Monday, January 30, 2023
Monday, January 30, 2023

వ్యర్థ పదార్థాల పర్వతాలు

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

కొందరి జీవిత వ్యర్థాలు మరి కొందరి జీవితాలను నిలబెడు తున్నాయి. మన దేశంలో వ్యర్థాలను కొంటారు. విదేశాల్లో వ్యర్థా లను తీసుకుపోయేవాళ్ళకు డబ్బులివ్వాలి. మురికివాడలతో ముంబయి మురికి అయిందని చాలామంది అంటారు. నిజానికి ఉన్నత, మధ్య తరగతి ప్రజలే చెత్తను సృష్టిస్తారు. ఆదాయం పెరిగితే చెత్త పెరుగుతుంది. చెత్త సృష్టికర్తలకు చెత్త నిర్వహణ విధానాలతో నచ్చజెప్పడం కష్టం. రాజకీయ సంకల్పంతో సమస్యను పరిష్కరించవచ్చు.

ప్రపంచంలో డెన్మార్క్‌ పరిశుభ్ర దేశం. బంగ్లా దేశ్‌, పాకిస్తాన్‌, భారత్‌లు మురికి కూపాల్లో ముందు న్నాయి. అమెరికా ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలో ఏడాదికి 830 కోట్ల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 630 కోట్ల టన్నులు ప్లాస్టిక్‌. 9 శాతమే తిరిగి ఉపయోగ పడుతోంది. 79% వ్యర్థాలుగా మిగులుతోంది.
మొత్తం 1250 అమెరికా చెత్త గుంతల్లో కాలి ఫోర్నియా ప్యూన్టే హిల్స్‌ చెత్త గుట్ట ప్రపంచంలోనే పెద్దది. ముంబయిలో రోజుకు 11 వేల టన్నుల చెత్త తయారవుతోంది. ఇండి యాలో పాతది, పెద్దదైన దేవనార్‌ చెత్త కొండ ముంబయి, శివాజీనగర్‌లో 330 ఎకరాల్లో ఉంది. ఇది 1927లో ఏర్పాటైంది. 8 గుట్టలుగా కాంక్రీటులా గట్టిపడ్డ ఈ చెత్త కుప్పల్లో మురికివాడలు వెలిశాయి. దేవనార్‌ చెత్త కొండలో రోజుకు 5,500 టన్నుల వ్యర్థాలు, 600 టన్నుల బురద, 25 టన్నుల జీవ వైద్య వ్యర్థాలు వేస్తారు. వర్షాకాలానికి ముందు మార్చి-జూన్‌లలో మురికి కాలువలను శుభ్రం చేస్తారు. ఈ కాలంలో రోజుకు 9 వేల టన్నుల బురద పడుతుంది. దేవనార్‌ చెత్త కొండను 164 అడుగుల ఎత్తుకు అనుమతించమని 2012లో బృహన్ముంబయి నగరపాలక సంస్థ (బిఎంసి) విమానాశ్రయ సంస్థను కోరింది. ఇప్పుడు ఇది 18 అంతస్తుల ఎత్తుంది. దేవనార్‌ చెత్త కొండతో పాటు ములుంద్‌, కంజుర్‌ మార్గ్‌ చెత్త గుట్టలను బిఎంసి నిర్వహిస్తోంది. ములుంద్‌లో రోజుకు 2 వేల టన్నుల చెత్త పడుతుంది. శాస్త్రీయంగా నిర్వహించే కంజుర్‌ మార్గ్‌ చెత్త గుట్టను 2015లో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లో ఘాజిపుర్‌ చెత్త గుట్ట 70 ఎకరాల్లో ఉంది. ఇక్కడ రోజుకు 1.4 కోటి టన్నుల వ్యర్థాలు పోగుపడతాయి. నేడు గ్రామీణ ప్రాంతాలతో సహా పట్టణాలూ మురికి కూపాలే. ఇంతే గాక ఇండియా అభివృద్ధి చెందిన దేశాల ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాల గిడ్డంగిగా మారింది.
చెత్తకుప్పలు నేల, గాలి, భూతల భూగర్భ జలాలు, పర్యావరణాలను కలు షితం చేస్తున్నాయి. కుళ్లిన వ్యర్థాల నుండి మిథేన్‌, నత్రజని, సల్ఫైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి హానికర విషవాయువులు వెలువడతాయి. చెత్తగుట్టలను తర చుగా తగలబెడతారు. దేవనార్‌ చెత్త కొండకు అగ్ని ప్రమాదాలు ఎక్కువ. 2016 జనవరిలో ఇది తీవ్రంగా కాలింది. నెలల తరబడి మంటలు ఆగలేదు. దట్టంగా పొగలు కమ్మాయి. ప్రజలు ఊపిరి పీల్చుకోలేకపోయారు. 2 రోజులు 74 బళ్ళను మూసేశారు. శిశు మరణాలు రెట్టింపు అయ్యాయి. మామూలుగా 1,000 మంది పిల్లలకు 35.2 మరణాలుండగా ఆ ప్రాంత శిశుమరణాల సంఖ్య 80కి పెరిగింది.
చెత్త ఏరుకునేవారిని తక్కువ కులస్తులుగా, అంటరానివారిగా పరిగణిస్తు న్నారు. 2016 మంటల తర్వాత వారిని చెత్త కుప్పల వద్దకు రానివ్వలేదు. వారిని అడ్డుకోడానికి భద్రతా సిబ్బందిని నియమించారు. చెత్త ఏరుకునేవారు చెత్తకుప్ప లకు నిప్పు పెడతారు. చెత్త, పొట్టు, గుడ్డ పీలికలు కాలిపోతాయి. తీగలు, కడ్డీలు, ఇతర ప్రయోజనకర ఘన పదార్థాలు మిగులుతాయి. వీటిని తీసుకుపోయి అమ్ము కోవచ్చు. చెత్త కుప్పల దగ్గరికి పోయేవారిని కొడతారు. కాని కాపలా సిబ్బందికి లంచాలిస్తారు. లేదా వారు రాకముందే చెత్తకుప్పల దగ్గరకు పోతారు. ఆకలి అలాంటిది. కొందరు రోజూ రూ.50 లు ఇచ్చి పోతారు. ఈ ఖర్చు రాబట్టుకో డానికి హానికరమైన ఆస్పత్రుల కోవిడ్‌ వ్యర్థాలను కూడా కెలుకుతారు. ఇప్పుడు చెత్తలో ఆస్పత్రుల వ్యర్థాలే ఎక్కువ. కోవిడ్‌కు ముందు చెత్త ఏరుకునేవారికి రోజుకు రూ.300లు వచ్చేది. ఇప్పుడు రూ.100 లే వస్తోంది. రూ.50 ల లంచం పోనూ రూ.50లే మిగులుతోంది. కోవిడ్‌ లాంటి అంటు రోగాలు సోకి చనిపోతామనే భయం కంటే ఆకలితో చనిపోతామనే భయమే ఎక్కువ వారికి.
వారాంతాల్లో చెత్త ఎక్కువగా వస్తుంది. అందులో మోదీ ముఖచిత్రాల కాగి తాలు, కార్పొరేట్‌ ఆర్థిక సూత్రాల పత్రికలూ ఉంటాయి. వ్యర్థాల్లో ప్లాస్టిక్‌ ఎక్కువ. రాగి బదులు అల్యూమినియం తీగలుంటాయి. చెత్త ఆదాయం తగ్గింది. భారతీ యులు ఇప్పుడు ఎక్కువ వ్యర్థాలు సృష్టిస్తున్నారు. వంట మాని హోటల్‌ తిండికి అలవాటు పడటం, తొందరగా పాడయ్యే నాసి రకం ఎలెక్ట్రానిక్‌ పరికరాలు, హోమ్‌ డెలివరీలు, పొదుపు విధానాలు వ్యర్థాల పెరుగుదలకు కారణాలు. పిల్లలు, స్త్రీలు చెత్తకుప్పల్లో ప్లాస్టిక్‌, తీగలు, గాజు వస్తువులు ఏరుకుంటారు. వీటికి గిరాకీ ఉంది. పిల్లలు ఎక్కువగా పగిలిన స్మార్ట్‌ ఫోన్లు వెతుక్కుంటారు. వారానికి ఒక్క ఫోన్‌ అయినా దొరుకుతుంది. వ్యర్థాలు అమ్మగా వచ్చిన డబ్బుతో వీటిని బాగు చేయించుకుంటారు. చౌక సిమ్‌లకు కొదవలేదు. పిల్లలు సెల్‌ ఫోన్లలో ఆటలు ఆడతారు. రాత్రులలో శృంగార, అశ్లీల చిత్రాలు చూస్తారు. అసాంఘిక చర్యల మూల కారణాల్లో ఇదీ ఒకటి.
వ్యర్థాలను ఉపయోగాలుగా మార్చే పథకాలు చేపట్టమని 20 ఏళ్ల నుండి కేంద్ర ప్రభుత్వాలు నగర పాలక సంస్థలను ఆదేశిస్తున్నాయి. రాష్ట్రాల, ప్రాంతీయ పాలక వర్గాల స్పందన నామమాత్రమే. వ్యర్థాల శుద్ధి యంత్రాల స్థాపన తక్కువగా జరిగింది. 2 కోట్ల జనాభా గల వాణిజ్య, వినోద కేంద్రం ముంబయిలో ఒకే ఒక ప్లాంట్‌ ఉంది. దేవనార్‌ చెత్త నుండి (విద్యుత్‌) శక్తి పథకం స్థాపించే ప్రతిపాదనను ఆగస్టు 6 న బిఎంసి మహారాష్ట్ర పర్యావరణ శాఖకు పంపగా ఆమోదించారు. దీనిని నిపుణుల కమిటి పరిశీలిస్తోంది. దిల్లీలోని తాత్విక సంస్థ శాస్త్రవిజ్ఞాన పర్యావరణ కేంద్రం (సి.ఎస్‌.ఇ.) గతేడాది భారత చెత్తకుప్పలపై అధ్యయనం చేసింది. 3,159 చెత్త గుట్టల్లో రోజుకు 80 కోట్ల టన్నుల చెత్త పోగవుతున్నట్లు నివేదించింది. దేవనార్‌ చెత్త కుప్పలను మూసివేయాలని ముంబయి కోర్టులో 26 ఏళ్లుగా వ్యాజ్యం నడుస్తోంది. ఐనా చెత్త వేయడం ఆగలేదు. ముంబయి సామాజిక కార్యకర్త జ్యోతి మ్హాసేకర్‌ చెత్త ఏరుకునే వారికి, పారిశుద్ధ్య కార్మికులకు సాయ పడుతూ, వారి శ్రేయస్సుకు పోరాడుతున్నారు. బాలీవుడ్‌ నటీమణులు షబనా అజ్మీ, నందితా దాస్‌ మురికివాడల అభివృద్ధికి విశిష్ట సేవ చేశారు. మరొక నటీమణి, సైన్యాధికారి కూతురు గుల్‌ పనాగ్‌ హక్కుల కార్యకర్తగా మారారు.
అక్టోబర్‌ 1న ప్రధాని రూ. 97,500 కోట్ల జాతీయ శుద్ధి పథకం ప్రకటిం చారు. ఇందులో మురికి నీటి, చెత్త కుప్పల శుద్ధి యంత్రాలను స్థాపిస్తారు. శుద్ధి పథకం అమలైతే చెత్త ఏరుకునేవారి బతుకుదెరువు పోతుంది. ఐతే నిపుణులు ఈ పథకాన్ని అనుమానిస్తున్నారు. చిన్న చెత్త కుప్పలను శుద్ధి చేయవచ్చు. వ్యర్థాల కొండల శుద్ధి సాధ్యం కాదని సి.ఎస్‌.ఇ. డెప్యూటి ప్రోగ్రాం మేనేజర్‌ సిద్దార్థ ఘనశ్యామ్‌ సింఫ్‌ు అన్నారు. ‘‘ఇది సమస్యే. దిల్లీ, ముంబయి లాంటి నగరాల్లో నివసించాలంటే చెత్త కొండలు తప్పవు.’’ అని వ్యర్థాల తగ్గింపు సలహా బృందాల సంకీర్ణం ‘నిర్మూలన ప్రత్యామ్నాయాల ప్రపంచ కూటమి’ సంధాన కర్త ధర్మేశ్‌ శాప్‌ా అన్నారు.
కొందరి జీవిత వ్యర్థాలు మరి కొందరి జీవితాలను నిలబెడుతున్నాయి. మన దేశంలో వ్యర్థాలను కొంటారు. విదేశాల్లో వ్యర్థాలను తీసుకుపోయేవాళ్ళకు డబ్బులివ్వాలి. మురికివాడలతో ముంబయి మురికి అయిందని చాలామంది అంటారు. నిజానికి ఉన్నత, మధ్య తరగతి ప్రజలే చెత్తను సృష్టిస్తారు. ఆదాయం పెరిగితే చెత్త పెరుగుతుంది. చెత్త సృష్టికర్తలకు చెత్త నిర్వహణ విధానాలతో నచ్చజెప్పడం కష్టం. రాజకీయ సంకల్పంతో సమస్యను పరిష్కరించవచ్చు. స్వచ్ఛ భారత్‌, ప్రజాప్రతినిధుల, కార్పొరేట్ల సామాజిక బాధ్యత నిధులను చెత్త శుద్ధికి వాడవచ్చు. ప్రజలు పౌరజ్ఞానం పెంచుకోవాలి. బాధ్యతలు నిర్వర్తించాలి. తక్కువ చెత్తను ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి అయిన చెత్తను వీలున్నంత వరకు పునరుపయోగ పర్చాలి. ప్రభుత్వాలు రాజకీయ బాధ్యత మరువరాదు.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి,
9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img