కార్మికులందరికీ అమలు చేయాలి
శిరందాసు నాగార్జున
దేశంలో ప్రాధాన్యం కలిగి, అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగం. స్వాతంత్య్రోద్యమంలో కూడా ఈ రంగం కీలకపాత్ర పోషించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చేనేత మనదేశ ఆర్థిక వ్యవస్థ బలపడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వాలు మాత్రం ఈ రంగం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దేశంలో, రాష్ట్రంలో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నాయో, ఎంతమంది చేనేత కళాకారులు లేక కార్మికులు ఉన్నారో లెక్కలు తేల్చలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలకు చేనేత వర్గాలు గుర్తుకు వస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత మగ్గంనేసే కార్మికులు దాదాపు 3 లక్షల మంది వరకు ఉన్నారు. దేశంలో అత్యధిక మంది చేనేత రంగంపై జీవిస్తున్నవారు ఏపీలోనే ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో చేనేత సహకార సంఘ సభ్యులు 2,00,310 మంది ఉన్నారు. సహకార సంఘాలలోలేని కార్మికులు 1,58,902 మంది ఉన్నారు. అంటే మొత్తం దాదాపు 3.60 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఓ లక్ష మంది చిలపలు ఎలిచేవాళ్లు, కండెలు చుట్టేవాళ్లు, అచ్చులు అతికేవాళ్లు ఉన్నా, 2.60 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటారు. వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 81,700 మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అంటే ఇంకా 1,78,300 కార్మికులకు ఈ పథకం అందడంలేదు. ఈ పథకం వర్తించడానికి రూపొందించిన నిబంధనలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. సొంత ఇల్లు లేక అద్దెకు ఉండే ఇంట్లో మగ్గం ఉన్న కార్మికులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇల్లు లేక మగ్గం పట్టేంత ఇంటికి అద్దె చెల్లించలేక మగ్గాల షెడ్లలో నేతనేసే నిజమైన చేనేత కార్మికులకు మాత్రం ఈ పథకం వర్తించడంలేదు. వారు ఈ పథకం కింద లబ్ధి పొందలేక పోతున్నారు. ప్రభుత్వం దృష్టిలో వారు చేనేత కార్మికులు కారు. చేనేత కార్మికులను శాస్త్రీయంగా గుర్తించే విధానాన్ని ఏ ప్రభుత్వం(అది ఏ పార్టీ అయినా) అనుసరించలేదు. ఆ ఆలోచన కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. రాజకీయ పార్టీలకు గాని, ప్రభుత్వాలకు గాని చిత్తశుద్ధి ఉంటే ఒక్క నెలరోజుల స్పెషల్‌డ్రైవ్ ద్వారా చేనేత కార్మికులను శాస్త్రీయంగా లెక్కించవచ్చు. చేనేత, సహకార వంటి సంబంధిత శాఖల అధికారులు మండలాల వారీగా ప్రతి చేనేత కార్మికుని ఇంటికి, ప్రతి సొసైటీకి, ప్రతి చేనేత షెడ్డు వద్దకు వెళ్లి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆ మగ్గాలను నేసే స్త్రీ, పురుష కార్మికులను గుర్తించాలి. అలాగే, పండుగుల సాగుల వద్దకు, ఆసుల వద్దకువెళ్లి అక్కడ పనిచేసే కార్మికులను గుర్తించాలి. చేనేత కార్మికులుగా వారికి అధికారికంగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డుల ద్వారా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం కల్పించాలి. ఈ విధంగా లెక్కతేల్చి, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చిన నాడే వారికి న్యాయం చేసినవారవుతారు. గతంలో కేంద్రప్రభుత్వం కార్వే సంస్థ ద్వారా సర్వే చేయించి కొంతమందికి కార్డులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హ్యాండ్లూమ్‌శాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చింది. కానీ, ఇప్పుడు వారికి పథకాలు వర్తించడంలేదు. అంటే, ప్రభుత్వం కార్డులు ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది.
కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డ్, హోం ఫర్ వర్క్‌షెడ్, మార్కెటింగ్ ఇన్సెంటివ్, చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనకరమైన మహాత్మాగాంధీ బంకర్ బీమా వంటి పథకాలను రద్దుచేసింది. దేశంలో నూలు ఉత్పత్తిచేసే స్పిన్నింగ్ మిల్లులు 40 శాతం చిలపనూలును గతంలో చేనేత అవసరాలకోసం సరఫరా చేసేవారు. ఇప్పుడు దాన్ని 15శాతానికి తగ్గించారు. దీంతో నూలుధరలు పెరిగాయి. ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో చేనేతవృత్తికి తీరనిఅన్యాయం జరుగుతోంది. లక్షాలాదిమంది జీవిస్తున్న చేతివృత్తి ద్వారా తయారయ్యే చేనేత వస్త్రాలపై కేంద్రం 5 శాతం జీఎస్టీ విధించడం అత్యంత దారుణం. అంతే కాకుండా, చేనేతకు ఉపయోగించే నూలుకు వేసే రంగులు, రసాయనాలపై 18 శాతం జీఎస్టీ విధించారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని, రద్దు చేసిన చేనేతకు సంబంధించిన పథకాలను పునరుద్దరించాలని, చేనేతవృత్తి చేస్తూ 80 సంవత్సరాలుపైబడి మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు కేంద్రం మత్స్యకారులకు ఇచ్చే విధంగానే ఐదు లక్షల రూపాయల బీమా వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీనియర్ జర్నలిస్ట్, 9440222914