Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

సనాతన ధర్మంపై రగడ

శుభాకర్‌ మేడసాని
భారతదేశంలో రిజర్వేషన్లకు కారణం సనాతన ధర్మమే. సనాతన ధర్మం అనే పదం వినిపిస్తే హిస్టీరియా వచ్చిన రోగిలాగా ఊగిపోవటం తప్ప! దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేసామా? దేశవ్యాప్తంగా గత రెండు మూడు రోజుల నుంచి సనాతన ధర్మం అనే వాక్యానికి విపరీత ప్రచారం కల్పించడం కొంతవరకు మంచే జరిగింది. సనాతన ధర్మం అంటే ఏంటి అని మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించిన మనువాదులకు కృతజ్ఞతలు. సనాతన ధర్మంపై డీఎంకే నేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం ఎందుకయ్యాయి? వివాదాస్పదం చేసింది ఎవరు?
చెన్నైలో ‘‘సనాతన నిర్మూలన’’ అనే అంశంపై తమిళనాడు ప్రగతిశీల రచయితలు, కళాకారుల సంఘం సమావేశం నిర్వహించింది. ఆ సభకు ముఖ్య అతిథిగా ఉదయనిది స్టాలిన్‌ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఉదయనిది మాట్లాడుతూ ‘‘కొన్నింటిని మనం వ్యతిరేకిస్తే సరిపోదు, పూర్తిగా నిర్మూలించాలి. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్న వాటిని నిర్మూలించాలి. ప్రజలను కులాల పేరిట విభజించింది. మహిళలపై వివక్షను ప్రోత్సహించింది దాన్ని నిర్మూలించాల్సిందే‘‘ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రసారమాధ్యమాలు వివాదాస్పద వ్యాఖ్యలు అంటూ ప్రచారం కల్పించాయి ఇంకేముంది భారతీయ జనతా పార్టీ విశ్వహిందూ పరిషత్‌తో పాటు వివిధ హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఏమిటి ఈ సనాతన ధర్మం అందులో ఏముందో చూద్దాం. సనాతన ధర్మం అనే రెండు పదాలను విమర్శిస్తే హిందూ మతం పై దాడి ఎలా అయ్యింది? సనాతన ధర్మం హిందూమతంగా ప్రచారం చేశారు. అనేక అసమానతలు ముఖ్యంగా ఈ ధర్మములో పుట్టిన వారిని నాలుగు వర్ణాలుగా విభజించారు. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించారు. బ్రహ్మ నుదిటి నుంచి బ్రాహ్మణులు, బుజాల నుండి క్షత్రియులు, నాభి నుండి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారని ప్రచారం జరిగింది. ఈ బ్రాహ్మణులు అంటే పూజారులు, ఆచార్యులుగా. క్షత్రియులు అంటే యుద్ధ వీరులు రాజులుగా, వైశ్యులు అంటే వ్యాపారస్తులుగా, శూద్రులు అంటే కార్మికులు/ కూలీలుగా పుడతారని చెప్తున్నారు..
మనిషి ఇలా పుట్టటానికి సాధ్యపడుతుందా? సనాతన ధర్మంలో సాధ్యపడుతుంది. ఈ తప్పుడు భావాన్ని మార్చటానికి ప్రయత్నిస్తే సనాతన ధర్మంపై దాడిని మనం నేడు చూస్తున్నాం. జోగిని వ్యవస్థ ఏర్పాటు చేసి గుడి వెనుక ఆశ్రయం కల్పించి మొదటి రాత్రి వధువుతో బ్రాహ్మణుడు శయనించాలన్న ఆచారం సనాతన ధర్మంలో భాగమే. కేరళలో శూద్ర జాతికి చెందిన ఎజవ, నాడార్‌ తెగకు చెందిన మహిళలపై రొమ్ము పన్ను విధించేవారు. తలక్కారం, ముళకరం అనే రెండు పన్నులు ఉండేవి. తలక్కారం అనే పన్ను పురుషుల గడ్డాలు, మీసాలపై విధించేవారు. స్త్రీలు ముళకరం పన్ను కట్టాల్సిందే. వక్షోజాల పరిమాణం బట్టి పన్ను! వక్షోజాలపై వస్త్రం ధరించాలంటే పన్ను కట్టాల్సిందే. ఇదీ సనాతన ధర్మంలో భాగమే. అగ్రవర్ణాలకు చెందిన మహిళలకు మాత్రమే రవికేెె ధరించే అవకాశం. రాజు అనుమతి లేకుండా వక్షోజాలను కప్పుతూ వస్త్రాలు ధరించటానికి వీలులేదు అని పన్ను వసూలుదారు నంగేలి అనే స్త్రీ పై వత్తిడిచేస్తే! అప్పటికే ఈ దురాచారంపై రగిలిపోతున్న నంగేలి తన రెండు వక్షోజాలను కొడవలితో కోసేసుకొని పన్నుకు బదులుగా సమర్పించి ఆమె రక్తపు మడుగులో మరణించింది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి చరిత్రలో నిలిచిపోయింది నంగేలి. సనాతన ధర్మంలో మనస్మృతి కులాల పుట్టుక వర్ణన. యజ్ఞవల్క స్మృతి ఆచారాలు న్యాయ ప్రక్రియ నేరం శిక్షలు ఇంకా అనేక అంశాలు. విష్ణు స్మృతి లో సతి సహగమనం ! అంటే భర్త చనిపోతే భార్యను కూడా భర్త శవంతో పాటు చితిలో వేసి హత్య చేసే సంప్రదాయం. ఇది ఒక మహా జాతరలా జరిగేది. మేళతాళాలతో ఊరేగింపుగా ఊరు ఊరంతా కదిలేది. కాలుతున్న భర్త చితిపై నుండి భార్య బయటకు రాకుండా నలువైపులా పెద్ద కర్రలతో గట్టిగా అదిమిపట్టేవారు. ఆమె అరుపులు వినపడకుండా పెద్ద శబ్దాలతో మేళతాళాలు వాయించేవారు. సనాతన ధర్మంలో లక్షలాది స్త్రీలు అగ్నికి ఆహుతి అయ్యారు. ఇది స్త్రీల జీవితాలను ధ్వంసం చేసిన ఘోరకలి. శూద్ర జాతి చదువుకోరాదు అటువంటి ఆలోచన వస్తే మరణశిక్ష విధిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే సనాతన ధర్మం గురించి చెప్పటానికి వేల పేజీలు కావాలి. ఇటువంటి అమానవీయ మూఢత్వం పై ఎందరో మహనీయులు త్యాగాలు, పోరాటాల ఫలితమే నేటి నాగరిక భారతదేశం. ఇప్పటికీ సనాతన ధర్మం అనే ఆచారం పేరుతో అసమానతలు, అన్యాయాలు కుల ఘర్షణలు. జాతుల విద్వేషాలకు అంతే లేకుండా పోయింది. నేడు ఈ మూఢత్వంలో ఎక్కువ చురుగ్గా అతి చేసేది శూద్రులే అనేది పెను విషాదం. శూద్రులు అంటే కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ శూద్రులే.
ఇప్పటికే సనాతన ధర్మంలో అనేక మార్పులు జరిగాయి. సనాతన ధర్మం నిర్మూలన అంటే మానవీయతను మేల్కొల్పడమే. మూఢత్వాన్ని వీడి కులం కోరల నుంచి బయటపడాలి. ధర్మా ధర్మాలను, మానవీయత, అమానవీయతలను నిర్ణయించుకోవాలి. స్వీయ జ్ఞానాన్ని పెంపొందించటమే అసలు ధర్మం అర్థం. సనాతనమైన ఆధునికమైన ధర్మం ఒక్కటే ఉంటుంది. అది మానవీయ ధర్మం. సనాతన ధర్మం అర్థం తెలియకుండా పూనకంతో ఊగిపోవటం అంటే అజ్ఞానం అనే దుమ్ముతో కళ్ళు చూపు కోల్పోవడమే.
రచయిత:జర్నలిస్టు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img