Monday, February 6, 2023
Monday, February 6, 2023

వీర సింహం ఉయ్యాలవాడ

బి.యస్‌.నారాయణరెడ్డి

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి (1857) దశాబ్దం ముందే బ్రిటిష్‌ పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రాయలసీమలో రాయల కాలం నుండి పాలెగాళ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఒకరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. పరాయి పాలకుల దోపిడీని అరికట్టడానికి సాహసించి, ఎదిరించి బ్రిటీష్‌ పాలకులను వణికించి, భారతీయులలో స్ఫూర్తిని నింపిన వీరుడు ఆయన. బ్రిటీష్‌ వాడి కుటిల పన్నాగంలో దేశద్రోహుల చేతికి చిక్కి ప్రాణ త్యాగానికి వెరవక, ఉరికొయ్యను ముద్దాడిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కర్నూలు జిల్లాలోని రూపనగుడి, ఉయ్యాలవాడ ఆయన పుట్టి పెరిగిన గ్రామాలు.
ఇదే జిల్లాలో నొస్సం అనే గ్రామం ఉండేది. చిన్న పాల్యం చెంచుమల వంశజుడు జయరామిరెడ్డి దాని పాలకుడు. నొస్సం పాలెంలోని 66 గ్రామాలకు అతడే పరిపాలకుడు. ప్రజా రంజకంగా పాలించే ఘనతర కీర్తి గాంచాడు జయరామిరెడ్డి. పచ్చపచ్చగా ప్రశాంతంగా ఉన్న నొస్సంపై బ్రిటిషర్ల కన్ను పడిరది. ఆంగ్లేయులు దండెత్తి రావడంతో జయరామిరెడ్డి వారితో సంధి చేసుకున్నాడు. స్వదేశీ కత్తులు, కటారులు తప్ప ఏమీ లేని మనం మారణాయుధాలు ఉన్న ఆంగ్లేయులను గెలవలేమని, ఈ క్రమంలో ప్రజలను బలి ఇవ్వడం ఇష్టం లేక వారితో రాజీపడ్డాడు. జయరాంరెడ్డికి సంతానం లేదు తన కూతురి కుమారుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని దత్తు తీసుకున్నాడు. మొలక మీసపుప్రాయం వచ్చే సమయానికి నరసింహారెడ్డి కండబలంతో పాటు బుద్ధి బలమూ పెరిగింది. ఆయన ఎంత ప్రచండుడో-అంత శాంత స్వభావి. ఎంత పంతము గలవాడో- అంత మృదు స్వభావి. పగబూనితే శూలధారుడు- మైత్రినేర్పితే కల్పవృక్షం. నొస్సం దుర్గంలో అతని కొలువు నిత్య సాహిత్య వినోద గోస్టులతో సాగుతుండేది. తాత దత్తు తీసుకున్నందున నరసింహారెడ్డి నొస్సం పాలెగాడు అయినాడు. 1800 సంవత్సరంలో సర్‌ థామస్‌ మన్రో పాలెగాళ్ళ వ్యవస్థను రద్దు చేసి వారికి తవర్జీని (కొంత సొమ్ము ఇచ్చే) ఏర్పాటు చేశాడు. ఈ తవర్జీని ప్రతి నెల నరసింహారెడ్డి తన అనుచరుడిని కోవెలకుంట్ల ఖజానాకు పంపించి తెప్పించుకునేవాడు. ఒకానొక సమయంలో కోవెలకుంట్ల తాసిల్దార్‌కు నరసింహారెడ్డికి వాగ్వాదం జరిగింది. నరసింహారెడ్డి తహసీల్దారు నేమాత్రం లెక్కచేయక దండిరచి అవమానించడంతో రగిలిపోయిన తహసీల్దార్‌ రెడ్డిపై తన ఆధిపత్యం చూపించే అదను కోసం నిరీక్షించాడు. ఈ క్రమంలో తవర్జీ కోసం వచ్చిన నరసింహారెడ్డి దూతతో ‘అతనే ఒక దాసరి. కింద మరో దాసరియా? ఆ దాసరినే వచ్చి తవర్జీని తీసుకొమ్మను’ అని పరిహాసంగా వెక్కిరించి పంపాడు. అప్పటికే ఆంగ్లేయుల దాష్టీకం, వారి అధికార మతోన్మాద వైఖరి, పీడిరచి పన్నులు వసూలు చేయడం లాంటి దురాగతాలపై కోపంతో ఉన్న నరసింహారెడ్డిలో ఈ అవమానం మరింత ఆవేశాన్ని రగిల్చింది. తన సైనిక శక్తి అత్యల్పమైనా గుండెబలం, ఆత్మ విశ్వాసం, దేశభక్తితో కోవెలకుంట్ల ఖజానా మీద దాడి చేశాడు. ఇందుకోసం తనకు విశ్వాసపాత్రులైన కలవటాల బోయదండు సాయం తీసుకున్నాడు. ఈ దాడికి హడలిపోయిన తహసిల్దారు కార్యాలయ ఉద్యోగులందరూ పరిగెత్తి పోయినారు. తహసిల్దార్‌ ఎక్కడో మారుమూలగదిలో తలుపులు బిగించుకుని దాక్కున్నాడు. అయినా వెతకి వెతకి తలుపులు బద్దలు కొట్టి తహసిల్దారును బయటకులాగి ఆనాడు నీవన్న దానికిదిరా బదులు అంటూ తహసిల్దారు తలను నరికాడు నరసింహారెడ్డి. అనంతరం ఆ ఖజానా మొత్తం కొల్లగొట్టాడు. ఇది తెలుసుకున్న ఆంగ్లేయులు ఆగ్రహోదగ్రులయ్యారు. నరసింహారెడ్డిని పట్టి బంధించి తెమ్మంటూ అధికారి కాక్రేన్‌ను కొందరు సైనికులతో పంపించారు. వీళ్ళందరినీ బోయదండు బందీచేసి నరసింహా రెడ్డి కాళ్ళ ముందు ఉంచింది. మొదటి తప్పుగా భావించి మీకు ప్రాణభిక్ష పెడుతున్నాను మళ్లీ ఇటు రా వద్దు అని హెచ్చరించి వారి దగ్గర ఉన్న ఆయుధాలు, తుపాకులు, గుర్రాలు అన్నీ స్వాధీనపరచుకొని వెనక్కి పంపించాడు నరసింహారెడ్డి. రాబోయే పరిణామాలను ఊహించిన నరసింహారెడ్డి తన మకాంను ఉయ్యాలవాడ నుండి నొస్సం దుర్గానికి మార్చి రక్షణ బురుజులను పటిష్ట పరిచి కోట నిండా కావలసిన నిత్యావసర సరుకులు నింపి తగు జాగ్రత్తలతో ఉన్నాడు. అలియారామాలయ వంశస్థుడు అవుకు నారాయణ రాజు, ముక్కమల్ల, ముదిగోడు, కానాల, సంజామల తదితర బోయ నాయకుల సహకారం కూడా సమకూర్చుకున్నాడు. రెడ్డి వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న లెఫ్టినెంట్‌ కల్నల్‌ వాట్సన్‌ నొస్సం మీదకు అదను చూసి దండయాత్ర చేశాడు. వాట్సన్‌ సైన్యాన్ని మధ్యలోనే ఆపేసిన నరసంహారెడ్డి దండు వారిని కనీసం కోట దరికి రానీయలేదు. ఒడిసెలు, విల్లంబులతో విరుచుకుపడడంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన వాట్సన్‌ సైన్యం వెనుదిరిగింది. తీసుకొచ్చిన ఆయుధ సంపత్తి అంతా అయిపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న సమయంలో నరసింహారెడ్డి తన సైన్యంతో అకస్మాత్తుగా దాడిచేసి అందిన వారిని అందిన రీతిలో ఖండిస్తూ వీరవిక్రమావతారుడై విజృంభించాడు. దీంతో వాట్సన్‌ బతికుంటే చాలు అని పారిపోయాడు. బ్రిటిష్‌ అధికారులకు నరసింహారెడ్డి పేరు వింటేనే ఒళ్ళు గగుర్పొడిచేది. అలా ఆంగ్ల పాలకుల గుండెల్లో ఉయ్యాలవాడ సింహస్వప్నమయ్యాడు. నల్లమలలో భయంకరమైన అడవి మధ్య తన పూర్వీకులు కట్టించిన పాత భవనాలను పునర్నిర్మించి పటిష్ఠంగా తనకు రక్షణగా మార్చుకుని అక్కడకు తన వసతి మార్చుకున్న నరసింహారెడ్డి అక్కడ అటవీ జనులను పట్టి పీడిస్తున్న రేంజర్‌ను హతమార్చి అరణ్య జీవులకు ఆనందం కలిగించాడు. ప్రజలను పీడిరచే కంభం తహసీల్దారు, సూపరిండెంట్‌ను హతమార్చడంతో కంభం పరిసర గ్రామాలలో ఉయ్యాలవాడ పేరు మారుమ్రోగిపోయింది. నరసింహారెడ్డి సాహసకృత్యం వార్తలన్నీ నాటి దక్షిణాపథ ఆంగ్ల స్థావర ప్రధాన నగరమైన మద్రాసు చేరడంతో అక్కడి ఆంగ్ల పాలనాధికారులు నార్టన్‌ అనే అధికారిని పంపించారు. గిద్దలూరు సమీపంలోని శిబిరానికి ఆమడ దూరంలో ఉన్న రెడ్డి కోటకు నార్టన్‌ దారి చేసు కుంటున్న విషయాన్ని తెలుసుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక అమావాస్య నాటి రాత్రి ఆంగ్ల సైన్యం అంతా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా వారిపై విరుచుకుపడి అందినవారిని అందినట్లు హతమార్చాడు. దీంతో నార్టన్‌ కూడా సిగ్గుతో అవమానంతో తల దించుకొని బతికి ఉంటే చాలు అనుకుని పారిపోయాడు. అవమానం భరించలేని నార్టన్‌ బళ్లారి వెళ్లి అక్కడ సైన్యాన్ని, మందుగుండు సామాగ్రిని సమకూర్చు కున్నాడు. భార్య, మాతృమూర్తి ఇద్దరూ మరణించి తీవ్ర విషాదంలో ఉయ్యాడవాడ మునిగిపోయిన సమయంలో నార్టన్‌ అతని మీద దాడి చేశాడు. అయినా ఏ మాత్రం ధైర్యం సడలకుండా సముద్రపు అలల్లా పోటెత్తి కోట నుండే శత్రుసైన్యాన్ని ఎదిరించాడు. ఈ పోరు సుదీర్ఘంగా మూడేళ్ళు సాగింది. పోరాటంలో తన సైన్యమంతా ప్రాణాలు కోల్పోవడంతో చివరకు నరసింహారెడ్డి ఒంటరివాడయ్యాడు.
ఇక ప్రజలను శక్తివంతులుగా తయారు చేయాలనే సంకల్పంతో నల్లమల ఎర్రమలలోని జగన్నాధం అనే కొండమీద నరసింహ ఆలయంలో రహస్యంగా ఉండసాగాడు నరసింహరెడ్డి. నార్టన్‌… రెడ్డి కోసం నల్లమల అంతా జల్లెడ పట్టినా ఎక్కడా ఆనవాళ్లు దొరకలేదు. అతను మాత్రం తన ప్రయత్నం వదలకుండా విచారణ సాగించి రెడ్డి ఆచూకీని కనిపెట్టాడు. రెడ్డికి అన్నపానాదులు అందజేస్తున్న కాపరికి ధనాశ చూపించి రెడ్డి కోసం అతడు తీసుకెళ్ళే ఆహారంలో మత్తుమందు కలిపారు. అది తిని ఉయ్యాడవాడ స్పృహ కోల్పోయిన తర్వాత జగన్నాథం కొండమీద ఆలయాన్ని చుట్టుముట్టి ఆయనను బంధించి కోవెలకుంట్ల కారాగారంలో వేసారు. నాటి కలెక్టరు కాక్రేన్‌ రెండు వేల మంది ప్రజల సమక్షంలో 1847 ఫిబ్రవరి 22న వీర సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జురేటి ఒడ్డున బహిరంగంగా ఉరి తీయించాడు. గిద్దలూరు మండలం బుర్జుపల్లె కొత్తకోటలో ఇప్పటికీ నరసింహారెడ్డి నివసించిన (బురుజు) కోట ఆనవాళ్లు ఉన్నాయి. అందులో ఆయన వాడిన ఒక ఫిరంగి, గుండు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి.
వ్యాస రచయిత సెల్‌ 9441932390

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img