Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

సదా మీ సేవలో

చింతపల్లి సుదర్శన్‌

పైకప్పు లేదు. మొండి గోడలు. విరిగిన కిటికీ, ఊగులాడు ఒకే ఒక్క తలుపు రెక్క. ఈ ఇంట్లో మనుషులు ఉంటారా అనుకుంటూ మెట్లెక్కాడు ఓ యువకుడు. గోడకు ఆనుకుని కూచున్న డాగీని గమనించకుండా అలికిడి విని కళ్లుమూసుకునున్న గ్రామసింహం చురుగ్గా కదిలి చలాకీగా లేచి నిలబడి ఒళ్లు విరుచుకుని నోరు తెరిచి అరుపు లంకించుకుంది. ఉలిక్క పడ్డాడు యువకుడు. అప్పటికే అరుగెక్కాడు. క్షణకాలంపాలు ‘స్టిల్‌ ఫొటో’ అయిపోయేడు. అరిచే కుక్క కరవదు అని విన్నట్లు గుర్తుకొచ్చింది. కొంచెం ధైర్యంచేసి వెనక్కి తిరగబోయేడు ఆగు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని విని కదలకుండా నిలబడి ఆ ధ్వని వచ్చినవైపు చూశాడు. అక్కడ ఓ గాడిద నాలుక్కాళ్ల మీద కూచుని ఉంది. యువకుడికి ఏమీ అర్థంకాలేదు. మాట్లాడిరది గాడిదేనా అని డవుటు పడ్డాడు. కుక్క మొరగడం ఆపింది. దిక్కులు చూడబోకోయ్‌ మాట్లాడిరది మా ‘బ్రో’ నే డాంకీనే అంది డాగీ. ఈ సారి తన బాడీ గాలిలోకి ఎగిరి గింగిరాలు తిరిగినట్టయి యువకుడు అరుగు మీద కూలబడ్డాడు. మాట్లాడుతున్నది డాగేనని అర్థమైంది.
కంగారుపడకు ఇక్కడెవరూ లేరు ఓండ్ర పెట్టే నేనూ, కరవక అరిచే డాగీ తప్ప అంది డాంకీ. కుక్క గాడిద మాటాడ్డం ఏమిటి అనుకున్నాడు యువకుడు తన్లోతాను. అది పైకి వినపడిరది, అనవసరంగా టెన్షన్‌ పడకు. ఇది కలియుగం ‘లాస్ట్‌లెగ్‌’ భయ్యా. ఏదైనా సాధ్యమే అరిచే కుక్క కరవవచ్చు, కరిచే కుక్క కూడా అరవవచ్చు. అరవని, కరవని కుక్కలెక్కడా దొరకవు అన్నాడో కవి. చేతిలో కాగితాల కట్టా, కలమూ ఉన్నవి. ఎవరు నువ్వు సేవారత్నవా, మిత్రవా లేక సేవా వజ్రవా అనడిగింది డాగీ. నేను సేవారత్ననని దీనికి ఎలా తెల్సిందబ్బా అనుకున్న యువకుడు ఏదో సేవారత్న అన్నారు అన్నాడు కొంచెం సిగ్గు పడుతూ.
అలా చెప్పు రత్నం ఈ ఇంటి వాళ్ల ‘డేటా’ కలెక్షన్‌కు వచ్చావన్నమాట అంది డాంకీ. అవును కానీ ఈ ఇంట్లో మనుషులే లేనట్టుంది. ఇదివరకు ఇక్కడ ఎవరు ఉండే వారో మీకేమైనా తెలుసా అనడిగాడు రత్న.
కుక్కా గాడిదా మాత్రం ఉండేవి కాదు. కొన్నేళ్ల కింద కొందరు మనుషులు ఒకళ్లనొకళ్లు బూతులు తిట్టుకోవడం, వాళ్లల్లో ఓ బట్టతలోడు కోర్టులో కలుద్దాం అనడం విన్నాను. ఆ తర్వాత తాళం పడ్డ ఈ ఇల్లు మెల్లమెల్లగా కూలికుప్పయింది. మన కోర్టుల్లో విషయం తేలడానికి తరాలు పడుతుందని నేనీ అరుగుమీద సెటిల్‌ అయ్యా తర్వాత ఈ డాగీ నాతో కల్సి సహవాసం మొదలుపెట్టింది అంది డాంకీ.
అలాగా అయితే ఇక్కడ రాసుకోవడానికి ఏమీ లేదన్నమాట అన్నాడు సేవారత్న అరుగు దిగడానికి కదులుతూ. వెళ్లిపోతావేం ఈ ఇంట్లో మేం ఉన్నాం కదా మా వివరాలు అక్కర్లేదా అంది డాంకీ. మన వివరాలు ఎందుకు నీకూ నాకూ ఓటు హక్కుందా? ఓటర్లయిన మనుషుల డిటైల్స్‌ అవసరంకాని అని డాగీ అంటుండగానే అవును మనుషుల కోసమే ఉంది సురక్షా పథకం అన్నాడు రత్నం. సరేలే మాకు ఓటూ, ఆధార్‌ కార్డూ, బ్యాంక్‌ అకౌంటూ ఎక్కడేడిశాయి. ఇంతకూ రత్నగారూ తమరు ఈ వివరాలు రాసుకోవడం బలవంతంగా ఫొటోలు తీసుకోవడం ఎందుకో కొంచెం చెప్పరూ అంది డాంకీ.
రత్నం రెచ్చిపోయేడు. ప్రభుత్వ సేవలు అందించడానికి. ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించడానికి ప్రభుత్వం ఇల్లిల్లూ తిరగలేదు కదా. ఎవరెవరికి ఏ సమస్యలున్నాయో తెల్సుకోవడం కష్టంకదా అందుకే మేం కాళ్లకు చక్రాలతో, చంకలో కాగితాలతో తిరుగుతున్నాం. ఎవరెవరకి ఏ పథకాలు సరిపోతాయో తెల్సుకుంటున్నాం. పెన్షను, రేషన్‌ సరుకులూ అందిస్తున్నాం అన్నాడు.
బాగానే రెచ్చిపోయావు రత్నం మీ వాళ్లల్లో వజ్రం ఒకడు మద్యం సరఫరా చేస్తాడని, గంజాయి అమ్మాడని ఒక మిత్రుడు మహిళలను వేధించాడని, ఒక సేవామిత్ర సంక్రాంతి పథకం అమలుకు జనం దగ్గర నెలకు మూడువందల రూపాయలు వసూలు చేసిందని చదివానే అంది డాంకీ. మీ కారణంగా ఆడవాళ్లు గల్లంతవుతున్నారని, మీ వాళ్లు ఫొటోల కోసం ఇళ్లల్లో జొరబడతున్నారని మీకు వివరాలిస్తే కొంపల్ని ముంచుతారేమోనని అంటున్నారు మరి అంది డాగీ. అసలు మీ పని ఓటర్లను వలలో వెయ్యడమేనని అస్మదీయులను ఒటర్ల జాబితాల్లో చేర్చి తస్మదీయుల పేర్లు లేకుండా చేయడానికేనని అంటున్నారు కూడా అన్నాడబ్బాయి అరుగెక్కుతూ. గిట్టనివాళ్లు అర్థం చేసుకోరు అప్పోజిషనోళ్లు అవాకులు చెవాకులు పేల్తారు అంటూ సేవారత్న అరుగుదిగి వెళ్లిపోయాడు. అరెరే నీవివరాలు చెప్పాల్సింది ‘బ్రో’ ‘పెళ్లికానుక’ దక్కేదేమో అంది డాంకీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img