింది. తన యుక్తిని ప్రదర్శించింది. హిందూ ధర్మాన్ని ప్రబోధించే గ్రంథాలన్నీ దాదాపు కుల ధర్మాన్ని ఎక్కువగా బోధించాయి. ‘‘చివరకు జ్యోతిష్యం, వాస్తు కూడా జాతులను, వర్ణాలను ఆరాధించినవే. అందువల్ల ఆ గ్రంథాలు గ్రహాదులనూ వర్ణ విభాగం చేసినవే. చివరకు చందస్సులోని వర్ణాలకు, అక్షరాలకు కూడా ఈ గతి పట్టింది. హిందూ ధర్మాల్ని ప్రచారం చేయడానికి వచ్చిన పురాణాలు, ప్రతి కథలో కుల సంస్కృతిని జాతికి ఉగ్గుగా పోశాయి. కరుణ రసానికి పెట్టింది పేరైన రామాయణంలో శంబుకుడిని ఈ కులం ముద్రతోనే చంపారు. ఈ కులం పేరుతోనే పురోహిత వర్గం విద్యను కొన్నివేల సంవత్సరాలు గుత్తకు తీసుకుని జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసింది. ఈ కుల విద్యతోనే తమకు అలౌకిక శక్తులున్నట్టు, అమోఘ మహిమలున్నట్లు కపట నటనలుచేసి సామాజిక ఆధిపత్యాన్ని చేపట్టి మిగిలిన వర్ణాలను అణగదొక్కి వైజ్ఞానిక పురోగమనానికి అడ్డుగోడగా నిలిచింది ఈ వర్గం. చారిత్రకంగా మనం ఆలోచించినట్లయితే ఇనుము కనుగొనడంతో వ్యవసాయాభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి సమాజంలో ప్రజా సమూహాలు సంచారదశ నుండి స్థిరనివాసం ఏర్పడటానికి దోహదపడిరది. స్థిరపడిన ఈ సమాజంలో అనేక వృత్తులు బయల్దేరాయి. వృత్తులు కూడా విద్యలే అయినప్పటికీ వీటికి విద్యా గౌరవం లేకుండాపోయింది. వృత్తి రీత్యా ఏర్పడిన కులాలు జన్మ రీత్యా స్థిరపడ్డాయి. కాని వృత్తి మారిపోయినప్పటికీ కులాలు మాత్రం మారలేదు.
వేదాన్ని వల్లించే వాడు తప్ప మిగిలిన వృత్తికారులకు విద్యావేత్తలుగా గుర్తింపులేదు. వాళ్ళు ‘‘శూద్రులు’’ అనే నామంతో దాసులుగా లెక్కించారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ సాగుతోంది. అందువలన శూద్రులు వేదాధ్యయానికి అర్హులుగా లెక్కించలేదు. ఎవడైనా పేద విద్యార్థి విద్యను అభ్యసిస్తే వాడి శిరచ్ఛేదము చేశారు. శంబుకుడిని ఈ విధంగానే చంపారు. భారతంలో ద్రోణుడు ఏకలవ్యుని విద్యా సంపత్తిని కులంపేరుతో అనర్హుడుగా ప్రకటించి దోచుకున్నాడు. కాని ధర్మశాస్త్రం ప్రకారం ద్రోణుడు ఉత్తమ బ్రాహ్మణుడై కూడా తన విద్యను పొట్టకూటికి అమ్ముకున్నాడు. కుల గోత్రాలు లేని పాండవులకు విద్య చెప్పడంలో లేని ధర్మ ప్రసక్తి ఏకలవ్యునికి విద్య చెప్పడంలో ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అయితే ఈ పురాణాలు బహుముఖాలుగా ప్రచారమై పురాణ పురుషులకే, కులధర్మం తప్పలేదు మనమెంత? అనే భావాన్ని సమాజానికి తీసుకొచ్చాయి. గీతను ప్రవచించి కులాన్ని మానవ ధర్మంగా నిర్దేశించిన కృష్ణుడు కులం పేరుతో రాజసూయ యాగం చేయగా శిశుపాలుడు అడ్డుకున్నాడు. హరిశ్చంద్రుడు కులం కోసం రాజ్యాన్ని, భార్యని, కుమారుని చివరకు తన్ను తాను అమ్ముకున్నాడు.
‘‘వర్ణ సంకర పుంబెండిలి యేల చుట్టెదవు నా కంఠంబునం గౌశికా’’ అని ఇప్పటికీ బలిజేపల్లి లక్ష్మీకాంతం పద్యాలు పాడటం వింటూనే వున్నాం కదా! అయితే ఇవన్ని పురాణ గాథలే, ఇవన్నీ సత్యాలు కావు. కాని భారతంలో కులాన్ని ప్రబోధించిన ఈ వ్యాసునకు కులమున్నట్లు కనబడదు. ఇతడు పరాశరుడనే మునికి, బెస్త కన్యకు పుట్టాడు. పరాశరుడు శక్తికీ పంచమ యువతిjైున అదృశ్యంతికి పుట్టాడు. శక్తి బ్రహ్మర్షిjైున వశిష్ఠునికి మాదిగ యువతిjైున అరుంధతికి జన్మించాడు. పురుషులు, ఋషులు, స్త్రీలు, అస్పృశ్యులు ఈ సందర్భంలోనే మనం మరొక్క విషయాన్ని కూడా గమనించాలి. వీరికి పుట్టిన పురుష సంతానానికి గౌరవం వచ్చింది. స్త్రీలకు మాత్రం గౌరవం లేకుండా పోయింది. వేదాల్లో ఋషులు పురుష సంతానానికై దేవతల్ని వేడుకొనుట, పుత్ర సంతతియే దేవతానుగ్రహముగాను, పుత్ర సంతతి కలుగుటయే దేవతలు తృప్తి పడినారనుటకు రుజువుగాను భావించారు. విశ్వవిద్యాలయాల నుండి గ్రామాల వరకు కుల, లింగ వివక్ష కొనసాగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఫూలే, అంబేద్కర్ భావజాలాన్ని మనం విశ్వ విద్యాలయాల నుండి సామాన్య ప్రజల వరకు కులభావం వుండడం వల్లే జరుగుతున్నాయి. స్త్రీలు ఉద్యోగాలు చేసే పనిప్రదేశాల్లో విపరీతమైన ఒత్తిడి కలిగిస్తున్నారు. పురుషాధికారులు అశ్లీలమైన కామెంట్లు, కించపరచే భాషను ఉపయోగిస్తూన్నారు. కుటుంబంలోను, ఉద్యోగంలోను స్త్రీలు తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నారు.
ప్రజల ఆవేదన గుర్తించి పాలనలో రాజ్యాంగ బద్ధులుగా జీవించకపోతే ప్రజల హృదయాల్లో మెదడుల్లో, ఆలోచనల్లో చోటు కోల్పోవడం తధ్యం. చరిత్ర ఈ రాజకీయ పాఠాలు మనకు నేర్పుతూనే వుంది. చరిత్రే అన్నిటికి నిలువెత్తు సాక్ష్యం. ఆవేదన అగ్ని కణం వంటిది. ఈనాడు భారతదేశంలో యువత భౌతిక, మానసిక, బౌద్ధిక శక్తిలు ప్రపంచానికే ఒక ఆదర్శం కావాలంటే భారతదేశం నుండి ఉద్యోగార్థులై ఇతర దేశాలకు వెళ్తున్న వలస సంస్కృతికి భిన్నంగా భారతదేశంలోనే వివిధ రంగాల్లో జీవనోపాధిని సృష్టించి వారిని ఇక్కడే జీవించేట్లు చేయగలిగితే భారతదేశం ఈనాడు దారిద్య్రం నుండి బయటపడేది. మహోన్నత ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాన్ని పాలకులు గుర్తించాలి. డా.బి.ఆర్.అంబేద్కర్ విద్య, ఉద్యోగం, ఉపాధి, జీవించే హక్కు, మాట్లాడేహక్కు, కుల నిర్మూలన భావన దేశానికి ఆయువుల వంటివి అని చెప్పాడు. ఎన్నో జీవనదులు, సముద్ర సంపద, మానవ వనరులు, భౌతిక సంపద, మానసిక తాత్విక మనోవిజ్ఞాన బలమున్న భారతదేశాన్ని పాలకులు నిర్లక్ష్యం చేయడం రాజ్యాంగ విరుద్ధం అని అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ మార్గంలో నడుద్దాం. భారతదేశ పునర్నిర్మాణానికి నడుం బిగిద్దాం.
వ్యాస రచయిత సెల్: 9849741695